న్యూయార్క్ : ఫిఫా ప్రపంచకప్–2026 ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఫైనల్ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భారీ ఆసక్తి, పరిమిత సంఖ్యలో టికెట్లు అందుబాటులో ఉండటం, డైనమిక్ ప్రైసింగ్ విధానం ప్రభావంతో అధికారిక ధరలతో పాటు రీసేల్ మార్కెట్‌లోనూ టికెట్లు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పలుకుతున్నాయి.
ఫిఫా అమలు చేస్తున్న డైనమిక్ ప్రైసింగ్ విధానం ప్రకారం .... డిమాండ్‌ను బట్టి టికెట్ ధరలు మారుతున్నాయి. పిచ్‌కు సమీపంలోని ప్రీమియం సీట్ల సగటు ధర 32,970 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.31.7 లక్షలు)కు చేరినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ ధరలు అమెరికాలోని ఎన్‌ఎఫ్‌ఎల్ సూపర్‌బౌల్, ఎన్‌బీఏ ఫైనల్స్ వంటి ప్రతిష్ఠాత్మక క్రీడా ఈవెంట్ల టికెట్లను మించిపోయినట్లు పేర్కొంది.
అధికారిక విక్రయాలతో పాటు రీసేల్ మార్కెట్‌లో ధరలు మరింత పెరిగాయి. కేటగిరీ–3 టికెట్లు సుమారు 8,000 డాలర్లు (రూ.7.7 లక్షలు), కేటగిరీ–1 టికెట్లు 11,700 డాలర్లు (రూ.11.3 లక్షలు) నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే రీసేల్ మార్కెట్‌లో కేటగిరీ–1 టికెట్లు రూ.5.53 కోట్ల వరకు, ఫ్రంట్ రో సీట్లు రూ.5.72 కోట్ల వరకు నమోదైనట్లు సమాచారం.
అత్యంత ఖరీదైన ఆఫర్‌గా న్యూయార్క్–న్యూజెర్సీ స్టేడియంలోని దిగువ డెక్‌లోని నాలుగు సీట్ల ప్యాకేజీ 2.3 మిలియన్ డాలర్ల (సుమారు రూ.22.14 కోట్లు)కు విక్రయానికి వచ్చినట్లు వెల్లడైంది.
2022 ఖతార్ ప్రపంచకప్ ఫైనల్‌తో పోలిస్తే ఈసారి ధరలు అనేక రెట్లు పెరిగాయి. అప్పట్లో అధికారిక టికెట్ ప్రారంభ ధర 750 డాలర్లు కాగా, సెకండరీ మార్కెట్‌లో సుమారు 4,000 డాలర్ల వరకు చేరింది. అత్యంత ఖరీదైన అధికారిక హాస్పిటాలిటీ ప్యాకేజీ కూడా 5,850 డాలర్లకే పరిమితమైంది.
ఫైనల్ మ్యాచ్‌పై నెలకొన్న విపరీతమైన డిమాండ్, పరిమిత టికెట్ల లభ్యత కారణంగా ఈ పరిస్థితి ఏర్పడినప్పటికీ, ఫుట్‌బాల్‌ను సామాన్య అభిమానులకు మరింత దూరం చేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.








కామెంట్‌లు (0)