mh ad
ఆదివారం, 28 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅందరికీ స్నేహ హస్తం.. పోస్ట్‌

2 గంటల క్రితం

post man
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 08:04 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

ఒక చిన్న ఉత్తరం ఎన్నో భావోద్వేగాలను మోసుకొచ్చేది. ఒక మనియార్డర్ కుటుంబానికి ఆసరా ఇచ్చేది. ఒక పార్సెల్ ఎంతో ఆప్యాయతను చేరవేసేది. ఒకప్పుడు ఇంటి గుమ్మానికి చేరిన ఉత్తరం అంటే ఆనందం, ఆతృత, అనుబంధం. ఆ ఉత్తరాల వెనుక ఎండనక, వాననక, దూరమనే మాటలేకుండా కష్టపడిన పోస్టల్ ఉద్యోగుల సేవలు దాగి ఉంటాయని అందరం గుర్తించాలి. ఈ రోజు ఫోన్‌ల ద్వారా సమాచారం క్షణాల్లో చేరుతున్నా.. ఒకప్పుడు మనసులోని మాటలను కాగితంపై రాసి, ఉత్తరాల రూపంలో చేరవేసేది పోస్టల్ వ్యవస్థే. కాలం మారినా, సాంకేతికత పెరిగినా, వారి సేవల విలువ ఏమాత్రం తగ్గలేదు. అలాంటి నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ‌జరుపుకునేదే జులై 1వ తేదీ జాతీయ పోస్టల్ వర్కర్స్ డే. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.


సాంకేతికత లేని రోజుల్లో ఉత్తరాలే మనుషుల మధ్య బంధాలను బలపరిచాయి. విదేశాల్లో ఉన్న కొడుకు రాసిన ఉత్తరం తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇచ్చేది. సైన్యంలో పనిచేస్తున్న జవాను పంపిన ఉత్తరం కుటుంబానికి ఆనందాన్ని అందించేది. విద్య, ఉద్యోగం, ప్రభుత్వ సమాచారమంతా ఉత్తరాల ద్వారానే చేరేది. ప్రతి ఉత్తరం వెనుక ఒక కథ, ఒక భావోద్వేగం ఉండేది. దూరంగా ఉన్న కుటుంబసభ్యుల సమాచారం అందించే పోస్ట్‌మ్యాన్‌ ‌కోసం ఎన్నో ఎదురుచూపులు ఉండేవి. ఎండైనా, వానైనా, చలైనా.. గ్రామం అయినా, పట్టణం అయినా.. ప్రతి ఇంటి గుమ్మం వరకూ సేవలు అందించడంలో పోస్టల్ ఉద్యోగులు ఎన్నో కష్టాలు పడుతుంటారు. కేవలం ఉత్తరాలు మాత్రమే కాదు.. పార్సిళ్లు, ప్రభుత్వ పత్రాలు, పెన్షన్లు, మనీ ఆర్డర్లు, బ్యాంకింగ్ సేవలు, అత్యవసర సమాచారాన్ని కూడా ప్రజలకు సకాలంలో చేరవేస్తుంటారు.

సేవలు గుర్తించి..

మారుమూల గ్రామాల్లో పోస్టుమ్యాన్ ఇప్పటికీ ప్రభుత్వ సేవలకు, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్నారు అంటే ఆశ్చర్యం అక్కర్లేదు. అందుకే వీరిసేవలను గుర్తించి, ప్రతి సంవత్సరం జులై 1న ‘జాతీయ పోస్టల్ వర్కర్ డే’ నిర్వహిస్తారు. భారతీయ తపాలా వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న లక్షలాది మంది పోస్టల్ సిబ్బంది అవిశ్రాంత సేవలకు ఇది గౌరవం. 1997లో రిచర్డ్ ఇ. బేకర్ ప్రారంభించిన ఈ దినోత్సవం, వడగాడ్పులు, వానలు, ఎండలు లెక్కచేయకుండా ప్రతి ఇంటి గడపకు అవసరాలను అందించే ఆత్మీయ సహాయకులకు అంకితం చేస్తారు. దేశంలో ప్రస్తుతం లక్షా 65 వేలు పోస్టాఫీసులున్నాయి. వీటిలో 4 లక్షల 17 వేల మంది ఉద్యోగులు, గ్రామీణ డాక్ సేవక్‌లు కలిసి పనిచేస్తున్నారు. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్‌వర్క్‌గా పేరు వచ్చింది. వీరు ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన దీవుల వరకూ, ఎడారుల నుంచి దట్టమైన అడవుల వరకూ ప్రతి ప్రాంతానికి సేవలు అందిస్తున్నారు.

premlal

మంచులో నడిచి..

హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రేమ్‌లాల్ అనే వ్యక్తి ప్రతిరోజూ 32 కిలోమీటర్ల దూరం మంచుతో కప్పబడిన లాహౌల్ ప్రాంతానికి నడిచి, పోస్టును అందిస్తున్నారు. ఈ మార్గం 9,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది. శీతాకాలంలో మంచు, హిమపాతాల ప్రమాదం ఉన్నప్పటికీ ఆయన సేవలు అందిస్తున్నారు. మార్గం మధ్యలో భారీ మంచు పడుతుంది. ఆక్సిజన్ లెవల్ పడిపోతుంది. కొండ అంచుల వెంట 32 కి.మీ. కాలినడక అయినా ఆయన పోస్టల్ సేవలు అందించారు. కళ్ల ముందు ఎంతటి ప్రమాదం ఎదురైనా ఏ ఒక్కరోజూ ఆయన వెనకడుగు వేయలేదు. ప్రతిరోజూ ఆ ప్రాంతానికి వెళ్లి, పోస్ట్ అందించారు. ప్రేమ్‌లాల్ అంకితభావానికిగానూ 2025లో భారత తపాలా శాఖ అత్యున్నత పురస్కారమైన మేఘదూత్ అవార్డు అందించి, సత్కరించింది.

పడవలో వెళ్లి..

జమ్మూ-కాశ్మీర్‌లో 1,617 పోస్టాఫీసులు, ఈశాన్య రాష్ట్రాల్లో 8,755 పోస్టాఫీసులు పనిచేస్తున్నాయి. వీటి ముఖ్య ఉద్దేశం కొండలు, అడవులు, దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు పోస్టల్, బ్యాంకింగ్, బీమా సేవలను అందించడం. జమ్మూ కాశ్మీర్‌లో కొండ ప్రాంతాలను, అడవులను దాటి మరీ పోస్టల్ సేవలు అందిస్తున్నారు. కాశ్మీర్‌లోని డాల్ సరస్సుపై నడిచే పోస్టాఫీసు ఇప్పటికీ స్థానికులకు పోస్టల్ సేవలు అందిస్తోంది. వరదలు, నీటి మట్టం మార్పులు వచ్చినా పడవ ద్వారానే సేవలు అందించే ప్రత్యేక పోస్టాఫీసుగా నిలిచింది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో కొండ ప్రాంతాలు, అడవులు, తక్కువ రోడ్లున్న ప్రాంతాల్లో పోస్టల్ ఉద్యోగులు వెళ్లి సేవలు అందిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీ ప్రాంతాల్లో మంచు కారణంగా తరచూ రవాణా అంతరాయం ఏర్పడుతుంది. దాంతో పోస్టల్ సేవలు పూర్తిగా నిలిచిపోకుండా స్థానిక సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సేవలను అందిస్తారు.

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ వంటి నక్సల్ ప్రభావిత జిల్లాల్లో పోస్టుమ్యాన్‌లు కొండలు, దట్టమైన అడవుల మధ్య ప్రతి నెలా వందల కిలోమీటర్లు ప్రయాణించి, సేవలు అందిస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు ఈ ఇబ్బందులు పడలేక కొంతమంది సిబ్బంది ఉద్యోగాలు మానుకున్నారు. దాంతో సిబ్బంది కొరత ఏర్పడుతోంది. మరికొన్నిచోట్ల సిబ్బంది కొరత వల్ల ఒకటి లేదా ఇద్దరు పోస్టుమ్యాన్‌లే పెద్ద పరిధికి సేవలందిస్తున్నారు.

కేరళ, అసోం, బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రతి ఏడాది వరదలు, భారీ వర్షాల వల్ల రహదారులు దెబ్బతింటాయి. అయినా గ్రామీణ డాక్ సేవక్‌లు (GDS), పోస్టుమ్యాన్‌లు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించి, సేవలు కొనసాగిస్తున్నారు.

