ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅమ్మ పాత్రలో జీవించా!

2 గంటల క్రితం

srinidhi .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 08:02 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

సినిమా రంగంలో అందం ఒక్కటే విజయానికి కొలమానం కాదు. ప్రతిభ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతోపాటు విభిన్న పాత్రలను ఎంచుకునే ధైర్యం కూడా అవసరం. ఈ లక్షణాలతోనే దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి శ్రీనిధి శెట్టి. అందాల పోటీల్లో అంతర్జాతీయ కిరీటాన్ని గెలుచుకుని, ఆ తర్వాత వెండితెరపై అడుగుపెట్టిన ఆమె ‘కేజీఎఫ్‌’ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. గ్లామర్‌ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా కథానాయకుడు వెంకటేష్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కలయికలో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం – హౌస్‌ నెం. 47’ (ఎకె 47) చిత్రంలో స్వర్ణగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఇద్దరు పిల్లల తల్లిగా కనిపిస్తూ, ద్వితీయార్ధంలో వచ్చే అనూహ్యమైన మలుపుతో యాక్షన్‌ సన్నివేశాల్లోనూ మెప్పించడం ఆమె పాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని కిన్నిగోళిలో 1992 అక్టోబరు 21న శ్రీనిధి శెట్టి జన్మించారు. తండ్రి రమేష్‌ శెట్టి, తల్లి కుశల. అమృత, ప్రియాంక అనే ఇద్దరు అక్కలు ఉన్నారు. మంగళూరులో పాఠశాల విద్యను పూర్తిచేసిన ఆమె.. బెంగళూరులోని జైన్‌ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చదివారు. చదువుతో పాటు మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకున్నారు. 2015లో మిస్‌ సౌత్‌ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్‌ కర్ణాటక, మిస్‌ బ్యూటిఫుల్‌ స్మైల్‌ టైటిళ్లను గెలుచుకున్నారు. 2016లో మిస్‌ దివా సుప్రనేషనల్‌ కిరీటాన్ని అందుకున్నారు. అదే ఏడాది పోలాండ్‌లో జరిగిన మిస్‌ సుప్రనేషనల్‌ అంతర్జాతీయ అందాల పోటీల్లో విజేతగా నిలిచి, దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఈ విజయం ఆమె జీవితంలో కీలక మలుపుగా మారి, మోడలింగ్‌ నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టేందుకు మార్గం సుగమం చేసింది.

కేజీఎఫ్‌తో పాన్‌ ఇండియా గుర్తింపు

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో 2018లో యష్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 1’ తో శ్రీనిధి సినీ ప్రయాణం ప్రారంభమైంది. ఇందులో రీనా దేశాయ్‌ పాత్రలో నటించి, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’ తో మరింత గుర్తింపు పొందారు. భారీ విజయాన్ని అందుకున్న ఈ రెండు చిత్రాలు ఆమెకు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టాయి. ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’ లో నటనకుగాను 2023లో సైమా ఉత్తమ కన్నడ నటి పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తర్వాత తమిళంలో ‘కోబ్రా’ చిత్రంలో నటించారు. తెలుగులో ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’తో అడుగుపెట్టి, అనంతరం సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ చిత్రంలో మెప్పించారు. భాష ఏదైనా పాత్రకు తగినట్లుగా తనను తాను మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

