మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

FIFA - ఇంగ్లండ్‌తో పోరుకు సెంటిమెంట్ అస్త్రం.. ప్రత్యేక జెర్సీతో అర్జెంటీనా

6 రోజుల క్రితం

Sentiment as a weapon for the clash against England... Argentina in a special jersey.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 12:21 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో నేవీ బ్లూ కిట్‌కు ఫిఫా అనుమతి


అట్లాంటా : ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో జరిగే కీలక పోరుకు అర్జెంటీనా సెంటిమెంట్‌ను ఆయుధంగా మలుచుకుంది. జూన్ 16న అట్లాంటా వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో సాధారణ హోమ్ జెర్సీకి బదులుగా నేవీ బ్లూ జెర్సీతో బరిలోకి దిగాలని అర్జెంటీనా ఫుట్‌బాల్ సమాఖ్య నిర్ణయించింది. ఇందుకు ఫిఫా నుంచి ప్రత్యేక అనుమతి కూడా లభించింది.


సాధారణంగా ప్రతి ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌ను నేవీ బ్లూ జెర్సీలో ఆడడం అర్జెంటీనాకు ఆనవాయితీ. ఈ టోర్నీలో ఇప్పటికే జోర్డాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జెర్సీని ధరించిన అర్జెంటీనా, ఇంగ్లండ్‌తో సెమీస్ కోసం మరోసారి అదే జెర్సీకి అనుమతి కోరింది. ఫిఫా ఆమోదం తెలపడంతో సెమీస్‌లో అర్జెంటీనా ఆటగాళ్లు నేవీ బ్లూ జెర్సీ, నలుపు రంగు షార్ట్‌తో బరిలోకి దిగనుండగా, ఇంగ్లండ్ జట్టు పూర్తిగా తెలుపు రంగు కిట్‌లో ఆడనుంది.


1986 జ్ఞాపకాలను పునరావృతం చేయాలనే లక్ష్యం

నేవీ బ్లూ జెర్సీ వెనుక అర్జెంటీనాకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. 1986 మెక్సికో ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు జట్ల జెర్సీల రంగులు ఒకేలా కనిపించడంతో అర్జెంటీనా నేవీ బ్లూ జెర్సీని ఉపయోగించింది. ఆ మ్యాచ్‌లో అర్జెంటీనా 2-1 తేడాతో విజయం సాధించింది. అదే మ్యాచ్‌లో డియెగో మారడోనా చేసిన 'హ్యాండ్ ఆఫ్ గాడ్' గోల్, 'గోల్ ఆఫ్ ది సెంచరీ' ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. అనంతరం అర్జెంటీనా ఆ ప్రపంచకప్‌ను కూడా కైవసం చేసుకుంది.


ఆ విజయానుభూతిని మరోసారి గుర్తు చేసుకుంటూ, ఇంగ్లండ్‌పై మానసిక ఆధిక్యం సాధించాలనే ఉద్దేశంతో ఈసారి కూడా అదే రంగు జెర్సీని ఎంచుకున్నట్లు అర్జెంటీనా వర్గాలు పేర్కొంటున్నాయి.


ఇంగ్లండ్‌పై మిశ్రమ ఫలితాలు


1986 తర్వాత ప్రపంచకప్‌లో అర్జెంటీనా, ఇంగ్లండ్ మరో రెండుసార్లు తలపడ్డాయి. 1998 ప్రపంచకప్‌లో పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా 4-3తో విజయం సాధించగా, 2002 ప్రపంచకప్‌లో డేవిడ్ బెక్‌హామ్ ఏకైక గోల్‌తో ఇంగ్లండ్ 1-0 తేడాతో గెలిచింది. చాలా కాలం తర్వాత మళ్లీ నాకౌట్ దశలో ఈ రెండు జట్లు తలపడుతుండటంతో ఈ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.


'హ్యాండ్ ఆఫ్ గాడ్' అంటే...


1986 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో మారడోనా ఇంగ్లండ్ గోల్‌కీపర్ కంటే ముందుగా ఎగిరి తన ఎడమ చేతితో బంతిని గోల్‌లోకి మళ్లించాడు. రిఫరీలు ఆ హ్యాండ్‌బాల్‌ను గుర్తించకపోవడంతో గోల్ చెల్లుబాటైంది. అనంతరం మారడోనా దానిని 'హ్యాండ్ ఆఫ్ గాడ్'గా వ్యాఖ్యానించడంతో అది ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత వివాదాస్పద గోల్‌గా నిలిచిపోయింది.


'గోల్ ఆఫ్ ది సెంచరీ'


అదే మ్యాచ్‌లో మారడోనా తన సొంత అర్ధభాగం నుంచి బంతిని తీసుకుని దాదాపు 60 మీటర్లు డ్రిబుల్ చేస్తూ ఐదుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లను, గోల్‌కీపర్‌ను దాటించి అద్భుతమైన గోల్ సాధించాడు. ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యుత్తమ గోల్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ గోల్‌ను తర్వాత 'గోల్ ఆఫ్ ది సెంచరీ'గా గుర్తించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్