Saravanan postman

భారీ మంచులోనూ..

పోస్టల్ ఉద్యోగులు అనేక కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. ఒక పోస్టుమ్యాన్ రోజూ సగటున 10 నుంచి 20 కిలోమీటర్లు, కొన్ని దూర ప్రాంతాల్లో ప్రయాణించాల్సి వస్తుంది. పరిసర ప్రాంతాల్లో సిబ్బంది లేకపోతే ద్విచక్ర వాహనంపై అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించి, సేవలు అందించడం సాధారణమే. కొన్ని గ్రామాలకు వెళ్లాలంటే కొండ ప్రాంతాల్లో కాలినడకన ప్రయాణం చేయాలి. బురద రోడ్లు, వాగులు, అడవులు దాటి ప్రజలకు సేవలు అందిస్తున్నారు.

హిమాచల్‌ప్రదేశ్‌లోని హిక్కిం గ్రామంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోస్టాఫీసు ఉంది. ఇది సముద్ర మట్టానికి సుమారు 4,400 మీటర్లు (15,500 అడుగులు) ఎత్తులో ఉంది. ఈ ప్రాంతం శీతాకాలంలో భారీ మంచుతో దేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు కోల్పోతుంది. ఇక్కడ పోస్టల్ సిబ్బంది పోస్టును కాజా వరకూ కాలినడకన వెళ్లి, ఇస్తున్నారు.

అడవి జంతువులు ఎదురయ్యాయి..

తమిళనాడులో నీలగిరి జిల్లాకు చెందిన డి.శివన్ సుమారు 35 సంవత్సరాల పాటు సింగారా, మరపల్లం వంటి కొండ ప్రాంతాల్లో పోస్టల్ సేవలు అందించారు. రోజూ 15 కిలోమీటర్లకు పైగా కాలినడకన ప్రయాణించి, దట్టమైన అడవులు, కొండ దారులు, జారుడు వాగులు దాటి ఉత్తరాలు, పెన్షన్ డబ్బులు ప్రజలకు అందించారు. అక్కడికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో, ఆయన తరచుగా నీలగిరి మౌంటెన్ రైల్వేట్రాక్ వెంట నడిచి వెళ్లేవారు. దారిలో ఆయన ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నారు. అడవి ఏనుగులు, ఎలుగుబంట్లు, అడవి పందులు ఎదురుపడ్డాయి. జారుడు రాళ్లు, చిన్న వాగులు దాటడం ఆయనకు అలవాటైంది. వర్షాలు, పొగమంచులో నడిచి కూడా విధులు నిర్వర్తించారు. శివన్ సేవలను గుర్తించి, ఆ జిల్లా కలెక్టర్ సుప్రియ సాహు అభినందించారు.

keralaashanatesan

ఆశా నటేశన్ కు ప్రశంసలు

ఈరోజు ఒక పోస్ట్ ఉమెన్ కేవలం ఉత్తరాలు అందించే ఉద్యోగి మాత్రమే కాదు. ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి గుమ్మానికి తీసుకెళ్లే ప్రతినిధిగా మారింది. మ్యాన్ కు- ఉమెన్స్ ఏ మాత్రం తీసిపోరు అనడానికి కేరళలో ఈ మధ్య చోటుచేసుకున్న సంఘటనే నిదర్శనం. ఆశా నటేశన్ అనే పోస్టు ఉమెన్ కొట్టాయం జిల్లా, వైక్కప్రయార్ బ్రాంచ్ పోస్టాఫీసులో 16 ఏళ్లుగా పనిచేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో ఒక ఇంటికి అత్యవసరమైన ఉత్తరం ఇవ్వడానికి ఆమె రెండుసార్లు వెళ్లింది. కానీ ఇంటికి తాళం వేసి ఉంది. సాధారణంగా అయితే "ఇంట్లో ఎవరూ లేరు" అని వెనక్కి వచ్చేసేవారు. కానీ ఆశా అలా చేయలేదు. ఆ ఇంటి వద్ద ఉన్న సిసిటివి కెమెరాను గమనించింది. కెమెరా ముందు నిలబడి తన చేతిలో ఉన్న ఉత్తరాన్ని చూపిస్తూ, ఆ ఉత్తరాన్ని పక్కింట్లో భద్రంగా ఉంచానని సైగల ద్వారా తెలియజేసింది. విదేశాల్లో ఉన్న ఇంటి యజమాని తన మొబైల్‌లో సిసిటివి ఫుటేజ్ చూసి విషయం తెలుసుకున్నాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఉత్తరం తనకు ఎంత ముఖ్యమైనదో తెలియజేశారు. దాంతో ఆశా సేవా దృక్పథం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. అంతేకాదు.. ఆమె వృత్తిలో భాగంగా సరైన చిరునామా దొరకకపోతే, స్థానిక వాట్సాప్ గ్రూపుల సహాయంతో లబ్ధిదారులను గుర్తించి, ఉత్తరాలు సరైన వారికి చేరేలా కృషి చేస్తారు. "ఉత్తరం సరైన వ్యక్తి చేతికి చేరాలి" అనే బాధ్యతతో పనిచేసే ఉద్యోగిగా ఆమె స్థానికంగా గుర్తింపు పొందారు.

