హాయ్ ఫ్రెండ్స్!
నేను పుస్తకాల్లో, టీవీలో చార్మినార్ బొమ్మలను చాలాసార్లు చూశాను. కానీ, దాన్ని నిజంగా కళ్లారా చూసినప్పుడు మాత్రం నాకు మాటలు రాలేదు. దాని ముందు నిలబడి పైకి తలెత్తి చూస్తే ఎంత పెద్దగా ఉందో! ఒక్కసారిగా నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇంత అందమైన కట్టడాన్ని ఇంతకాలం బొమ్మల్లోనే చూశానా అనిపించింది. దాని ముందు నిలబడితే ఏదో పాత కాలంలోకి వెళ్లిపోయినట్లుగా అనిపించింది. నేను చార్మినార్ దగ్గరకు వెళ్లి దాని నిర్మాణాన్ని ఆసక్తిగా చూశాను. నాలుగు వైపులా నాలుగు పెద్ద మినార్లు, వాటి మధ్య అందమైన గుమ్మటాలు, గోడలపై కనిపించే సున్నితమైన చెక్కడాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పైకి చూస్తుంటే ఆ మినార్లు ఆకాశాన్ని తాకుతున్నట్లుగా అనిపించాయి. ఒక్కో వైపు నుంచి చూస్తే ఒక్కోలా కనిపించడం నాకు చాలా నచ్చింది. ఇన్ని వందల సంవత్సరాల క్రితం ఇంత పెద్ద కట్టడాన్ని ఎలా నిర్మించారో అని ఆశ్చర్యపోయాను. ఇప్పుడు మన దగ్గర ఎన్నో యంత్రాలు, ఆధునిక పరికరాలు ఉన్నాయి. కానీ అప్పట్లో అవేవీ లేకుండానే ఇంత అద్భుతమైన కట్టడాన్ని ఎలా నిర్మించారో తెలుసుకోవాలనిపించింది. చార్మినార్‌ను 1591లో మహ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారని మా నాన్న చెప్పారు. దాని నిర్మాణంలో సున్నం, గుడ్డుసొన, బెల్లం వంటి పదార్థాలను ఉపయోగించారని కూడా చెప్పారు. ఈ విషయాలు విన్నాక చార్మినార్ గురించి మరింత తెలుసుకోవాలనిపించింది. దాన్ని చూస్తూ ఉంటే మన పూర్వీకుల నిర్మాణ నైపుణ్యం ఎంత గొప్పదో అర్థమైంది. చార్మినార్ చుట్టూ ఉన్న పాత నగర వాతావరణం కూడా నాకు బాగా నచ్చింది. అక్కడి సందడి, దుకాణాలు, రకరకాల వస్తువులు, రంగురంగుల గాజులు చూస్తుంటే ఎంతో ఆసక్తిగా అనిపించింది. చార్మినార్ దగ్గర నిలబడి ఫొటోలు కూడా దిగాను. ఆ కట్టడాన్ని చూస్తూ గడిపిన సమయం నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. నా జీవితంలో నేను ప్రత్యక్షంగా చూసిన మొదటి చారిత్రక కట్టడం చార్మినార్! పుస్తకాల్లో చదివిన చరిత్రను కళ్ల ముందు చూస్తుంటే కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను. ఈ పర్యటన వల్ల చారిత్రక కట్టడాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత పెరిగింది. మళ్లీ ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే చార్మినార్‌ను మరోసారి చూడాలని ఉంది. ఆ అందమైన కట్టడం, అక్కడ గడిపిన సమయం ఎప్పటికీ నా జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి ఫ్రెండ్స్!

రిషి నందన్
4వ తరగతి, శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్, కాకినాడ.








కామెంట్‌లు (0)