ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబొమ్మ పడి 130 ఏళ్ళు

26 నిమిషాల క్రితం

movies
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 09:30 పూర్వాహ్నం | 10 నిమిషాల చదవడం

అతిశయోక్తి అనిపించినా, అది అక్షర సత్యం. కళ్ళెదుటి వాస్తవ దృశ్యాలను తెరపై పునఃసృష్టించే చలనచిత్రం అత్యంత ప్రాచుర్యం గల వినోదంగా అవతరించింది. కొందరి మాటల్లో చెప్పాలంటే, అచ్చమైన ఏడో కళారూపంగా స్థిరపడింది. మొత్తం ఇరవయ్యో శతాబ్దానికి తిరుగులేని ప్రాతినిధ్యం వహించే, అద్భుతమైన మానవ కళ అయింది. అవతరించి పదమూడు దశాబ్దాలే అయినా, ప్రపంచాన్ని శాసిస్తోంది. అసలీ సినిమా ఆరంభగాథ, సరిగ్గా 130 ఏళ్ళ క్రితం మన దేశానికి వచ్చినప్పటి కథ అంతా.. అచ్చమైన ఓ సినిమా స్టోరీయే!


అది 1895 చివరి రోజుల సంగతి. ప్యారిస్‌లో చలి ఘనీభవించిన ఓ శీతకాలపు సాయంత్రం. స్థలం.. బులెవార్డ్ ది క్యాపుసిన్స్ రహదారి ప్రాంతం. రోడ్డు మీద నిల్చొని ఓ మనిషి చేతితో కరపత్రాలు అందిస్తున్నాడు. ఆ పత్రాలను ఆగి అందుకుంటున్నవారు కొద్దిమందే. అందులోనూ మరీ కొద్దిమంది మాత్రం ఆ ఫ్లయర్లు పుచ్చుకొని, ఆ రోడ్డు మీదే 14వ నంబర్ విలాసంలోని ‘గ్రాండ్ కెఫే’లోకి అడుగుపెట్టారు. ఆ కెఫేలోని బేస్‌మెంట్‌లో ‘ఇండియన్ సలోన్‌’ అనే గదిలో అప్పటికే ఓ తాత్కాలిక థియేటర్‌ ఏర్పాటు చేశారు. మొత్తంగా 33 మంది పోగయ్యారు. ఒక్కొక్కరూ ఒక్కో ఫ్రాంకు చొప్పున డబ్బులు చెల్లించి, మరీ అక్కడి లూమియర్ సినిమాటోగ్రాఫ్‌ ప్రదర్శనను చూసేందుకు లోపలకు వచ్చారు. మొత్తం 10 లఘు ఫిల్ములతో కూడిన 20 నిమిషాల ప్రదర్శన అది.

ప్రపంచ సినిమా పుట్టినరోజు!

టికెట్ కొనుక్కొని వచ్చిన జనానికి తెరపై కదిలేబొమ్మల్ని ప్రదర్శించడం అదే తొలిసారి. అలా ఒకచోట చేరిన ఆ కొద్దిమంది జనం ప్రపంచంలోనే తొలి సినీ ప్రేక్షకులుగా చరిత్రకెక్కారు. నిజానికి, అంతకన్నా కొద్దినెలల ముందే అదే ఏడాది మార్చి 22న లూయీ లూమియర్ పట్టుమని పది మంది హాజరైన ఫ్రెంచ్ వ్యాపారవేత్తల సమావేశంలో ఫొటోగ్రాఫిక్ పరిశ్రమపై ప్రసంగించి, తన సినిమాటోగ్రాఫ్‌ పరికరాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత ఎన్నో ప్రైవేటు ప్రదర్శనలు చేశాక, ఎట్టకేలకు 1895 డిసెంబర్ 28న లూమియర్ బ్రదర్స్ తొలిసారిగా బాహాటంగా జనం కోసం సినిమాటోగ్రాఫ్ పరికరంతో చలనచిత్రాలను ప్రదర్శించారు. ఆ తేదీయే ‘ప్రపంచ సినిమా పుట్టినరోజు’గా వాడుకలో స్థిరపడింది.

చేతితో తిప్పే కెమెరా! ప్రొజెక్టర్ కూడా అదే!!