2017 లెక్కల ప్రకారం శాశ్వత పోస్ట్ ఉమెన్ లు 2,708 మంది , తాత్కాలిక పోస్ట్ ఉమెన్ 287 మంది విధుల్లో ఉన్నారు. పోస్ట్ ఉమెన్ కూడా మ్యాన్‌లతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. ఉత్తరాలు, పార్శిళ్ల పంపిణీ అన్నీ సేవలనూ అందిస్తున్నారు. అయితే పోస్ట్ ఉమెన్ లకు భద్రత విషయంలో ఎప్పుడూ భయం వెంటాడుతూనే ఉంటుందని వారి మాటల్లో స్పష్టమవుతుంది. దూర గ్రామాల్లో ఒంటరిగా వెళ్లాల్సి రావడం, సాయంత్రం ఆలస్యంగా డెలివరీలు చేయాల్సిన పరిస్థితులు ఎదుర్కొవడం, భారీ బ్యాగులు, పార్శిళ్లు, నగదు, బయోమెట్రిక్ పరికరాలు, పత్రాలు... అన్నీ కలిపి చాలా బరువును వారు మోస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విధుల సమయంలో మహిళలకు మరుగుదొడ్లు అందుబాటులో ఉండవు. అయినా ఎంతోమంది పోస్ట్ ఉమెన్లు సేవలు అందించడం వారి వృత్తిలో నిబద్ధతకు నిదర్శనం.

డిజిటల్ పోస్టల్ సేవలు..

నేటి ఇండియా పోస్ట్ పాత్ర డిజిటల్ యుగంలో ఉత్తరాల వినియోగం తగ్గినా, భారత పోస్టల్ వ్యవస్థ తన సేవలను కాలానుగుణంగా విస్తరించుకుంది. నేడు ఇండియా పోస్ట్ ద్వారా స్పీడ్ పోస్ట్, పార్సిల్ సేవలు, బ్యాంకింగ్, పొదుపు పథకాలు, బీమా సేవలు, ఈ-కామర్స్ డెలివరీలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీ వంటి అనేక సేవలు ప్రజలకు అందుతున్నాయి. దేశంలోని మారుమూల ప్రాంతాలకూ సేవలు చేరవేయడంలో ఇండియా పోస్ట్ ఇప్పటికీ కీలకపాత్ర పోషిస్తోంది అంటే పోస్ట్‌మ్యాన్‌ ‌గొప్పతనమే. ప్రతి ఇంటి గుమ్మం తట్టే పోస్టుమ్యాన్ చేతిలో ఉండేది కేవలం ఉత్తరం కాదు.. ఒక కుటుంబం ఎదురుచూసే వార్త, ఒక వృద్ధుడి పెన్షన్, ఒక విద్యార్థి భవిష్యత్తు, ఒక తల్లి ఆశ. టెక్నాలజీ పెరిగినా.. కాలం మారినా.. మనిషిని మనిషితో కలిపే ఆ సేవకు విలువ ఎప్పటికీ తగ్గదు. ఆ నిస్వార్థ సేవకు మనసారా వందనం.


పద్మావతి
9490559477

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్