మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టెస్టుల్లోనూ రాణించాలి

6 గంటల క్రితం

teram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 11:18 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- న్యూజిలాండ్‌ పర్యటనలో వరుసగా సిరీస్‌ విజయాలు

వెల్లింగ్టన్‌: ​న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న భారత పురుషుల క్రికెట్‌ జట్టు వరుసగా రెండు సిరీస్‌లను కైవసం చేసుకుంది. సుదీర్ఘ పర్యటనలో భాగంగా టెస్ట్‌ సిరీస్‌కు ముందు జరిగిన టి20 సిరీస్‌ను తొలుత టీమిండియా కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్‌ను 3-1తో చేజిక్కించుకుంది. దీంతో కివీస్‌ గడ్డపై దాదాపు ఏడేళ్ల తర్వాత సిరీస్‌ను కైవసం చేసుకోగా.. కివీస్‌ జట్టు వరుసగా ఏడు సిరీస్‌ల తర్వాత స్వదేశంలో వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ క్రమంలో 19నుంచి వెల్లింగ్టన్‌ వేదికగా జరిగే తొలి టెస్ట్‌పై టీమిండియా దృష్టి సారించింది. రెండు టెస్టుల కీలక సిరీస్ కోసం సెలక్టర్లు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. ఈ జట్టులో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి చేరుకోగా.. మరికొందరికి కొత్తగా అవకాశం లభించింది. శుభ్‌మన్ గిల్ ఈ యువ జట్టుకు నాయకత్వం వహించనున్నారు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా శ్రీలంకతో జరిగిన సిరీస్‌కు దూరంగా ఉన్న జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్ తిరిగి జట్టులోకి వచ్చి చేరారు. వీరితో పాటు అన్షుల్ కాంబోజ్‌కు కూడా సెలక్టర్లు చోటు కల్పించారు. గతంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మాంచెస్టర్ టెస్టులో అరంగేట్రం చేసిన కాంబోజ్, ఇప్పుడు కివీస్ గడ్డపై సత్తా చాటేందుకు సిద్దమయ్యాడు. మరోవైపు కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, సర్ఫరాజ్ ఖాన్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీలకు ఈసారి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. దీంతో వీరంతా తిరుగు పయనమై సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 లీగ్‌ బరిలో దిగుతున్నారు. ఇక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుటిసి) 2025-27 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాలంటే భారత్‌కు ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది. ఇప్పటివరకు న్యూజిలాండ్ గడ్డపై భారత్ కేవలం రెండు టెస్టు సిరీస్‌లు మాత్రమే గెలిచింది. ఈసారి సిరీస్ కైవసం చేసుకోవాలంటే కుర్రాళ్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

వికెట్ కీపర్ పంత్‌ రెడీ...

న్యూజిలాండ్‌తో టెస్ట్‌ల సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్. స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఫిట్‌నెస్ క్లియర్ చేసి న్యూజిలాండ్ విమానం ఎక్కేందుకు రెడీ అయ్యాడు. ఈ విషయాన్ని అతనే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. తన ఇన్‌స్టా స్టోరీలో విమానం విండోకు సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను పంచుకున్నాడు. ఈ ఫొటోపై న్యూజిలాండ్ ఫ్లాగ్ ఎమోజీని కూడా ఉంచాడు. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నానని పరోక్షంగా వెల్లడించాడు. ఎడమవైపు పొత్తి కడుపు కండరాల నొప్పి కారణంగా 29 ఏళ్ల రిషభ్ పంత్.. గత నెల రోజులుగా ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇరానీ కప్ సందర్భంగా పంత్ ఈ గాయానికి గురయ్యాడు. ఈ టోర్నీలో రెస్టాఫ్ ఇండియాకు పంత్ సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఈ గాయంతో భారత్-ఏ తరఫున న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లలేకపోయాడు. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు పంత్‌ను తొలుత ఎంపిక చేసినా.. ఫిట్‌నెస్ టెస్ట్‌ క్లియర్ చేస్తేనే ఆడతాడని బిసిసిఐ ఇంతకు ముందే ప్రకటించింది. ఈ క్రకమంలో గాయం నుంచి పూర్తిగా కోలుకున్న పంత్‌.. త్వరలోనే జట్టుతో చేరనున్నట్లు సమాచారం. సోమవారం భారత టెస్ట్ టీమ్ వెల్లింగ్టన్ వేదికగా ప్రాక్టీస్ క్యాంప్‌లో ముమ్మురంగా సాధన చేసింది. 19 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తోనే జస్‌ప్రీత్ బుమ్రా పునరాగమనం చేయనున్నాడు.

షెడ్యూల్‌...

తొలి టెస్టు : నవంబర్‌ 19 – 23 (వెల్లింగ్టన్)

రెండో టెస్టు: నవంబర్ 27 – డిసెంబర్ 1 (క్రైస్ట్ చర్చు)

(తెల్లవారుఝామున 3.30 గంటల నుంచి)

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్