"ఉప్పు కప్పురంబునొక్క పోలికనుండు చూడ చూడ రుచులు జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా" ఓయ్ బామ్మా పుణ్య పురుషులు అంటే ఎవరే?" అంటూ బుడుగు అరిచేసరికి "నీకెందుకురా? పుణ్య పురుషులు, పాపం పురుషులు" అంటూ గసిరింది బామ్మ "అదేమిటే బామ్మా! డౌటు అడిగితే అలా అరుస్తావుటే? సరే కానీ, ఉప్పు కప్పు రమ్ము అంటే ఏమిటే? నొక్క పోలిక జాడీలు రుచులు అంటే ఏమిటి బామ్మా?" అని గట్టిగా బుడుగు అరిచేసరికి "ఒరేయ్ బుడుగ్గా వీపు చిట్లకొడతా భడవకానా ఆ చదవటమేంటిరా? ఎనిమిదో క్లాస్ చదువుతున్నావ్ తెలుగు సరిగా చదవలేకపోతున్నావు" అంటూ కోప్పడింది "బామ్మా! నా వీపు తర్వాత చీట్లాడదువు గానీ ముందు నా డౌటు తీర్చవే బామ్మా" అని బుడుగు చిరాగ్గా అడిగేసరికి "ఆ చదువేమిటిరా? అది సరే గానీ నీకేం అర్ధమైందో? ముందు నువ్వు చెప్పరా" అని ఎదురు అడిగేసరికి "ఉప్పు అంటే పప్పులో వేసుకునేది. కప్పు అంటే కాఫీ తాగుతాం కదా అది. రమ్ము అంటే రోజూ రాత్రి తాత తాగి వచ్చి ఊగుతుంటాడు కదా అది" అని బుడుగు చెప్పేసరికి "ఆపరా భడవకానా ఏం కాలం రా? బాబూ ఏం చదువులురా నాయనా? ఆ పద్యం రాసినాయన ఎప్పుడో చనిపోయాడు. కానీ ఇప్పుడు వుంటేనా? "అంటూ కోపంగా నవ్వసాగింది బామ్మ. "ఓయ్ బామ్మా తర్వాత నవ్వుదుగానీ, కానీ నేను చెప్పింది రైటా? కాదా? "అంటూ బామ్మను గట్టిగా పట్టి లాగుతూ అడిగేసరికి నవ్వు ఆపుకొని "నువ్వు చెప్పింది కొద్దిగా రైటేరా నాయనా మిగిలినది నేను సరిగ్గా చెబుతా విను
"ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు
చూడ చూడ రుచులు జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ వినురవేమ "
ఇది వేమన శతకం లో పద్యం. దీనిని వేమన గారు రాసారు. ఉప్పు కప్పురంబు ఒకేలా వుంటాయి" అని బామ్మ చెబ్తోంటే "కప్పురంబు కాదే బామ్మా కప్పు రమ్ము విడిగా చదవాలే" అని బుడుగు అనగానే "భడవకానా తాతకు దగ్గులు నేర్పుతావుట్రా నువ్వు? ఆగు నే చెప్పేది విను. అలా విడిగా చదవకూడదు కలిపే చదవాలి. ఉప్పు కప్పురంబు అని ఉప్పు అంటే తెల్లగా ఉంటుంది కూరల్లో, పచ్చడిల్లో అన్నిట్లోను వేసుకుంటాము. అది వేయకపోతే అసలు ఆ పదార్థాలకు రుచే రాదు. పలుకులు పలుకులుగా తెల్లగా గడ్డలాగా వుంటుంది. కప్పురంబు అంటే కర్పూరం దేవునికి పూజా సమయంలో హారతి ఇస్తాం కదా! అప్పుడు వెలిగిస్తాం అది కప్పురమంటే, అదీ తెల్లగానే పలుకులు పలుకుల్లా గడ్డల్లాగే వుంటుంది. ఉప్పు కప్పురంబు రెండు పక్క పక్కనే