నగోయా : ఆసియా క్రీడలు ముగిసిన కొద్ది రోజుల్లోనే మరో ప్రతిష్ఠాత్మక పోరుకు తెరలేచింది. జపాన్‌లోని నగోయా నగరంలో 5వ పారా ఆసియా క్రీడలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ మెగా టోర్నీలో భారత పారా అథ్లెట్లు భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నారు. మొత్తం 11 క్రీడాంశాల్లో దేశం తరఫున 168 మంది అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చైనా (హాంగ్జౌ)లో జరిగిన గత 2022 క్రీడల్లో భారత్ నుంచి రికార్డు స్థాయిలో 303 మంది అథ్లెట్లు పాల్గొని, 29 స్వర్ణాలతో సహా మొత్తం 111 పతకాలు కొల్లగొట్టారు. అయితే, ఈసారి అథ్లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిన నేపథ్యంలో.. మళ్లీ పతకాల శతకాన్ని అందుకోవడం సాధ్యమేనా అన్నది ఆసక్తికరంగా మారింది. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్‌తో పాటు హైజంపర్ నిషాద్ కుమార్, స్ప్రింటర్ ప్రీతి పాల్‌లపై దేశం కొండంత ఆశలు పెట్టుకుంది. అలాగే ఆర్చరీలో శీతల్ దేవి, తోమన్ కుమార్.. బ్యాడ్మింటన్‌లో ప్రమోద్ భగత్, సుహాస్‌లు పసిడి పతకాలే లక్ష్యంగా రాణించనున్నారు. షూటింగ్, టేబుల్ టెన్నిస్ విభాగాల్లోనూ భారత్‌కు మెరుగైన పతక అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురు వీరులు
ఈ ప్రతిష్ఠాత్మక క్రీడల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురు అథ్లెట్లు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రవి రొంగలి, రవని, షేక్ హర్షద్, రవి వీర వెంకట భువన్ బరిలో ఉండగా.. తెలంగాణ నుంచి పారాలింపిక్స్ పతక విజేత జీవాంజి దీప్తి, అకీరా నందన్ పతకాల వేటలో నిలిచారు.
బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయం
క్రీడల అధికారిక ప్రారంభానికి ముందే శనివారం మొదలైన గ్రూప్ మ్యాచ్‌ల్లో భారత పారా షట్లర్లు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. మహిళల డబుల్స్‌లో మానసి జోషి - తులసిమతి మురుగేశన్ జోడీ సెమీఫైనల్‌కు దూసుకెళ్లి, దేశానికి తొలి పతకాన్ని ఖాయం చేసింది. క్వార్టర్స్ పోరులో ఈ జోడీ 21-10, 21-17తో చైనాకు చెందిన యుమెయ్ లియు - టాంగ్‌టాంగ్ జంటపై ఘన విజయం సాధించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో టోక్యో పారాలింపిక్స్ విజేత కృష్ణ వరుసగా రెండో విజయం నమోదు చేసి క్వార్టర్స్ బెర్తును దక్కించుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో నితేశ్ కుమార్ 21-6, 21-7తో చామ్నాన్వెట్ (థాయ్‌లాండ్)పై, స్టార్ ప్లేయర్ ప్రమోద్ భగత్ 21-17, 21-16తో షియాంగ్ (చైనా)పై ఘన విజయాలు సాధించారు. మహిళల సింగిల్స్‌లో నిత్య శ్రీ 21-18, 21-13తో లిన్ షాంగ్బావొ (చైనా)ను ఓడించగా, పురుషుల డబుల్స్‌లో సూర్యకాంత్ - నవీన్ జోడీ 21-7, 21-19తో మింగ్పన్ లి-షియాంగ్ లిచువాన్ (చైనా) జంటపై పైచేయి సాధించింది. అయితే మహిళల సింగిల్స్‌లో మానసి జోషి 3-21, 3-21తో జపాన్ ప్లేయర్ షినో చేతిలో ఓటమి చవిచూసింది.








కామెంట్లు (0)