ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆటపాటలతో.. ఆనందాల హరివిల్లు!

3 గంటల క్రితం

ఓవరాల్_.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 06:51 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

హాయ్ ఫ్రెండ్స్‌..

బాలల దినోత్సవం అంటేనే మాకు ఎంతో ఇష్టం. ఆరోజు పుస్తకాలు, పాఠాలు పక్కనపెట్టి ఆటపాటలతో ఆనందంగా గడిపే అవకాశం కదా! అలాంటి మధురమైన రోజున మా మౌంట్ ఫోర్ట్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలతో మా పాఠశాల ప్రాంగణమంతా సందడిగా మారిపోయింది. ఈసారి మా వేడుకల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడూ మాకు పాఠాలు చెప్పే మా టీచర్లే వేదికపైకి వచ్చి కళాకారులుగా మారిపోయారు. మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూ అద్భుతమైన నృత్య ప్రదర్శనలు చేశారు. సందేశాత్మక నాటికలతో అలరించారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు చేసిన కోలాటం మాకు ఎంతో నచ్చింది. వారి నృత్యాలు, నటన చూస్తుంటే మా ఆనందానికి అవధులే లేవు. నాటికల సందర్భంగా టీచర్లు తమ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను కూడా మాతో పంచుకున్నారు. మా గురువులు కూడా ఒకప్పుడు మాలాగే ఆటపాటలతో సందడి చేసిన పిల్లలేనని తెలుసుకుని ఎంతో సంబరపడ్డాం. ఇక మా ఆనందాన్ని రెట్టింపు చేస్తూ అందరికీ చిన్నచిన్న బహుమతులు, స్వీట్లు అందజేశారు. వాటిని అందుకున్నప్పుడు మా ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి. స్నేహితులందరితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా గడిపాం. మా కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించిన టీచర్లను చూసి ఎంతో సంతోషించాం. ఈ సందర్భంగా మా పాఠశాల ప్రిన్సిపల్ బ్రదర్ కిరణ్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ బ్రదర్ ప్రదీప్ రెడ్డి మాకు చక్కని సందేశం ఇచ్చారు. చాచా నెహ్రూ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని, నేటి బాలలమే రేపటి పౌరులమని చెప్పారు. తల్లిదండ్రులు, గురువుల మాటలను గౌరవిస్తూ క్రమశిక్షణతో చదువుకోవాలని, మంచి లక్ష్యాలను ఏర్పరచుకుని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. నిజంగా ఈ బాలల దినోత్సవం మాకు ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. మా టీచర్ల ప్రదర్శనలు, స్నేహితుల కేరింతలు ఆద్యంతం ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి.

పి.నవ్యనందిని .jpg

​పి. నవ్య నందిని

9వ తరగతి, మౌంట్ ఫోర్ట్ హైస్కూలు,

రేపల్లె, బాపట్ల జిల్లా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్