శశాంక్ ఏలేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్ నటన చాలా బాగుంది. కేవలం ఒక పాత్రకే పరిమితం కాకుండా, ప్రతి సినిమాలోనూ వేర్వేరు పాత్రలతో, సరికొత్త అభినయంతో ప్రేక్షకులను మైమరపిస్తుంటారు. తాను ఇండస్ట్రీకి వచ్చింది స్టార్డమ్ సాధించడానికో, ఫ్యాన్ బేస్ పెంచుకోవడానికో కాదు. కేవలం నాన్న (ఫాజిల్) సంతోషం కోసమే ఇండస్ర్టీలోకి వచ్చానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నేడు భారతీయ చిత్రసీమ గర్వించదగ్గ నటులలో ఒకరిగా ఎదిగిన జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు కనిపిస్తాయి. ఈ మధ్యకాలంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న విశేషాలు తెలుసుకుందాం.
ఆలప్పుళలోని సుప్రసిద్ధ సినీ కుటుంబంలో జన్మించిన ఫహాద్ తండ్రి ప్రముఖ దర్శకుడు ఎ.ఎమ్. ఫాజిల్, తల్లి రోజినా. నాన్న గొప్ప దర్శకుడైనప్పటికీ ఫహాద్ బాల్యం సాధారణ వాతావరణంలోనే గడిచింది. చిన్నతనం నుంచే హాస్టల్ వాతావరణంలో, బోర్డింగ్ స్కూళ్లలోనే ఆయన చదువు సాగింది. ఊటీలోని లారెన్స్ స్కూల్, త్రిప్పుణిత్తురలోని ఛాయిస్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసిన ఫహాద్, ఆ తర్వాత డిగ్రీ చదివి, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి మయామి విశ్వవిద్యాలయం నుండి ఫిలాసఫీలో మాస్టర్స్ పట్టా పొందారు. బోర్డింగ్ స్కూల్ అండ్ విదేశీ జీవితం ఆయనకు చిన్నతనం నుంచే స్వతంత్రంగా ఆలోచించడం, ఎవరిపై ఆధారపడకుండా తన బాధ్యతలు తాను చూసుకోవడం నేర్పాయని ఆయన ఓ సందర్భంలో తెలిపారు.
తండ్రి సినీ రంగంలో ఉన్నప్పటికీ ఫహాద్‌కు చిన్నతనంలో నటనపై ఉండేదికాదు. అయితే పన్నెండేళ్ల వయసులో నాన్న సెట్‌కి వెళ్లినప్పుడు తమిళ నటుడు విజయ్‌తో సంభాషించడం, సినిమా గురించిన విషయాలు వినడం ఆయనకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. కేవలం ఇరవై ఏళ్ల వయసులో 2002లో ఆయన తండ్రి దర్శకత్వంలోనే ‘కయ్యేతుమ్ దూరత్’ అనే మలయాళం చిత్రంతో కథానాయకుడిగా తెరంగేట్రం చేశారు. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. మొదటి సినిమా ప్లాప్ అవ్వడం, తన నటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం ఫహాద్‌ను తీవ్రంగా కలచివేసింది. ‘ఆ సినిమా ప్లాప్ కావడానికి నాన్న కారణం కాదు, నాదే తప్పు. ఎలాంటి ముందస్తు శిక్షణ లేదు. మానసిక సంసిద్ధత లేకుండా నేను నటనలోకి వచ్చేశాను. ఆ వైఫల్యాన్ని ఎలా తట్టుకోవాలో నాకు తెలియక రెండు రోజులకే అమెరికా వెళ్లిపోయాను’ అని ఓ ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా తన పంచుకున్నారు.
సుదీర్ఘ విరామం..తర్వాత
అమెరికాలో ఐదేళ్లపాటు చదువుకుంటూ గడిపిన కాలం ఆయన ఆలోచనా దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసింది. గొప్ప వ్యక్తుల్ని కలిశారు. ఎన్నో పుస్తకాలు చదివారు. అక్కడ విడుదలైన రకరకాల ప్రపంచ సినిమాలు చూడటం, అనేక విషయాలను గమనించడం వల్ల నటనపై ఆయనకు నిజమైన గౌరవం, అనుబంధం ఏర్పడ్డాయి. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒక్క సినిమాలోనైనా నటించాలని ఇండియాకు వచ్చారు. 2009లో రంజిత్ రూపొందించిన ‘కేరళ కేఫ్’ అనే సంకలన చిత్రంలోని ఓ చిన్న లఘు చిత్రం ద్వారా ఆయన మళ్లీ వెండితెరకు రీ-ఎంట్రీ ఇచ్చారు. ఈసారి ఆయన మునుపటి లాంటి తప్పు చేయకుండా నటనకు ఆస్కారం ఉన్న చిన్న చిన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రయాణం ప్రారంభించారు.
నటనకే ప్రాముఖ్యత..
‘చాప్పా కురిషు’ సినిమా ఆయన సినీ జీవితంలో మొదటి పెద్ద మలుపుగా నిలిచింది. ఆ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తన కళ్లతోనే భయంకరమైన హావభావాలు పలికించి, చిత్రపరిశ్రమను ఆశ్చర్యపరిచారు. అప్పటి నుండి కమర్షియల్ ఫార్ములా సినిమాలకు భిన్నంగా ‘22 ఫిమేల్ కొట్టాయమ్’, ‘డైమండ్ నెక్లేస్’, ‘ఆమెన్’, ‘కుంబళంగి నైట్స్’, ‘జోజి’, ‘మామన్నన్’, ‘ఆవేశం’ వంటి చిత్రాల్లో పూర్తి వైవిధ్యమైన, క్లిష్టమైన పాత్రలు పోషిస్తూ తనను తాను క్రమంగా మలచుకున్నారు.