లూమియర్ బ్రదర్స్ ఫ్రాన్స్‌లోని లీయాన్‌ నగరంలో కెమెరాలు, ఫొటోగ్రాఫిక్ ప్లేట్లు తయారుచేసే ఓ పెద్దమనిషి కుమారులు. వాళ్ళేమీ సినిమా అనే వినోద సాధనాన్ని కనిపెట్టాలని బయలుదేరలేదు. కేవలం కదులుతున్న వస్తువులను అధ్యయనం చేసేందుకు అవసరమైన ఓ శాస్త్రీయ సాధనాన్ని రూపొందించాలన్నది వాళ్ళ ఆలోచన. అంతకు మునుపటి పరికరాల్లోని లోటుపాట్లను సవరించి, వారు అభివృద్ధి చేసిన నవీన సాధనమే – సినిమాటోగ్రాఫ్. చలనచిత్రాలంటే కాంతే ఆధారం. సినిమాను కనిపెట్టిన ఫ్రెంచ్ సోదరులు లూయిస్, అగస్టేల ఇంటి పేరు 'లూమియర్'. ఫ్రెంచ్ భాషలో దాని అర్థం... "కాంతి". ఎంత విచిత్రం!?

లూమియర్ సోదరులు రూపకల్పన చేసిన 'సినిమాటోగ్రాఫ్' పరికరం అటు కెమెరాగానూ, ఇటు ప్రొజెక్టర్‌గానూ రెండు విధాలుగా పనిచేసేది. ఆ విప్లవాత్మక పరికరంతో వారు అప్పట్లో దాదాపు 1400 లఘు చిత్రాలను రూపొందించారు. ఆ చిత్రాలన్నీ కేవలం 50 సెకన్ల నిడివి గలవి. సింగిల్ సీక్వెన్స్ షాట్స్. కళ్ళెదుటి దృశ్యాన్ని యథాతథంగా కెమెరాలో బంధించడమే. ఆ రోజుల్లో కెమెరామెన్లు 35 ఎం.ఎం. ఫిల్మ్‌ను ఉపయోగించి, కదులుతున్న పడవలు, రైళ్లపై నుండి రీలును చేతితో తిప్పే హ్యాండ్-క్రాంక్డ్ కెమెరాలతో వీటిని చిత్రీకరించారు.

indian Feature film Raja Harischandra by Dadasaheb Phalke దాదాసాహెబ్ ఫాల్కే రచించిన 1వ భారతీయ చలనచ్రితం (రాజా హరిశ్చంద్ర (1913-1)

కలత నిద్రవేళ... కుట్టు మిషన్ ప్రేరణతో...

చలనచిత్రాలు వచ్చిన చారిత్రక క్రమం ఆసక్తికరమైనది. 1800ల మధ్యకాలంలో ప్రపంచాన్ని ఫొటోగ్రఫీ ఒక ఊపు ఊపింది. ఆ నిశ్చలన ఛాయాచిత్రకళకు లభించిన ఆదరణే.. ఈసారి ఏకంగా చలనచిత్రాల (సినిమా) వైపు అడుగులు వేసేలా సాంకేతిక నిపుణులను ప్రోత్సహించింది. లూమియర్ బ్రదర్స్ అయిన అగస్టే, లూయిస్‌ల తండ్రి స్వయంగా పెయింటర్, ఫొటోగ్రాఫర్. తండ్రి బాటలోనే వారు కూడా ఫొటోగ్రఫీపై మక్కువ చూపారు. 1893లో థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టిన 'కైనెటోస్కోప్' గురించి తెలిశాక వారి ఆలోచన మారింది. దాదాపు ఒక పబ్లిక్ పోస్ట్‌బాక్స్ పరిమాణంలో ఉండే పరికరం అది. దానికి ఉన్న హ్యాండ్ క్రాంక్‌ను చేతితో తిప్పడం ద్వారా, ఫిల్మ్ స్ట్రిప్స్‌ను వేగంగా ఒకదాని తర్వాత ఒకటిగా ఫ్రేమ్‌ల రూపంలో చూడొచ్చు. ఇది చలనచిత్రమనే భ్రమాజనిత అనుభూతినిచ్చేది. ఈ కైనెటోస్కోప్‌లో తడవకు ఒక్కరు మాత్రమే ఫిల్మ్ లూప్‌లను చూడటానికి వీలుండేది. అలా కాకుండా ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు కలసి చూసేలా థియేటర్ స్క్రీన్ తరహా 'ప్రొజెక్షన్ విధానం' బాగుంటుందని లూమియర్స్ భావించారు.

