ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవెండితెర వైభవం.. కొత్త అధ్యాయానికి శ్రీకారం..

21 నిమిషాల క్రితం

ambati madhumohanakrishna .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 09:58 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

తెలుగు సినిమా ప్రయాణం ఎన్నో మలుపులు, మరెన్నో మైలురాళ్లను దాటుకుంటూ నేటి స్థాయికి చేరుకుంది. కథ చెప్పే పద్ధతి, సాంకేతికత మారింది.. ప్రేక్షకుల అభిరుచులు, సినిమా నిర్మాణ విధానాలు మారాయి. మూకీ చిత్రాల నుంచి టాకీ వరకు, నలుపు–తెలుపు తెర నుంచి రంగుల ప్రపంచం వరకు, ఫిల్మ్‌ కెమెరా నుంచి డిజిటల్‌ సాంకేతికత వరకు, థియేటర్ల నుంచి ఓటీటీ వేదికల వరకు తెలుగు సినిమా నిరంతరం పరిణామం చెందుతూ వచ్చింది. సినిమా అంటే కేవలం నటీనటులు, దర్శకులు, నిర్మాతలు మాత్రమే కాదు. రచయితలు, సంగీత దర్శకులు, గాయకులు, ఛాయాగ్రాహకులు, కళాదర్శకులు, మేకప్‌ కళాకారులు, లైటింగ్‌ సిబ్బంది, సెట్‌ కార్మికులు, ఎడిటర్లు, ధ్వని నిపుణులు, పంపిణీదారులు, ప్రదర్శకులు, థియేటర్‌ సిబ్బంది, రవాణా, హోటల్‌, క్యాటరింగ్‌ వంటి అనేక రంగాలు సినిమాతో ముడిపడి ఉన్నాయి. అందుకే చలనచిత్ర రంగం ఒక సృజనాత్మక పరిశ్రమ మాత్రమే కాదు. వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించే విస్తృత ఆర్థిక వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర వాణిజ్య మండలి దశాబ్ది వేడుకలు 2026 అక్టోబర్‌ 4న గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని హ్యాపీ రిసార్టులో జరగనున్నాయి. వ్యవస్థాపక అధ్యక్ష‍ుడిగానూ, ఇప్పుడు రెండోసారి మండలి అధ్యక్ష‍ులుగా ఉన్న అంబటి మధుమోహనకృష్ణ మనోగతం ఆయన మాటల్లోనే..

గత ఐదు దశాబ్ధాలుగా సినీరంగంలో వివిధ విభాగాల్లో పనిచేసిన అనుభవంతో సినీ పరిశ్రమ బలోపేతానికి కృషి చేస్తున్నా. ఈ దశాబ్ది వేడుక ఒక సంస్థ పదేళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకోవడంతో పాటు, తెలుగు సినిమా భవిష్యత్తు గురించి ఆలోచించడానికి కూడా ఒక సందర్భం. ముఖ్యంగా రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమకు కొత్త మౌలిక వసతులు ఎలా నిర్మించాలి. రాష్ట్రంలోని సహజ వనరులను చిత్రీకరణకు ఎలా వినియోగించుకోవాలి. స్థానిక యువతకు సినీ రంగంలో అవకాశాలు ఎలా కల్పించాలి. పరిశ్రమకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఫిల్మ్‌ చాంబర్‌, ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లతో ఎలా సమన్వయంతో పనిచేయాలి వంటి ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించాల్సిన సమయం ఇది.

ఎంతో ఘనమైన తెలుగు సినిమా చరిత్రలో మన రాష్ర్టానికి చెందిన ప్రముఖ పాతతరం నటీనటులులైన ఎన్‌.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చంద్రమోహన్, సావిత్రి, భానుమతి, జమున, అంజలీదేవి, కాంచన, వాణిశ్రీ, జయప్రదలతో పాటుగా మరోతరం నటులైన రేలంగి, రమణారెడ్డి, ఎస్‌.వి. రంగారావు, గుమ్మడి, అల్లూరామలింగయ్య, పద్మనాభం, చలం వంటి వారిని స్మరించుకోవటం ఎంతైనా ముదావహం. అందుకే ఏటేటా చాంబర్‌ ద్వారా ప్రముఖ నటీనటుల వర్థంతులు, జయంతి వేడుకలను నిర్వహిస్తూ భావితరాలకు వారి త్యాగమయ జీవితం, కళారంగానికి వారు చేసిన చిరస్మరణీయమైన కృషిని వివరిస్తున్నాం. అందులో భాగంగానే దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నాం.

ఈ వేడుకలకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌, ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పి.భరత్‌భూషణ్‌, రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణ, ప్రముఖ సినీనటుడు మాగంటి మురళీమోహన్‌, సినీ నిర్మాత ఎఎం రత్నం, సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. సినీనటీమణులు లయ, నిహారిక కొణిదెల, జో శర్మలకు సత్కారం జరగనుంది. ‘కమిటీ కుర్రాళ్లు’, ‘లిటిల్‌ హార్ట్స్‌’, ‘35–చిన్న కథ కాదు’ చిత్రాల దర్శకులకు అవార్డులు అందించనున్నాం. జాతీయ ఉత్తమ తెలుగు, లఘు చిత్రాల విజేతలు, సీనియర్‌ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు కూడా ప్రోత్సాహంగా అభినందన సత్కారాలు ఉంటాయి.

