టొరంటో:
కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ లిబరల్ పార్టీ నూతన నాయకుడిగా భారత సంతతికి చెందిన నవదీప్ బైన్స్ (49) ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన పార్టీ నాయకత్వ ఎన్నికల్లో ఆయన 50.3 శాతం ఓట్లను సాధించి విజయం సాధించారు.
2018 ఎన్నికల ఓటమి తర్వాత మాజీ ప్రీమియర్ కాథ్లీన్ విన్ రాజీనామా చేసినప్పటి నుండి ఒంటారియోలో లిబరల్ పార్టీ తిరిగి అధికారంలోకి రాలేకపోయింది. అప్పటి నుండి ప్రోగ్రెసివ్ కన్జర్వేటివ్ పార్టీయే రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతోంది. గత జనవరిలో బోనీ క్రోంబీ కూడా పార్టీ నాయకత్వ బాధ్యతల నుండి తప్పుకోవడంతో పార్టీకి శాశ్వత నాయకుడు లేని పరిస్థితి ఏర్పడింది. 2018 తర్వాత ఒంటారియో లిబరల్ పార్టీ పగ్గాలు చేపట్టిన మూడో నాయకుడు నవదీప్ బైన్స్ కావడం విశేషం.
విజయం అనంతరం బైన్స్ మీడియాతో మాట్లాడుతూ.. "ఇది నాయకత్వ పోటీకి ముగింపు మాత్రమే కావచ్చు, కానీ డగ్ ఫోర్డ్ మరియు ప్రోగ్రెసివ్ కన్జర్వేటివ్ పార్టీని ఒంటారియో పీఠం నుండి దించడానికి మా ప్రచారానికి ఇది ఆరంభం మాత్రమే" అని ధీమా వ్యక్తం చేశారు.
రాజస్థాన్ మూలాలు.. కష్టాల నేపథ్యం
గతంలో ఫెడరల్ మంత్రిగా పనిచేసిన బైన్స్ ప్రస్తుతం ప్రావిన్షియల్ అసెంబ్లీలో సభ్యుడు కారు. అయితే, త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, 2030లో జరిగే తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీని విజయపథంలో నడిపించే కీలక బాధ్యత ఇప్పుడు ఆయనపై ఉంది.
50 ఏళ్ల క్రితం రాజస్థాన్‌లోని ఒక చిన్న గ్రామం నుండి ఒంటారియోకు వలస వెళ్లిన దంపతులకు బైన్స్ జన్మించారు. తన తండ్రి క్యాబినెట్ తయారీ కార్మికుడిగా, తల్లి ఫ్యాక్టరీలో నైట్ షిఫ్ట్ ఉద్యోగిగా కష్టపడి పనిచేసి తమ కుటుంబాన్ని పోషించారని గెలుపు అనంతరం పార్టీ కార్యకర్తల ఎదుట ఆయన గుర్తుచేసుకున్నారు. తాను నివసించే మిస్సిసాగా ప్రాంతంలో ప్రజలు ఇప్పటికీ ఆహారం కోసం ఫుడ్ బ్యాంకులపై ఆధారపడాల్సిన దుస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ, వృత్తిపరమైన నేపథ్యం
రాజకీయాల్లోకి రాకముందు నవదీప్ బైన్స్ ఫోర్డ్ మోటార్ కంపెనీలో సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పనిచేశారు. 2021లో ఫెడరల్ పార్లమెంట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ప్రైవేట్ రంగంలో ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడోకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న బైన్స్, జాతీయ స్థాయిలో అత్యధిక కాలం ఫెడరల్ ఇన్నోవేషన్, సైన్స్ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ మంత్రిగా సేవలందించిన రికార్డును కలిగి ఉన్నారు.








కామెంట్‌లు (0)