ఎడ్జ్‌బాస్టన్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్‌కు ఇంగ్లాండ్ 259 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే 47.5 ఓవర్లలో 258 పరుగులకే అలౌటైంది. జో రూట్ (76*), లియామ్ డాసున్ (68) అర్ధశతకాలు చేశారు. బెన్ డకెట్ (43) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్ల దెబ్బకు 22 ఓవర్లలోనే ఇంగ్లాండ్ ఆరు వికెట్లను చేజార్చుకుంది. అయితే, లియామ్ డాసున్ - జో రూట్ ఏడో వికెట్‌కు 121 పరుగులు జోడించి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను ఆదుకొన్నారు. ఆఖర్లో మళ్లీ పుంజుకున్న భారత బౌలర్లు స్వల్ప వ్యవధిలో వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేశారు. ఇంగ్లాంగ్ బ్యాటర్లలో జాకబ్ బెతెల్ (14), విల్ జాక్స్ (20*), ఆర్చర్ (12) రెండంకెల స్కోరు చేశారు. హ్యారీ బ్రూక్ (1), జోస్ బట్లర్ (5), సామ్ కరన్ (0) విఫలమయ్యారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 4, గుర్నూర్ బ్రార్ 2, ప్రసిద్ధ్ కృష్ణ 2.. బుమ్రా, దూబే చెరో వికెట్ తీశారు.
ఇంగ్లాండ్‌ను దెబ్బతీసిన భారత బౌలర్లు.. 107/6
భారత్‌తో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఒక దశలో వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసిన ఇంగ్లాండ్, ఆ తర్వాత కేవలం 52 పరుగుల వ్యవధిలోనే 6 కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
కేఎల్ రాహుల్ వండర్ క్యాచ్.. : ఇంగ్లాండ్ జట్టును కుదురుకోనివ్వకుండా భారత బౌలర్లు, ఫీల్డర్లు ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్‌ను ఆదుకునేందుకు ప్రయత్నించిన విల్ జాక్స్ (20) ను శివమ్ దూబే పెవిలియన్‌కు పంపాడు. ఇన్నింగ్స్ 21.4వ ఓవర్‌లో శివమ్ దూబే వేసిన బంతిని విల్ జాక్స్ ఆడబోగా, అది బ్యాట్ ఎడ్జ్ (అంచు) తీసుకుని వెనుకకు దూసుకెళ్లింది. అయితే వికెట్ల వెనుక ఉన్న కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన డైవింగ్‌తో, గాల్లోకి లేచి ఆ సూపర్ క్యాచ్‌ను ఒడిసిపట్టాడు. రాహుల్ మెరుపు ఫీల్డింగ్‌కు విల్ జాక్స్ నిరాశగా వెనుదిరగక తప్పలేదు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 107 పరుగుల వద్ద తన ఆరో వికెట్‌ను కోల్పోయి మరింత గడ్డు పరిస్థితిలోకి నెట్టబడింది.
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన ప్రసిద్ధ్ : ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్, కెరీర్‌లో 200వ వన్డే మైలురాయిని అందుకున్న జోస్ బట్లర్ (5) ను ప్రసిద్ధ్ కృష్ణ బోల్తా కొట్టించాడు. 16.1వ ఓవర్‌లో బట్లర్ ఇచ్చిన క్యాచ్‌ను గుర్నూర్ బ్రార్ ఎటువంటి పొరపాటు చేయకుండా అందుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సామ్ కరన్ (0) తాను ఎదుర్కొన్న మూడో బంతికే (16.4వ ఓవర్) వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ ఓవర్‌లో ప్రసిద్ధ్ కృష్ణ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా రెండు కీలక వికెట్లను పడగొట్టి ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు.
తొలి బంతికే కెప్టెన్ ఔట్.. బుమ్రా అరుదైన రికార్డు : తొలి రెండు వికెట్లు పడగానే కెప్టెన్ హ్యారీ బ్రూక్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెంటనే జస్‌ప్రీత్ బుమ్రాను బౌలింగ్‌కు దించాడు. బుమ్రా తను వేసిన తొలి బంతికే (13.1వ ఓవర్) కెప్టెన్ హ్యారీ బ్రూక్ (1) ను పెవిలియన్ చేర్చాడు. బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో రోహిత్ శర్మ సులువుగా అందుకున్నాడు. ఈ వికెట్‌తో బుమ్రా వన్డేల్లో తన 150వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా ఇంగ్లాండ్ గడ్డపై వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
బ్రేక్ ఇచ్చిన గుర్నూర్ బ్రార్ : చక్కటి భాగస్వామ్యంతో దూసుకుపోతున్న ఇంగ్లాండ్ ఓపెనర్లను విడదీసి టీమిండియాకు తొలి బ్రేక్ ఇచ్చాడు బౌలర్ గుర్నూర్ బ్రార్. ఇన్నింగ్స్ 12.2వ ఓవర్‌లో బ్రార్ వేసిన బంతిని భారీ షాట్‌గా మలిచేందుకు ప్రయత్నించిన ఓపెనర్ జాకబ్ బెతెల్ (14), డీప్ వికెట్ వద్ద ఉన్న వాషింగ్టన్ సుందర్ చేతికి చిక్కాడు. దీంతో ఇంగ్లాండ్ తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ వెంటనే అదే ఓవర్ నాలుగో బంతికి (12.4వ ఓవర్) ప్రమాదకరంగా మారుతున్న మరో ఓపెనర్ బెన్ డకెట్ (43) ను కూడా బ్రార్ వెనక్కి పంపాడు. డకెట్ కొట్టిన షాట్‌ను థర్డ్ మ్యాన్ దిశగా ఉన్న జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతమైన క్యాచ్‌గా మలచడంతో ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది.








కామెంట్‌లు (0)