- 275 పరుగులకే హైదరాబాద్ ఆలౌట్
- త్రిపురణ విజయ్కు నాలుగు వికెట్లు
ప్రజాశక్తి - హెల్త్ యూనివర్సిటీ (విజయవాడ) : ఆంధ్ర, హైదరాబాద్ జట్ల మధ్య మూలపాడులో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్లో తొలి రోజే ఆంధ్ర జట్టు బౌలర్లు సత్తా చాటారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు 86 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు రెండు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆటలో ఆంధ్ర జట్టు పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టు లంచ్ విరామం వరకు పటిష్టంగా కనిపించింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్, అభిరత్ రెడ్డి నిలకడగా ఆడుతూ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. లంచ్ విరామ సమయానికి హైదరాబాద్ జట్టు ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసి మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే, లంచ్ విరామం అనంతరం ఆంధ్ర బౌలర్లు ఒక్కసారిగా పుంజుకుని హైదరాబాద్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థి జట్టు స్కోరు వేగానికి అడ్డుకట్ట వేశారు. ఓపెనర్లతో పాటు మిడిల్ ఆర్డర్లో రాహుల్ రాదేష్ మినహా మిగిలిన బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో హైదరాబాద్ జట్టు తొలి రోజే ఆలౌట్ అయింది.ఆంధ్ర బౌలర్లలో త్రిపురణ విజయ్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. సౌరభ్ కుమార్, లలిత్ మోహన్ చెరో మూడు వికెట్లు తీసి హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చారు.








కామెంట్లు (0)