మైగ్రేన్‌తో బాధపడుతున్న ఓ రాత్రి కలత నిద్రవేళ.. లూయిస్ లూమియర్‌కు చటుక్కున ఓ ఆలోచన మెరిసింది. కుట్టుమిషన్ ప్రేరణతో కెమెరాలో ఫిల్ము కదలికకు సంబంధించి ఓ చిన్న పరిష్కార మార్గం ఆలోచించారు. అలా ఓ పరికరాన్ని తయారు చేయించారు. దానికి 'సినిమాటోగ్రాఫ్' అని పేరు పెట్టారు. లూమియర్లు తీసిన తొలి సినిమాయే తమ ఫ్యాక్టరీ నుంచి బయటకొస్తున్న కార్మికుల దృశ్యాల చిత్రం. అలా ప్రపంచ సినీచరిత్రలో తెరపై కనిపించిన తొలి పాత్ర – అక్షరాలా ప్రజలే, వందలాది కార్మికులే!

విశ్వరూపాన్ని ఊహించని ఆవిష్కర్తలు

నిజానికి, చలనచిత్రాలకు సంబంధించి అప్పట్లో ప్రయోగాలు చేసింది లూమియర్ బ్రదర్స్ ఒక్కరే కాదు. వాళ్ళకు ముందు, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు. లూమియర్ బ్రదర్స్ సినిమాటోగ్రాఫ్ మాత్రం సినిమాటోగ్రఫీలోని అనేక ప్రాథమిక సమస్యలను పరిష్కరించింది. అయితే, ఆ సోదరులు సినిమాకున్న వాణిజ్య అవకాశాలను పసిగట్టలేకపోయారు. దానికి బోలెడంత వ్యాపారం ఉందని నమ్మలేకపోయారు. అంతేకాదు.. గ్రాండ్ కెఫేలో తొలిసారి సినిమాటోగ్రాఫ్‌ పబ్లిక్ ప్రదర్శనను స్వయానా తమ తండ్రి నిర్వహిస్తున్నప్పటికీ, వాళ్ళు ఆ షోకు రాను కూడా రాలేదు.

అద్దె ఇమ్మని, ఆదాయం కోల్పోయిన ఓనర్!

‘గ్రాండ్ కెఫే’ తాలూకు బేస్‌మెంట్‌ను ఆ హోటల్ ఓనర్ ఏడాది పాటు లూమియర్లకు లీజుకిచ్చాడు. వచ్చే ఆదాయంలో 20 శాతం అద్దె కింద తీసుకొమ్మని లూమియర్లు అడిగితే, సినిమాటోగ్రాఫ్ సక్సెస్ మీద నమ్మకం లేని ఆ పెద్ద మనిషి ససేమిరా అన్నాడు. రోజుకు 30 ఫ్రాంకులు అద్దె చెల్లించాలన్నాడు. తీరా మూడు వారాలు తిరిగే సరికల్లా టికెట్ వసూళ్ళు రోజుకు 2 వేల నుంచి 2500 ఫ్రాంకులు రాసాగాయి. కేవలం 100 నుంచి 120 మంది పట్టే ఆ హాలు బయట పెద్దసంఖ్యలో జనం క్యూ కట్టి, తోసుకుంటూ ఉండేవారు. వసూళ్ళలో వాటా ఇస్తామంటే కాదన్న కెఫే యజమాని మానసిక స్థితి ఊహించుకోవచ్చు.