అలా ఒక్క సినిమా చేద్దామని వచ్చి, 66 సినిమాలు చేశారు. ‘నాకేదీ నిరూపించుకోవాలనే ఆరాటం లేదు. ప్రేక్షకులను మెప్పించాలి, చేసే పనిలో నాకు ఆనందం ఉండాలి. నా పనిలో తృప్తి లేదనిపిస్తే కొన్నాళ్ల పాటు సినిమాలకు పూర్తిగా విరామం ఇచ్చి, ప్రయాణాలు చేస్తాను. నా దృష్టిలో సినిమా అనేది నిరంతర అభ్యాసం’ అని ఆయన తన నటనా శైలి గురించి చెప్పారు. కేవలం సంభాషణలపైనే కాకుండా శారీరక భాష, చూపుతోనే భావాలు వ్యక్తపరిచే కళను సొంతం చేసుకున్న ఫహాద్, ఎలాంటి సోషల్ మీడియా ఖాతాలు లేకుండా, కేవలం తన పనితనం ద్వారానే పాన్-ఇండియా వ్యాప్తంగా అగ్రనటుడిగా గుర్తింపు పొంది, ముందుకు సాగుతున్నారు.
పాత్రే కనిపిస్తుంది..
‘‘కుంబళంగి నైట్స్’’ సినిమాలో ఫహాద్ ‘‘షమ్మీ’’ పాత్రలో చాలా నిమ్మళంగా, పద్ధతిగా కనిపిస్తూనే లోపల తీవ్రమైన పురుషాధిక్య భావాలు కలిగిన పాత్ర.
ఈ సినిమాలో ఫహాద్ నటించారనడం కంటే ఆ పాత్రలో జీవించారనడం సరిపోతుంది. బయటకు ఎంతో నీట్‌గా, నవ్వుతూ ఉండే వ్యక్తి సమాజం నిర్దేశించిన పద్ధతులను ఇతరులపై ఎలా రుద్దడానికి ప్రయత్నిస్తాడో ఈ పాత్ర ద్వారా చూపించారు. అద్దం ముందు నిలబడి మీసం తిప్పుకునే సన్నివేశంలో ఆయన హావభావాలు, సినిమా క్లైమాక్స్‌లో సైకోగా మారే క్రమంలో కళ్లలోనే భయాన్ని, వికారాన్ని పలికించిన తీరు సినీ విమర్శకులను సైతం ఆశ్చర్యపరిచింది. ఒక విలన్ పాత్రను ఎంత సైలెంట్‌గా, ప్రమాదకరంగా చేయవచ్చో ఫహాద్ నిరూపించారు. ‘‘తోండిముతలుమ్ దృక్సాక్షియుమ్’’ 2017లో ప్రసాద్ పాత్ర ప్రతిఒక్కరిని ఆకర్షిస్తుంది. బస్సులో మహిళ మెడలోని బంగారు గొలుసును దొంగిలించి, దొరికిపోకుండా దాన్ని మింగేసే ఒక తెలివైన దొంగ. ఈ పాత్రకు సంభాషణలు చాలా తక్కువగా ఉంటాయి. పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎంత చిత్రహింసలు పెట్టినా, ప్రశ్నించినా ‘‘నేను దొంగతనం చేయలేదు’’ అని అమాయకంగా మొహం పెట్టే తీరు అద్భుతం. నిజం చెప్తున్నాడా? అబద్ధం చెప్తున్నాడా? అని ప్రేక్షకుడికి కూడా అనుమానం వచ్చేలా ఆయన అభినయం ఉంటుంది. ఈ సినిమాలో ఆయన చూపించిన సూక్ష్మమైన హావభావాలకుగానూ ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు లభించింది.
ఇప్పుడు.. శశాంక్ ఏలేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రం పలు భాషల్లో అక్టోబర్ 2న విడుదలై మంచిపేరు తెచ్చుకుంది. ఇందులో కీలకపాత్ర పోషించిన ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్-సారా అనే బాలికతో కలిసి నటించారు. ఈ చిత్రంలో ప్రాథమికంగా ప్రేమ, ఆప్యాయతలతో పాత్ర నడుస్తుంది. లోతైన భావోద్వేగాలు ఇందులో ఫహాద్ కనబరిచారు. ఒక రకంగా చెప్పాలంటే పెద్దల కోసం తీసిన పిల్లల సినిమా. ‘ఈ సినిమా విషయంలో నాకెదురైన పెద్ద సవాల్ అంటే.. భాష. తెలుగులో ఆ కొత్త పదాల్ని, భాషనీ అర్థం చేసుకుంటూ నటించడం నాకు పెద్ద సవాల్‌గా మారింది. అయినా ఈ ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదించాను’ అని ఫహాద్ తన అనుభవాన్ని పంచుకున్నారు. నటుడిగా ఆయన ప్రయాణం మొదలై 24 ఏళ్లయింది. ఇలా వైవిధ్యభరితమైన పాత్రలు ఎంచుకుంటూ ఫహాద్ అభిమానులకు, ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు.








కామెంట్లు (0)