గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో బాక్సింగ్‌లో ఏకంగా 7 స్వర్ణాలు, 3 రజతాలు సాధించి కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో భారత్ తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. శనివారం జరిగిన ఫైనల్స్‌లో అంకుశ్ పంఘాల్ (80 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు), అరుంధతి, ప్రియ, సాక్షి, ప్రీతి, జైస్మిన్ స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు.
మహిళల 75 కేజీల విభాగం ఫైనల్‌లో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బొర్గొహెయిన్ ఆస్ట్రేలియాకు చెందిన ఎమ్మా-స్యూ గ్రీన్‌ట్రీ చేతిలో 1-4 తేడాతో ఓటమి పాలై రజత పతకంతో సరిపెట్టుకుంది. అయితే ఈ పతకంతో మేరీ కోమ్, విజేందర్ సింగ్ తర్వాత అన్ని ప్రధాన అంతర్జాతీయ టోర్నమెంట్లలో పతకాలు సాధించిన భారత బాక్సర్‌గా లవ్లీనా ప్రత్యేక గుర్తింపు పొందింది. నరేందర్ (90+ కేజీలు), జడుమణి సింగ్ కూడా రజత పతకాలు గెలిచారు.
అథ్లెటిక్స్‌లో భారత స్టార్ రన్నర్ గుల్వీర్ సింగ్ చరిత్ర సృష్టించాడు. పురుషుల 5000 మీటర్ల పరుగులో 13:24.95 నిమిషాల్లో రేసును పూర్తి చేసి కాంస్య పతకం సాధించాడు. అంతకుముందు 10,000 మీటర్లలో రజతం గెలిచిన గుల్వీర్, ఒకే కామన్వెల్త్ గేమ్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.








కామెంట్‌లు (0)