చరిత్రకు సాక్షి అరుదైన ఆ హోటల్

భారతదేశంలో తొలి సినిమా ప్రదర్శన జరిగిన వాట్సన్స్ హోటల్ అప్పట్లో బొంబాయిలోనే మొట్టమొదటి అతి పెద్ద హోటల్. ఆ హోటల్ అసలు పేరు – ‘ఎస్‌ప్లనేడ్ హోటల్’. హోటల్ యజమాని వాట్సన్ గారి పేరు మీదే ఆ హోటల్‌ ‘వాట్సన్స్ హోటల్‌’గా ప్రసిద్ధమైంది. దాదాపు 130 గదులతో కూడిన ఐదంతస్తుల అందమైన భవనం అది. పోత పోసిన ఇనుప ఫ్రేమ్‌తో దాన్ని నిర్మించారు. ఆ హోటల్‌ చావళ్ళు, లేవటరీలు అలా పోత ఇనుముతో కట్టినవే. ఆ హోటల్ అప్పట్లో బొంబాయి హార్బర్‌లోకి వచ్చే నౌకలకు దర్పంగా, స్పష్టంగా కనిపిస్తుండేది. అత్యాధునిక వాట్సన్స్ హోటల్‌లో అప్పట్లో కేవలం శ్వేతజాతీయులకే ప్రవేశం. యూరోపియన్లను మాత్రమే ఆడ వెయిటర్లుగా ఉద్యోగంలోకి తీసుకొనేవారు. కాలగతిలో అది ఆఫీసులు, కార్యాలయాలకు ఆవాసంగా మారి, క్షీణించిన రూపురేఖలతో ఎస్‌ప్లనేడ్ మ్యాన్షన్‌గా మిగిలింది.

​ప్యారిస్ నుంచి ప్రపంచమంతటికీ..

తొలి ప్రదర్శనల విజయంతో సినిమాటోగ్రాఫ్ వ్యాపార సామర్థ్యం ఎంతో లూమియర్లకు అర్థమైంది. ఏకంగా 200 సినిమాటోగ్రాఫ్ మెషిన్ల తయారీకి కొత్త ఆర్డర్ ఇచ్చారు. ఆ పరికరం సర్వహక్కులూ తామే అట్టిపెట్టుకున్నారు. తర్వాత కొద్ది నెలల పాటు పలువురు ఆపరేటర్లకు ఆ సినిమాటోగ్రాఫ్ పరికరాన్ని ఎలా ఉపయోగించాలో, తమ వ్యాపార ప్రక్రియలు ఏమిటో శిక్షణనిచ్చారు. సదరు ఆపరేటర్లకు కేవలం చలనచిత్రాలను ప్రదర్శించడమే కాదు, వాటిని ఎలా చిత్రీకరించాలో కూడా నేర్పారు. అదిగో అలాంటి ఆపరేటర్లలో ఒకరే – భారత్, ఆస్ట్రేలియాల్లో తొలిసారి సినిమాటోగ్రాఫ్ ప్రదర్శనలు ఇచ్చిన మారిస్ సెస్టియర్.

Novelty Cinematographe నావెల్టీ ధియేటర్, బొంబాయి

​మన గడ్డపై సినిమా తొలి అడుగు

ప్రపంచంలో సినిమా ఆరంభమై ఆరు నెలలు తిరిగేసరికల్లా లూమియర్ సినిమాటోగ్రాఫ్ భారతీయ గడ్డపై అడుగుపెట్టింది. తొలిసారిగా మన దేశంలో 1896 జులై 7న బొంబాయిలోని వాట్సన్స్ హోటల్‌లో తెరపై కదిలే బొమ్మల ప్రదర్శన జరిగింది. అరడజను లఘు చిత్రాలు అక్కడ ప్రదర్శించారు. అలా సరిగ్గా 130 ఏళ్ళ క్రితం మనకు సినిమాతో పరిచయం జరిగింది.

భారత్ లో తొలి చలనచిత్ర ప్రదర్శనలిచ్చిన మారిస్ సెస్టియర్ కూడా ఫ్రెంచ్ వాడే! స్వతహాగా కెమిస్ట్. అయితే, చలనచిత్రాల మీద ఆసక్తితో ఫార్మసీని అమ్మేసి మరీ ఈ రంగం ఎంచుకున్నారు. కెమెరా ఆపరేటర్‌గా మారిన మారిస్ సెస్టియర్ ఆస్ట్రేలియాకు వెళుతూ, మార్గమధ్యంలో ఇండియాకు వచ్చి, సినిమాటోగ్రాఫ్ ప్రదర్శనలిచ్చారు.

బొంబాయి వాట్సన్స్ హోటల్‌లో రోజూ సాయంత్రం గంటకు ఓ ఆట చొప్పున నాలుగు ఆటలు సినిమాటోగ్రాఫ్ ప్రదర్శించేవారు. అలా అయిదు రోజులు ఆ షోలు నడిచాయి. ఆపైన ఈ ప్రదర్శనల్ని మరింత మంది ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు జులై 14న బొంబాయిలోనే నావెల్టీ థియేటర్‌కు మార్చారు. కరెంట్ విషయంలో ఇబ్బందులు ఎదురై, తొలినాటి ప్రదర్శన రద్దవడంలాంటి కొన్ని ఇబ్బందులు ఎదురైనా, కొద్దిరోజుల్లో అంతా సర్దుకుంది. నావెల్టీలో జనం బాగా వచ్చారు. షోలు సూపర్‌హిట్.