స్వర్ణగా సరికొత్త ప్రయోగం

వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కలయికలో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం – హౌస్‌ నెం. 47’ లో శ్రీనిధి శెట్టి పోషించిన స్వర్ణ పాత్ర ఆమె కెరీర్‌లో మరో విభిన్నమైన ప్రయత్నం. మొదటి భాగంలో ఇద్దరు పిల్లల తల్లిగా, అమాయకమైన గృహిణిగా కనిపిస్తూ హాస్యాన్ని పండిస్తారు. కుటుంబ సన్నివేశాల్లో ఆమె హావభావాలు సహజంగా ఉంటాయి. అయితే ద్వితీయార్ధంలో పాత్రలో చోటుచేసుకునే అనూహ్యమైన మలుపు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. యాక్షన్‌ సన్నివేశాల్లోనూ తనదైన శైలిలో మెప్పించారు. వెంకటేష్‌తో ఆమె కెమిస్ట్రీ, పాత్రకు తగ్గట్టుగా చెప్పిన డబ్బింగ్‌ కూడా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాయి. నవంబర్‌లో విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుండటంతో శ్రీనిధి నటనపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి. అందాల పోటీలతో మొదలైన ఆమె ప్రయాణం అంతర్జాతీయ కిరీటం, పాన్‌ ఇండియా సినిమాలు, విభిన్న భాషల్లో నటన వరకు విస్తరించింది. విజయాలు తనను ముందుకు నడిపిస్తే, అపజయాలు ఎన్నో పాఠాలు నేర్పాయని ఆమె చెబుతుంటారు. పాత్రల ఎంపికలో కొత్తదనానికి ప్రాధాన్యమిస్తూ నటిగా తన పరిధిని విస్తరించుకోవాలన్నదే శ్రీనిధి ఆకాంక్ష. తెరపై అందంతోనే కాకుండా వైవిధ్యమైన నటనతోనూ ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలన్న ఆమె ప్రయత్నం కొనసాగుతోంది.

అమ్మ పాత్రకూ సై..

సాధారణంగా కథానాయికలు కెరీర్‌ ప్రారంభంలోనే తల్లి పాత్రలు చేయడానికి కొంత వెనుకాడుతుంటారు. అయితే శ్రీనిధి శెట్టి మాత్రం కథ, పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రనైనా అంగీకరించేందుకు సిద్ధమంటున్నారు. ‘ఆదర్శ కుటుంబం’లో అమ్మ పాత్రకు అంగీకరించడం కూడా అందులో భాగమే. ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 1, కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’’ చిత్రాలు మంచి విజయాన్ని అందించాయి. అయితే ఆ తర్వాత నేను నటించిన తమిళ చిత్రం ‘‘కోబ్రా’’ కు ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ లభించలేదు. కెరీర్‌ ప్రారంభంలోనే విజయాలు, అపజయాలు రెండింటినీ చూశాను. ఒక సినిమా విజయం సాధించడం పూర్తిగా మన చేతుల్లో ఉండదని అర్థమైంది. అందుకే కథ, పాత్ర నచ్చిన సినిమాలనే ఎంపిక చేసుకుంటున్నాను. ‘‘ఆదర్శ కుటుంబం’’ లో నాది అమ్మ పాత్ర అని చెప్పగానే నో చెప్పాలనుకోలేదు. వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కలయికలో సినిమా అంటేనే ప్రత్యేక ఆసక్తి కలిగింది. అందుకే ఈ చిత్రంలో భాగం కావాలనుకున్నాను. పాత్రలో ఒదిగిపోయి జీవించాను. వెంకటేష్‌ అద్భుతమైన నటుడు. ఆయన కామెడీ టైమింగ్‌, భావోద్వేగ సన్నివేశాల్లో నటన ఎంతో బాగుంటాయి. ఆయనతో కలిసి నటించడం మంచి అనుభవం. త్రివిక్రమ్‌ సూచనలతో నా పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించాను. ‘‘హిట్‌ 3’’ చిత్రంలో కొంత యాక్షన్‌ చేశాను. ‘‘ఆదర్శ కుటుంబం’’ లోనూ యాక్షన్‌ సన్నివేశాల్లో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నేనే డబ్బింగ్‌ చెప్పుకోవడం మరింత సంతోషాన్నిచ్చింది. ‘‘రామాయణ’’ సినిమాలో సీత పాత్ర కోసం ఆడిషన్‌ ఇచ్చాను. అయితే ఆ పాత్రకు సాయిపల్లవిగారు ఎంపికయ్యారు. ప్రస్తుతం కన్నడలో ఓ సినిమా చేస్తున్నాను. తెలుగులో మరికొన్ని సినిమాల గురించి చర్చలు జరుగుతున్నాయి’’ అని తెలిపారు.

పేరు: శ్రీనిధి శెట్టి
వయస్సు: 35
పుట్టిన ఊరు: మంగళూరు, కర్ణాటక

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్