అసలు పేరు: రక్షిత
పుట్టిన తేదీ: జులై 20, 1992
జన్మస్థలం: వరంగల్, తెలంగాణ
వివాహం: సోక్రటీస్
(మెరైన్ ఇంజనీర్, అసిస్టెంట్ డైరెక్టర్) తో
జనవరి 7, 2021న వివాహం జరిగింది.
వీరికి ఒక కుమారుడు ఉన్నారు.
నిజజీవిత వ్యక్తి (బయోపిక్) ని వెండితెరపై ఆవిష్కరించడం నటీనటులకు పెద్ద సవాలు. ఆ వ్యక్తి మాటతీరు, జీవనశైలి, భావోద్వేగాలను అర్థం చేసుకుని తెరపై ప్రతిబింబించాలి. నటి ఆనంది నటించిన ‘గరివిడి లక్ష్మి’ చిత్రం అలాంటి ప్రయత్నమే. ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితాన్ని ఆవిష్కరిస్తూ, టైటిల్ పాత్రలో ఆనంది తన నటనా ప్రతిభను చాటుకున్నారు. యాస, హావభావాలు, భావోద్వేగాల విషయంలో ఆమె చేసిన సాధన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆనంది అసలు పేరు రక్షిత. తెలంగాణలోని వరంగల్‌లో పుట్టి పెరిగిన ఆమెకు తొలుత చదువుపైనే ఆసక్తి ఉండేది. తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో ‘ఆట జూనియర్స్’, ‘డాన్స్ ఇండియా డాన్స్’ వంటి టెలివిజన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత దర్శకుడు మారుతి ‘ఈ రోజుల్లో’ సినిమాలో అవకాశం ఇవ్వడంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ‘బస్ స్టాప్’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో తమిళ చిత్రసీమలోకి వెళ్లారు. భాష తెలియకపోయినా నటనను కొనసాగిస్తూ, ఇతరులతో మాట్లాడుతూ తమిళం నేర్చుకున్నారు. 2014లో వచ్చిన ‘కాయల్’ ఆమె కెరీర్లో కీలక మలుపుగా నిలిచింది. ఆ తర్వాత ‘చండివీరన్’, ‘విసారణై’, ‘పరియేరుమ్ పెరుమాళ్’ వంటి చిత్రాల్లో నటించారు. తెలుగులో ‘జాంబిరెడ్డి’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ తదితర చిత్రాల్లోనూ విభిన్న పాత్రలు పోషించారు. కథానాయిక పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకోవడం ఆమె ప్రత్యేకత.
గరివిడి లక్ష్మి పాత్రే సవాలు!
ఉత్తరాంధ్ర జానపద కళారంగంలో బుర్రకథ ప్రదర్శనలతో గుర్తింపు పొందిన గరివిడి లక్ష్మి జీవితాన్ని తెరకెక్కించడం దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము చేసిన ప్రత్యేక ప్రయత్నం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 17న విడుదలై, బాక్సాఫీసు వద్ద టాలీవుడ్లో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ద్వారా ఒక జానపద కళాకారిణి జీవితాన్ని విస్తృత ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం జరిగింది. ఈ కథ తన దగ్గరకు వచ్చినప్పుడు గరివిడి లక్ష్మి గురించి, బుర్రకథ కళారూపం గురించి పెద్దగా తెలియదని ఆనంది ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కథ విన్న తర్వాత ఆమె జీవితం మరింతమందికి తెలియాలని అనిపించిందని, ఇలాంటి పాత్ర లభించడం తన అదృష్టమని తెలిపారు.
యాస.. హావభావాలు.. బుర్రకథ!
