మన నిత్య జీవితంలో శారీరక శ్రమ తగ్గి, కూర్చుని చేసే పనులు పెరిగాయి. ఈ క్రమంలో మనం క్రమంగా శారీరక శ్రమను పెంచుకోవడం అవసరం. దీంతోనే ఆరోగ్యానికి దీర్ఘకాలిక ప్రయోజనమని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది మన శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, అకాల మరణాన్ని తగ్గిస్తుందని తెలిసింది. రోజుకు కేవలం ఐదు నిమిషాల వ్యాయామంతో ప్రతి పది మరణాలలో ఒకటి నివారించవచ్చని ‘‘ది లాన్సెట్’’లో ప్రచురితమైన ఈ అధ్యయనం వెల్లడిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
ఎవరైనా కేవలం ఐదు నిమిషాలు వేగంగా నడిచినా, సైకిల్ తొక్కినా, మెట్లు ఎక్కినా వారు ఈ ప్రయోజనాన్ని పొందగలరు. ఈ వ్యాయామాలు లక్షల మంది ప్రజలు ఎక్కువ కాలం జీవించేందుకు సహాయపడతాయి. శారీరక వ్యాయామాలు విపరీతంగా చేయాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. దీని బదులు శారీరక శ్రమను క్రమంగా పెంచుకోమంటున్నారు. అయితే, కేవలం ఐదు నిమిషాల వ్యాయామం మిమ్మల్ని పూర్తి ఆరోగ్యవంతుల్ని చేస్తుందని అర్థం కాదు. ఏమీ చేయకుండా ఉండటం కంటే శారీరక శ్రమను కాస్త పెంచుకోవడం ఆరోగ్యకరమైన అలవాటుగా మారుతుంది. ఇప్పటికే చురుకుగా, శారీరకంగా దృఢంగా ఉన్న వ్యక్తులలో ఇలాంటి ఐదు నిమిషాల వ్యాయామ ప్రభావం తక్కువగా ఉండవచ్చనీ ఈ అధ్యయనం సూచిస్తోంది. కానీ సాధారణ కసరత్తులు చేయడమూ శక్తివంతమైన ప్రభావం చూపుతోందని ఇది వెల్లడిస్తోంది.
ఒత్తిడి, అలసట హుష్‌కాకి..
"శారీరక వ్యాయామం అధిక ఒత్తిడిని, అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక వ్యక్తి మరణించే వరకూ ఎంత ఆరోగ్యంగా ఉంటాడో నిర్ణయించగలవు" అని అమెరికాలోని రోడ్ ఐలాండ్ విశ్వవిద్యాలయంలో కైనెసియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నికోల్ లోగాన్ చెప్పారు. "శారీరక పనితీరు, కండరాల బలం, నాణ్యత, ఎముకల బలం వృద్ధాప్యంలో మరణాన్ని అంచనా వేయడానికి మంచి సూచికలు. కాబట్టి ఎక్కువ కాలం జీవించడమే కాదు, ఎక్కువ కాలం ఆరోగ్యంగానూ జీవించాలి'' అంటారు ఆయన.
ఆయుర్దాయాన్ని పెంచుతుంది..
