ఒక పెద్ద చెరువు ఒడ్డున ఎక్కువగా నెమళ్లు చేరేవి. అక్కడ వాటికి మంచి ఆహారం దొరికేది. అందుకని ఆ ఊరికి “నెమళ్ల దిన్నె” అని పేరు వచ్చింది. ఒకసారి ఒక నెమలి చెరువు వద్దకు వెళుతుండగా అటు పక్కగా పాము కనిపించడంతో దానిని వెంబడించింది. కానీ ఆ పాము సరసరమని పాకుతూ పక్క పొలం వైపు వెళ్లింది. ఒంటరిగా పొలంలోకి వచ్చిన నెమలిని వేటగాడు చూశాడు. వల వేసి దానిని బంధించాడు.
‘అయ్యా! నన్ను ఏం చేస్తావు? అని అంది నెమలి.
‘నిన్ను సంతలో అమ్మి డబ్బు సంపాదిస్తాను’ అని అన్నాడు వేటగాడు.
నెమలి బాగా ఆలోచించింది.‘ఎలాగైనా ఈ వేటగాడి చేతిలో నుంచి తప్పించుకోవాలి’ అనుకుంది.
‘నీకు సంతలో కంటే ఎక్కువ డబ్బులు వచ్చేలా చేస్తాను. నన్ను వదిలేస్తావా?’ అని అంది నెమలి.
‘నాకు డబ్బు ఎక్కువగా వస్తే అలాగే వదిలేస్తాను. డబ్బు వచ్చే మార్గమేమిటో చెప్పు’ అన్నాడు వేటగాడు.
‘నేను వర్షం వస్తేగానీ పురి విప్పి నాట్యం చేయను. నీకు డబ్బులు రావాలి కదా. అలా వీధుల్లో తీసుకెళ్లు. నేను పురివిప్పి నాట్యం చేస్తాను. నా నాట్యం చూసిన వారు నీకు డబ్బులు ఇస్తారు’ అని అంది నెమలి.
‘సరే పద..!’ అని వేటగాడు నెమలిని వల నుండి విడిపించి, ముందుగా ఒక వీధిలోకి తీసుకెళ్ళాడు. నెమలి పురివిప్పి, నాట్యం చేసింది. చూసిన వాళ్ళంతా చిల్లర డబ్బులు ఇచ్చారు. అలా ఆరు వీధుల్లో తిప్పాడు వేటగాడు. చిల్లర డబ్బులు బాగా పోగయ్యాయి. వాటిని మూట గట్టుకున్నాడు.
‘అయ్యా! అన్నట్టుగానే నీకు బాగా డబ్బు ముట్టింది కదా?’ అంది నెమలి.
‘అవును. ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బులు వచ్చాయి. ఇక నిన్ను వదిలిపెట్టను. రోజూ ఇలాగే చుట్టుపక్కల ఊళ్లల్లో ప్రదర్శన చేయిస్తాను. డబ్బు సంపాదిస్తాను’ అన్నాడు వేటగాడు.
ఆ మాటలకు నెమలికి కోపం వచ్చింది. ‘ఇక నేను వెళ్ళి వస్తాను’ అని నెమలి ఎగిరిపోయింది. వేటగాడు నిరాశగా నెమలివైపు చూశాడు. ఆ నెమలి.. నెమళ్ల దిన్నెకు తన నేస్తాల చెంతకు చేరుకుంది. ‘ఎక్కడకు వెళ్లావు?’ అని అడిగిన తన నేస్తాలకు జరిగిందంతా చెప్పింది. “అందుకే ఒంటరిగా ఎక్కడికీ వెళ్లకూడదు. ఈ మనుషులు అంతే. అత్యాశపడతారు’ అని ఆ నెమలిని మందలించాయి తోటి నేస్తాలు. ‘ఇంకెప్పుడూ వెళ్ళాను’ అని చెప్పింది ఆ నెమలి.
యు. విజయశేఖరరెడ్డి
9959736475







కామెంట్‌లు (0)