సినీరంగంలో తొలి మహిళా ప్రొఫెషనల్

మన దేశానికి సినిమాను తీసుకొచ్చిన సెస్టియర్ గురించి ఎక్కడా పెద్దగా నమోదు కాని కథ చాలానే ఉంది. ఆయన ఒంటరిగా కాదు, సతీ సమేతంగా బొంబాయిలో దిగారు. సెస్టియర్ భార్య- మేరీ లూయిస్ ప్యూష్ (1873-1957). మేరీ రోజ్ అనే పేరుతో ఆమె పాపులర్. భర్తతో కలసి ఆమె కూడా ఇండియా, ఆస్ట్రేలియా పర్యటించారు. 1896 జూన్ 30న వారు బొంబాయి చేరుకున్నారు. బొంబాయిలోని స్థానికులతో సెస్టియర్ చకచకా సంబంధాలు నెలకొల్పుకున్నారు. కెమెరా గురించి మేరీకి అనుభవమేమీ లేదు. అయితేనేం, ఇంగ్లీషుతో ఆమెకున్న పరిచయం, ఆమె వ్యాపారానుభవం భర్తకు ఉపకరించాయి. సినిమాటోగ్రాఫ్ ప్రదర్శనల్లో ఆ భార్యాభర్తలది బలమైన బంధం. ఆర్థిక వ్యవహారాల నిర్వహణ భార్య చూసుకుంటే, ప్రదర్శనల నిర్వహణ వ్యవహారం భర్త చూసుకొనేవారు. అలా ప్రపంచ సినీచరిత్రలో ఆమె తొలి మహిళా ఫిల్మ్ ప్రొఫెషనల్ అయ్యారు. అప్పుడామెకు నిండా 23 ఏళ్ళే.

​తొలి.. సినిమా న్యూస్, యాడ్స్, రివ్యూ!

ఆ మహానగరంలో దిగిన రెండు రోజుల్లోనే స్థానిక పత్రికలో ఓ వార్తాకథనం ప్రచురితమయ్యేలా చూసుకొని, తాను, తమ సినిమాటోగ్రాఫ్ పరికరం బొంబాయి చేరిన సంగతి నలుగురికీ తెలిసేలా చేశారు సెస్టియర్. అటుపై ఆ సరికొత్త సాంకేతిక పరికరం ప్రదర్శించడానికి వేదికను కూడా సంపాదించారు. ఒక రకంగా మన దేశ సినీ చరిత్రలో తొట్టతొలి సినిమా వార్త అదే అనుకోవచ్చు. నగరంలో తొలి ప్రదర్శన ఇస్తున్ననాడు కూడా ప్రచారమేమీ తక్కువ లేదు. “ది మార్వెల్ ఆఫ్ ది సెంచరీ” (ఈ శతాబ్దపు అద్భుతం), “ది వండర్ ఆఫ్ ది వరల్డ్” (ప్రపంచంలోకెల్లా వింత) అంటూ బొంబాయి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. మన చరిత్రలో ఫస్ట్ ఫిల్మ్ అడ్వర్టైజ్‌మెంట్లు అవే!

1896 జులై 7, మంగళవారం ఇండియాలోనే ప్రప్రథమంగా సినిమాటోగ్రాఫ్ పబ్లిక్ ప్రదర్శన జరిగింది. అరడజను చిత్రాలను ప్రదర్శించారు. ఒక్కో ప్రదర్శన దాదాపు 30 నిమిషాలు. టికెట్ రూపాయి. ఆ రోజున సాయంత్రం 6, 7, రాత్రి 9, 10 గంటలకు అలా వరుసగా నాలుగుసార్లు ప్రదర్శనలు జరగడం విశేషం. ప్రదర్శనలోని ఫిల్ముల్లోని అంశాలను వివరిస్తూ, తొలి ప్రదర్శన మరునాడే ఓ పత్రికలో సమీక్ష ప్రచురితమైంది. ఇక ఆ మరునాడు జులై 9న మరో ఇంగ్లీషు పత్రికలో తొలి ప్రదర్శన తాలూకు సమీక్ష వచ్చింది. వాట్సన్స్ హోటల్‌లో ఈ ఫిల్ములు ప్రదర్శించిన గది మరీ చిన్నదిగా ఉందనీ, ఫలితంగా ప్రకటనల్లో వాగ్దానం చేసినట్టుగా నిలువెత్తు సైజులో బొమ్మలు చూసే వీలు లేకపోయిందనీ ఆ సమీక్షలో విమర్శించారు కూడా! అవి మన సినీ చరిత్రలో తొలి ఫిల్మ్ రివ్యూలు.

