బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

NZ vs IND: విదేశీ గడ్డ పై కీలక సమరం - ఐదు టీ 20 ల సవాల్‌ !

34 నిమిషాల క్రితం

NZ vs IND: A crucial battle on foreign soil – the challenge of five T20 matches!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 12:26 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

క్రీడలు : భారత గడ్డపై బ్యాటర్ల విధ్వంసం.. పరుగుల వరదతో హోరెత్తిన మైదానాలు ! ఇప్పుడు వేదిక మారింది. పేస్‌, బౌన్స్‌కు పెట్టింది పేరైన న్యూజిలాండ్‌ గడ్డపై టీమిండియా అడుగుపెట్టింది. స్వదేశంలో బ్యాటింగ్‌ పిచ్‌లపై సత్తాచాటిన భారత ఆటగాళ్లకు ఇక విదేశీ పరిస్థితుల్లో తమను తాము నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. ఐదు టీ 20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులతో సాగనున్న సుదీర్ఘ పర్యటనకు పొట్టి ఫార్మాట్‌తో తెరలేవనుంది. కివీస్‌ గడ్డపై భారత ఆటగాళ్లకు ఎలాంటి సవాళ్లు ఎదురుకానున్నాయి ? ఎవరిపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి ? అన్నది ఆసక్తికరంగా మారింది.


భువనేశ్వర్‌పైనే అందరి చూపు !

దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత జట్టులోకి తిరిగొచ్చిన భువనేశ్వర్‌ కుమార్‌పై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. న్యూజిలాండ్‌ వంటి పేస్‌కు అనుకూలించే పరిస్థితుల్లో తన అనుభవంతో జట్టుకు అండగా నిలవాల్సిన బాధ్యత అతడిపై ఉంది. కీలకమైన టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని జస్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో పేస్‌ విభాగాన్ని ముందుండి నడిపించే బాధ్యత భువీపై మరింత పెరిగింది.


న్యూజిలాండ్‌ పిచ్‌లపై బంతి స్వింగ్‌, బౌన్స్‌ అయ్యే అవకాశాలు ఎక్కువ. అయితే పిచ్‌ నుంచి సహకారం లభించినంత మాత్రాన వికెట్లు వాటంతట అవే రావు. ప్రత్యర్థి బ్యాటర్ల బలహీనతలను గుర్తించి, సరైన ప్రణాళికతో బౌలింగ్‌ చేయడమే కీలకం. యువ బౌలర్లతో కలిసి భువీ ఏ మేరకు ప్రభావం చూపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. చివరిసారిగా భారత్‌ తరఫున పూర్తిస్థాయి మ్యాచ్‌ ఆడింది కూడా న్యూజిలాండ్‌పైనే, నేపియర్‌ వేదికగా కావడం విశేషం. ఇప్పుడు అదే ప్రత్యర్థిపై తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకోవాలని అతడు భావిస్తున్నారు.


శ్రేయస్‌ సారథ్యానికి అసలైన పరీక్ష !

విదేశీ గడ్డపై కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్‌ అయ్యర్‌కు గత అనుభవాలు ఆశించిన ఫలితాలివ్వలేదు. ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ పర్యటనల్లో వరుస సిరీస్‌ పరాజయాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఐర్లాండ్‌పై 0-2తో, ఆ తర్వాత ఇంగ్లాండ్‌ చేతిలోనూ 0-4తో ఓటములు చవిచూశాడు. అనంతరం స్వదేశంలో జింబాబ్వే, అఫ్గానిస్థాన్‌పై విజయాలు సాధించినప్పటికీ, ఆ జట్లతో పోలిస్తే న్యూజిలాండ్‌ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది. జపాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన అనుభవం శ్రేయస్‌కు ఉంది. ఇప్పటివరకు 21 మ్యాచ్‌ల్లో 11 విజయాలు అతడి ఖాతాలో ఉన్నాయి. అయితే బలమైన ప్రత్యర్థిపై విదేశీ గడ్డలో జట్టును విజయపథంలో నడిపించడం మాత్రం మరో స్థాయి సవాల్‌. కివీస్‌పై సిరీస్‌ విజయం సాధిస్తే శ్రేయస్‌ నాయకత్వంపై ఉన్న సందేహాలకు సమాధానం చెప్పినట్లే. అందుకే ఈ పర్యటన అతడికి కేవలం మరో సిరీస్‌ మాత్రమే కాదు.. సారథిగా తన సామర్థ్యాన్ని నిరూపించుకునే కీలక అవకాశం కూడా !


