ప్రయాణం మనిషి సహజ స్వభావం. తెలిసిన పరిధిని దాటి కొత్త ప్రదేశాలను చూడటం, కొత్త మనుషులను కలుసుకోవడం, భిన్నమైన సంస్కృతులను గమనించడం, ఆ అనుభవాలను ఇతరులతో పంచుకోవడం ఎప్పటి నుంచో కొనసాగుతున్న ప్రక్రియ. ఆ అనుభవం అక్షరరూపం దాల్చినప్పుడు యాత్రా సాహిత్యం పుడుతుంది. ఒకరికి సాధ్యమైన ప్రయాణాన్ని మరొకరికి అక్షరాల ద్వారా పరిచయం చేయడం, తన కళ్లతో చూసిన ప్రపంచానికి ఇతరుల ముందు ఒక గవాక్షాన్ని తెరవడం యాత్రా రచన ప్రత్యేకత. తెలుగులో ఆధునిక యాత్రాసాహిత్యానికి దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర ఉంది. 1822లో వెన్నెలకంటి సుబ్బారావు తన కాశీయాత్రను ఆత్మకథలో నమోదు చేయగా, 1838లో ఏనుగుల వీరాస్వామి 'కాశీయాత్ర చరిత్ర' స్వతంత్రంగా విస్తృతమైన యాత్రా గ్రంథంగా వెలువడింది. ఈ ప్రక్రియ తర్వాత అనేక రూపాల్లో విస్తరించింది. తెలుగులో సుమారు రెండు వందల యాత్రా గ్రంథాలు, దాదాపు వందమంది యాత్రా గ్రంథకారులు ఉన్నారని ఒక అంచనా.
మద్రాసు కోర్టులో ఉద్యోగం చేసిన ఏనుగుల వీరాస్వామి 1830లో వందమందికి పైగా పరివారంతో చెన్నపట్నం నుంచి కాశీకి బయలుదేరారు. రాయలసీమ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య భారత ప్రాంతాల మీదుగా కాశీ వెళ్లి; తిరుగు ప్రయాణంలో బీహార్, బెంగాల్, ఒడిశా, కళింగాంధ్ర, కోస్తాంధ్రల మీదుగా మద్రాసుకు చేరుకున్నారు. మొత్తం ప్రయాణం సుమారు 15 నెలలు సాగింది. ఆయన రహదారులు, రవాణా, వసతి, ఆహారం, పంటలు, స్థానిక ఆచారాలు, మతాచారాలు, కులవృత్తులు, ప్రజల జీవన విధానం, పరిపాలన వంటి అనేక విషయాలను నమోదు చేశారు. అందువల్ల 'కాశీయాత్ర చరిత్ర' కేవలం తీర్థయాత్రా వర్ణనగా కాకుండా పంతొమ్మిదో శతాబ్దపు భారతదేశ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులకు సంబంధించిన విలువైన పత్రంగా నిలిచింది. వెన్నెలకంటి సుబ్బారావు యాత్రానుభవం, చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి కాశీయాత్ర, కందుకూరి వీరేశలింగం, కాళోజీ నారాయణరావు తదితరుల జ్ఞాపకాలు, ఆత్మకథలు కూడా యాత్రను వివిధ సాహిత్య ప్రక్రియల్లోకి తీసుకెళ్లాయి. ఇలా ఒకరు స్వయంగా చూసిన ప్రపంచం అక్షరాల ద్వారా పాఠకులకూ అందుబాటులోకి వచ్చింది.
మధిర సుబ్బన్న దీక్షితుల 'కాశీమజిలీ కథలకు' ఈ పరిణామంలో ప్రత్యేక స్థానం ఉంది. అవి వీరాస్వామి 'కాశీయాత్ర చరిత్ర'లాంటి నిజమైన ప్రయాణ దినచర్యలు కావు. గురువు, శిష్యులు కాశీ వైపు ప్రయాణిస్తూ మజిలీ మజిలీకి కథలు చెప్పుకోవడం వాటి నిర్మాణం. ఇక్కడ ప్రయాణం కథకు నేపథ్యం మాత్రమే కాకుండా కథను ముందుకు నడిపించే పద్ధతిగా పనిచేసింది. కాలక్రమంలో యాత్రా సాహిత్యం తీర్థయాత్ర పరిధిని దాటి దేశదర్శనంగా మారింది. కోలా శేషాచలకవి 'నీలగిరి యాత్ర' వంటి రచనలు ప్రకృతిని, వివిధ ప్రదేశాలను, ప్రజల జీవనాన్ని ప్రయాణంతో ముడిపెట్టాయి. యాత్ర అంటే దేవాలయ దర్శనం మాత్రమే కాదని, దేశాన్ని చూడటం, సమాజాన్ని అర్థం చేసుకోవడం, ప్రకృతిని పరిశీలించడం కూడా అనే దృష్టి ఏర్పడింది. దారిలో కనిపించే ప్రజలు ఎలా జీవిస్తున్నారు, ఏం తింటున్నారు, వారి రవాణా ఎలా ఉంది, వ్యవసాయం ఎలా సాగుతోంది, స్థానిక ఆచారాలు ఏమిటి, పాలనా వ్యవస్థ ఎలా ఉంది వంటి అంశాలు యాత్రారచనలో భాగమయ్యాయి. దీంతో యాత్రాసాహిత్యం క్రమంగా సామాజిక పరిశీలనకు కూడా ఒక రూపంగా మారింది.