ఈ కొత్త పరిశోధనలో యూకె, అమెరికా, స్కాండినేవియా దేశాలకు చెందిన 1,50,000 మంది వృద్ధులను పెద్దఎత్తున విశ్లేషించారు. ''కేవలం ఐదు నిమిషాల వ్యాయామం, రోజువారీ దినచర్యలో మార్పులు, అకాల మరణాన్ని తగ్గించడంలో పెద్ద ప్రభావాన్ని చూపుతుందని తెలుసుకుని మేం ఆశ్చర్యపోయాం.'' అని ఈ పరిశోధన ప్రధాన రచయిత, నార్వేజియన్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్‌లో ఫిజికల్ యాక్టివిటీ, హెల్త్ ప్రొఫెసర్ ఉల్ఫ్ ఎకెలుండ్ చెప్పారు. ఈ ఆవిష్కరణల వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయోజనం పొందారని కూడా ఆయన పేర్కొన్నారు. వారానికి 150 నిమిషాల పాటు ఒక మోస్తరు నుంచి తీవ్రత కలిగిన వ్యాయామాన్ని పెద్దలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యహెచ్ఓ) సూచించిన సిఫార్సులను పాటించాలని ఉల్ఫ్ ఎకెలుండ్ చెప్పారు. అయితే, జిమ్‌కు వెళ్లడం, స్పోర్ట్స్ క్లబ్‌లో చేరడం కష్టంగా భావించేవారూ తమ దైనందిన జీవితంలో కొంత వ్యాయామాన్ని చేర్చుకోవడంతో ఆరోగ్యంగా ఉండగలరని ఈ అధ్యయనం నిరూపించింది.
అరగంట తగ్గించుకుంటే..
శారీరక కదలికలు పెంచుకోవడం ద్వారా మరణ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని ఈ అధ్యయనంలో వెల్లడైంది. రోజువారీ కూర్చునే సమయాన్ని 30 నిమిషాలు తగ్గించడం వల్ల అకాల మరణం ఏడు శాతం తగ్గుతుందని తెలిసింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే శారీరక కదలిక లేకపోవడం అనేది దీర్ఘకాలిక వ్యాధులకు, అకాల మరణానికి ఒక ప్రధాన కారణం.
కండరాల బలాన్ని పెంచుకోండి
''మీ దినచర్యలో వ్యాయామం స్థిరంగా ఉండటం చాలా ముఖ్యం'' అని తాజా అధ్యయన పరిశోధకుడు ఎకెలుండ్ చెప్పారు. ''మెల్లగా మొదలుపెట్టి, క్రమంగా మీ వర్కవుట్ల తీవ్రతను పెంచుకోవాలి. కానీ, ఇది ప్రతి ఒక్కరి సామర్థ్యం, వారి ఎంపికలకు అనుగుణంగా ఉండాలి'' అని చెప్పారు. కండరాలను బలోపేతం చేసే పనులూ ప్రయోజనకరమని ఒక అమెరికా అధ్యయనం చెబుతోంది. ''వ్యాయామం చేయని వారితో పోలిస్తే, ఏరోబిక్ వ్యాయామం, కండరాలు బలపడే పనులు చేసిన 60, 70 ఏళ్ల వ్యక్తులు ఎక్కువకాలం జీవించారు. వారిలో మరణ ప్రమాదమూ తక్కువే'' అని ఈ అధ్యయనం గుర్తించింది.

''ఎక్సర్‌సైజు స్నాకింగ్'' అంటే ఏమిటి?
ఇటీవల పలు అధ్యయనాలు ''ఎక్సర్‌సైజు స్నాకింగ్'' ప్రయోజనాలను నొక్కి చెప్పాయి. దీని ప్రకారం రోజంతా చిన్న చిన్న శారీరక వ్యాయామాలు చేయడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజంతా అప్పుడప్పుడు తక్కువ సమయం పాటు చేసే వ్యాయామాలు పెద్దవారిలో కండరాలు అలసిపోకుండా ఎక్కువసేపు పనిచేయగల సామర్థ్యాన్ని పెంచాయి. దీన్ని ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరిశోధనలపై చేసిన ఒక విశ్లేషణ పేర్కొంది. 80 శాతం మందికి పైగా సీనియర్లు ఎక్సర్‌సైజు స్నాకింగ్‌ను తమ దినచర్యలో భాగంగా చేర్చుకోవడం ద్వారా తేలిగ్గా వీటిని కొనసాగించగలిగారని పరిశోధకులు గుర్తించారు. జిమ్ కాకుండా.. ఎక్సర్‌సైజు స్నాకింగ్ రోజంతా మీ దినచర్యలో భాగంగా మారుతుంది. ''రోజులో అప్పుడప్పుడు కొద్దిసేపు వ్యాయామం చేయడం వల్ల... మీ మెటబాలిజం ఎక్కువసార్లు ఉత్తేజమయ్యే అవకాశం ఉంటుంది'' అని బ్రిటన్‌లోని అల్స్టర్ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్ మేరీ మార్ఫీ చెప్పారు.
