ఆ ఇల్లు కొండకు దగ్గరగా ఉంది. ఇంటి పెరటి వైపు ఉన్న కిటికీ తెరచి చూస్తే, పచ్చని చెట్లతో ఉన్న ఎత్తైన కొండ కనిపిస్తుంది. పెరటి నిండా పళ్ళ చెట్లు!
పది సంవత్సరాల చిత్ర బడి నుంచి రాగానే, ఇంకా సెలవు రోజుల్లో ఆ కిటికీని తెరచి ఎక్కువ సమయం అక్కడే గడిపేది. నడవలేని చిత్ర చక్రాల కుర్చీలో కూర్చుని, కిటికీలోంచి పెరడును, కొండను చూస్తూ.... అప్పుడప్పుడూ బొమ్మలు గీస్తూ గడిపేది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం కిటికీ దగ్గరే తినేసేది.
కొద్ది రోజుల నుంచి పెరట్లోకి ఒక మైనా పక్షి వస్తోంది. కావలసినన్ని పళ్ళు తిని, కిటికీ దగ్గరికి వచ్చి కూర్చునేది. మనుషుల మాటలను అనుకరించి మాట్లాడే మైనా చిత్రతో సులువుగానే స్నేహం కుదుర్చుకుంది. మైనా కొండమీద ఉన్న చెట్లపై నివాసం ఉండేదని చిత్ర తెలుసుకుంది.
‘మైనా.. నాకు అమ్మానాన్నలు చాలా ప్రదేశాలు చూపించారు. కానీ, కొండమీదకి తీసుకెళ్లలేదు. ఆ ప్రాంతం ఎలా ఉంటుందో చెప్పవా?’
బ్రతిమిలాడినట్లు అడిగింది చిత్ర.
‘ఓ.. అలాగే’ సంతోషంగా ఒప్పుకున్న మైనా కొండపైని చెట్లు, పొదలు, రాళ్ల గురించి చెప్పింది.
‘నీకో విషయం తెలుసా? కొండ పైనుంచి చూస్తే ఊర్లోని ఇళ్లన్నీ బొమ్మ ల్లా కనిపిస్తాయి. చాలా తమాషాగా ఉంటుంది.’ సంభాషణ చివర్లో చెప్పిందా విషయం.
మైనా చెప్పిన వాటిని చిత్ర ఊహించుకుని, ఒక బొమ్మ గీసింది. ఆ చిత్రం చూసిన మైనా తెగ సంతోష పడిపోయింది.
‘భలే..భలే, నేను ఇలా చెప్పగానే నువ్వు అలా బొమ్మ గీచావు. ఇక రోజూ... నేను చూసిన వాటి గురించి చెబుతాను. నువ్వు బొమ్మ గీయాలి. సరేనా?’
మైనా మాటలకు ఆనందపడిన చిత్ర ‘అలాగే...అయితే నువ్వు రోజూ కొత్త విషయాలే చెప్పాలి.’ నవ్వుతూ అంది. ఆ రోజు నుంచి వారి స్నేహం మరింత పెరిగింది. మైనా చెప్పే మాటలకు తగినట్లు చిత్ర బొమ్మలు గీస్తోంది. మైనా తిరిగి వెళ్లే ముందు ఇద్దరూ కలిసి ‘ప్రకృతి పాట పాడుదమా... పరవశించి పోయెదమా...
ఎన్నో రకాల మొక్కలు.... మరెన్నో రంగుల పువ్వులు.... కీటకాల గుసగుసలు...పక్షులు చేసే సవ్వడులు.... జంతువుల అరుపులు....
జగానికి మేలుకొలుపులు.....' అనే పాటను తప్పక పాడుకునేవారు. ఈ ఇద్దరి స్నేహాన్ని తల్లిదండ్రులు రమ్య, వేణు గమనించారు. చిత్రకు ఒక అన్నయ్య ఉన్నాడు.
తన పేరు సంతోష్. సంతోష్ కూడా మైనాతో మాట్లాడాలని దగ్గరకు వెళ్లగానే అది తుర్రుమని చెట్లపైకి వెళ్ళేది.
ఒకరోజు... కొండపై వర్షం పడేటప్పుడు ఎలా ఉంటుందో మైనా వర్ణించింది. వర్షపు నీరు పారుతూ, పరిగెత్తుతూ కొండకు ఇంకొక వైపు ఉన్న చెరువుకు చేరడం, చెరువులో విరబూసి ఉన్న కలువలు, కమలాల గురించి వివరించింది. ఇలా రోజూ మైనా చెప్పే విశేషాలకు తగినట్లు చిత్ర బొమ్మలు గీస్తోంది. ఒకరోజు మైనా తిరిగి వెళ్ళబోయే ముందు... ‘మైనా... నువ్వు చాలా ప్రాంతాలు తిరిగే ఉంటావు. ఎడారులు, మంచు కురిసే ధ్రువప్రాంతాల గురించి చెప్పవా? నేను వాటి గురించి పుస్తకాల్లో చదివాను. నువ్వు చెబితే నేరుగా అక్కడికి వెళ్లి చూసినట్లు ఉంటుంది.’ చిత్ర తన కోరిక చెప్పింది.
