ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగోదారమ్మ సాక్షిగా.. అక్షరాల్లో జీవన అలల సవ్వడి

1 గంట క్రితం

Book review.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 08:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

తెలుగు కథా సాహిత్యంలో గోదావరి ప్రాంత నేపథ్యానికి ఒక విలక్షణమైన ముద్ర ఉంది. రచయిత కె.వి. లక్ష్మణరావు కలం నుండి జాలువారిన "గోదారమ్మ సాక్షిగా" కథలు ఆ సంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాయి. కేవలం భౌగోళిక ప్రాంతాన్నే కాకుండా, అక్కడి మనుషుల మనస్తత్వాలను కూడా గోదారమ్మ ప్రవాహంతో ముడిపెట్టి చూపించడం ఈ రచన యొక్క ప్రత్యేకత. గోదావరి నదీతీర మానవ సంబంధాలు, గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా రచయిత ఈ కథలను రచించారు.

ఇక కథా వస్తువు - విశ్లేషణకు వస్తే.. ఈ కథా సంపుటిలో గోదావరి ఒక నదిలా మాత్రమే కాకుండా ప్రతి పాత్ర జీవితంలోనూ ఒక భాగస్వామిగా, ఒక సజీవ సాక్షిగా కనిపిస్తుంది. రచయిత సృష్టించిన పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. మన పక్కింటి మనుషులను లేదా పల్లెటూరి పెద్దమనుషులను గుర్తు చేస్తాయి. వారి ఆనందాలు, ఆవేదనలు, నమ్మకాలు కథను ముందుకు నడిపిస్తాయి. లంక గ్రామాల జీవన శైలి, వరదలు వచ్చినప్పుడు పడే ఇబ్బందులు, మనుషుల మధ్య ఉండే కల్మషం లేని బంధాలు ఈ కథలలో ప్రధానంగా కనిపిస్తాయి. ప్రేమ, త్యాగం, ఆత్మీయతలతో పాటు మారుతున్న ఆధునిక సమాజంలో పాత తరం అనుభవాలు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయో రచయిత హృద్యంగా చిత్రించారు.

ఈయన రచనలోని అతిపెద్ద బలం.. పాత్రల సంభాషణలు చదువుతుంటే ఆ ప్రాంతపు మట్టి వాసన, ఆత్మీయత పాఠకుడికి నేరుగా స్పృశిస్తాయి. కథ ఎక్కడా సాగతీత లేకుండా సరళంగా సాగిపోతుంది.

ఈ సంపుటిలో పాఠకుల మనసుపై బలమైన ముద్ర వేసే కొన్ని ముఖ్యమైన కథాంశాల గురించి పరిశీలిస్తే.. నాన్నకల.. నన్ను మన్నించండి నాన్నా, నాన్న రుణం, మార్నింగ్‌ వాక్‌.. వంటి కథలు తండ్రి సెంటిమెంటుతో నడిచినవి. అలాగే అమ్మ రాజీనామా కథ..తండ్రి చనిపోయాక తల్లిని ఎలా వంతులు వేసుకుంటారో.. దానికి ఆ తల్లి ఎలాంటి పరిష్కారం చూపిందో ఆసక్తికరంగా సాగింది. అలా ప్రతీ కథ తల్లిదండ్రులు, స్నేహితులు, పిల్లల మధ్య అనుబంధాలను, అనురాగాలను, ఆప్యాయతలను, మానవ, సామాజిక సంబంధాలను గురించే.

'గోదారమ్మ సాక్షిగా' అనేది ఒక భావోద్వేగ భరితమైన గ్రామీణ కథ. ఈ కథా సంపుటి మొత్తానికి టైటిల్‌ అయిన ఈ కథ, గోదావరి నది తీరంలో సాగే మానవ సంబంధాలకు, ఆత్మీయతలకు అద్దం పడుతుంది. ఈ కథ ప్రధానంగా గోదావరి తీరంలో పెరిగిన ఇద్దరి మధ్య బంధం, వారి జీవితాల్లో గోదావరి నది పోషించిన పాత్ర చుట్టూ తిరుగుతుంది. పల్లెటూరి అమాయకత్వం, స్వచ్ఛమైన ప్రేమ, చిన్ననాటి జ్ఞాపకాల సమాహారమే ఈ కథ. కథలోని ముఖ్య పాత్రలు తమ జీవితంలోని ప్రతి ముఖ్యమైన మలుపును, సంతోషాన్ని, బాధను గోదారమ్మతో పంచుకుంటారు. వారి చిన్ననాటి ఆటలు, మాటలు అన్నీ ఆ నదీ తీరంలోనే సాగుతాయి. రచయిత ఈ కథలో గోదావరిని కేవలం ఒక నదిలా కాకుండా, కష్టసుఖాలను చూసే ఒక సజీవ సాక్షిగా, ఒక తల్లిగా చిత్రించారు. పాత్రల మధ్య ఉన్న అనురాగానికి, వారు ఒకరికొకరు ఇచ్చుకునే మాటలకు ఆ గోదారమ్మే సాక్ష్యం. మనుషులు మారినా, కాలం మారినా, నది ప్రవాహంలాగే వారి జ్ఞాపకాలు కూడా ఎలా నిలిచిపోయాయనేది హృద్యంగా చూపించారు. కథ కేవలం పాత జ్ఞాపకాలకే పరిమితం కాకుండా, ఆధునిక కాలంలో వస్తున్న మార్పుల వల్ల పల్లెలు, మానవ సంబంధాలు ఎలా మారుతున్నాయి అనే కోణాన్ని కూడా స్పృశిస్తుంది. ఉద్యోగాల రీత్యా, జీవన ఉపాధి కోసం పల్లెలను వదిలి పట్టణాలకు వెళ్ళిపోతున్న నేటి తరం పరిస్థితిని, తిరిగి తమ ఊరికి వచ్చినప్పుడు ఆ గోదావరి ఒడ్డున వారికి కలిగే అలౌకిక ఆనందాన్ని, మానసిక ప్రశాంతతను రచయిత ఎంతో సున్నితంగా ఆవిష్కరించారు."మనుషులు ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని ఎత్తులకు ఎదిగినా తమ పుట్టిన ఊరిని, మట్టి వాసనలను, తమకు లైఫ్ ఇచ్చిన ఆ మూలాలను (గోదారమ్మను) మర్చిపోకూడదు" అనే ఒక అంతర్లీన సందేశాన్ని ఈ కథ అందిస్తుంది. గోదావరి యాసలో సాగే సంభాషణలు ఈ కథకు ప్రాణం పోశాయి. రచయిత తన కథల్లో సమాజంలోని నైతిక విలువలను, కుటుంబ బంధాల ప్రాముఖ్యతను గుర్తు చేయడం. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో సులభంగా చదువుకోగలిగేలా చిన్న చిన్న భాగాలుగా, ఆసక్తికరమైన మలుపులతో కథనాన్ని మలచడం ప్రత్యేకతగా చెప్పుకోవాలి. "గోదారమ్మ సాక్షిగా" సంపుటిలోని 24 కథలు తెలుగుదనం ఉట్టిపడేలా సాగాయి. పల్లెటూరి వాతావరణాన్ని, గోదావరి తీరపు తీపి-చేదు జ్ఞాపకాలను ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పకుండా చదివి, ఆస్వాదించాల్సిన ఒక మంచి కథా సంపుటి.

శాంతిశ్రీ

8333818985

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్