స్త్రీలకు ప్రత్యేకం! స్థానిక భాషల్లో పబ్లిసిటీ!!

బొంబాయిలో సినీ ప్రదర్శనలు 1896 ఆగస్టు 15 వరకు ప్రేక్షకులను అలరించాయి. అంతకు ఆరువారాల క్రితం వాట్సన్స్ హోటల్‌లో తొలిసారి ప్రదర్శించినప్పుడు పల్చగా అనిపించిన ప్రేక్షకుల సంఖ్య తీరా ఆగస్టులో బొంబాయిలో ప్రదర్శనల ముగింపు దగ్గర పడే సమయానికి వందల్లోకి చేరింది. భారతీయులను ఆకర్షించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. గమనిస్తే, అడ్వర్టైజ్‌మెంట్లలో “గమనిక: పరదా మహిళలకూ, వారి కుటుంబాలకు ప్రత్యేకంగా రిజర్వు చేసిన బాక్స్ తరగతి సీట్లు కలవు” అని ప్రచురించారు.

అలాగే, ఈ సినిమాటోగ్రాఫ్ షోలకు పబ్లిసిటీ కూడా అప్పట్లో జోరుగా సాగింది. ప్రత్యేకించి గుజరాతీ, మరాఠీ భాషల్లో సైతం పైవివరాలన్నీ బోర్డుల మీద రాసేవారు. ఆ సినిమా బోర్డులను మనుషులు ఛాతీకీ, వీపుకీ తగిలించుకొని, వీధుల వెంట తిరిగేవారు. చౌకగా అయిపోయే ఈ తరహా ‘శాండ్‌విచ్ బోర్డ్’ పబ్లిసిటీని ఆ రోజుల్లో తొలి సినీ ప్రదర్శనలకే మన దేశంలోనూ వాడడం విశేషం.

మన గడ్డపైకి.. మరికొన్ని సినీ పరికరాలు

బొంబాయిలో మారిస్ సెస్టియర్ తొలిసారి లూమియర్ సినిమాటోగ్రాఫ్ ప్రదర్శనలిచ్చిన తర్వాత వరుసగా పలువురు సినీ ప్రదర్శకులు అదే బాట పట్టారు. తమ వద్ద ఉన్న రకరకాల సినీ ప్రదర్శన పరికరాలతో వారు మన దేశంలో చలనచిత్ర ప్రదర్శనలు చేశారు. పరికరాలు వేరు, పద్ధతి కాస్తంత వేరేమో కానీ అన్నీ కదిలే బొమ్మల ప్రదర్శనలే. స్టీవర్ట్ చేసిన ‘విటాగ్రాఫ్’ ప్రదర్శన, హ్యూజెస్ జరిపిన ‘మోటో ఫోటోస్కోప్’ ప్రదర్శన, ప్రొఫెసర్ ఆండర్సన్ నిర్వహించిన ‘ఆండర్సనోస్కోగ్రాఫ్’ ప్రదర్శన వగైరాలన్నీ అలా మన దేశంలో జరిగాయి. కొద్ది నెలల్లోనే వేర్వేరు ఆపరేటర్లు, వేర్వేరు పరికరాల ద్వారా చలనచిత్రాలు కలకత్తా, మద్రాసు, హైదరాబాద్ సహా మన దేశంలో అనేక ప్రాంతాలకు ప్రయాణించాయి.

అలా సినీ ప్రేక్షక వర్గం విస్తరించింది.

