హాయ్ ఫ్రెండ్స్!
మీకో విషయం చెప్పనా! మా స్కూలు పిల్లలు విజయవాడ ఉత్సవాల్లో అద్భుతమైన ప్రతిభ చూపించారు. చదువులోనే కాదు.. నాట్యం, వేషధారణ వంటి కళారూపాల్లోనూ మా అక్కలు అందరినీ ఆకట్టుకున్నారు. వారు బహుమతులు గెలుచుకోవడం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. విజయవాడ ఉత్సవాల్లో నిర్వహించిన శాస్త్రీయ నృత్యం సోలో విభాగంలో ఎస్. శ్రావ్య అక్క ప్రథమ బహుమతి సాధించింది. ఫ్రీ స్టైల్ డ్యాన్స్ పోటీలో వి. సాధన సూర్య, జి. దీక్షిత, ఎస్. శ్రావ్య కలిసి అద్భుతంగా నృత్యం చేసి ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. వేషధారణ పోటీలో డి. సాయి హరిణి అక్క మహిషాసురమర్దిని వేషంలో ఎంతో అద్భుతంగా అభినయించి జూనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించింది. మహిషాసురమర్దినిగా ఆమె ప్రదర్శించిన అభినయం అందరినీ ఆకట్టుకుంది. అలాగే సబ్ జూనియర్స్ విభాగంలో నేను తృతీయ బహుమతి గెలుచుకున్నాను. నాట్యం చేయడం, విచిత్ర వేషధారణలు వేయడం అంటే నాకు చాలా ఆసక్తి. వేదికపై ధైర్యంగా ప్రదర్శన ఇవ్వడం, అందరి ప్రశంసలు పొందడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంటుంది కదా! ఇలాంటి పోటీల వల్ల మనలోని ప్రతిభ బయటపడటమే కాకుండా, కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఉత్సాహం కూడా పెరుగుతుంది. మా పాఠశాలలో చదువుతో పాటు ఆటపాటలకు, నాట్యకళలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి, ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తుంటారు. మేము సాధించిన విజయాలకు మా ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ప్రోత్సహిస్తున్నారు. వారి ప్రోత్సాహం మాలాంటి పిల్లలకు ఎంతో ధైర్యాన్నిస్తుంది. నేను కూడా బాగా చదువుకుంటూ, నాకు ఇష్టమైన కళల్లో ప్రతిభ చూపించి, మా పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలనుకుంటున్నాను.
చదువుతో పాటు కళలకూ ప్రాధాన్యత ఇద్దాం.. మనలోని ప్రతిభను వెలికితీద్దాం!
– దామెర్ల దాక్షిణ్య
7వ తరగతి,
కొండపల్లి జిల్లా పరిషత్
బాలికల ఉన్నత పాఠశాల,
ఇబ్రహీంపట్నం మండలం,
ఎన్టీఆర్ జిల్లా.








కామెంట్‌లు (0)