పాత్రలో సహజంగా ఒదిగిపోవడానికి ఆనంది ప్రత్యేకంగా వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర యాసలో సంభాషణలు పలకడం, మాటల్లో సహజత్వాన్ని తీసుకురావడం సవాలుగా అనిపించిందని చెప్పారు. బుర్రకథ కళాకారుల ప్రదర్శనలను అర్థం చేసుకోవడానికి వీడియోలు చూశారు. కొందరు కళాకారులను ప్రత్యక్షంగా కలిసి వారి ప్రదర్శనలను పరిశీలించారు. వేదికపై కళాకారులు ప్రదర్శించే ఉత్సాహం, శరీర భాష, ముఖ కవళికలు, చేతుల కదలికలను ఆకళింపు చేసుకుని సాధన చేశారు. కళపై ప్రేమ, జీవితంలోని సంఘర్షణలు, గుర్తింపు కోసం చేసే పోరాటాన్ని తన అభినయంతో పలికించేందుకు ప్రయత్నించారు. వేదికపై కళాకారిణిగా కనిపించే ఉత్సాహానికి, వ్యక్తిగత జీవితంలోని ఆవేదనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపడంలో ఆనంది నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. ‘గరివిడి లక్ష్మి’ ప్రీ-రిలీజ్ వేడుకలో ఆనంది చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో నటీనటులు ఎదుర్కొనే సవాళ్లను గుర్తుచేశాయి. అవకాశాలు, లెక్కలు, రాజకీయాల మధ్య కొన్నిసార్లు తాను ఈ రంగానికి సరిపోనేమో అనిపిస్తుందని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, ఆదరణే తనను ముందుకు నడిపిస్తున్నాయని తెలిపారు. పాత్ర కోసం కష్టపడినా నటనా ప్రతిభ ఒక్కటే అవకాశాలకు హామీ ఇవ్వని పరిస్థితులను ఆమె మాటలు ప్రతిబింబించాయి. మరోవైపు, సినిమా ప్రదర్శన అనంతరం ప్రేక్షకుల స్పందన ఆమెకు సంతోషాన్ని ఇచ్చింది. తెరపై ఆనంది కనిపించలేదని, గరివిడి లక్ష్మి మాత్రమే కనిపించిందని ప్రేక్షకులు చెప్పడం నటిగా గొప్ప సంతృప్తినిచ్చిందని ఆమె వెల్లడించారు. ఒక నిజజీవిత కళాకారిణి పాత్రను ప్రేక్షకులు అంగీకరించడం ఆమె సాధనకు లభించిన గుర్తింపుగా చెప్పవచ్చు.
బాల్యం ఇచ్చిన బలం!
‘చిన్నప్పుడు స్కూల్ ఫంక్షన్లలో స్టేజ్‌పైకి వెళ్లాలంటే కాళ్లు వణికేవి. అలాంటిది, ఈ రోజు వేలమంది చూసే వెండితెరపై కనిపిస్తున్నానంటే అది కేవలం నాపై నాకు ఉన్న నమ్మకమే. హాస్టల్ లైఫ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి చేసిన అల్లరి, రాత్రిపూట దొంగచాటుగా తినడం వంటి చిన్న చిన్న సాహసాలు కూడా నన్ను మానసికంగా
స్ట్రాంగ్‌గా చేశాయి. సినిమాల్లో నేను ఎంత సైలెంట్‌గా కనిపిస్తానో, నిజ జీవితంలోనూ అంతే. పార్టీలకు వెళ్లడం కంటే షూటింగ్ అయిపోగానే నా గదిలో ప్రశాంతంగా ఉండటానికే ఇష్టపడతాను. నా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా చిన్నదే. సోక్రటీస్‌తో నా వివాహం 2021లో చాలా సింపుల్‌గా జరిగింది. నా పర్సనల్ లైఫ్ ఎప్పుడూ_లో ప్రొఫైల్‌లోనే ఉండాలని నేను కోరుకుంటాను. నేను ఒక పక్కా బుక్వర్మ్. నా బ్యాగ్‌లో ఎప్పుడూ ఒక పుస్తకం తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ నవలలంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం’ అంటూ ఆనంది ఒక ఇంటర్వ్యూలో తన అభిరుచులను పంచుకున్నారు.
నటిగా మరో మెట్టు
తెలుగు నుంచి తమిళ చిత్రసీమకు వెళ్లడం, కొత్త భాషను నేర్చుకోవడం, విభిన్న కథాంశాల్లో నటించడం ఆనందికి పరిణతిని అందించాయి. ‘గరివిడి లక్ష్మి’ వంటి జానపద కళాకారిణి జీవిత చరిత్ర ఆధారిత చిత్రంలో నటించడం ఆమె ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయి. పాత్ర కోసం కొత్త విషయాలను నేర్చుకోవడం, తనను తాను మలచుకోవడం ఆమె నిబద్ధతను తెలియజేస్తాయి. ఈ చిత్రం ఒక కళాకారిణి కథకే పరిమితం కాకుండా, జానపద కళాకారుల జీవితాలు, వారి ఆత్మగౌరవం, కళకు లభించాల్సిన గుర్తింపు గురించి ఆలోచింపజేస్తుంది. కనుమరుగవుతున్న కళారూపాలను కాపాడుకోవడంతోపాటు, వాటిని సజీవంగా ఉంచుతున్న కళాకారులను గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది. ప్రేక్షకుల మనసుల్లో పాత్రగా నిలవడం ఏ నటికైనా గొప్ప గుర్తింపు. ‘గరివిడి లక్ష్మి’గా ఆనంది చేసిన ప్రయత్నం ఆమె సినీ ప్రయాణంలో గుర్తుండిపోయే మైలురాయిగా నిలుస్తుంది. యాస నుంచి అభినయం వరకు పాత్ర కోసం ఆమె చేసిన సాధన, ప్రేక్షకుల స్పందనకు తోడై మరిన్ని విభిన్న పాత్రలను ఎంచుకునే స్ఫూర్తినిస్తుంది.








కామెంట్లు (0)