వుంటే ఏది ఉప్పో? ఏది కర్పూరమో? తెలుసుకోలేం. నోట్లో వేసుకుంటే ఉప్పు ఉప్పగా ఉంటుంది వెంటనే ఊసేస్తాం. కర్పూరం వగరుగా ఘాటుగా వుంటుంది దానిని ఊసేస్తాం. అలాగే పురుషులు అంటే మనుషులు అందరూ ఒకేలా పైకి కనిపిస్తుంటారు. కానీ స్వభావాలు గుణాలు వేరు వేరుగా వుంటాయి. ఎవరు మంచివాడో? ఎవరు చెడ్డవాడో? తెలియదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తుల గురించి తెలుస్తుంది. అందుకనే పురుషులలో పుణ్య పురుషులు వేరుగా వుంటారు రా అని ఆ పద్యానికి భావం రా!’ అని బామ్మ చెప్పేసరికి "చాలా బాగా చెప్పావు బామ్మా మంచినీళ్ళు తాగు అలసిపోయావు" అంటూ బుడుగు మంచినీళ్ళ గ్లాసు ఇస్తాడు. అది అందుకొని తాగి "మనుషులందరూ ఒకేలా కనిపించినా వాళ్ళ స్వభావాలను బట్టి అంచనా వేసుకోవాలి నాయనా" అని బామ్మ చెప్పేసరికి "సరే బామ్మా రేపు స్కూల్లో నువ్వు చెప్పినట్లే చెబుతాను. బహుమతి నేనే తీసుకుంటాను" అంటూ నవ్వుకొంటూ వెళ్ళిపోయాడు బుడుగు.
మర్నాడు స్కూల్ లో పద్యాల పోటీల్లో బుడుగు తో పాటు ఇంకా పాతికమంది పద్యాలు చెప్పారు. చివరికి బుడుగు, శంకర్ మిగిలారు. వారిలో ఒకరికి ఫస్ట్ బహుమతి ఇవ్వాలి. "శంకర్ మన వూరి ప్రసిడెంట్ సుబ్బరాజు గారి కొడుకు. వాడికే బహుమతి ఇవ్వా"లని హెడ్మిస్ సునీత చెప్పేసరికి "కుదరదండి ఆ బుడుగు పద్యం, భావం చాలా వివరంగా చెప్పాడు. బహుమతి వాడికే ఇవ్వాలి" అంటూ తెలుగు మేడమ్ రమణి గట్టిగా అనేసరికి "ఎందుకు కుదరదు? ఈ స్కూల్ హెడ్మాస్టర్ నేనా? మీరా? ఆ శంకర్ కు బహుమతి ఇవ్వకపోతే ఆ ప్రెసిడెంట్ సుబ్బరాజుగారితో చాలా గొడవలు వస్తాయి" అంటూ సునీత చెప్పేసరికి "మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకునేటప్పుడు ఈ పోటీలెందుకు? నేనెందుకు? మీకు నచ్చినట్టు చేసుకోండి" అంటూ రమణి కోపంగా పుస్తకాలు, పెన్ వదిలేసి కుర్చీలోంచి లేచిపోయింది. ఇదంతా దూరం నుంచి గమనిస్తోన్న ప్రెసిడెంట్ సుబ్బరాజు "మేడమ్ నేను మాట్లాడుతాను" అంటూ "రేయ్ బాబూ ఇటురా" అని బుడుగును పిలిచాడు. "చూడు బాబూ నువ్వు చాలా మంచోడివి కదా. ఈ బహుమతి మా శంకర్ కి ఇమ్మని చెప్పు. నీకు నేను వంద రూపాయలు కానుకగా ఇస్తాను. ఇది నాకు, మా వాడికి ప్రిస్టేజ్ రా బాబు" అని నవ్వుతూ జేబులోంచి వంద రూపాయలు నోటు తీసి ఇదిగో తీసుకో అంటూంటే "అవునురా బుడుగు మీ నాన్న ఈ వూరిలో ఎవరికీ తెలియదు. ఓ బట్టల కొట్టు లో గుమాస్తా. ఆ శంకర్ వాళ్ళ నాన్న ఈ ఊరి ప్రెసిడెంట్ ఆయన గురించి అందరికీ తెలుసు.