‘అయ్యో... నువ్వు చెబుతున్న వాటిని నేనెప్పుడూ చూడలేదు. చూడని వాటి గురించి ఎలా చెప్పాలి? పైగా నువ్వు చెబుతున్న ప్రాంతాలకు వెళ్లడం నాకు సాధ్యపడదు. వలసపక్షుల ద్వారా ఆ ప్రాంతాలు చాలా దూరం అని విని ఉన్నాను. కొంత దూరం మాత్రమే నేను ఎగిరి వెళ్లగలుగుతాను. వలసపక్షుల లాగా సుదూరం వెళ్ళలేను.
నువ్వు చెబుతున్న ప్రాంతాలు చూడాలని నాకూ కోరికగా ఉంది. ’ అంటూ తన అశక్తతను తెలియజేసింది మైనా. మైనా మాటలతో చిత్ర కాస్త నీరసపడింది.
ఆ రాత్రి భోజన సమయంలో ఈ విషయాన్ని అమ్మానాన్నలకు చెప్పింది. చిత్ర మాటలు సంతోష్ కూడా విన్నాడు.తన బాధను వాళ్ళందరూ గమనించారు.
మరుసటి రోజు, సంతోష్ కు ఒక ఆలోచన వచ్చింది. అది అమలు చేస్తే చిత్ర బాధ తొలగిపోతుందని తల్లిదండ్రులకు చెప్పాడు.
వారికి కూడా అది సరైనదేనని అనిపించింది. ఇంతకీ సంతోష్ ఆలోచన ఏంటో తెలుసా? ఇంటర్నెట్ ఉన్న కంప్యూటర్ ద్వారా పలు ప్రదేశాల ఫోటోలు వీడియోలను చిత్రకు చూపించాలని! ముగ్గురూ వెళ్లి షాపులో ఓ లాప్ టాప్ కొన్నారు. ఇంటికి వచ్చాక, సంతోష్ అందులో ఒక యాప్ ను ఎక్కించాడు. ఆ యాప్ ద్వారా భూమిపై ఉన్న పలు ప్రాంతాల ఫోటోలు, వీడియోలను చూడవచ్చు. ఇదంతా చిత్రకు తెలియదు.
సాయంత్రం చిత్ర మైనా తో మాట్లాడుతున్న సమయంలో.... ల్యాప్ టాప్ ని తీసుకెళ్లి చిత్రకి ఇచ్చారు. అది తనకు ఎందుకు ఇచ్చారో మొదట్లో చిత్రకు అర్థం కాలేదు. కానీ, అందులోని యాప్ ద్వారా ఫోటోలు వీడియోలు చూపించేసరికి ఎంతో సంతోషం కలిగింది. తనకోసం దాన్ని తెచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పింది. వాళ్లు అక్కడున్నంతసేపూ మైనా ఓ జామ చెట్టు పైనే కూర్చుని ఉంది. ఇక చిత్ర ఒంటరిగా ఉన్నప్పుడు... దగ్గరికి వచ్చి ల్యాప్ టాప్ వైపు వింతగా చూడ సాగింది. అది గమనించిన చిత్ర ల్యాప్ టాప్ లో ఎడారి ప్రాంతాలు, ధ్రువ ప్రాంతాల ఫోటోలు, వీడియోలను మైనాకు చూపించింది. అవి చూసిన మైనాకు సంబరమేసింది. ల్యాప్ టాప్ ను తేరిపారా చూస్తూ... 'ఎంత వింత వస్తువిది?'అని మనసులో అనుకుంది. ఇక ఆ రోజు నుంచి.. చిత్ర, మైనాలు కలిసినప్పుడల్లా కాసేపు ల్యాప్ టాప్ లో ఏదో ఒక ప్రాంతం యొక్క విశేషాలు తెలుసుకుంటూనే ఉన్నారు. మైనా ఎగిరి వెళ్లేటప్పుడుమాత్రం...ఇద్దరూ కలిసి 'ప్రకృతి పాట' పాడుకోవడం మాత్రం మానలేదు.
శాఖమూరి శ్రీనివాస్
94410 75753








కామెంట్లు (0)