Lumiere Brothers లూమియర్ బ్రదర్స్

​భారత్‌లో ఆ తొలినాళ్ళ సినీకథ

1898 నాటికల్లా దేశంలోని ప్రసిద్ధ చారిత్రక కట్టడాలు, బజార్లు, ధార్మిక ఊరేగింపుల “అసాధారణ” దృశ్యాలు, రంగస్థల ప్రదర్శనల్లోని వివిధ దృశ్యాలను కెమెరాలోకి ఎక్కించడం మొదలైంది. ఆ సంవత్సరంలోనే ఇద్దరు భారతీయులు సినీ రంగంలో ప్రవేశించారు. వారే – బొంబాయికి చెందిన హెచ్.ఎస్. భట్వాడేకర్, కలకత్తాకు చెందిన హీరాలాల్ సేన్. ఇద్దరూ వృత్తిరీత్యా ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లే! ఇరువురూ ఫిల్మ్ ఎగ్జిబిషన్ వ్యాపారంలోకి ప్రవేశించారు. అచిరకాలంలోనే తమ సొంత సినిమాలు తీయడం, పంపిణీ చేయడం మొదలుపెట్టారు.

ఆ తర్వాత కొన్నేళ్ళకే జె.ఎఫ్. మదన్, అబ్దులాలీ యూసూఫలీలాంటి ఎగ్జిబిటర్లు తగినన్ని వనరులు సమకూర్చుకొని, దేశంలోని మరింత మూలనున్న ప్రాంతాలకు సైతం ఈ చలనచిత్ర ప్రదర్శనలను అందుబాటులోకి తెచ్చారు. 1907 తర్వాత దేశంలో టూరింగ్, పర్మనెంట్ సినిమా థియేటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆ క్రమంలోనే తమిళుడైన సామికన్ను విన్సెంట్, తెలుగువాడైన రఘుపతి వెంకయ్యనాయుడు సినీ ప్రదర్శనలు, ఆపైన థియేటర్లు – ఫిల్మ్ నిర్మాణం వగైరా సాగించి, దక్షిణాదిలో సినీ పితామహులయ్యారు.

మూకీల నుంచి టాకీల దాకా..

న్యూస్ రీల్ తరహా లఘు చిత్రాలను దాటి, తెరపై ఓ కథను చెప్పే ప్రయత్నం ఆ తర్వాత మొదలైంది. ప్రసిద్ధ మరాఠీ నాటకం ‘పుండలీక్‌’ను రంగస్థలంపై ప్రదర్శిస్తూ, యథాతథంగా కెమెరాకెక్కించే ప్రయత్నం 1912లో జరిగింది. బ్రిటీష్ కెమెరామన్‌ ఆ చిత్రీకరణ సాగించడంతో, ఆర్.జి. తోరణే తీసిన ఆ సినిమా తొలి భారతీయ ఫీచర్ ఫిల్మ్‌గా గుర్తింపు పొందలేకపోయింది. ఆ మరుసటేడే 1913లో దాదాసాహెబ్ ఫాల్కే తీసిన ‘రాజా హరిశ్చంద్ర’తో మనదేశంలో తొలిసారిగా కథాకథనాత్మక చిత్రాలు సంపూర్ణంగా మొదలయ్యాయి. దేశంలో సినీ పరిశ్రమకు బలంగా పునాది వేసి, ఫాల్కే భారతీయ సినీ పితామహుడయ్యారు. అక్కడ నుంచి బొంబాయి, పుణే, కొల్హాపూర్, కలకత్తా, మద్రాస్, హైదరాబాద్, బెంగళూరు.. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సినీ నిర్మాణం సాగింది. అన్నీ మాటలు లేని మూగ కథలే! మూకీల శకం తర్వాత 1931 నుంచి టాకీల యుగం. దాంతో, మాట, పాట కీలకమయ్యాయి. హిందుస్తానీ మొదలు తెలుగు, మరాఠీ, తమిళం... ఇలా వరుసగా అన్ని భాషల్లో టాకీలు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి దాకా మన సినిమా ఎన్నో మార్పులు చూసింది.

​ప్రతి ముప్పునూ దాటుకొని..

