ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపెద్దపులి.. పెద్ద సవాల్‌...

1 గంట క్రితం

nallamala tiger
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 08:29 పూర్వాహ్నం | 11 నిమిషాల చదవడం

పెద్దపులి కేవలం అందమైన జంతువే కాదు.. అది ఆరోగ్యకరమైన అటవీ పర్యావరణ వ్యవస్థకు ప్రతీక (indicator species). పులులు సురక్షితంగా ఉన్న అడవిలోనే జీవవైవిధ్యం వర్ధిల్లుతుంది. స్థానిక వాతావరణ సమతుల్యత కొనసాగుతుంది. పెద్దపులి పరుగులో మెరుపువేగం..నడకలో గాంభీర్యం.. కళ్లలో క్రౌర్యం.. ఆ రాజసమే వేరు. ఒక్కసారి గాండ్రించిందంటే అడవి అడవంతా చిన్నబోవాల్సిందే. మిగతా జంతువులు ఉలిక్కి పడాల్సిందే. ఇవన్నీ ఒక్క పులికే సొంతం. అంతటి ఠీవి ఉన్న పులి మనుగడ ప్రమాదపు అంచుల్లో ఉంది. పులి ప్రకృతిలో అత్యంత శక్తివంతమైన వేటగాడు. దాని నడకలో ఠీవీ. వేటలో చాకచక్యం అద్భుతం. అడవికి నిజమైన రాజు. వేటలో రారాజు. ఆ పులిని కాపాడుకోవడమే ఇప్పుడు నిజమైన సవాలు. క్రమంగా పులులు అంతరించిపోయే ప్రమాదముందని గమనించిన ప్రపంచ దేశాలు, వాటి సంరక్ష‍ణే ధ్యేయంగా ఏటేటా జులై 29న ప్రపంచ పులుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.

మనిషి కంటే కొన్ని వందల ఏళ్ల కిందటే భూమ్మీదకు వచ్చిన వన్యప్రాణుల్లో ఒకటి ‘‘పులి(Tiger)’’. ఫెలిడే (పిల్లి) కుటుంబంలో కెల్లా పులి అతి పెద్దది. అనేక అంతరించిపోయిన జాతులతో పాటు చిరుత, జాగ్వార్, మంచు చిరుత, సింహం, పులులు కూడా పాంథెరా ప్రజాతికి చెందినవే. లక్షల సంవత్సరాల క్రితం పాంథెరా పిల్లులు ఇతర పిల్లి జాతుల నుండి వేరుపడి, పులి, చిరుత, మంచు చిరుతగా పరిణామం చెందాయి. ప్రపంచంలో ఉన్న పులుల్లో మూడో వంతు భారతదేశంలోనే ఉండటం విశేషం. మనదేశ జాతీయ జంతువు కూడా. ఆత్మరక్షణ కోసం మాత్రమే పులి దాడి చేస్తుందని, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పులి ప్రవర్తన సాధారణం కంటే భిన్నంగా ఉంటుందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. పర్యావరణ సమతుల్యానికి జీవగర్ర ‘‘పులి’’. పులి ఆహారచక్రంలో నాలుగు కాళ్ల తో నడిచే జంతువును మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది. పులి పంజా చాలా పవర్ ఫుల్. ఒకసారి పులి పంజా విసిరితే దాని బలం ఒకటిన్నర టన్నుల వరకు ఉంటుందని అంచనా. అంతటి శక్తిమంతమైన పులి పంజాకు ఎదుటి జంతువు ఏదైనా చీలిపోవాల్సిందేనట. సింహంతో పోలిస్తే పులియే రాజసంగా ఉంటుందనేది కొందరి అభిప్రాయం. ఎందుకంటే సింహాల్లో మగ సింహానికి ఉండే జూలు, జుట్టు, నడుము అందంగా కనిపిస్తాయి. పులుల్లో ఆడైనా, మగైనా ఆ నడకలోనే రాజసం ఠీవీ కొట్టిచ్చినట్లు కనబడుతాయి. అందుకే జూలలో సైతం సందర్శకులు, జనం ఎక్కువ సేపు పులినే చూస్తుంటారు.