భవిష్యత్‌ లక్ష్యాలకు వేదిక

ఫిల్మ్‌ చాంబర్‌ దశాబ్ది వేడుకలు ఒక సంస్థ పదేళ్ల ప్రయాణానికి గుర్తు. అదే సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమతో అనుబంధం ఉన్న కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శకులు, పరిశ్రమ ప్రతినిధులు ఒక వేదికపైకి రావడం ద్వారా భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించుకునే అవకాశం కూడా. ఈ విస్తృత సినీ ప్రయాణ స్మరణతో ఈ సందర్భాన్ని అనుసంధానించుకుంటే గత దశాబ్దాలు తెలుగు సినిమాకు అందించిన అనుభవాన్ని సమీక్షించుకుంటాం. అదే సమయంలో మారుతున్న సాంకేతికత, డిజిటల్‌ నిర్మాణం, ఓటీటీ, ప్రపంచ మార్కెట్‌, కొత్త తరహా ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా పరిశ్రమను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై దృష్టి పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాం.

మద్రాసు నుంచి హైదరాబాద్‌ వరకు

తెలుగు సినిమా ప్రారంభదశలో మద్రాసు ప్రధాన కేంద్రంగా ఉండేది. స్టూడియోలు, ప్రయోగశాలలు, సాంకేతిక నిపుణులు, నిర్మాణ సంస్థలు అక్కడే కేంద్రీకృతమయ్యాయి. తెలుగు ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది కళాకారులు అక్కడే తమ సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు. కాలక్రమంలో హైదరాబాద్‌లోనూ చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పడ్డాయి. స్టూడియోలు, నిర్మాణ సంస్థలు, సాంకేతిక నిపుణులు, పెట్టుబడులు పెరగడంతో హైదరాబాద్‌ తెలుగు సినిమాకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది. ఏదైనా ఓ ప్రాంతం సినీ కేంద్రంగా ఎదగాలంటే కేవలం ప్రకృతి అందాలు లేదా ప్రతిభ మాత్రమే సరిపోవు. స్టూడియోలు, సాంకేతిక సదుపాయాలు, పెట్టుబడులు, శిక్షణ, రవాణా, వసతి, అనుమతుల సరళీకరణ, ప్రభుత్వ విధాన సహకారం అవసరం. అలాంటి ప్రోత్సాహకాలనే ఇప్పుడు అమరావతిలో కోరుతున్నాం.

కొత్త అవకాశాలు కల్పిస్తున్నాం

రాష్ట్రంలో సముద్రతీరాలు, నదులు, కొండలు, అడవులు, పచ్చని పంట పొలాలు, చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, కోటలు, గ్రామీణ ప్రాంతాలు, ఆధునిక పట్టణాలు ఇలా విభిన్న కథలకు అనువైన నేపథ్యాలు ఉన్నాయి. ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధికారికంగా రాష్ట్రంలోని అమరావతి ధ్యానబుద్ధ, గోదావరి వంతెన, బెలూం గుహలు, హార్స్లీహిల్స్‌, లేపాక్షి, పులికాట్‌, గండికోట, మచిలీపట్నం తదితర ప్రాంతాలను షూటింగ్‌లకు అనువైనవిగా గుర్తించింది. ఇలాంటి ప్రాంతాలను చిత్రీకరణకు మరింత అనుకూలంగా తీర్చిదిద్దితే సినిమా నిర్మాణంతో పాటు పర్యాటకం, హోటళ్లు, రవాణా, స్థానిక సేవా రంగాలకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. భారీ, చిన్న స్టూడియోలు, ఇండోర్‌ చిత్రీకరణ వేదికలు, శాశ్వత సెట్లు, డబ్బింగ్‌, రికార్డింగ్‌, ఎడిటింగ్‌, పోస్ట్‌ప్రొడక్షన్‌, యానిమేషన్‌ వంటి యూనిట్లు, వస్త్రాలు, మేకప్‌, కళా విభాగం, నిర్మాణ సంస్థల కార్యాలయాలు, సాంకేతిక శిక్షణ కేంద్రాలు వంటివి వస్తే మరింతగా పరిశ్రమ విస్తరిస్తుంది.

సమిష్టి కృషి

పరిశ్రమ తరఫున ఫిల్మ్‌ చాంబర్‌, ప్రభుత్వ రంగంలో ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, రాష్ట్ర ప్రభుత్వం పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో కొత్త ప్రతిభను ప్రోత్సహించడం, చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో చర్చించడం వంటి కార్యక్రమాలు మేము కొనసాగిస్తున్నాం. దశాబ్ది వేడుకల సందర్భంగా షార్ట్‌ఫిల్మ్‌ పోటీలను నిర్వహించడం కూడా కొత్త ప్రతిభను ప్రోత్సహించే చర్యల్లో ఒకటి. ఏపీ ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 1975లో రాష్ట్రంలోని చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఏర్పాటైంది. ప్రస్తుతం ఆ సంస్థ ఆన్‌లైన్‌ షూటింగ్‌ అనుమతులు, చిత్రాల నమోదు, చిత్రీకరణ ప్రాంతాల ప్రచారం, నంది అవార్డులు తదితర కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ రెండు వ్యవస్థలతో పాటు ప్రభుత్వం మౌలిక వసతులు, విధానపరమైన నిర్ణయాలు, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి అంశాల్లో సహకరిస్తే సినీ రంగానికి మరింత బలమైన పునాది ఏర్పడుతుంది.

సంభాషణ : యడవల్లి శ్రీనివాసరావు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్