న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌కు విశేష సేవలందించిన మాజీ ఫాస్ట్ బౌలర్, ఆల్‌రౌండర్ షాపూర్ జద్రాన్ (39) కన్నుమూశారు. కొంతకాలంగా అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఆయన గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణాన్ని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ధ్రువీకరించింది. తన 39వ పుట్టినరోజుకు ఒక రోజు ముందే ఆయన మృతి చెందడం క్రీడా ప్రపంచాన్ని విషాదంలో ముంచింది.
షాపూర్ జద్రాన్ గత కొన్ని నెలలుగా హీమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్ (HLH) అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్నారు. ఈ వ్యాధిలో రోగనిరోధక వ్యవస్థ అసాధారణంగా స్పందించి శరీరంలోని కీలక అవయవాలను దెబ్బతీస్తుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను భారత్‌కు తరలించారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు.
2009 నుంచి 2020 వరకు ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన షాపూర్ జద్రాన్, యుద్ధ పరిస్థితులను ఎదుర్కొంటున్న దేశంలో క్రికెట్ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఎడమచేతి ఫాస్ట్ బౌలర్‌గా ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన ఆయన ... ఆఫ్ఘనిస్తాన్ జట్టు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంలో కీలక పాత్ర పోషించారు. తన అంతర్జాతీయ కెరీర్‌లో 44 వన్డేలు, 36 టి 20లు కలిపి మొత్తం 80 మ్యాచ్‌లు ఆడిన షాపూర్, ఆఫ్ఘనిస్తాన్ జట్టు తొలిసారిగా ప్రపంచకప్ టోర్నీలకు అర్హత సాధించిన ప్రయాణంలో కీలక సభ్యుడిగా నిలిచారు. క్లిష్ట పరిస్థితుల్లో వికెట్లు సాధిస్తూ జట్టుకు అనేక చిరస్మరణీయ విజయాలు అందించారు.
గత ఏడాది అక్టోబరులో ఆయన ఆరోగ్యం విషమించిన సమయంలో సహచర ఆటగాళ్లు మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ గ్రేటర్ నోయిడా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆసుపత్రి పడకపై చికిత్స పొందుతున్న షాపూర్‌ను చూసి భావోద్వేగానికి గురైన నబీ సోషల్ మీడియాలో పంచుకున్న చిత్రం అప్పట్లో క్రీడా అభిమానులను కదిలించింది. షాపూర్ జద్రాన్ మృతి పట్ల అంతర్జాతీయ క్రికెట్ వర్గాలు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఆయనను దేశంలో క్రికెట్‌కు బలమైన పునాదులు వేసిన యోధుడిగా అభివర్ణిస్తూ నివాళులర్పించింది.








కామెంట్‌లు (0)