ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపాత్రకు నిజాయితీగా ఉండటమే ముఖ్యం

1 గంట క్రితం

Gowri priya.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 09:51 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

‘‘చెన్నయి లవ్ స్టోరీ’’తో మరోసారి తన నటనకు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు యువ కథానాయిక శ్రీ గౌరీప్రియ. భావోద్వేగాలను ఎంతో అందంగా వ్యక్తీకరించిన తీరుకి ప్రేక్షకుల నుంచి అభినందనల వర్షం కురుస్తోంది. చిన్న అవకాశాలను కూడా పెద్ద విజయాలుగా మార్చుకుంటూ ఆమె తన కెరీర్‌ను స్థిరంగా ముందుకు తీసుకెళుతున్నారు. ప్రతి పాత్రలో కొత్తదనం చూపించాలని చేసే ప్రయత్నం ఆమెను యువతకు మరింత అభిమానిని చేస్తోంది. దర్శకుడు సాయి రాజేశ్‌ తీసిన ఈ సినిమాలో ‘నివి’ పాత్రలో శ్రీగౌరీ ప్రియ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ప్రేమలో విఫలమై దేవదాసులా మారిన యువతిగా భావోద్వేగభరితమైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.


హైదరాబాద్ లో పుట్టి పెరిగిన గౌరీ ప్రియ.. తండ్రి శ్రీనివాస్ రెడ్డి, తల్లి వసుంధర. తండ్రి కార్పొరేట్ రంగంలో కన్సలెంట్ గా పనిచేశారు. గౌరీ సికింద్రాబాద్ లో సెయింట్ ఆన్స్ హై స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. చిన్నప్పటి నుంచే పాటలు, నృత్యం, నాటకాలు, క్రీడలు వంటి స్కూలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. స్టేజ్ పై మాట్లాడటం, నటించడం పట్ల భయం లేకుండా ఎదగడానికి కుటుంబసభ్యులు ఎంతో ప్రోత్సహించారని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. డిగ్రీలో బిఎంఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత డిజిటల్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ లో ఉన్నత విద్యను పూర్తి చేశారు.

గాయనిగా గుర్తింపు

విద్యార్థి దశలోనే కళారంగంపై ఆసక్తి పెంచుకున్న గౌరీ ప్రియ, ముందుగా సంగీతం, వేదికలపై ప్రదర్శనల ద్వారా తన ప్రతిభను చాటుకున్నారు. ప్రముఖ టెలివిజన్ కార్యక్రమం ‘‘బోల్ బేబీ బోల్’’ లో పాల్గొని గాయనిగా గుర్తింపు పొందారు. ఆమెకు అక్కడ లభించిన ఆత్మవిశ్వాసమే వినోద రంగంలో ముందుకు సాగేందుకు బాటలు వేసింది. 2018లో నిర్వహించిన 'మిస్ హైదరాబాద్' అందాల పోటీలో విజేతగా నిలవడం గౌరీ ప్రియ కెరీర్‌లో కీలక మలుపుగా మారింది. ఆ విజయం తర్వాత మోడలింగ్‌తో పాటు పలు ప్రకటనల్లో నటించే అవకాశాలు ఆమెను వెండితెరకు మరింత చేరువ చేశాయి. సినిమాల్లోకి రాకముందు గౌరీ ప్రియ టెలివిజన్ రంగంలో యాంకర్‌గా, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కెమెరా ముందు సహజంగా ఉండే తీరు, స్పష్టమైన అభివ్యక్తి ఆమెకు నటిగా అవకాశాలు తెచ్చిపెట్టాయి.