సముద్రం దాటి...
తెలుగు యాత్రా సాహిత్యంలో పోతం జానకమ్మకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 1873లో భర్తతో కలిసి ఆమె ఇంగ్లండ్ వెళ్లారు. మద్రాసు నుంచి సముద్రయానంలో గాల్, ఏడెన్, సూయజ్, అలెగ్జాండ్రియా, మాల్టా, జిబ్రాల్టర్ తదితర ప్రాంతాల మీదుగా ఇంగ్లండ్ చేరుకున్నారు. అక్కడి సామాజిక జీవితం, మహిళల పరిస్థితి, రవాణా, పరిశ్రమలు, విద్య, నగరజీవనం, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలను పరిశీలించారు. పంతొమ్మిదో శతాబ్దంలోనే ఒక తెలుగు మహిళ సముద్రం దాటి యూరప్‌కు వెళ్లి అక్కడి సమాజాన్ని పరిశీలించి రాయడం తెలుగు యాత్రా సాహిత్య చరిత్రలో గమనించదగ్గ ఘట్టం. జానకమ్మ దృష్టిలో ఇంగ్లండ్ కేవలం వింతల ప్రపంచం కాదు. భారతదేశంతో పోల్చి చూడాల్సిన మరో సమాజం. ఆ పోలిక యాత్రారచనకు కొత్త ఆలోచనా కోణాన్ని ఇచ్చింది.
భారతీయ యాత్రా సాహిత్యాన్ని విస్తృతంగా ప్రభావితం చేసిన రాహుల్ సాంకృత్యాయన్ తెలుగువారు కాకపోయినా తెలుగు యాత్రా దృష్టిపై ఆయన ప్రభావం గణనీయమైనది. ఆయనకు ప్రయాణం పర్యాటకం కాదు; జ్ఞానాన్వేషణ. చరిత్రను వెతకడం, భాషలను అధ్యయనం చేయడం, బౌద్ధ గ్రంథాలను అన్వేషించడం, హిమాలయాలను దాటడం, టిబెట్ వంటి ప్రాంతాలకు వెళ్లడం, భిన్న సమాజాలను పరిశీలించడం ఆయన యాత్రల లక్షణాలు. అందుకే ఆయన రచనల్లో ప్రదేశాల వర్ణనతోపాటు చరిత్ర, తత్వశాస్త్రం, సామాజిక ఆలోచన, మానవ జీవితం కనిపిస్తాయి. ఆయన రచనలు తెలుగులోకి రావడం ద్వారా తెలుగు పాఠకుడి యాత్రా దృష్టి కూడా విస్తరించింది.

