ఒకానొక ఊరి చివర ఒక అందమైన పచ్చని తోపు ఉండేది. ఆ తోపులో మామిడి, రావి, వేప వంటి ఎన్నోరకాల చెట్లు ఉండేవి. వాటి కొమ్మలపై చిలుకలు, కోకిలలు, పిచ్చుకలు, పావురాలు ఎన్నో రకాల పక్షులు కలసిమెలసి జీవించేవి. ప్రతి ఉదయం పక్షుల కిలకిలారావాలతో తోపంతా సందడిగా ఉండేది. ముఖ్యంగా కోకిల మధురంగా కూస్తే చెట్లన్నీ ఆ పాటను ఆస్వాదిస్తున్నట్లుగా అనిపించేవి.
అదే తోపులో కాక్యు అనే చిన్న కాకి ఉండేది. ఒకరోజు అది ఉత్సాహంగా, “కావ్... కావ్...!” అని అరిచింది. అంతే! పక్కనే ఉన్న పక్షులన్నీ చెవులు మూసుకున్నాయి. కోకిల అసహనంగా, ‘కాక్యూ! ఏమిటా బొంగురు గొంతు? మా మధురమైన కూతల మధ్య నీ అరుపు అస్సలు బాగోలేదు!’ అంది.
రామచిలక కూడా నవ్వుతూ, ‘నీ గొంతు వింటేనే తలనొప్పి వస్తోంది. ఇక మా ముందు అరవకు!’ అని ఎగతాళి చేసింది. ఆ మాటలు కాక్యు మనసును బాధించాయి. ఒక కొమ్మ చివర కూర్చుని, ‘నాకెందుకు ఇలాంటి గొంతు వచ్చింది?’ అని బాధపడింది. కాసేపటికి తన కన్నీళ్లు తుడుచుకుని, ‘నా గొంతును నేను మార్చలేను. కానీ నాకు ఏదైనా ప్రత్యేకమైన ప్రతిభ ఉందేమో ప్రయత్నించి చూడాలి’ అని అనుకుంది.
ఒకరోజు ఆహారం కోసం సమీపంలోని పచ్చిక బయళ్లకు వెళ్లిన కాక్యు, అక్కడ రాముడు అనే పశువుల కాపరి వేణువు వాయించడం చూసింది. వేణువు నుంచి వచ్చిన మధురమైన సంగీతానికి కాక్యు మైమరచిపోయింది. రాముడు వాయించడం పూర్తయ్యాక కాక్యు వినయంగా, ‘అయ్యా! నాకు కూడా వేణువు వాయించడం నేర్పిస్తావా?’ అని అడిగింది. రాముడు ఆశ్చర్యపోయినా, కాక్యు కళ్లలోని ఆసక్తిని చూసి, ‘సరే. కానీ ప్రతిరోజూ కష్టపడి సాధన చేయాలి’ అన్నాడు. ఆ రోజు నుంచి కాక్యు ప్రతిరోజూ రాముడి దగ్గరకు వెళ్లి, వేణువు నేర్చుకుంది. మొదట స్వరాలు సరిగ్గా రాలేదు. అయినా అది నిరుత్సాహపడకుండా పట్టుదలతో సాధన చేసింది. కొద్దిరోజులకు వేణువును ఎంతో చక్కగా వాయించడం నేర్చుకుంది. కాక్యు అడగడంతో రాముడు తన చిన్ననాటి వేణువును దానికి కానుకగా ఇచ్చాడు. కాక్యు ఆనందంగా తోపుకు తిరిగి వచ్చింది. ఎత్తైన మామిడి చెట్టు కొమ్మపై కూర్చుని వేణువు వాయించడం మొదలుపెట్టింది. ఆ మధురమైన సంగీతం తోపంతా వ్యాపించింది. పక్షులన్నీ తమ పనులను మరిచి కాక్యు దగ్గరకు చేరుకున్నాయి. కోకిల, చిలక, పావురం... అన్నీ ఆ వేణుగానానికి మైమరచిపోయాయి. సంగీతం పూర్తయ్యాక, ‘'ఇంత అద్భుతంగా వేణువు వాయించింది ఎవరు?’` అని చూస్తే అక్కడ కాక్యు కనిపించింది.
కోకిల సిగ్గుతో కాక్యు దగ్గరకు వచ్చి, ‘కాక్యూ! మమ్మల్ని క్షమించు. నీ గొంతును ఎగతాళి చేశాం. కానీ నువ్వు నీ కృషి, పట్టుదలతో అద్భుతమైన ప్రతిభను సాధించావు’ అంది. కాక్యు చిరునవ్వుతో, ‘ప్రకృతి మన అందరికీ అన్నీ ఇవ్వదు. కానీ మనకు ఉన్నదానితో కష్టపడి ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు!’ అంది. ఆ రోజు నుంచి పక్షులన్నీ కాక్యును తమ మంచి స్నేహితురాలిగా చేసుకున్నాయి. ప్రతి సాయంత్రం కాక్యు వేణువు వాయిస్తుంటే, మిగతా పక్షులన్నీ ఆనందంగా దాని చుట్టూ నాట్యం చేసేవి.
దాసరి చంద్రయ్య
9440407381








కామెంట్లు (0)