అనగనగా ఒక సుసంపన్నమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని ధర్మపరుడైన ఒక రాజు పాలించేవాడు. తన తర్వాత రాజ్యాన్ని పాలించే వ్యక్తి తెలివి, ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగినవాడై ఉండాలని రాజు అనుకున్నాడు. అందుకే ఒకరోజు రాజ్యం అంతటా ఒక ప్రత్యేకమైన పోటీని ప్రకటించాడు. రాజభవనం మధ్యలో ఒక పెద్ద ఇనుప తలుపును ఉంచి, ప్రజలందరినీ పిలిచి ఇలా అన్నాడు. ‘ఈ తలుపును ఎవరు తెరవగలరో వారికి నా రాజ్యాన్ని అప్పగించి, రాజుగా ప్రకటిస్తాను. కానీ తెరవలేకపోతే వారి ఒక చేయి నరికిస్తాను` అని ప్రకటించాడు. రాజు మాటలు విన్న ప్రజలందరూ భయపడ్డారు. ఒక వేళ తలుపు తెరవలేకపోతే చేయి పోతుందని అనుకుని ఎవరూ ముందుకు రాలేదు. రోజంతా గడిచిపోయినా ఆ తలుపును తాకడానికి ఎవరూ సాహసించలేదు. చివరికి ఒక పేద కుటుంబానికి చెందిన యువకుడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. అందరూ అతన్ని చూసి, ‘వెళ్లకు! నీ చేయి పోతుంది` అని హెచ్చరించారు. ఆ యువకుడు తనపై తనకు నమ్మకం ఉంచుకున్నాడు.
అతను తలుపు దగ్గరకు వెళ్లి, మెల్లగా చేతితో నెట్టాడు. ఆశ్చర్యంగా ఆ తలుపు వెంటనే తెరుచుకుంది. అసలు ఆ తలుపుకు తాళమే వేయలేదు. రాజు చిరునవ్వుతో ఆ యువకుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి ‘ఈ తలుపు తెరవడానికి బలం కాదు.. ధైర్యం కావాలి. ప్రయత్నించక ముందే ఓటమిని ఊహించి, వెనక్కి తగ్గినవారు అవకాశాన్ని కోల్పోయారు. నీవు మాత్రం నీ మీద నమ్మకం ఉంచి, ప్రయత్నించావు. అందుకే నువ్వే ఈ రాజ్యానికి అర్హుడివి!’ అన్నాడు. ఆ యువకుడు రాజుగా పట్టాభిషేకం పొందాడు. ప్రజలందరూ అతని ధైర్యాన్ని ప్రశంసంచారు.
నీతి: మనపై మనకు నమ్మకం ఉంటే, ప్రయత్నించే ధైర్యం ఉంటే ఏ లక్ష్యన్నైనా సాధించవచ్చు. ప్రయత్నించకుండా భయపడటం నిజమైన ఓటమి.

చాట్లా వెంకట్
7వ తరగతి, గీతాంజలి హైస్కూలు, రెడ్డిగూడెం, ఎన్టీఆర్ జిల్లా.








కామెంట్లు (0)