హాయ్ ఫ్రెండ్స్!
మీకు మీ అమ్మానాన్నలంటే ఇష్టమే కదా! నాకు కూడా మా అమ్మానాన్నలంటే చాలా ఇష్టం. వారు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అలాగే మా స్కూల్లో టీచర్లు కూడా మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. మాకు చదువు చెప్పటమే కాకుండా ఎన్నో మంచి విషయాలు నేర్పిస్తారు. అమ్మానాన్నల మాట వినాలని, టీచర్లు చెప్పేది శ్రద్ధగా వినాలని, పెద్దలను గౌరవించాలని చెబుతుంటారు. ఎవరైనా మనకు మంచి చెబితే దాన్ని పాటించాలని నేర్పిస్తున్నారు. అందుకే నేను మా టీచర్లను ఎంతో గౌరవిస్తాను. మా స్కూల్లో జాతీయ పండుగలు, జాతీయ నాయకుల జయంతులు, వర్థంతులు, ఇతర వేడుకలు నిర్వహిస్తుంటారు. ఆ రోజుల్లో మేమంతా ఎంతో ఆనందంగా పాల్గొంటాం. జాతీయ నాయకుల గురించి, వారు మన దేశానికి చేసిన సేవల గురించి తెలుసుకుంటాం. పండుగల సమయంలో మా స్కూల్లో ఉండే సందడి నాకు చాలా ఇష్టం. ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల మాకు చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. మేము చక్కగా చదువుకుంటూ, పెద్దలను గౌరవిస్తూ, మంచి పిల్లలుగా ఎదగాలని మా ఉపాధ్యాయులు ఎప్పుడూ అభినందిస్తూ ప్రోత్సహిస్తుంటారు. వారు మమ్మల్ని ప్రేమగా పలకరించినప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. నేను కూడా బాగా చదువుకుని అమ్మానాన్నలకు, టీచర్లకు మంచి పేరు తీసుకురావాలనుకుంటున్నాను.
వెన్నెల సహస్ర
1వ తరగతి, బచపన్ ప్లే స్కూలు,
తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా.








కామెంట్‌లు (0)