‘ఫుట్‌బాల్ ప్రపంచ కప్-2026’లో స్పెయిన్ జట్టు ప్రదర్శన చూసి ప్రపంచం మొత్తం ఫిదా అయ్యింది. మైదానంలో స్పెయిన్ ఆటగాళ్లు ప్రదర్శించిన అద్భుతమైన సమన్వయం, వ్యూహాత్మక ఆటతీరు క్రీడాభిమానులను మంత్రముగ్ధులను చేశాయి. ఫైనల్లో అర్జెంటీనా వంటి బలమైన జట్టుపై సాధించిన ఈ విజయం, స్పెయిన్ ఫుట్‌బాల్ చరిత్రలో మరో సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుంది. స్పెయిన్‌కు ‘ఫిఫా’ ఫిదా అనిపించేలా ఆడిన ఈ టోర్నమెంటులో వారు కేవలం కప్పును మాత్రమే కాదు, కోట్లాది మంది అభిమానుల హృదయాలనూ గెలుచుకున్నారు.
ఫుట్‌బాల్ క్రీడా చరిత్రలో మరో సువర్ణాధ్యాయం ఇది. అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన మహా సంగ్రామం ఫిఫా-2026 వరల్డ్ కప్ ముగిసింది. ఫుట్‌బాల్ పులకించిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో అంతిమ విజేతగా యూరోపియన్ దిగ్గజం స్పెయిన్ నిలిచింది. న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో అర్జెంటీనాతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో 1-0 తేడాతో విజయం సాధించి, 2010 తర్వాత సరిగ్గా పదహారేళ్లకు రెండోసారి ప్రపంచ కిరీటాన్ని ముద్దాడింది.
పాత జ్ఞాపకాల పునరుజ్జీవనం
2010లో ఆండ్రెస్ ఇనిస్టా కొట్టిన ఆ చారిత్రాత్మక గోల్ స్పానిష్ ఫుట్‌బాల్ ప్రేమికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. సరిగ్గా అదే తరహాలో ఇప్పుడు మరో తరం ఆటగాళ్లు చరిత్రను పునరావృతం చేశారు. ఈ టోర్నమెంటులో స్పెయిన్ ప్రదర్శన కేవలం విజయాలకే పరిమితం కాలేదు.. అది ఒక కళాఖండం. బాల్ పొజిషన్, పాసింగ్, మైదానంలో ఆటగాళ్ల సమన్వయం.. చూసేవారికి కనువిందు చేశాయి.
పటిష్టమైన రక్షణ శ్రేణి...
ఈ టోర్నమెంట్‌లో స్పెయిన్ విజయానికి అసలు సిసలు కారణం వారి పటిష్టమైన రక్షణ శ్రేణి. మెగా టోర్నీ ఆసాంతం కేవలం ఒక్క గోల్‌ను మాత్రమే ప్రత్యర్థులకు సమర్పించుకుని, సరికొత్త డిఫెన్సివ్ రికార్డును సృష్టించారు. యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞులైన సీనియర్ల కలయికతో కోచ్ నిర్మించిన వ్యూహం అద్భుతాలను సృష్టించింది. మాడ్రిడ్ నుంచి బార్సిలోనా వరకు... స్పానిష్ వీధులన్నీ ఇప్పుడు ‘ఛాంపియన్స్’ నినాదాలతో మార్మోగుతున్నాయి. 2010 స్వర్ణయుగాన్ని గుర్తు చేస్తూ, 2026లో స్పెయిన్ మరోసారి విశ్వ వేదికపై తన ఆధిపత్యాన్ని చాటి చెప్పింది. ఈ విజయం రాబోయే తరాల స్పానిష్ ఫుట్‌బాల్ క్రీడాకారులకు ఎప్పటికీ ఒక మార్గదర్శిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

కన్నీళ్ల నుంచి మైదానాన్ని శాసించే వరకూ...
ఒకప్పుడు ఫుట్‌బాల్ ప్రపంచంలో స్పెయిన్ జట్టు అంటే పెద్దగా ఆదరణ ఉండేది కాదు. అడుగుపెట్టిన ప్రతిసారీ అద్భుతంగా ఆడినా, కీలకమైన మ్యాచ్‌లకు వచ్చేసరికి ఏదో ఒక లోపంతో కప్పు చేజారిపోయేది. అందుకే వాళ్లకు ‘అన్ లక్కీ టీమ్’ (అదృష్టం లేని జట్టు) అనే ముద్ర ఉండేది. పెద్ద టోర్నమెంట్లు వస్తే చాలు, క్వార్టర్స్ దాటి ముందుకు వెళ్లలేక కన్నీళ్లతో వెనుదిరిగేవాళ్ళు. కానీ, ఆ దేశ ఆటగాళ్లు, కోచ్‌లు ఆ ఓటముల నుంచి కుంగిపోలేదు. తమ బలహీనతలపై కఠినంగా శ్రమించడం మొదలుపెట్టారు.