ప్రాజెక్టు టైగర్‌ స్ఫూర్తిదాయకం

మనదేశంలో పులుల సంరక్షణ ప్రపంచానికే ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణ. 1973లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ప్రారంభమైన "ప్రాజెక్ట్ టైగర్" ప్రపంచంలోనే అతిపెద్ద జాతుల సంరక్షణ కార్యక్రమాల్లో ఒకటిగా చరిత్ర సృష్టించింది. కేవలం 9 రిజర్వ్‌లతో మొదలైన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50కి పైగా టైగర్ రిజర్వ్‌లను కలిగి ఉంది.2006 నుంచి 2022 మధ్య భారత్‌లో పులుల సంఖ్య దాదాపు రెండున్నర రెట్లు పెరిగింది. వేలాది మంది అటవీ సిబ్బంది, శాస్త్రవేత్తలు, స్థానిక గిరిజన సమాజాల నిరంతర శ్రమ ఫలితమే ఇది. గణాంకాల ప్రకారం ప్రపంచంలోని మొత్తం అడవి పులుల్లో 70 శాతానికి పైగా మనదేశంలోనే నివసిస్తుండటంతో భారత్‌ను "పులుల రాజధాని"గా కూడా కొందరు పిలుస్తుంటారు. దేశంలో 2022 అఖిల భారత పులుల అంచనా ప్రకారం సగటున 3,682 పులులు ఉన్నట్లు అంచనా.

మనదేశంలో గత రెండు దశాబ్దాల గణాంకాలు ఇవే

సంవత్సరం దేశవ్యాప్త పులుల సంఖ్య (అంచనా)

2006 1,411

2010 1,706

2014 2,226

2018 2,967

2022 సుమారు 3,167 – 3,925 (సగటు అంచనా ~3,682)

​మధ్యప్రదేశ్ ("టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా" అనే బిరుదు కూడా దానిదే), కర్ణాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాలు అత్యధిక పులుల సంఖ్య కలిగిన రాష్ట్రాలుగా అగ్రస్థానంలో ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ ఈ జాబితాలో దిగువ స్థానాల్లోనే మిగిలిపోయింది. మనదేశంలో పులుల్లో చీతా, చిరుతపులి, పులి ఉన్నాయి.

నల్లమలే దేశంలోనే అతిపెద్ద పులుల ఇల్లు

ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించి ఉన్న నాగార్జున సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) మన దేశంలోనే అతిపెద్ద పులుల అభయారణ్యంగా నిలుస్తోంది. కర్నూలు, నంద్యాల, ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలో వ్యాపించి ఉన్న ఈ రిజర్వ్ 3,700 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంతో ఇది గోవా రాష్ట్ర విస్తీర్ణం కంటే ఎక్కువ. జాతీయ వన్యప్రాణి సంరక్షణ ప్రాధికార సంస్థ (NTCA) నిర్వహించే అఖిల భారత పులుల గణన ప్రతి నాలుగేళ్లకోసారి జరుగుతుంది. 2022 గణాంకాలు (2023లో విడుదల) ప్రకారం నల్లమల ప్రాంతంలో పులుల సంఖ్య గత దశాబ్దపు అత్యల్ప స్థాయి (5-8 మధ్య) నుంచి క్రమంగా కోలుకుని, ప్రస్తుతం సుమారు 20 స్థాయికి చేరినట్లు అంచనా. గత గణనతో పోలిస్తే దాదాపు రెట్టింపు వృద్ధి. అయినప్పటికీ, ఇంత భారీ విస్తీర్ణంతో పోలిస్తే ఈ సంఖ్య ఇప్పటికీ చాలా తక్కువగానే ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ లేదా కర్ణాటకలోని నాగర్‌హోల్ వంటి రిజర్వ్‌లతో పోలిస్తే ఇది చాలా స్వల్పం. ఆహారం లేకపోతే పులి ఉండదు. ఎర జంతువులు తగ్గిన అడవిలో పులి మనుగడ సాధించలేదు. అందుకే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతుంటాయి. కొన్ని చోట్ల జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా పరిస్థితి మారుతోంది. అటవీ శాఖ చేపట్టిన గ్రామాల స్వచ్ఛంద పునరావాస కార్యక్రమం, చుక్కల జింకల పునరుద్ధరణ ప్రాజెక్టులు, మెరుగైన నిఘా వ్యవస్థ (కెమెరా ట్రాప్‌లు, డ్రోన్ పహారా) పులుల సంఖ్య నెమ్మదిగానైనా పెరగడానికి దోహదపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొరుగున ఉన్న తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ తో నల్లమలను అనుసంధానం చేసి, దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పులుల కారిడార్‌గా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఉంది. ఈ రెండు రిజర్వ్‌లు కలిస్తే మొత్తం విస్తీర్ణం 5,000 చదరపు కిలోమీటర్లు దాటుతుంది. ఇది పులుల జన్యు వైవిధ్యానికి, దీర్ఘకాలిక మనుగడకు కీలకం కానుంది. అడవి దున్ననలను అడవుల్లో వదలటం ద్వారా పులికి మేతగా ఏర్పాటుచేస్తున్నారు. ఇలాంటి చర్యలు పులుల సంఖ్య పెరగటానికి దోహదపడుతుంది.