ఒకవేళ వ్యాయామం చేయడం ఆపేసినా.. మెటబాలిజం కొంత సమయం పాటు ఎక్కువ స్థాయిలోనే ఉంటుందన్నారు. అందుకే, ''ఎక్సర్‌సైజు స్నాకింగ్ మీ జీవక్రియ వ్యవస్థను చురుకుగా ఉంచుతాయి'' అని తెలిపారు. ఎక్సర్‌సైజు స్నాకింగ్‌కు సంబంధించిన ప్రయోజనాల గురించి ప్రజలకు చెప్పినప్పుడు వారు చాలా సానుకూల దృక్పథాన్ని కలిగున్నారని పలు అధ్యయనాలు సూచించాయి. ఈ వైఖరి వ్యాయామం పట్ల ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది.
చిన్న అలవాట్లు.. పెద్ద మార్పు..
చిన్న చిన్న సూచనలూ ఎంతో మార్పును తీసుకురాగలవు అని పరిశోధకులు చెబుతున్నారు. ఉదా: లిఫ్ట్ / ఎస్కలేటర్ ఎక్కడానికి బదులు మెట్లు ఎక్కాలి. చిన్న మార్పులు.. అర్థవంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయని బ్రిటన్‌లోని లౌబరో యూనివర్సిటీలో బిహేవియరల్ ప్రొఫెసర్ అమండా డాలీ చెప్పారు. "క్రమంగా ఈ మార్పులు మనం ఆలోచించాల్సిన అవసరం లేని అలవాట్లుగా మారిపోతాయి. ఉదా: ఎవరైనా మెట్లు ఎక్కడం అలవాటు చేసుకుంటే, వారికి ఎలివేటర్ వాడాలనే ఆలోచనా రాదు. వారు ఆటోమేటిక్‌గా మెట్ల వైపు వెళ్తారు" అని తెలిపారు.
ఎక్సర్‌సైజు స్నాక్స్ అవసరం..
ఒక అధ్యయనం ప్రకారం.. రోజుకు కేవలం రెండు వేల అడుగులతో పోలిస్తే.. 2,517 - 2735 అడుగులు వేయడం వల్ల గుండెజబ్బుల ముప్పు 11 శాతం తగ్గుతుందని తెలిసింది. వ్యాయామానికి ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. కొండలు ఎక్కొచ్చు. డ్యాన్స్ క్లాస్‌లో చేరొచ్చు, హై-ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ లాంటి తీవ్రమైన వ్యాయామాన్ని ప్రయత్నించవచ్చు. ఇవి శరీరంలో కొవ్వును తగ్గించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిల్ని, రక్తపోటును నియంత్రిస్తాయి. మార్కెట్ నుంచి సరుకులు ఇంటికి తీసుకురావడం పెద్ద పనిగా అనిపించినప్పటికీ, ఇబ్బందిగా ఉండే పనులూ ఆరోగ్యానికి మేలు చేస్తాయని ప్రొఫెసర్ డాలీ అన్నారు. వంటగదిలో పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు కొద్దిగా శరీరాన్ని స్ట్రెచ్ చేయడం వల్లా ప్రయోజనం పొందగలరని ప్రొఫెసర్ డాలీ సూచిస్తున్నారు. వీటినే 'ఎక్సర్‌సైజు స్నాక్స్' అంటారు. వీటి గురించి ఎప్పుడూ అపరాధభావనకు గురి కావాల్సిన అవసరం లేదని ప్రొఫెసర్ డాలీ అంటున్నారు.








కామెంట్‌లు (0)