ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅధికారపు చీకటిపై అక్షర మిస్సైల్స్‌..‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’

1 గంట క్రితం

WhatsApp Image 2026-08-13 at 7.49.45 PM.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 09:51 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

అక్షరం అన్యాయాన్ని ప్రశ్నించినప్పుడు ఆయుధమవుతుంది.

అజ్ఞానాన్ని తొలగించినప్పుడు వెలుగవుతుంది.

బడుగుల గొంతుకగా మారినప్పుడు మార్పునకు తొలి అడుగవుతుంది.

‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’ అలాంటి అక్షరాల సమాహారం.

కొన్ని పుస్తకాలు మనకు తెలిసిన విషయాలను మరోసారి చెబుతాయి. మరికొన్ని మనకు తెలియని ప్రపంచం వెనుక దాగున్న చీకటి ముఖాన్ని చూపిస్తాయి. రచయిత కృష్ణ కానూరి రాసిన ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’ రెండో కోవకు చెందిన పుస్తకం. ఎనిమిది అధ్యాయాల్లో జెఫ్రీ ఎప్‌స్టీన్‌ వ్యవహారాన్ని ఒక నేరగాడి వ్యక్తిగత కథగా కాకుండా, డబ్బు, అధికారం, రాజకీయ పలుకుబడి, కార్పొరేట్‌ ప్రయోజనాలు, మీడియా, న్యాయవ్యవస్థ, దర్యాప్తు సంస్థలు పరస్పరం ఎలా ప్రభావితం చేసుకుంటాయో పరిశీలించే సామాజిక, రాజకీయ పత్రంగా రచయిత ఆవిష్కరించారు. సుమారు మూడు దశాబ్ధాలపాటు జర్నలిస్టుగా పనిచేసిన రచయిత సమకాలీన అంతర్జాతీయ, దేశీయ, సామాజిక సమస్యలపై పదునైన విశ్లేషణాత్మక పరిశోధనా వ్యాసాలు రాయటంలో దిట్ట. ప్రపంచాన్ని కుదిపేసిన ఎప్‌స్టీన్‌ ఫైల్సులోని మానవ విషాదం ఆయన్ను తీవ్రంగా కదిలించటం పుస్తకం రాయటానికి కారణమైంది. ఆ అరాచక వ్యవస్థల లోగుట్టును స్పష్టంగా వెలుగులోకి తెచ్చే ప్రయత్నమే ఈ పరిశోధనాత్మక రచన. ఈ పుస్తక రచనలో కృష్ణ కానూరికి సీనియర్‌ పాత్రికేయురాలు వడ్లమూడి పద్మ, రచయిత కుటుంబసభ్యులు కూడా ఎంతో సహకారాన్ని అందించారు. ఇంకా చివరి పేజీకి వస్తే సీనియర్‌ పాత్రికేయులు తాడి ప్రకాష్‌ చేసిన విశ్లేషణ కూడా చాలా చక్కగా సాగింది. రాజకీయాలు, గూఢచర్యం, సెక్సు, నోట్ల కట్టలతో అగ్రరాజ్యాల పాలకులనే తన కాళ్ల దగ్గరకు రప్పించుకున్న అంతర్జాతీయ కిరాతకుడు ఎప్‌స్టీన్‌ నిర్మించిన అబేధ్యమైన చీకటి సామ్రాజ్యం ప్రస్తావన కూడా వ్యవస్థాగత లోపాలను పట్టిచూపించింది. సముద్రపు అలల మధ్య ఎప్‌స్టీన్‌ సృష్టించిన ‘సుఖలాలస దీవి’లో నిస్సహాయులైన ఆడపిల్లల కన్నీళ్లు, వేదనల వెనుక దాగున్న భయంకరమైన నరకకూపాన్ని ప్రపంచం ముందుకు తెచ్చిన అపూర్వ పరిశోధనగా ఈ పుస్తకాన్ని ప్రకాష్‌ వర్ణించారు. అడుగడుగునా గుండెల్ని పిండేసే నిజాలు, ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే అమానవీయ సంఘటనలను నిజాన్ని నిబద్ధతతో రికార్డు చేసిన అసాధారణ గ్రంథంగా కూడా ఎఫ్‌స్టీన్‌ ఫైల్సు పుస్తకాన్ని పేర్కొనవచ్చు.

