హాయ్ ఫ్రెండ్స్!
నాకు చిన్నప్పటి నుంచే నాట్యం అంటే ఎంతో ఇష్టం. సంగీతం వినిపిస్తే చాలు.. నా కాళ్లు తెలియకుండానే నాట్యం చేయాలనుకుంటాయి. నాట్యంతో పాటు వివిధ కళారూపాలను ప్రదర్శించడం కూడా నాకు చాలా ఇష్టం. నాలోని ఈ ఆసక్తిని గుర్తించిన మా ఉపాధ్యాయులు ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారు. ఇటీవల విజయవాడలో జరిగిన దశరా ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం రావడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ ఉత్సవాల్లో క్లాసికల్ డ్యాన్స్ సోలో విభాగంలో విజేతగా నిలవడం నా సంతోషాన్ని మరింత పెంచింది. నాట్యం, వేషధారణ వంటి కళారూపాలు మనలోని సృజనాత్మకతను, ప్రతిభను బయటపెట్టేందుకు చక్కని వేదికలని నేను భావిస్తాను. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు ఆత్మవిశ్వాసం, ధైర్యం కూడా పెరుగుతాయి. మా పాఠశాలలో చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకూ ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. మా ప్రతిభను గుర్తించి ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తుంటారు. పాఠశాల ఉపాధ్యాయులు అందిస్తున్న సహకారం వల్లే మాలోని కళాత్మక ఆసక్తులకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. నేను కూడా నాట్యరంగంలో మరింతగా రాణించాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఎన్నో వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చి, మా పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నదే నా ఆశయం. కళలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తమలోని ప్రతిభను గుర్తించి, దాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాను.
చదువుతో పాటు కళలకూ ప్రాధాన్యత ఇద్దాం.. మనలోని ప్రతిభను వెలికితీద్దాం!
ఎస్. శ్రావ్య
7వ తరగతి, కొండపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల,
ఇబ్రహీంపట్నం మండలం, ఎన్టీఆర్ జిల్లా.








కామెంట్‌లు (0)