ఆ బహుమతి ఆ శంకర్ కి ఇచ్చేద్దాం" అంటూ నవ్వుతూ సునీత చెబుతుంటే డ్రిల్ మాస్టారు రంగారావు "అదేం కుదరదు. న్యాయంగా పోటీలో నెగ్గిన వాడికే బహుమతి ఇవ్వండి. ఎవడితో ఏం గొడవ వస్తుందో? నే చూస్తానం"టూ మైకందుకొని "ఈ పద్యాల పోటీలలో ఫస్ట్ ఫ్రైజ్ బుడుగు కే వచ్చింది. వాళ్ళ అమ్మానాన్నలు కూడా స్టేజీ మీదకు వచ్చి బహుమతి తీసుకోవాలి" అని మైకులో అరిచి "సుబ్బరాజు గారు మీరు బహుమతి ఇచ్చేయండం"టూ ఆయన చేతికి బహుమతి ఇచ్చారు రంగారావు మాస్టారు. చేసేదేమీలేక తల్లిదండ్రులతో వచ్చిన బుడుగు కు బహుమతి అందిస్తూ, నవ్వుతూ "ఈ బుడుగు చాలా బాగా చెప్పాడు పద్యం, భావం. ఇటువంటి పిల్లలే తెలుగు పద్యాలను బాగా చదవగలరు. ఇటువంటి వాళ్ళే తెలుగు తల్లి ముద్దు బిడ్డలు. అతనికి మన స్కూల్ తరపున, మన ఊరి తరపున శుభాకాంక్షలు. ఈ అబ్బాయి తల్లిదండ్రులకి అభినందనలు" అంటూ ముగించాడు ప్రెసిడెంట్ సుబ్బరాజు.
"మర్నాడు నువ్వు చెప్పింది నిజమేనే బామ్మా!
ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే మా హెడ్మిస్ ను చాలా మంచిది అని, ఎప్పుడూ కోపంగా మాట్లాడే మా డ్రిల్ మాస్టారు రంగారావు గారిని కోపిష్ఠి అని స్కూల్ లో అందరూ అనుకొంటూ వుంటాం కానీ, బామ్మా! నిన్న జరిగిన సంగతి పూర్తిగా మా అభిప్రాయాన్ని మార్చేసింది. కోపంగా మాట్లాడే వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదని, నవ్వుతూ మాట్లాడే వాళ్ళందరూ మంచోళ్ళు కాదని తెలిసింది బామ్మా!"అని బుడుగు చెప్పేసరికి "అవునురా మాట్లాడే మాటలను బట్టి మనుషులు చెడ్డోళ్ళు, మంచోళ్ళు కాదని తెలుసుకో, వేమన గారు పద్యంలో అదే చెప్పారురా. ఉప్పు, కర్పూరం చూడడానికి ఒకేలా వున్నా వాటి రుచిని బట్టి వాటిని ఎలా గుర్తిస్తామో అదే విధంగా పురుషులలో పుణ్య పురుషులు వేరుగా వుంటారురా. ఈ పద్యం భావం గుర్తుపెట్టుకో నాయనా!" అని బామ్మ చెప్పగానే "సరే బామ్మా! రేపట్నించి వీళ్ళు మంచోళ్ళు అని, వీళ్ళు చెడ్డోళ్ళు అని ఈ పద్యం ద్వారానే లెక్కేసుకుంటాను"అంటూ"ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు, రేయ్ రాజు వుండరా వస్తానం"టూ బయటికి ఆడుకోవటానికి పరుగెత్తేసాడు బుడుగు. ఈ బుడుగ్గాడు గట్టోడే, ఇట్టే చెబితే అట్టే పట్టేస్తాడు" అంటూ నవ్వుకోసాగింది బామ్మ.
- తెన్నేటి లక్ష్మీ నరసింహ మూర్తి
8247433432







కామెంట్లు (0)