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లోని అసలు సంచలనం ప్రముఖుల పేర్లలో లేదు. ఒక వ్యక్తి చుట్టూ ఇంతకాలం దుర్వినియోగ వ్యవస్థ ఎలా కొనసాగింది? బాధితుల కేకలు ఎందుకు ఆలస్యంగా వినిపించాయి? అధికార వ్యవస్థలు ఎందుకు అడ్డుకోలేకపోయాయి? డబ్బు, పలుకుబడి న్యాయవ్యవస్థను ఎంతవరకు ప్రభావితం చేయగలవు? అనే ప్రశ్నల్లో ఉంది. ఈ ప్రశ్నల చుట్టూనే ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’ తన అక్షరాలను ‘మిస్సైల్స్‌’గా ప్రయోగించింది. ఎప్‌స్టీన్‌ చుట్టూ ఏర్పడిన ప్రపంచం ఒక వ్యక్తి చుట్టూ తిరిగిన వలయం కాదు. రాజకీయ నాయకులు, బిలియనీర్లు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు, సామాజిక ప్రభావశీలులతో అతడికి పరిచయాలు ఉండేవి. అయితే ఫైల్స్‌లో పేరు కనిపించడం నేరానికి రుజువు కాదు. పరిచయం, సమావేశం, ఇ-మెయిల్‌, ప్రయాణ రికార్డు వంటి ప్రతి అంశాన్ని దాని సందర్భంలోనే చూడాలి. సంచలనం కంటే సత్యం ముఖ్యం అనే జర్నలిస్టిక్‌ బాధ్యతను పుస్తకం గుర్తుచేస్తుంది. రచయిత ఎప్‌స్టీన్‌ వ్యవహారంలోని అత్యంత భయానక కోణాన్ని ఇక్కడే పట్టుకున్నారు. బాధితులను ఎలా ఆకర్షించారు? ప్రలోభాలకు ఎలా గురిచేశారు? వారి బలహీనతలను ఎలా ఉపయోగించుకున్నారు? ఒక వ్యక్తి చుట్టూ ఏర్పడిన ప్రభావ వలయం ఎలా పనిచేసింది? అనే ప్రశ్నలకు సంఘటనలను ముడిపెట్టి సమాధానాలు వెతికారు. అభం శుభం తెలియని యువతులను దోపిడీకి గురిచేసిన విధానం, నేరానికి సహకరించే వాతావరణం, మౌనంగా ఉండిపోయిన సంస్థలు—పుస్తకాన్ని సామాజిక ఆందోళనకు అద్దంగా నిలబెడతాయి.

ఎప్‌స్టీన్‌ కథలో మరింత కలవరపెట్టేది నేరం కంటే నేరానికి అనుకూలంగా మారిన వ్యవస్థ. ఒక వ్యక్తి నేరం చేయొచ్చు. కానీ ఒక నేర వ్యవస్థ సంవత్సరాల తరబడి కొనసాగాలంటే అనేక చోట్ల నిర్లక్ష్యం, మౌనం, వైఫల్యం లేదా ప్రయోజనాల సంఘర్షణ ఉండాలి. అందుకే ఈ పుస్తకం వ్యక్తిని మాత్రమే కాదు, ఆ నేరానికి అవకాశం కల్పించిన వ్యవస్థను కూడా నిందితుడి బోనులో నిలబెడుతుంది.

భారతీయ ప్రజాస్వామ్యానికి అద్దం..అక్షరాయుధ పోరాటం

అమెరికాలో డోనాల్డ్ ట్రంప్, బిల్ గేట్స్ వంటి దిగ్గజాలతో పాటు భారతదేశానికి చెందిన అనిల్ అంబానీ, హర్దీప్ సింగ్ పురి తదితరుల పేర్లు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో కనిపించడం విదేశీ కుంభకోణమే కాదు. మన దేశంలో కార్పొరేట్, రాజకీయ అపవిత్ర కలయికను, కుప్పకూలుతున్న వ్యవస్థలను నిలదీసే ఒక పదునైన హెచ్చరిక. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార కేంద్రీకరణ, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మీడియా స్వతంత్రతపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో, కేవలం 'ఎవరి పేరుంది?' అనే చవకబారు సంచలనం కంటే, ‘ఆ పరిచయాలు ప్రజా ప్రయోజనాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? పాలకుల జవాబుదారీతనం ఏది?’ అని ప్రశ్నించడమే అసలైన ప్రజాస్వామ్య చైతన్యం. అధికారాన్ని కళ్లల్లోకి చూసి ప్రశ్నించే మీడియా లేకపోతే ఏ సమాజమైనా కూలిపోతుంది. అందుకే 'అక్షర మిస్సైల్స్' వ్యక్తులపై రువ్వే ఆరోపణలు కావు. వ్యవస్థల నిరంకుశ మౌనాన్ని ఛేదించే ప్రశ్నాస్త్రాలు. చట్టం ముందు అందరూ సమానులేనా? లేక అధికారానికి ప్రత్యేక తలుపులు తెరుచుకుంటాయా? అని నిలదీస్తూ... ‘ఈ వ్యవస్థ అసలు ఎవరి కోసం?` అనే సత్యాన్ని గుర్తించేలా చేయడమే ఈ 'ఎప్‌స్టీన్ ఫైల్స్' అసలు విజయం.

యడవల్లి శ్రీనివాసరావు

9490099214

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్