‘టికీ-టాకా’ అనే సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. బంతిని ప్రత్యర్థికి దొరకనీయకుండా, కేవలం పాస్‌ల వర్షం కురిపిస్తూ మైదానాన్ని శాసించేలా తమ ఆట తీరును మార్చుకున్నారు. చెమటోడ్చి చేసిన ఆ సాధన సాధారణమైనది కాదు.. నిరంతరం ఒకే లక్ష్యం కోసం మైదానంలో పగలనక, రాత్రనక వారు పడిన శ్రమ అంతా ఇంతా కాదు.. ఆ చిన్న ఆటగాళ్ల నుంచి దిగ్గజాల వరకు ప్రతి ఒక్కరూ దేశం కోసం ఒకే తాటిపై నిలబడ్డారు. దీంతో దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ 2008 యూరో కప్‌లో స్పెయిన్ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ విజయం కేవలం ఒక కప్ కాదు, వాళ్ల కష్టానికి దక్కిన తొలి గుర్తింపు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 2010 ప్రపంచ కప్‌లో వారు సృష్టించిన చరిత్ర ఎప్పటికీ మరువలేనిది. ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతమైన పోరాట పటిమ కనబరుస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లారు. హోరాహోరీగా సాగిన తుది పోరులో నెదర్లాండ్స్‌ను ఓడించి, తొలిసారి విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించారు. ప్రపంచ విజేతగా నిలిచినా వారి దాహం తీరలేదు. మళ్లీ అదే జోరుతో 2012లోనూ యూరో కప్‌ను కైవసం చేసుకుని, వరుసగా మూడు మేజర్ టైటిల్స్ గెలుచుకున్న ప్రపంచంలోనే ఏకైక అజేయ జట్టుగా అవతరించింది. ఒకప్పుడు కన్నీళ్లతో సరిపెట్టుకున్న అదే జట్టు.. తమ మొక్కవోని దీక్షతో.. చెమటోడ్చిన కష్టంతో.. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. ఫిఫా-2026 ప్రపంచ కప్ మరోసారి విజేతగా నిలిచింది. ఆ ప్రయాణం గొప్ప నిదర్శనంగా మారింది.
అసాధారణ ప్రతిభ
ఫిఫా వరల్డ్ కప్-2026లో స్పెయిన్ ప్రయాణం ఒక అద్భుతమైన సాకర్ కావ్యంలా సాగింది. లూయిస్ డి లా ఫ్యూంటె పర్యవేక్షణలో బరిలోకి దిగిన జట్టు.. టోర్నమెంటు ఆసాంతం అసాధారణ ప్రతిభను కనబరుస్తూ రెండోసారి విశ్వవిజేతగా అవతరించింది. ఈ టోర్నమెంట్‌లో తమదైన శైలిలో పాసింగ్ గేమ్, బాల్ పొజిషన్ (బంతిపై ఆధిక్యం) ప్రదర్శిస్తూ ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా యువ సంచలనాలు లమిన్ యమాల్, పావ్ కుబార్సి వంటి 19 ఏళ్ల కుర్రాళ్లు.. సీనియర్ ఆటగాళ్లతో సమానంగా రాణించి జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించారు. టోర్నమెంటు మొత్తం అద్భుతమైన డిఫెన్సివ్ ఆటతీరును ప్రదర్శించిన స్పెయిన్.. తమ గోల్‌కీపర్ ఉనై సిమోన్... ప్రత్యర్థి జట్లు గోల్ చేయకుండా అడ్డుగోడగా నిలిచాడు. దీంతో టోర్నీ మొత్తంలో కేవలం ఒక్క గోల్‌ను మాత్రమే ప్రత్యర్థికి సమర్పించుకున్నారు.

ప్రయాణం సాగిందిలా...
