ఆదివారం, 11 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కబుర్ల కోతి

18 గంటల క్రితం

kurbula
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026, 09:27 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

మృగరాజు పాలనలో ఆ అడవిలోని జంతువులన్నీ తమ విధులను ఎంతో బాధ్యతగా నిర్వహించేవి. ఎలుగులు వైద్యం చేసేవి. అనారోగ్యం చేసినవారిని వైద్యాశాలకు మోసుకొచ్చేవి గాడిదలు. నక్కలు, కోతులు ముసలి జంతువులకు, గర్భవతులకు అవసరమైన ఆహారం అందించేవి. కాకులు, గుడ్లగూబలు రేయింబగళ్లు పహారా కాస్తే, గద్దలు, పులులు, ఏనుగులు రక్షణ బాధ్యతలు చూసేవి. జింకలు అడవి అంతా తిరిగి, అందరి బాగోగులూ రాజుకు తెలియజేసేవి. ఇలా ఒక క్రమశిక్షణతో అడవి అంతా ప్రశాంతంగా సాగిపోయేది.

ఒకరోజు ఆ అడవిలోకి పట్నం నుండి 'టింకూ' అనే కోతి వచ్చింది. అది పట్నంలోని విలాసవంతమైన పార్కులు, సినిమాలు, రుచికరమైన ఆహార పదార్ధాల గురించి గొప్పలు చెప్పడం మొదలుపెట్టింది. జంతువులన్నీ తమ పనులు మాని, టింకూ చెప్పే పట్నం కబుర్లలో మునిగిపోయేవి. దాంతో అడవిలో వ్యవస్థ అంతా ఒక్కసారిగా అస్తవ్యస్తమైంది. మృగరాజు ఎన్నిసార్లు చెప్పినా జంతువులు తమ తీరు మార్చుకోలేదు. టింకూ చుట్టూ చేరి కబుర్లు వినడానికి ఆసక్తి కనబరిచేవి. ​ఈ పరిస్థితిని గమనించిన మృగరాజు జంతువులకు బుద్ధి చెప్పడానికి ఒక ఉపాయం ఆలోచించాడు.

ఒకరోజు మర్రిచెట్టు కింద సమావేశం ఏర్పాటుచేసి, జంతువులన్నింటినీ పిలిపించాడు. ​‘టింకూ చెప్పే పట్నం విశేషాలు చాలా సరదాగా ఉన్నాయి. రేపటి నుండి పది రోజుల పాటు మీ అందరికీ సెలవు ప్రకటిస్తున్నాను. ఈ పదిరోజులూ మన అడవిలో పనులన్నీ ఆపేద్దాం. ఎవరూ బాధ్యతలు నిర్వహించక్కర్లేదు. అం దరం టింకూ కబుర్లతో హాయిగా గడుపుదాం!’ అని ప్రకటించాడు. మృగరాజు ప్రకటనతో జంతువులన్నీ సంతోషపడ్డాయి._

ఆ ​మరుసటి రోజు నుండి అడవిలో అసలు తిప్పలు మొదలయ్యాయి. ఆహార సేకరణ నిలిచిపోవడంతో ముసలి జంతువులు, గర్భవతులు ఆకలితో అలమటించాయి. ఎలుగులు వైద్యశాల మూసేయడంతో జబ్బుపడిన జంతువులు విలవిల్లాడాయి. పహారా లేకపోవడంతో పక్క అడవిలోని క్రూర మృగాలు ఈ అడవిలోకి చొరబడి, జంతువులను వేటాడడం మొదలుపెట్టాయి._నాలుగో రోజు కల్లా అడవిలో హాహాకారాలు మొదలయ్యాయి. వాటిని తట్టుకోలేక జంతువులన్నీ గుంపుగా మృగరాజు దగ్గరకు వెళ్లి, ‘మహారాజా! ఆకలితో, రోగాలతో మేము అలమటించిపోతున్నాం. మాకు రక్షణ కరువయ్యింది. దయచేసి మమ్మల్ని కాపాడండి!’ అని తమ బాధలను చెప్పుకున్నాయి. కానీ మృగరాజు వారికి సహాయం చేయడానికి నిరాకరించాడు._

‘మీలాగే నేను కూడా సెలవులో ఉన్నాను. కనుక నేను మీకోసం ఏమీ చేయలేను. ఇలాంటి కష్ట సమయాల్లో పట్నం వాసులు ఏం చేస్తారో ఆ టింకూ కోతిని అడగండి. అది మీకు కచ్చితంగా పట్నం తరహాలోనే సహాయం చేయగలదు.’ అన్నాడు మృగరాజు._

ఆ మాటలతో జంతువులన్నీ నిరాశగా టింకూ దగ్గరకు వెళ్లాయి. ‘ఇప్పుడు మేము కష్టాల్లో ఉన్నాం. మాకు పట్నం ఆహారం ఇప్పించు, రక్షణ కల్పించు. మా బాధలు పోగొట్టు!’ అని నిలదీశాయి. టింకూ దగ్గర మాటలు తప్ప, చేతలు లేవు.

‘నేను మీకు ఎలాంటి సహాయమూ చేయలేను. నన్ను మన్నించండి!’ అంటూ తలదించుకుంది టింకూ.

అప్పుడు మృగరాజు అక్కడికి వచ్చి జంతువులతో ఇలా అన్నాడు._‘చూశారా! పట్నం విశేషాలు వినడానికి బాగుంటాయి.. కానీ మన అడవి నిలబడాలంటే మన బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తించాలి. ఎవరి పని వారు చేయకపోతే సమాజం కుప్పకూలిపోతుంది. పట్నంలోని సౌకర్యాల వెనుక మనుషుల నిరంతర శ్రమ ఉన్నట్లే, మన అడవి బాగుండాలంటే మనం కూడా నిరంతరం కష్టపడాలి!’ అంది గంభీరంగా._

తమ తప్పు తెలుసుకున్న జంతువులన్నీ వెంటనే తిరిగి విధుల్లో నిమగ్నమయ్యాయి. టింకూ కేవలం కబుర్లు చెప్పడం మానేసి, అడవిలోని పండ్లను సేకరించడంలో కోతులకు సహాయం చేయడం మొదలుపెట్టింది. అడవి మళ్ళీ పూర్వపు వైభవాన్ని సంతరించుకుంది.​

- పేట యుగంధర్

9492571731

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్