శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Asian Games - కీలక నిర్ణయం దిశగా బిసిసిఐ

1 గంట క్రితం

Asian Games – BCCI moving towards a key decision
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 11:55 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

జపాన్ : జపాన్‌ వేదికగా జరగనున్న ఏషియన్‌ గేమ్స్‌–2026కు సమయం దగ్గరపడుతోంది. సెప్టెంబర్‌ 19 నుంచి ఈ క్రీడా సంబరాలు ప్రారంభం కానుండగా.. పురుషుల క్రికెట్‌ పోటీలు సెప్టెంబర్‌ 24 నుంచి జరగనున్నాయి. అయితే క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగే ఐచి–నగోయాలో ఆటగాళ్లకు కల్పిస్తున్న వసతులపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ప్రధానంగా క్రికెట్‌ జట్లకు తగిన స్థాయిలో హోటల్‌ వసతి లేకపోవడం, డ్రెస్సింగ్‌ రూమ్‌లుగా తాత్కాలిక టెంట్లను ఏర్పాటు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ సమావేశంలో బిసిసిఐతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డులు కూడా ఈ ఏర్పాట్లపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. క్రికెటర్లకు ప్రత్యేక వసతి కల్పించాలని ఈ బోర్డులు ఒలింపిక్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆసియా (ఓసీఏ)ను కోరాయి. అయితే క్రికెట్‌ ఆటగాళ్లకు ప్రత్యేకంగా వసతి కల్పించే అవకాశం లేదని ఒసిఎ స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓఏ) కూడా ధ్రువీకరించింది.


ఈ నేపథ్యంలో బిసిసిఐ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పురుష, మహిళా క్రికెట్‌ జట్లకు వసతి, ఆహారం, రవాణా వంటి ఏర్పాట్లను స్వయంగా బిసిసిఐనే నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏషియన్‌ గేమ్స్‌ నిర్వాహకులు భారత పురుషుల జట్టుకు త్రీ–స్టార్‌ హోటల్‌, మహిళల జట్టుకు ఫోర్‌–స్టార్‌ హోటల్‌ను కేటాయించారు. అంతేకాకుండా ఒక్కో గదిలో ఇద్దరు ఆటగాళ్లు ఉండాల్సి రావడంపై కూడా బిసిసిఐ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.


అంతర్జాతీయ టోర్నీల సమయంలో భారత క్రికెటర్లకు సాధారణంగా సింగిల్‌ ఆక్యుపెన్సీతో కూడిన 5–స్టార్‌ హోటల్‌ గదులను కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో ఏషియన్‌ గేమ్స్‌ కోసం కేటాయించిన గదుల పరిమాణం, సౌకర్యాలపై బిసిసిఐ వర్గాలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆటగాళ్లు తీసుకెళ్లే భారీ కిట్‌బ్యాగ్‌లు, ఇతర క్రీడా పరికరాలను ఉంచేందుకు ఈ గదులు సరిపోవన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే తుది నిర్ణయం తీసుకునే ముందు పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించాలని బిసిసిఐ భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని జపాన్‌కు పంపనున్నట్లు తెలుస్తోంది. అక్కడి వసతులు, ఆహారం, రవాణా తదితర ఏర్పాట్లపై ఆ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా భారత క్రికెట్‌ జట్లకు సంబంధించిన ఏర్పాట్లపై బిసిసిఐ తుది నిర్ణయం తీసుకోనుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్