ఓపెనింగ్‌ నుంచి మిడిలార్డర్‌ వరకు.. బ్యాటర్లకు కఠిన పరీక్ష !

భారత జట్టులో బ్యాటింగ్‌ స్థానాల కోసం పోటీ కూడా ఈ సిరీస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ముఖ్యంగా సంజు శాంసన్‌, వైభవ్‌ సూర్యవంశీ మధ్య ఓపెనింగ్‌ స్థానం కోసం పోటీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు అభిషేక్‌ శర్మకు కూడా ఈ సిరీస్‌ కీలకం కానుంది. విండీస్‌తో జరిగిన సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఈ దూకుడైన బ్యాటర్‌.. కివీస్‌ బౌలర్లపై ఎలా స్పందిస్తాడన్నది చూడాలి.


న్యూజిలాండ్‌ పిచ్‌లపై బంతి వేగంగా రావడంతో పాటు బౌన్స్‌ కూడా ఎక్కువగా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడటం బ్యాటర్లకు సవాలుగా మారుతుంది. అభిషేక్‌, సంజు, వైభవ్‌ తమ సహజమైన ఆటను కొనసాగిస్తూనే పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్‌ చేయాల్సి ఉంటుంది.


మిడిలార్డర్‌లో శివమ్‌ దూబేకు కూడా పరీక్ష తప్పదు. స్పిన్నర్లపై దూకుడుగా ఆడగల అతడు.. వేగంగా బంతులు సంధించే పేసర్లను ఎంత సమర్థంగా ఎదుర్కొంటాడన్నది కీలకం. తొలి ఓవర్లలో వికెట్లు కాపాడుకోవడం, చివరి వరకు బ్యాటింగ్‌ లోతును నిలబెట్టుకోవడం భారత జట్టు విజయావకాశాలను ప్రభావితం చేయనున్నాయి.


నాలుగేళ్ల తర్వాత సిరీస్‌ విజయం సాధ్యమేనా ?

న్యూజిలాండ్‌పై భారత్‌ చివరిసారిగా 2022లో టీ20 సిరీస్‌ విజయం సాధించింది. అప్పట్లో సూర్యకుమార్‌ యాదవ్‌ నాయకత్వంలోని భారత జట్టు కివీస్‌ను ఎదుర్కొంది. అయితే ఆ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ ఒక మ్యాచ్‌లో విజయం సాధించగా, మరో మ్యాచ్‌ టైగా ముగిసింది. ఇంకో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది.


ఈ నేపథ్యంలో కివీస్‌ గడ్డపై మరోసారి టీ 20 సిరీస్‌లో ఆధిపత్యం చాటుకోవాలని భారత్‌ భావిస్తోంది. అయితే స్వదేశంలో కనిపించిన బ్యాటింగ్‌ జోరు విదేశీ పరిస్థితుల్లోనూ కొనసాగుతుందా ? భువనేశ్వర్‌ అనుభవం పేస్‌ విభాగానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది ? శ్రేయస్‌ సారథ్యంలో యువ ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమిస్తారా ? అన్న ప్రశ్నలకు మైదానంలోనే సమాధానం లభించనుంది. మొత్తంగా.. ఈ సిరీస్‌ భారత్‌కు మరో ద్వైపాక్షిక పోటీ మాత్రమే కాదు. విదేశీ పరిస్థితుల్లో బ్యాటింగ్‌, బౌలింగ్‌, నాయకత్వం.. మూడు విభాగాల్లోనూ సత్తా చాటుకోవాల్సిన కీలక సమరం !


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్