విభిన్న పర్యాటకానుభవాల ‘ఇంతియానం’
తెలుగు యాత్రాసాహిత్యంలో మహిళల స్వరం ప్రత్యేకంగా వినిపించేలా చేసిన విశిష్ట ప్రయత్నం ‘ఇంతియానం’. స్వర్ణ కిలారి సంపాదకత్వంలో రెండు భాగాలుగా వెలువడిన ఈ సంకలనంలో వందమంది తెలుగు మహిళలు తమ యాత్రా అనుభవాలను రికార్డు చేశారు. తొలి భాగంలో 45 మంది, రెండో భాగంలో మరో 55 మంది తమ పర్యాటక అనుభవాలను అక్షరబద్ధం చేశారు. తాము చూసిన ప్రదేశాలను, కలిసిన మనుషులను, ఎదురైన అనుభవాలను మాత్రమే కాకుండా, ఆ ప్రయాణాలు తమలో రేకెత్తించిన ఆలోచనలు, అనుభూతులను కూడా తమదైన దృక్కోణంలో పంచుకున్నారు. ‘ఇంతియానం’ మొదటి భాగంలోని యాత్రలు థాయ్‌లాండ్, అండమాన్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, లాండోర్, జలియన్‌వాలాబాగ్ వంటి ప్రాంతాల నుంచి ఆదిలాబాద్, కాకినాడ మడ అడవుల వంటి స్థానిక ప్రదేశాల వరకు ఉన్నాయి. రెండో భాగంలోనూ స్థానిక ప్రాంతాల నుంచి విదేశీ నగరాలు, భిన్న సంస్కృతుల పరిచయం వరకు అనేక రకాల ప్రయాణ అనుభవాలు కనిపిస్తాయి. సోలో ప్రయాణాలతో పాటు కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తల్లీ–కూతుళ్లు కలిసి చేసిన ప్రయాణాలూ ఇందులో చోటుచేసుకున్నాయి. మహిళలకు ప్రయాణం కేవలం ఒక ప్రదేశాన్ని సందర్శించడం మాత్రమే కాదు; కొత్త ప్రపంచాన్ని తెలుసుకోవడం, తమను తాము మరింతగా అర్థం చేసుకోవడం, అపరిచిత పరిస్థితులను ఎదుర్కోవడం వంటి అనుభవాల సమాహారం. ఈ అనుభవాలను మహిళలే స్వయంగా చెప్పడం ‘ఇంతియానం’ ప్రత్యేకత. భిన్నమైన జీవన నేపథ్యాలు, ప్రయాణాలు, అనుభూతులతో వచ్చిన ఈ కథనాలు మహిళల దృష్టితో ప్రపంచాన్ని పరిచయం చేశాయి. తెలుగు యాత్రాసాహిత్యంలో మహిళల స్వరానికి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించాయి.
యాత్రకు కొత్త చూపు
ఆధునిక తెలుగు యాత్రాసాహిత్యంలో నాయని కృష్ణకుమారి పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. 1967లో విద్యార్థులతో కలిసి కాశ్మీర్ వెళ్లిన అనుభవాలను ఆమె 'కాశ్మీర దీపకళిక'గా మలిచారు. ఆమె చూసిన కాశ్మీర్ కేవలం మంచుకొండలు, సరస్సులు, లోయలు, పర్యాటక ప్రదేశాల సమాహారం కాదు. ప్రకృతి, మనుషులు, సంస్కృతి, అనుభూతి అన్నీ కలిసిన ప్రపంచం. ఈ దశలో మహిళా యాత్రారచన కూడా విస్తరించింది. అబ్బూరి ఛాయాదేవి, జయప్రభ, కురుగంటి శ్రీలక్ష్మి, భానుమతి, మాలతీ చందూర్, టంగుటూరి సూర్యకుమారి తదితరులు తమ యాత్రానుభవాలను అక్షరబద్ధం చేశారు. ప్రపంచాన్ని మహిళా దృష్టితో చూడటం ద్వారా తెలుగు యాత్రాసాహిత్యానికి కొత్త అనుభూతులు, కొత్త ప్రశ్నలు వచ్చాయి. ఒకే ప్రదేశాన్ని వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు అనుభవాల నుంచి చూడగలరని ఈ రచనలు తెలియజేశాయి.
1960లలో అమెరికా ప్రభుత్వం భారతీయ ప్రముఖ కళాకారులను ఆహ్వానించిన సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావు అమెరికా వెళ్లారు. ఆయన తన అనుభవాలను 'నేను చూసిన అమెరికా'గా ప్రచురించారు. అక్కడి సినీ స్టూడియోలు, నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులతోపాటు అమెరికా రైతు కుటుంబ జీవనాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి ఆయన రచనలో కనిపిస్తుంది. తరువాతి కాలంలో యూరప్, రష్యా, చైనా, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా తదితర ప్రాంతాలు కూడా తెలుగు యాత్రాసాహిత్యంలోకి వచ్చాయి. వేమూరి రాజేశ్ 'ఐరోపా యాత్ర' వంటి రచనల ద్వారా యూరప్ అనుభవాలను పాఠకులకు పరిచయం చేశారు. మల్లాది వెంకట కృష్ణమూర్తి ప్రపంచంలోని అనేక దేశాలను పర్యటించి ట్రావెలాగ్‌లు రాశారు. దాసరి అమరేంద్ర 'మూడు నగరాలు', 'అండమాన్ డైరీ' వంటి రచనల్లో ప్రదేశాలకంటే అక్కడి మనుషులు, వారి జీవితాలను ముందుకు తెచ్చారు. 