సినిమా రంగంలో అందం, అభినయం, గ్లామర్.. ఇలా ఒక్కో నటికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కానీ సహజత్వమే తన అందం, నటనే తన బలం అని నిరూపించుకున్న హీరోయిన్ సాయిపల్లవి. తెరపై ఆమె కనిపిస్తే పాత్ర మాత్రమే కనిపిస్తుంది తప్ప స్టార్ హోదా గుర్తుకు రాదు. నృత్యంలో లయబద్ధమైన కదలికలతో ఆకట్టుకునే ఆమె, భావోద్వేగ సన్నివేశాల్లో కళ్లతోనే డైలాగులు చెప్పగలదు. పాత్రల్లో తనదైన అభిరుచులకు, విలువలకు ప్రాధాన్యతనిస్తూ సాగుతున్న ఆమె ప్రయాణం ప్రత్యేకమైనది. డాక్టర్ కావాలనే చిన్ననాటి కల నుంచి నటిగా మంచి గుర్తింపు పొందారు. ఎంత ఎత్తు ఎదిగినా.. ఒదిగిపోయే స్వభావం గల సాయిపల్లవి అభిమానులతో ఎప్పుడూ కలిసిపోయి ఉంటారు. ఈ నెలలో ఆమె నటించిన ‘‘రామయణం’’, ‘‘ఓం’’ సినిమాలు విడుదలై, విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తి పేరు : సాయిపల్లవి సెంటామరై కన్నన్
పుట్టినతేది : 1992, మే 9న
చెల్లెలు : పూజ
అవార్డులు : ‘‘ ప్రేమమ్’’ (ఫిల్మ్‌ఫేర్ సౌత్, సైమా అవార్డులు), ‘‘ఫిదా’’, ‘‘లవ్‌స్టోరీ’’, ‘‘శ్యామ్ సింగరాయ్’’, ‘‘గార్గి’’, ‘‘విరాటపర్వం’’ చిత్రాల్లో నటనకు వివిధ విభాగాల్లో (ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డు)పురస్కారాలు అందుకున్నారు. 2020లో ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన 30 అండర్ 30 జాబితాలో చోటు సంపాదించారు. 2021లో తమిళనాడు ప్రభుత్వం నుంచి ‘‘కళైమామణి’’ పురస్కారం అందించారు.
సాయిపల్లవి తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించారు. తండ్రి సెంటామరై కన్నన్ సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో ఉద్యోగిగా పనిచేశారు. తల్లి రాధా కన్నన్. చెల్లెలు పూజా కన్నన్. కుటుంబంలో కళల పట్ల ఆసక్తి ఉండటంతో చిన్నతనం నుంచే సాయిపల్లవికి నృత్యం, సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల మక్కువ. సాయిపల్లవి చదువులోనూ ముందుండేవారు. చిన్నప్పటి నుంచీ వైద్యవృత్తిపై ఆసక్తి ఉండటంతో ఇంటర్మీడియట్ తర్వాత వైద్యవిద్యను అభ్యసించాలని నిర్ణయించుకున్నారు. జార్జియాలోని టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 2016లో వైద్య పట్టా అందున్నారు. 2020లో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (FMGE) కూడా ఉత్తీర్ణత సాధించారు. సాయిపల్లవి మొదట్లో సినిమాల్లో నటించాలని అనుకోలేదు. వైద్యవిద్యను పూర్తిచేసి, కార్డియాలజిస్ట్ కావాలనేది ఆమె లక్ష్యం. అయితే వైద్యురాలిగా ప్రాక్టీస్ చేయకుండా నటననే వృత్తిగా ఎంచుకున్నారు.
డ్యాన్స్ అంటే ప్రాణం
సాయిపల్లవికి చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే ఇష్టం. టీవీలో ప్రసారమైన తమిళ, తెలుగు డ్యాన్సు కార్యక్రమాల్లో పాల్గొని, పోటీలో ఫైనలిస్టుగా నిలిచారు. ఇవి ఆమెలో నృత్య ప్రతిభను గుర్తించేలా చేశాయి.
‘‘ప్రేమమ్’’తో మొదలై..
దర్శకుడు అల్ఫోన్స్ పుత్రెన్ ఆమె డ్యాన్సు వీడియోలను చూసి ‘‘ప్రేమమ్’’ చిత్రంలో నటించే అవకాశం కల్పించారు. అలా 2015లో విడుదలైన మలయాళ చిత్రం ‘‘ప్రేమమ్’’ లో మలర్ టీచర్ పాత్రకు ఎంపికైంది. మేకప్ లేకుండా సహజంగా కనిపించడం, సిగ్గు, చిరునవ్వు, భావాలను పలికించే కళ్లతో మలర్ టీచర్ పాత్రకు ప్రాణం పోశారు. సినిమా ఘన విజయం సాధించడంతో సాయిపల్లవికి దక్షిణాది ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. ఈ విజయం తర్వాత సాయిపల్లవికి వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే ఆమె కేవలం కథానాయికగా కనిపించాలనే ఆలోచనతో కాకుండా, తన నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకున్నారు.
