మంజుల దినచర్య ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకే మొదలవుతుంది. పిల్లలు రాహుల్, సిరిల స్కూల్ బాక్సులు సిద్ధం చేయడం, భర్త ప్రకాష్ లంచ్ బాక్స్ సర్దడం, టిఫిన్ చేయడం.. ఇలా పొద్దున్నే ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. వాళ్లందరూ ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లాక ఇక ఇంట్లో పనుల వంతు. ఊడ్చడం, తుడవడం, దుస్తులు ఉతకడం, గిన్నెలు తోమడం—ఇలా క్షణం తీరిక లేకుండా సరిపోతుంది.
వారం మొత్తం ఎలాగోలా గుంజేస్తుంది కానీ, ఆదివారం వస్తే మంజులకు ఇంకా ఎక్కువ పనిభారం పడుతుంది. ఇల్లంతా శుభ్రం చేయడంతో పాటు చికెన్, మటన్, చేపలు అంటూ రకరకాల ప్రత్యేక వంటకాలు చేయాల్సి వస్తుంది. ఒకరోజు ఉదయం, వారం అంతా చేసిన పనితో తీవ్రంగా అలసిపోయిన మంజుల, డైనింగ్ టేబుల్ దగ్గర నీరసంగా కూర్చుండిపోయింది.
"ఏమండీ! పిల్లలూ! మీ అందరికీ ఆదివారం వస్తే ఆఫీసులు, స్కూళ్లకు సెలవు ఉంటుంది.. మరి మా ఆడవాళ్లకు ఆదివారం కూడా సెలవు ఇవ్వరా? నాకు ఈ రోజు ఓపిక లేదు, నేను వంట చేయను!" అని కచ్చితంగా చెప్పేసింది.
ప్రకాష్, పిల్లలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. "అమ్మ లేకపోతే వంట చేయడం ఎలా?" అని లోపల కాస్త కంగారుపడ్డా, రోజూ ఆమె పడే శ్రమను గుర్తుతెచ్చుకుని, ఈ రోజు మంజులకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
మంజులను హాల్లో ఉన్న సోఫాలో ప్రశాంతంగా కూర్చోబెట్టి, టీవీలో తనకు నచ్చిన ప్రోగ్రామ్ పెట్టుకోమని చెప్పారు. రాహుల్ వేడి వేడిగా టీ చేసి తెచ్చివ్వగా, మంజుల ఎంతో ఆనందంగా ఆస్వాదించింది.
ఇక వంటగదిలో ప్రకాష్, పిల్లల 'వంట పోరాటం' మొదలైంది. ప్రకాష్ చికెన్ కూర వండటం. యూట్యూబ్ చూస్తూ అల్లంవెల్లుల్లి పేస్ట్, మసాలాలు ఎంత వేయాలో లెక్కలు వేయడం మొదలుపెట్టాడు. రాహుల్_బియ్యం కడిగి రైస్ కుక్కర్‌లో పెట్టడం, ఇతర చిన్న చిన్న పనులు చూడటం.
సగం వంట పూర్తయ్యేసరికి వంటగది మొత్తం చెల్లాచెదురైంది. పసుపు డబ్బా ఒకచోట, నూనె జిడ్డు మరొకచోట! మసాలా ఘాటుకు ఇల్లంతా తుమ్ములు మొదలయ్యాయి. హాల్లో ఉన్న మంజుల నవ్వుకుంటూ, "నేను వచ్చి సహాయం చేయనా?" అని అడిగితే, "వద్దు వద్దు! ఈ రోజు నీకు పూర్తి సెలవు" అని ప్రకాష్ లోపల నుంచి కేక వేశాడు.
చివరకు మధ్యాహ్నం రెండు గంటలకు వంట పూర్తయింది. కాస్త మాడిన చికెన్ కూర, కొద్దిగా మెత్తబడిన అన్నాన్ని డైనింగ్ టేబుల్ మీద అందంగా సర్దారు. ప్రకాష్, పిల్లలు ఎంతో ఆత్రుతగా మంజులకు వడ్డించారు.
మంజుల మొదటి ముద్ద నోట్లో పెట్టుకుని, "చాలా బాగుంది!" అని నవ్వింది. తను రోజూ పడే శ్రమను అర్థం చేసుకుని, ప్రేమతో చేసిన ఆ వంటకం ఆమెకు ప్రపంచంలోనే అత్యంత రుచికరమైనదిగా అనిపించింది.
"అమ్మా రోజువారీ పనుల్లో నీకు ఎంత కష్టమో ఈ రోజు మాకు అర్థమైంది. ఇకపై ప్రతి ఆదివారం నీకు సెలవే! మేమే వంట చేస్తాం," అని పిల్లలు, భర్త మాటిచ్చారు. మంజుల కళ్లలో ఆనందబాష్పాలు సుడులు తిరిగాయి.
నీతి: " ఆరోగ్య రీత్యా విశ్రాంతి అవసరమే.. అమ్మకి సెలవివ్వాలి.."
- యాడవరం చంద్రకాంత్ గౌడ్
9441762105








కామెంట్‌లు (0)