గ్రూప్ దశలో స్పెయిన్ అద్భుతమైన ఆధిపత్యం ప్రదర్శించింది. కాబో వెర్డేతో జరిగిన తొలి మ్యాచ్ 0-0తో డ్రాగా ముగించడం, సౌదీ అరేబియాపై 4-0తో ఘన విజయం, ఉరుగ్వేతో 1-0తో గెలుపుతో రౌండ్-32కు చేరింది. నాకౌట్ దశలో మరింత పటిష్టమైన ఆటను కనబరిచింది. ఆస్ట్రియాపై 3-0 గోల్స్ తేడాతో సులభంగా విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో పోర్చుగల్‌పై 1-0 తో గెలుపొందింది. క్వార్టర్ ఫైనల్స్‌లో బెల్జియంతో జరిగిన ఉత్కంఠ పోరులో 2-1 గోల్స్ తేడాతో గెలుపొంది సెమీస్‌లోకి దూసుకెళ్లింది. బలమైన ఫ్రాన్స్ జట్టును 2-0 గోల్స్ తేడాతో ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించింది. న్యూజెర్సీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో జరిగిన తుదిపోరు అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. నిర్ణీత 90 నిమిషాల సమయం ముగిసేసరికి రెండు జట్లు గోల్స్ చేయలేకపోవడంతో మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు వెళ్లింది. సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన ఫెర్రాన్ టోరెస్ 106వ నిమిషంలో అద్భుతమైన గోల్ కొట్టి స్పెయిన్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో స్పెయిన్ రెండోసారి ఫిఫా ప్రపంచ కప్‌ను ముద్దాడింది.
కెప్టెన్ రోడ్రి, కోచ్ లూయిస్ సరికొత్త రికార్డు
స్పెయిన్ జట్టుకు టైటిల్ అందించడంలో కెప్టెన్ రోడ్రి కీలకపాత్ర పోషించాడు. ఈ టోర్నీ మొత్తంలో రోడ్రి ఒక్క గోల్ కూడా చేయనప్పటికీ, డిఫెన్స్‌కు కొండంత అండగా నిలవడంతో ఆయనను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ (గోల్డెన్ బాల్) అవార్డు వరించింది. బెల్జియం మినహా ఈ టోర్నీలో ఏ జట్టు కూడా స్పెయిన్‌పై గోల్ చేయలేకపోయిందంటే రోడ్రి నేతృత్వంలోని డిఫెన్స్ శ్రేణి ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే స్పెయిన్ హెడ్ కోచ్ లూయిస్ డి లా ఫ్యూంటె 65 ఏళ్ల వయసులో ఫిఫా వరల్డ్ కప్ గెలుచుకున్న అత్యంత వయసు మళ్లిన మేనేజర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించారు. అలాగే 19 ఏళ్ల స్పెయిన్ యువ డిఫెండర్ పావ్ కుబార్సి తన పరిణతితో కూడిన ఆటతీరుకు గానూ ‘యంగ్ ప్లేయర్’ అవార్డు దక్కించుకున్నాడు. గోల్‌కీపర్ ఉనై సిమోన్ టోర్నమెంటు మొత్తంలో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో ‘గోల్డెన్ గ్లోవ్’ అవార్డును సొంతం చేసుకున్నారు.

ఈ సారి 48 జట్లు..
నాలుగేళ్లకోసారి జరిగే ఫిఫా ప్రపంచకప్ కప్ ఈ సారి 48 జట్ల మధ్య జరిగింది. గతంలో 32 జట్లకే పరిమితమై సాగేది. జట్ల సంఖ్యను పెంపునకు ఫిఫా ఆమోదం తెలపడంతో ఈ సారి 16 జట్లకు అదనంగా చోటు లభించింది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ముగిశాక 12 జట్ల నుంచి టాప్-2లో నిలిచిన 24 జట్లు, మెరుగైన ప్రదర్శన కనబర్చిన మరో 8 జట్లు (రౌండ్-32) నాకౌట్‌కు చేరాయి. ఫిఫా 2026 టోర్నీలో ఆసియా ఖండం నుంచి రికార్డు స్థాయిలో 9 జట్లు అర్హత సాధించాయి. వీటిలో ఆస్ర్టేలియా, జపాన్, కొరియా రౌండ్-32కు చేరగా.. ఇరాన్, ఇరాక్, ఖతార్, సౌదీ అరేబియా, ఉజ్బెకిస్తాన్, జోర్డాన్ గ్రూప్ దశను దాటలేకపోయాయి.
బొక్కేల సంతోష్
9666773382







కామెంట్‌లు (0)