'అండమాన్ డైరీ'లో అనేక వ్యక్తులను సజీవంగా పరిచయం చేయడం ద్వారా యాత్రను మానవ సంబంధాల కథగా మలిచారు. పరిమళా సోమేశ్వర్ 'ప్రేమయాత్ర' వంటి యాత్రా నవలలు రాశారు. అంపశయ్య నవీన్ 'ప్రయాణంలో ప్రమదలు', 'అమెరికా అమెరికా' వంటి రచనల్లో యాత్రను నవలా నిర్మాణంతో మేళవించారు. మధురాంతకం నరేంద్ర యాత్రను కల్పిత కథనంతో అనుసంధానించారు. ఎండ్లూరి సుధాకర్, జె. బాపురెడ్డి, ఎన్. గోపి వంటి కవులు యాత్రను కవితా అనుభూతిగా మలిచారు. పరవస్తు లోకేశ్వర్ వంటి రచయితలు 'స్కూటర్‌పై ఛత్తీస్‌గఢ్ యాత్ర', 'సిల్క్‌రూట్‌లో సాహసయాత్ర' వంటి రచనల ద్వారా రహదారి, ప్రయాణ సాధనం, స్థానిక పరిస్థితులు, మార్గంలోని అనుభవాలను కథనంలోకి తెచ్చారు. హిమాలయ యాత్రలు, పాదయాత్రలు, ట్రెక్కింగ్, పర్వతారోహణ కూడా తెలుగు యాత్రారచనలో స్థానం సంపాదించాయి.
నడకలో ప్రపంచం
ఆధునిక తెలుగు యాత్రాసాహిత్యాన్ని ఎం. ఆదినారాయణ ప్రస్తావన లేకుండా చూడలేం. ఆయనకు యాత్ర పర్యాటకం కాదు, జీవనానుభవం. రాహుల్ సాంకృత్యాయన్ శతజయంతి సందర్భంగా 1993లో విశాఖపట్నం నుంచి డార్జిలింగ్‌లోని సాంకృత్యాయన్ సమాధి వరకు సుమారు 1,800 కిలోమీటర్లు నడిచారు. ఆ యాత్ర 'పాదయాత్రాంజలి'గా రూపుదిద్దుకుంది. తన బాల్యంతో ముడిపడిన గుండ్లకమ్మ నది మూలాలను అన్వేషిస్తూ సుమారు 300 కిలోమీటర్లు నడిచిన అనుభవం 'ఏటి ఒడ్డున ప్రయాణం'గా వచ్చింది. చెల్లెలు కోటేశ్వరి జ్ఞాపకార్థం చవటపాలెం నుంచి ఢిల్లీ వరకూ సుమారు 2,300 కిలోమీటర్లు నడిచిన యాత్ర 'ప్రార్థించే పాదాలు'గా నమోదైంది. ఈ యాత్రల సమాహారం 'భ్రమణ కాంక్ష'గా వెలువడింది. 14 దేశాల ప్రయాణాలను నమోదు చేసిన 'భూభ్రమణ కాంక్ష'తో ఆయన ప్రపంచయాత్రకు విస్తృత రూపాన్ని ఇచ్చారు. 2016లో వచ్చిన 'తెలుగువారి ప్రయాణాలు' సంకలనంలో 1838 నాటి 'కాశీయాత్ర చరిత్ర' నుంచి ఆధునిక యాత్రికుల వరకు 64 మంది తెలుగువారి ప్రయాణ రచనల శకలాలను సేకరించారు. దాంతో తెలుగు యాత్రాసాహిత్యంలోని పాత, కొత్త ధోరణులను ఒకే చోట నుంచి చూసే అవకాశం ఏర్పడింది.
పుస్తకాలతోపాటు పత్రికలు కూడా యాత్రాసాహిత్య విస్తరణకు దోహదపడ్డాయి. విదేశీ ప్రయాణాలను రచయితలు వారపత్రికలు, మాసపత్రికల్లో ధారావాహికలుగా ప్రచురించారు. సి. నారాయణరెడ్డి రష్యా పర్యటన అనుభవాలను ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ధారావాహికగా రాశారు. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత బ్లాగులు, వెబ్ పత్రికలు, సామాజిక మాధ్యమాలు, వీడియోలు యాత్రానుభవానికి కొత్త వేదికలయ్యాయి. ప్రయాణం చేసిన వ్యక్తి అనుభవం అక్కడితో ఆగకుండా మరింత మందికి చేరే మార్గాలు ఏర్పడ్డాయి. నేడు సరికొత్తగా పర్యాటక అనుభవం కూడా డిజిటల్ రూపంలో నమోదవుతోంది.
సత్యాజీ
94900 99167







కామెంట్‌లు (0)