సంగీత ప్రపంచంలో వారసత్వాన్ని అందిపుచ్చుకున్నప్పటికీ, తన ప్రతిభతోనే అభిమానుల మన్ననలు పొందిన వ్యక్తి ఎస్పీ చరణ్. గాయకుడిగా మాత్రమే కాకుండా, నటుడిగా, నిర్మాతగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయినా నిలదొక్కుకుని భవిష్యత్తు తరానికి సంగీత వారసులను అందించడం ఒక బాధ్యతగా భావించారు. 'పాడుతా తీయగా' కార్యక్రమం ద్వారా ప్రతిభ గల పిల్లలను గుర్తించి, ప్రతి చిన్నారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ సంగీతానికి సరికొత్త వారసులను తీర్చిదిద్దుతున్నారు ఎస్పీ చరణ్. ఈ సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం.
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సావిత్రి దంపతులకు చెన్నైలో ఉన్నప్పుడు చరణ్ జన్మించారు. చెల్లి పల్లవి ఉన్నారు. సంగీతం, సాహిత్యం, కళలకు ప్రాధాన్యమున్న కుటుంబ వాతావరణంలో పెరిగిన చరణ్‌కు చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి పెరిగింది. అయితే, తండ్రి తనపై సంగీతాన్ని బలవంతంగా రుద్దకుండా, తనకు నచ్చిన రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ఇచ్చారని చరణ్ అనేక సందర్భాల్లో చెప్పారు. చరణ్ తన పాఠశాల విద్యను ఆసన్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూలు, చెన్నైలో పూర్తి చేశారు. ఈ పాఠశాలలోనే నటుడు అజిత్ కుమార్ కూడా ఆయనకు సహ విద్యార్థిగా ఉన్నారు. చిన్నప్పటి నుంచే సంగీతంతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనేవారు. పాఠశాల విద్య అనంతరం అమెరికాకు వెళ్లిన చరణ్, పేస్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బిబిఎ)లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం, సినిమా రంగంపై తనకున్న ఆసక్తితో ఫిల్మ్ అండ్ టెలివిజన్లో రెండేళ్ల ప్రత్యేక కోర్సును కూడా పూర్తిచేశారు.
సంగీతం వైపు అడుగులు..
దేశానికి తిరిగి వచ్చిన చరణ్, కొంతకాలం వ్యాపార రంగంలో అవకాశాలను పరిశీలించినప్పటికీ చివరకు సంగీతం, సినిమా రంగం వైపు అడుగులు వేశారు. అంతేకాదు.. చరణ్ స్వరంలో తండ్రి స్వరఛాయలు ఉండటంతో నేపథ్య గాయకుడిగా అవకాశాలు బాగా వచ్చాయి. ‘‘ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా..’’,‘‘ చెప్పవే ప్రేమా..’’, ‘‘నేను నేనుగా లేనే..’’, ‘‘ఒక తోటలో ఒక కొమ్మలో..’’,‘‘తెలుగు భాష గొప్పదనం...’’,‘‘మెల్లగా కరగనీ..’’, ‘‘అవునన్నా ప్రేమే కాదన్నా ప్రేమే..’’,‘‘చాలు
చాలు చాలు..’’,‘‘ఉయ్యాలో ఉయ్యాల..’’...''ఓ సీతా హే రామా``, ''ఇంతందం`` ఇలా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హిట్ సాంగ్స్ పాడి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
నటుడిగా కొత్త కోణం
నటుడిగానూ ఎస్పీ చరణ్ తన ప్రతిభను నిరూపించుకోవాలనుకున్నారు. సహజమైన నటన, సౌమ్యమైన వ్యక్తిత్వం కారణంగా ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులకు దగ్గరయ్యాయి. ‘‘ఉన్నై చరణడైన్దేన్’’ తమిళం ఇది చరణ్ నటుడిగా గుర్తింపు తెచ్చిన తొలిచిత్రం. ఇదే చిత్రాన్ని ఆయన తన నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించారు. సముద్రకని దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్నేహం, భావోద్వేగాలు, మానవ సంబంధాల నేపథ్యంలో సాగుతుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చరణ్ నటన సహజంగా ఉందని ప్రశంసించారు. వాణిజ్యపరంగా భారీ విజయం కాకపోయినా మంచిపేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘‘నాలో’’ తెలుగులో నటించారు. ఇది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ చిత్రం‘‘సరోజ’’. చరణ్ ముఖ్యపాత్ర పోషించారు. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. యువతలో మంచి ఆదరణ పొందింది. తర్వాత ‘‘వ’’ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించారు. కానీ ఆశించిన విజయం సాధించలేదు. తర్వాత ‘‘వనవరాయన్ వల్లవరాయన్’’ హాస్యభరిత కథాంశంతో తెరకెక్కించారు. కానీ మంచి అవకాశాలు రాకపోవడంతో నటనా ప్రయత్నాలు నిలిపేశారు.
నిర్మాతగా విజయవంతమైన అడుగులు
‘‘కెపిటల్ ఫిల్మ్ వర్క్స్’’ అనే నిర్మాణ సంస్థను 2002లో స్థాపించి, కొత్త దర్శకులు, కొత్త నటీనటులు, విభిన్న కథలకు ప్రాధాన్యం ఇస్తూ పలు చిత్రాలను నిర్మించారు. ‘‘ఉన్నై చరణదైంతేన్’’ మొదటి సినిమా. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు కూడా దక్కాయి. ‘‘మళై’’(తమిళం), ‘‘చెన్నై 600028 (తమిళం)’’, ‘‘కుంగుమ పూవుం కొంజుం పూరవుం’’, ‘‘ఆరణ్య కానం’’, ‘‘తిరుడాన్ పోలీస్’’, ‘‘మూనే మూను వర్తై’’ వంటి తమిళ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలోనూ ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారు.
టీవీ వ్యాఖ్యాతగానూ..
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం దాదాపు రెండు దశాబ్దాల పాటు నిర్వహించిన 'పాడుతా..తీయగా`.. కార్యక్రమం తెలుగు బుల్లితెరపై సంగీతానికి ఒక పాఠశాలగా నిలిచింది. ఆయన మరణానంతరం ఆ కార్యక్రమాన్ని కొనసాగించడం అంత తేలికైన బాధ్యత కాదు. అయితే ఆ బాధ్యతను స్వీకరించిన ఎస్పీ చరణ్ తనదైన శైలిలో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. పోటీలో పాల్గొనే చిన్నారులను కుటుంబసభ్యుల్లా పలకరించడం ఆయన ప్రత్యేకత. వేదికపై భయపడుతున్న పిల్లలను సరదా మాటలతో నవ్విస్తూ, వారి ఆందోళనను తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతారు. అందుకే పిల్లలు కూడా ఆయనతో ఎంతో ఆప్యాయంగా మెలుగుతారు. చరణ్ వ్యాఖ్యానంలో హాస్యం ఉంటుంది. కానీ అది ఎవరి మనసును నొప్పించేలా ఉండదు. తండ్రి కలలైన కొత్త గాయకులను వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యాన్ని అదే నిబద్ధతతో కొనసాగిస్తున్నారు. అందుకే ప్రేక్షకులు ఆయనను కేవలం యాంకర్‌గా కాకుండా, ప్రతిభను ప్రోత్సహించే మార్గదర్శిగా ఆదరిస్తున్నారు.








కామెంట్‌లు (0)