మానవ పరిణామక్రమంలో మారుతున్న టెక్నాలజీతో పాటు సినిమా కూడా మారుతూ వచ్చింది. మూకీలు, టాకీలు, బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్, సినిమాస్కోప్, త్రీడీ, ఐ-మ్యాక్స్, ఫిల్ము నుంచి డిజిటల్.. ఇలా ఎన్నో మార్పులు. మరోపక్క మనదేశంలోనే కాదు.. ప్రపంచమంతటా ఎప్పటికప్పుడు సినిమాల పని అయిపోయిందని చెబుతూనే ఉన్నారు. సినిమాను తలదన్నే వినోదాలు సవాలక్ష అందుబాటులోకి వచ్చినా, సినిమా మాత్రం నిటారుగా నిలిచింది. ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఎదిగింది. అలాంటి తెర మీది కదిలేబొమ్మ మన దేశానికి వచ్చి, జనజీవితంలో భాగమై, ఈ జులై 7కి 130 ఏళ్ళు నిండుతున్న వేళ సినిమాకు శతకోటి వందనాలు.

అప్పుడే బాక్సాఫీస్ రిపోర్ట్! కాస్ట్ ఫెయిల్యూర్!

సినిమాటోగ్రాఫ్ ప్రదర్శనల్ని తీసుకొచ్చిన సెస్టియర్ దంపతులు భారత్‌లో ఉన్న కాలమంతా దాదాపు వానలే. వర్షాల వల్ల కొన్ని కొన్ని రోజులైతే, ప్రదర్శనలకు అసలు జనమే రాలేదు. అయితేనేం, నెల గడిచేసరికల్లా ఆ షోలకు గణనీయమైన వ్యాపారమే జరిగింది. ఆ తొలి షోల టికెట్ రేట్ల వివరాలు చూస్తే.. వాట్సన్స్ హోటల్‌లో అంతా ఒకే తరగతి. రూపాయి టికెట్. అంటే, ఎన్ని రూపాయలు వసూలైతే, అంతమంది జనం చూసినట్టు! కానీ, నావెల్టీ థియేటర్‌లో ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు మాత్రం మూడు, నాలుగు వేర్వేరు తరగతులు, అందుకు తగ్గట్టే టికెట్ రేట్లు పెట్టారు. గమ్మత్తేమిటంటే, భారతదేశంలోని ఈ తొలి సినిమాటోగ్రాఫ్ షోలకు వచ్చిన మొత్తం ఆదాయం రూ. 3,362 కాగా, అయిన ఖర్చు ఏకంగా రూ. 5,723.25. అంటే, బొంబాయిలో ప్రదర్శనలు ముగిసే సమయానికి, వాటిని తీసుకొచ్చిన సెస్టియర్‌కు వచ్చిన ఆదాయం కన్నా 70 శాతం ఎక్కువ ఖర్చు అయింది. ఇవాళ్టి మాటల్లో చెప్పాలంటే, కాస్ట్ ఫెయిల్యూర్ అన్నమాట.

Dadasaheb-Phalke దాదాసాహెబ్ పాల్కే

రెండుసార్లు భూమిని చుట్టేంత రీళ్ళు

​మనదేశంలో 1913 నుంచి లెక్కవేస్తే.. ఆ తర్వాత తొమ్మిది దశాబ్దాల్లో అంటే 2003 నాటికి లఘు చిత్రాలతో కలిపి దాదాపు 33 వేల భారతీయ సినిమాలు రిలీజయ్యాయి. ఇప్పటికీ యాభై ఏళ్ళ క్రితం సరిగ్గా 1975లో దేశం ఏకంగా 431 ఫీచర్ ఫిల్ములు నిర్మించింది. జపాన్‌ను సైతం అధిగమించి, ప్రపంచంలోనే అతి పెద్ద సినీ నిర్మాణ దేశంగా అవతరించింది. అప్పటితో పోలిస్తే ఏటా వచ్చే సినిమాల సంఖ్య రెట్టింపైంది. ప్రపంచంలోని అనేక భారీ సినీ నిర్మాణ దేశాల కన్నా భారత్ మున్ముందుకు దూసుకుపోయింది. దేశంలో తయారైన సినిమాల తాలూకు రీళ్ళను అన్నింటినీ ఒకదానికొకటి జోడిస్తే, ఆ రీళ్ళ తాలూకు నిడివి ఏకంగా భూమధ్యరేఖ గుండా మన భూమిని ఏకంగా రెండుసార్లు చుట్టేసేంత ఉంటుందని ఓ లెక్క. అదీ 2000 ప్రథమార్ధం నాటి అంచనా. ఇక ఇప్పటి సంగతి వేరే చెప్పనక్కర లేదు.

రెంటాల జయదేవ,
జర్నలిస్ట్ – రచయిత,
rjayadev@yahoo.com


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్