‘‘మెయిల్‌’’ ద్వారా

ఉదయ్ గుర్రాల దర్శకత్వంలో తీసిన ‘‘మెయిల్‌’’ చిత్రంతో 2021లో చిత్ర పర్రిశమలోకి అడుగుపెట్టారు. గౌరీ ప్రియ ‘‘రోజా’’ పాత్రలో గ్రామీణ యువతి పాత్రలో కనిపించారు. పాత్రకు అవసరమైన అమాయకపు చిరునవ్వు, మృదువైన సంభాషణ, సున్నితమైన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పెద్దగా డైలాగులు లేకపోయినా, తెరపై కనిపించిన ప్రతిసారీ తన సహజ నటనతో ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. ఈ చిత్రం ద్వారానే ఆమె సహజ నటిగా సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. దాంతో సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చాయి.

శృతి పాత్రతో ప్రశంసలు..

‘‘రైటర్ పద్మభూషణ్’’ 2023లో విడుదలైన చిత్రం గౌరీ ప్రియకు నటిగా మరింత గుర్తింపు తీసుకొచ్చింది. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆమె ‘‘కన్నా’’ అనే పాత్రలో కనిపించారు. కథానాయకుడు పద్మభూషణ్ జీవితంలో హాస్యాన్ని, సహజత్వాన్ని జోడించే ఈ పాత్రలో గౌరీ ప్రియ ప్రతి సన్నివేశంలోనూ అమాయకత్వం, చలాకీతనం సహజంగా ప్రతిబింబించాయి. ఆ తర్వాత ‘‘మ్యాడ్‌’’ చిత్రంలో ‘‘శృతి’’ పాత్ర ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గౌరీ ప్రియ కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది. గౌరీ ప్రియ తన హావభావాలు, ప్రేమించిన వ్యక్తితో సహజమైన సంభాషణ, కళ్లతోనే భావాలను పలికించే అభినయంతో శృతి పాత్రకు జీవం పోశారు. నిజ జీవితంలో కనిపించే కాలేజ్ అమ్మాయిలా ఆ పాత్రను మలచడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదల తర్వాత యువతలో గౌరీప్రియకు అభిమానులు గణనీయంగా పెరిగారు. అనంతరం తమిళ చిత్రం ‘‘లవర్’’ (Lover)లో ‘‘దివ్య’’ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ చిత్రంలోని నటనకు ఆమెకు ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ డెబ్యూ (ఫిమేల్) అవార్డు కూడా లభించింది.

'చెన్నై లవ్ స్టోరీ'తో మరో మెట్టు

తాజాగా ‘‘చెన్నై లవ్ స్టోరీ’’లో కథానాయికగా నటించిన గౌరీప్రియ, ప్రేమ విఫలమైన భావోద్వేగాలతో నిండిన పాత్రను ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. హీరో కిరణ్‌ అబ్బవరం నటన కన్నా గౌరీప్రియ నటన అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. ఆమె ప్రేమలో విరహవేదన, ఆత్మన్యూనత, ఆశ, ప్రేమ వంటి భావాలను సహజంగా ఈ సినిమాలో పలికించిన ఆమె నటనకు ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల నుంచీ ప్రశంసలు లభిస్తున్నాయి. ‘ఏ పాత్ర చేసినా దానికి నిజాయితీగా ఉండాలి. ప్రేక్షకులు ఆ పాత్రను నిజమని నమ్మేలా నటించగలిగితే అదే నా విజయంగా భావిస్తాను. గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలనే ఎంచుకోవాలని ప్రయత్నిస్తాను. చిన్న పాత్ర అయినా, పెద్ద పాత్ర అయినా నేర్చుకోవడానికి ఒక అవకాశంగా భావిస్తాను. సినిమా ప్రయాణంలో ప్రతి అడుగూ నాకు ఒక పాఠమే’ అని గౌరీప్రియ ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె ఆలోచనా విధానమే నటిగా ఆమె ఎదుగుదలకు బలమైన పునాదిగా నిలుస్తోందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

పుట్టినతేది : 13 నవంబర్, 1998
నివాసం : హైదరాబాద్
అభిరుచులు: సంగీతం, పుస్తక పఠనం, ప్రయాణాలు, నృత్యం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్