* పురుషుల, మహిళల జట్లు షెడ్యూల్ విడుదల
ఐచి:
2026 ఆసియా క్రీడల కబడ్డీ పోటీల గ్రూపులు, మ్యాచ్‌ల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ పోటీలు సెప్టెంబర్ 21 నుండి 26 వరకు జపాన్‌లోని తోకాయ్ సిటిజన్ జిమ్నాషియంలో జరగనున్నాయి. 2023 హ్యాంగ్‌జూ ఆసియా క్రీడల్లో పురుషుల, మహిళల విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన భారత జట్లు, ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగుతున్నాయి.
ఈ టోర్నీలో పురుషుల విభాగంలో 10 జట్లు, మహిళల విభాగంలో 8 జట్లు పోటీ పడుతున్నాయి. సెప్టెంబర్ 21 నుండి 24 వరకు రౌండ్-రాబిన్ లీగ్ దశ మ్యాచ్‌లు జరగనుండగా, 25న సెమీఫైనల్స్, 26న ఫైనల్ పోరు జరగనుంది.
పురుషుల జట్టు వివరాలు:
డిఫెండింగ్ ఛాంపియన్ భారత పురుషుల జట్టు గ్రూప్-ఎ లో చోటు దక్కించుకుంది. ఈ గ్రూప్‌లో బంగ్లాదేశ్, దక్షిణ కొరియా, చైనీస్ తైపీలతో పాటు ఆతిథ్య జపాన్ ఉన్నాయి. భారత్‌కు ప్రధాన ప్రత్యర్థిగా భావించే ఇరాన్ జట్టు గ్రూప్-బి (నేపాల్, థాయిలాండ్, పాకిస్తాన్, మలేషియా) లో ఉంది.
సెప్టెంబర్ 21: భారత్ vs జపాన్ (తొలి మ్యాచ్)
సెప్టెంబర్ 22: భారత్ vs దక్షిణ కొరియా
సెప్టెంబర్ 23: భారత్ vs బంగ్లాదేశ్
సెప్టెంబర్ 24: భారత్ vs చైనీస్ తైపీ
మహిళల జట్టు వివరాలు:
భారత మహిళల జట్టు కూడా గ్రూప్-ఎ లోనే పోటీపడుతోంది. ఈ గ్రూప్‌లో బలమైన ఇరాన్, జపాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. గ్రూప్-బి లో శ్రీలంక, థాయిలాండ్, చైనీస్ తైపీ, నేపాల్ జట్లు నిలిచాయి.
సెప్టెంబర్ 21: భారత్ vs బంగ్లాదేశ్ (తొలి మ్యాచ్)
సెప్టెంబర్ 23: భారత్ vs ఇరాన్
సెప్టెంబర్ 24: భారత్ vs జపాన్
ప్రతి గ్రూప్ నుండి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్‌లో ఓడిన రెండు జట్లకు నేరుగా కాంస్య పతకాలు అందజేస్తారు; కబడ్డీలో మూడో స్థానం కోసం ప్రత్యేకంగా మ్యాచ్ నిర్వహించరు.








కామెంట్‌లు (0)