ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionభావోద్వేగాల మేళవింపు అంజలిదే.. గొనుమా!

1 గంట క్రితం

WhatsApp Image 2026-10-12 at 11.30.56 AM.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 08:56 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఒక కథ చదివితే స్వార్థం లేని నిర్మలమైన అమ్మ ప్రేమ కనిపిస్తుంది. ఇంకో కథ చదివితే మధ్యతరగతి జీవితాల్లో అనుబంధాలు గుర్తుకువస్తాయి. మరో కథ మోసపోయిన అమ్మాయి ధైర్యంగా ఎలా జీవించాలో చెబుతుంది.. ఇలా ఒక్కో కథ ఒక అనుభవ పాఠంగా తీర్చిదిద్దారు 'అంజలిదే గొనుమా` కథా సంపుటి రచయిత సిఎన్ చంద్రశేఖర్. ఇందులో మొత్తం 13 కథలు ఉన్నాయి. ఒక్కో కథ ఒక్కో జీవితాన్ని కళ్ల ముందు ఉంచుతుంది. ఈ కథలు చదువుతుంటే.. సంతోషం, దు:ఖం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, హాస్యం ఇలా ప్రతి భావోద్వేగం ఏదో ఒక క్షణంలో పాఠకుడికి పరిచయమవుతాయి. ఈ కథల్లో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే పాత్రల సంభాషణల్లో ఎన్నో జీవితపాఠాలు ఎంతో అర్థవంతంగా రచయిత చెబుతారు. ఆయా సందర్భాల్లో రాసుకొచ్చిన ఒక్కో మాట ఒక్కో ఆణిముత్యంలా అనిపిస్తుంది.

​‘మంచి మనసుకు మంచి రోజులు` కథలో కథానాయకుడు చంద్రం మధ్యతరగతి కుటుంబంలో ఎదురయ్యే ఎన్నో ఇబ్బందులు పడుతూనే జీవితంలో ఎదుగుతాడు. ఈ ప్రయాణంలో తనకు ఎదురైన ఒక్కో అవమానాన్ని ఒక్కో సోపానంగా చేసుకుంటాడు. ఎక్కడా నిరుత్సాహపడడు. కొడుకుగా, అన్నగా, భర్తగా, తండ్రిగా, మిత్రుడిగా, ఉద్యోగిగా ప్రతి బాధ్యతలో ఎంతో ఉన్నత వ్యక్తిత్వాన్ని కనబరుస్తాడు. చంద్రం పాత్ర మన చుట్టూ ఉన్న ఎంతోమంది వ్యక్తులను మరోసారి గుర్తుచేస్తుంది.

​'అంజలిదే గొనుమా` కథలో మంచి మనుషుల మధ్య ఏర్పడే అభిమానాన్ని రచయిత ఎంతో అందంగా తీర్చిదిద్దారు. బ్యాంకు ఉద్యోగి కృష్ణమోహన్, బ్యాంకు లోను తీసుకుని వ్యాపారంలో ఉన్నత స్థానాలకు ఎదిగిన జయశ్రీ పాత్రలను కథ చివరివరకు చాలా హుందాగా నడిపించారు. ‘మాతృదేవోభవ` కథలో కన్నబిడ్డల క్షేమం కోసం తపన పడే అమ్మను కళ్లముందుంచారు. ఒంటరి తల్లిగా ఇద్దరు కొడుకులను తీర్చిదిద్దిన ప్రమీలను ప్రయోజకులైన కొడుకులు భారంగా భావిస్తారు. అమ్మ మీద ప్రేమ ఉన్నా భార్య మాటకు అడ్డుచెప్పలేని వినోద్ అంత:సంఘర్షణను చాలా హృద్యంగా చెబుతారు. చివరికి కొడుకును రక్షించుకోవడం కోసం తల్లి తన ప్రాణాలనే ఫణంగా పెట్టడం, ఆమె అంత్యక్రియలు చేసే అవకాశం కూడా ఆ కొడుకులకు లేకుండా చేసిన కోవిడ్ కాలాన్ని రచయిత ఈ కథలో వాడుకోవడం ఆనాటి ఎన్నో చేదు సంఘటనలను గుర్తుచేస్తుంది. ‘తల్లి ప్రేమ`, ‘అమ్మ నిర్ణయం` కథలు కూడా మాతృమూర్తి గొప్పతనాన్ని కళ్లకు కడతాయి.

​‘విజేత` కథలో మోసపోయిన ఆడపిల్ల జీవితంలో ఎలా నిలదొక్కుకుందీ చెప్పారు. జీవితంలో ఎదురయ్యే ఎదురుదెబ్బలను ఆడపిల్లలు ధైర్యంగా ఎదుర్కొనాలంటే తల్లిదండ్రుల మద్దతు ఎంతో అవసరమని ఈ కథలో చెప్పారు. అనుకోని సంఘటనలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ఎలా మెలగాలో సౌందర్య పాత్రను ఈతరం ఆడపిల్లలకు గొప్ప సందేశం ఇచ్చేలా తీర్చిదిద్దారు. ‘అలా మొదలైంది` కథలో ట్విస్టులు, ప్రధాన పాత్రల మధ్య వచ్చే సంభాషణలు కథను ఆద్యంతం చదివేవరకు వదిలిపెట్టవు. ‘కర్మఫలం`, ‘వ్యక్తిత్వం` కథల్లో మనుషుల మధ్య కొరవడుతున్న గౌరవభావాలను రచయిత చాలా చక్కగా లేవనెత్తారు. అనుచితంగా ప్రవర్తిస్తున్న వ్యక్తుల వల్ల నిజజీవితంలో ఎదురయ్యే అవమానాలను రచయిత ఈ కథలో ప్రతి ఒక్కరికీ గుర్తుకుతెస్తారు. ‘అనుబంధాలు` కథలో అత్తాకోడళ్ల అనురాగాన్ని ఎంతో అందంగా చూపించారు. సుమిత్ర, విజయ అత్తాకోడళ్ల కంటే తల్లీకూతుళ్లుగా మెలగడం, ఆ పాత్రలతో పలికించే సంభాషణలు ప్రతి అత్తాకోడలు తప్పక తెలుసుకోవాలి అన్నట్లు ఉంటాయి. దారి తప్పిన కొడుకును సరైన మార్గంలో నడిపించేందుకు తండ్రి తీసుకున్న నిర్ణయాన్ని ‘నాన్న ఎప్పుడూ నాన్నే’ కథలో చెబుతారు. తండ్రి ప్రేమను, బాధ్యతను ఎవరూ భర్తీ చేయలేరు అన్నంతగా ఆ కథలో పాత్ర ఉంటుంది.

​ప్రేమకథలు, మనసుకు హత్తుకునే అమ్మ కథలతో పాటు ఎన్నో భావోద్వేగ కథలతో పాటు కిసుక్కున పెదవులపై చిరునవ్వు చిందించే హాస్య కథలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. ‘అదీ సంగతి`, ‘ముఖాలు చూసుకుందాం` కథలు ఆ కోవలోనివే.

​- జ్యోతిర్మయి​

కథా సంకలనం : అంజలిదే గొనుమా

రచయిత : సిఎన్‌ ‌చంద్రశేఖర్‌

పుస్తకం వెల : రూ.200

సంప్రదించాల్సిన ఫోను నెంబరు :

94923 78422

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్