న్యూఢిల్లీ : 2027 వన్డే ప్రపంచ కప్ కోసం జట్టు సభ్యుల సంఖ్యను 15 నుండి 17 మందికి పెంచాలని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)ని కోరారు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీలో 14 జట్లు పాల్గొననున్నాయి. కొత్త ఫార్మాట్ కారణంగా ఫైనల్ చేరే జట్టు కనీసం 13 మ్యాచ్‌లు, కొన్ని పరిస్థితుల్లో 15 మ్యాచ్‌ల వరకు ఆడాల్సి వస్తుంది.
‘ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న 15 మంది సభ్యుల జట్టు సరిపోదు. ఎక్కువ మ్యాచ్‌లు, భిన్నమైన వాతావరణ పరిస్థితులు, గాయాల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కనీసం 17 మంది సభ్యులతో కూడిన జట్టుకు ఐసిసి అనుమతి ఇవ్వాలి. 2023 ప్రపంచ కప్‌లో ట్రావిస్ హెడ్ గాయపడటంతో ఆస్ట్రేలియా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఐసిసి నిబంధనల కారణంగా అతడిని జట్టు నుంచి తొలగించలేకపోయాం. దీంతో తొలి మ్యాచ్‌ల్లో పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగే అవకాశం లేకుండా పోయింది. న్యూజిలాండ్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది’ అని మెక్‌డొనాల్డ్ వివరించారు.
‘రానున్న ప్రపంచ కప్‌కు ముందు ఆస్ట్రేలియా 14 నెలల్లో 20 కుపైగా టెస్టులు ఆడాల్సి ఉంది. భారత్, ఇంగ్లండ్ పర్యటనలు కూడా ఉండటంతో ఆటగాళ్లపై పని భారం మరింత పెరుగుతుంది. కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ వంటి కీలక బౌలర్లు ఇప్పటికే గాయాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జరిగిన ఫిఫా ప్రపంచ కప్‌లో నిర్వాహకులు 26 మంది సభ్యులతో జట్టుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో అత్యుత్తమ ఆటగాళ్లు అందుబాటులో ఉండాలంటే ఐసిసి కూడా జట్ల పరిమాణాన్ని పెంచే అంశంపై సానుకూలంగా ఆలోచించాలి’ అని మెక్‌డొనాల్డ్ ఐసిసి కి విజ్ఞప్తి చేశారు.








కామెంట్‌లు (0)