ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసూరిగాడు

1 గంట క్రితం

mini katha-surigadu.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 07:53 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఇంకా జల్లు కురుస్తూనే ఉంది. వాకిలి మొత్తం బురదతో నిండిపోయింది. ఇంకా ఎన్ని రోజులు.. అన్నట్టు వాన చినుకులను భారంగా మోస్తున్నాయి పూల మొక్కలు. ఇంటి చూరు మీద నుంచి సర్రున వాన నీరు జారుతుంది. అదే వరండాలో ఒక పక్కకి కూర్చొని, చూరు మీద నుంచి జారుతోంది. వాన నీటిని తదేకంగా చూస్తున్నాడు సూరి. మరి అలా చూడక ఇంకేం చేస్తాడు!! అప్పటికే కడుపునిండా అన్నం తిని మూడురోజులు అయింది. ఆకలికి తట్టుకోలేక ఇంట్లో ఒక పక్కన పడేసిన కొన్ని నూకలు మిగిలితే వాటితోనే గంజి కాచుకొని తాగుతున్నారు. సూరి ఇంట్లో తాను, అతని తల్లితండ్రులు, చెల్లి ఉంటున్నారు. ఇదే అతని కుటుంబం. సూరి కూలి పనికి వెళ్ళేవాడు. తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేస్తారు. అతని చెల్లి సుగుణకు వచ్చే శ్రావణమాసం లగ్గం పెట్టుకున్నారు.

ఇంతలో సూరి తల్లి బయటకు వచ్చి, వరండాలో ఉన్న గుంజను పట్టుకొని, విరక్తి- నిరాశ కలగలిసిన భావంతో ‘ముసురు.. మాయదారి ముసురు వారం నుంచి పడతానే ఉండే. మనయా రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులాయే, ఇలాగే ఉంటే బతికి బట్టకట్టేది ఎలాగా. ఇక ఆ దేవుడే కనికరించాలా!’ అంటూ గుమ్మానికి ఆనుకొని చతికిలబడింది.

సూరి వాళ్ళ కుటుంబానికే కాదు, దాదాపు ఊర్లో అన్ని కుటుంబాలది ఇదే పరిస్థితి. ఇందుకు గల కారణం, సూరి వాళ్ళ ఊరి పక్కనే ఒక వాగు ప్రవహిస్తుంది. గట్టిగా నాలుగు రోజులు కుండపోత వాన పడితే వాగు పొంగి ఇళ్లు, వాకిలి, పశువుల కొట్టం, పొలాలూ.. ఊరు మొత్తం నీట మునిగిపోతుంది. దిగువుగా ఉన్న ఇళ్ళలోకైతే, ఇంటి లోపలి నీళ్లు వచ్చేస్తాయి. పొలాలు నీట మునిగి, రైతు బిడ్డలకు కన్నీళ్లను మిగులుస్తాయి. వాకిలి దాకా నీళ్లతో మునిగి ఉండడంతో ఎవరూ బయటికి కదలలేని పరిస్థితి. ఇంకా పొయ్యిలో కట్టె ఎలా వెలుగుతుంది.. సూరి వాళ్ళ ఇంటి పక్కనే ఒక చిన్న కుటుంబం ఉంది. ఇంట్లో పొయ్యి వెలిగించి, ఎన్ని రోజులు అయిందో.. ఆకలికి పసిపిల్లల ఏడుపులు వినిపిస్తూనే ఉన్నాయి. ఆటల్లో పడి ఆకలి మర్చిపోతారని బయటికి పంపుదామన్నా వీలుకాని పరిస్థితాయే.

రెండు, మూడురోజుల నుంచి వర్షం తగ్గడంతో ఇళ్ల ముందున్న నీరు తగ్గిపోయింది. ఆలోచనలోంచి బయటకు వచ్చిన సూరి, చినుకు జల్లులు లెక్కజేయకుండా ‘పొలం చూసొస్తానే యమ్మా’ అంటూ వరండాలో నుంచి అడుగు బయటపెట్టాడు. మడమల దాకా బురద.. చెప్పులు పనికిరావని అర్థం చేసుకొని, చెప్పులు తీసి, వరండాలో ఒక పక్కకి విసిరి కొట్టి, నడక మొదలుపెట్టాడు. ఎలాగో పొలం చేరుకున్నాడు. నిరాశతో పొలమంతా కలియచూశాడు. ఏమీ మిగలకుండా పొలమంతా నాశనమైంది. పొలంలో మొత్తం వర్షం నీళ్లు. ఆ నీళ్లలోనే ఎన్నో నత్తలు, చేపలు కనిపిస్తున్నాయి. హఠాత్తుగా సూరికి అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ‘‘ప్రకృతి మనకు ఏదీ ఊరికే ఇవ్వదు. అన్నీ మనకు ఇస్తది. కానీ వాటిని సద్వినియోగం చేసుకోవాలా!, ఏమిచ్చినా అది మన మంచికే, మనం కూడా దాన్ని అంతే గౌరవించాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి’ అని.

సూరి వెంటనే తన ప్యాంటును మోకాళ్ళదాకా మడుచుకున్నాడు. పొలంలోకి దిగి, గబాగబా గంప నిండా నత్తలు, చేపలు పట్టాడు. అటునుంచి అటే చుట్టూ పక్క గ్రామంలోకి వెళ్లాడు. వాటిని అమ్మి, వచ్చిన డబ్బుతో సరుకులు తీస్కొని ఇంటిదారి పట్టడు. ఇంటికి చేరాక కొన్ని సరుకులు పిల్లలున్న పక్కింట్లో ఇచ్చాడు. ఆ రోజు సాయంత్రానికి ఇంట్లో ఒక పక్కన మూడు ఇటుకలు పేర్చి, నిప్పు ముట్టించి ఘుమ ఘుమలాడే చేపల పులుసు, నత్తల వేపుడు చేసి ఇంట్లో అందరికీ వడ్డించింది సూరి తల్లి.

‘ఆహా! ఎన్ని రోజులైంది నోటికి రుచి తగిలి’ అంటూ సూరి నాన్న అన్నాడు.

‘నీ చేతి వంటే వంటే వీరమ్మా!’ అని మనసారా ఆస్వాదిస్తూ అన్నాడు సూరి.

అందరూ కడుపు నిండా తిని, ఆదమరిచి నిద్రపోయారు.

ఆ రాత్రి పిల్లల ఏడుపులు కూడా వినిపించలేదు.​

ఎస్‌‌కె.​ అనిసా తబస్సుమ్

85220 97112


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్