సహజ నటనతో..
‘‘కాళి’’ (2016) సినిమాలో హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ఈ మలయాళ చిత్రంలో అంజలి పాత్ర పోషించారు. తీవ్రమైన కోపం ఉన్న భర్తతో జీవితాన్ని కొనసాగించే భార్యగా కనిపించారు. భావోద్వేగాలతో కూడిన భార్యాభర్తల బంధాన్ని చాలా సహజంగా ప్రదర్శించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘‘ఫిదా’’ (2017) లో ‘‘ భానుమతి’’ పాత్రలో తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా, ‘‘మిడిల్ క్లాస్ అబ్బాయి’’ లో పల్లవి అలియాస్ చిన్ని పాత్రలో కనిపించారు.‘కణం’’ (2018) ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సాయిపల్లవి ‘‘తులసి’’ పాత్రలో తల్లీబిడ్డల అనుబంధం, మాతృత్వ భావోద్వేగాలను ప్రధానంగా చూపించారు.
వైవిధ్యమైన కథల ఎంపిక
ఆ తర్వాత తన నటనలో పరిణితి చెందారు సాయిపల్లవి. పాత్రలతో పాటూ కథలో వైవిధ్యంగా ఉన్నవాటిని ఎంపిక చేసుకున్నారు. ‘‘అథిరన్’’ ఫహాద్ ఫాజిల్‌తో కలిసి నటించిన ఈ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్‌లో నిత్య లక్ష్మి పాత్రలోమానసిక సమస్యలతో బాధపడుతున్న యువతిగా నటించి, ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తించారు. ‘‘పావ కథైగల్’’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ తమిళ ఆంథాలజీలో వెట్రిమారన్ దర్శకత్వం వహించిన 'ఒరు ఇరవు' భాగంలో సుమతి పాత్ర పోషించారు. కులవివక్ష, పరువు పేరుతో జరిగే హింస వంటి సున్నితమైన సామాజిక అంశాలను ప్రతిబింబించే ఈ కథలో ఆమె నటన ప్రేక్షకులను ఆలోచింపజేసింది. తెలుగులోనూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘‘లవ్‌స్టోరీ’’ కూడా అటువంటి పాత్రలోనే నటించారు. ‘‘శ్యామ్ సింగరాయ్’’లో దేవదాసి పాత్రలో, ‘‘విరాటపర్వం’’లో ప్రేమ కోసం ఉద్యమ బాట పట్టిన యువతిగా కనిపించి ప్రేక్షకాదరణ పొందారు. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో తమిళ చిత్రంలో ‘‘గార్గి’’ అనే పాఠశాల ఉపాధ్యాయురాలిగా నటించారు. ‘‘అమరన్’’ చిత్రంలో ‘‘ఇందు రెబెక్కా వర్గీస్’’ పాత్రల ద్వారా భావాలను ఆమె కళ్లతోనే వ్యక్తపరిచారు.
రామాయణంలో సీతగా..
‘‘రామాయణం’’ పార్ట్ వన్ నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ పౌరాణిక చిత్రంలో సీత పాత్ర పోషించారు. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సాయిపల్లవి కెరీర్‌లో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. సీత పాత్రకు అవసరమైన ప్రశాంతత, సహనం, ఔన్నత్యాన్ని తెరపై చాలా చక్కగా ప్రదర్శించారు. ఈ సినిమా కోసం తాను ప్రశాంతంగా కనిపించేందుకు ప్రతిరోజూ ధ్యానం చేశారు. ఈ పాత్ర తాను ఎలాంటి సవాళ్లనైనా ప్రశాంతంగా ఎదుర్కొనేలా నేర్పిందని పల్లవి ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఐపిఎస్ నిత్యారెడ్డిగా..
దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తీసిన‘‘ ఓమ్’’లో సాయిపల్లవి పోషిస్తున్న ఐపిఎస్ నిత్యారెడ్డి పాత్ర కోసం తన రూపంలోనూ పెద్ద మార్పు చేసుకున్నారు. ఖాకీ యూనిఫామ్‌లో గంభీరంగా కనిపిస్తూ, పోలీస్ అధికారిగా తన బాధ్యతను నిర్వర్తించే తీరు ఆకట్టుకుంది. నిత్యారెడ్డి పాత్రకు సరిపోయేలా పొడవాటి జుట్టును కత్తిరించుకున్నారు. తన సహజ స్వభావానికి పూర్తి భిన్నమైన పాత్రను స్వీకరించి, కష్టపడ్డారు. ఫైట్ సన్నివేశాల్లోనూ రియల్ గా నటించారు. సహనటుడు మమ్ముట్టి ఆమె యాక్షన్ సన్నివేశాలను చూసి, ఆమె కరాటే నేర్చుకుందేమో అని అభినందించారు.








కామెంట్‌లు (0)