​వందేళ్ల కిందటి రాజసం నుంచి నేటి సంక్షోభం వరకు..

ఒకప్పుడు భారత ఉపఖండం అంతటా పులి రాజ్యమేలింది. 20వ శతాబ్దం ఆరంభంలో ప్రపంచవ్యాప్తంగా లక్ష దాటి ఉండే పులుల సంఖ్య, వేట, బ్రిటిష్ కాలంనాటి "షికార్" సంస్కృతి, అటవీ నరికివేత కారణంగా క్రమక్రమంగా కుప్పకూలింది. 2010 నాటికి ప్రపంచవ్యాప్తంగా అడవి పులుల సంఖ్య కేవలం 3,200కు పడిపోయింది. అంటే వందేళ్లలో 97 శాతం పులులు కనుమరుగయ్యాయి. ఈ భయానక వాస్తవాన్ని గ్రహించిన ప్రపంచ నాయకులు అదే ఏడాది రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో చారిత్రాత్మక "టైగర్ సమ్మిట్"ను నిర్వహించారు. పులులున్న 13 దేశాలైన భారత్, రష్యా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, చైనా, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్, వియత్నాం, లావోస్, కంబోడియా, మయన్మార్లు ఒక్కతాటిపైకి వచ్చి ఒక సాహసోపేతమైన లక్ష్యాన్ని ప్రకటించాయి. "Tx2" అంటే 2022 నాటికి ప్రపంచ పులుల సంఖ్యను రెట్టింపు చేయడం. ఈ లక్ష్యాన్ని ప్రపంచానికి గుర్తు చేయడానికే జూలై 29ను అంతర్జాతీయ పులుల దినోత్సవంగా నిర్ణయించాయి. ఆనాటి నుంచి ఈ రోజు కేవలం ఒక వేడుక కాదు. ఇది ఒక జాతి మనుగడ కోసం ప్రపంచం చేసుకున్న ప్రమాణం. పులుల సంరక్షణ కోసం ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థ.. గ్లోబల్ టైగర్ ఫోరం ప్రపంచ వ్యాప్తంగా పులుల సంఖ్యను పెంపొందించేందుకు కృషి చేస్తోంది. 2022 నాటికి పులుల సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించుకున్న ఈ సంస్థ.. మిగిలిన దేశాలను లక్ష్యం దిశగా సమాయత్తం చేస్తోంది. ప్రత్యేకించి భారత్ మిగిలిన దేశాలతో పోలిస్తే పులుల సంరక్షణలో ముందుంది.

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుదల

2006లో ఏర్పాటైన జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ-ఎన్‌టీసీఏ ఇప్పటికి 4 సార్లు దేశవ్యాప్తంగా వన్యప్రాణుల గణన చేపట్టింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే ఈ సంస్థ నాటి నుంచి దేశంలో పులుల సంరక్షణ కోసం కృషి చేస్తోంది. 2014లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో పులుల సంఖ్య 68 కాగా, 2018 నాటికి ఏపీ, తెలంగాణల్లో కలిపి వీటి సంఖ్య 74కు చేరింది.

డబ్బుల కోసమో, దర్పం కోసమో వేటాడే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఈ సరదా పులుల ప్రాణాలు తీస్తోంది. కొన్ని అటవీ ప్రాంతాల్లోనూ, గ్రామాల్లోనూ నివాసాలపై పులులు చేసే దాడులను నిలువరించటానికి వాటిని వేటాడుతున్నారు. ఒక్క ఏడాదిలో వేర్వేరు కారణాల వల్ల దేశంలో 100 పులులు మృత్యువాత పడ్డాయంటే పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సరిహద్దుల కోసం పులుల మధ్య ఘర్షణలు, ఇతరులు వాటిని వేటాడటం, ప్రమాదాలు, ప్రకృతివైపరీత్యాల కారణంగా పులులు మృత్యువాత పడినట్లు ఎన్‌టీసీఏ వెల్లడించిది.

అంతరించిపోతున్న జాతులు

పులుల్లో 41 రకాల ఉప జాతులున్నాయి. ప్రస్తుతం వాటిలో బెంగాల్ టైగర్, అమూర్‌ టైగర్, దక్షిణ చైనా, సుమత్రాన్, ఇండో చైనీస్, మలయన్ రకాల పులులు ఉన్నాయి. కెస్పియన్, జవాన్, బాలి అనే 3 రకాల పులులు ఇది వరకే అంతరించిపోయాయి. అంతరించిపోయే పరిస్థితిలో ఉన్న పులి జాతులు రక్షించుకోవడానికి ప్రపంచ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నా.. చాలా దేశాల్లో పులుల గణాంక వివరాలు లేకపోవటం సమస్యగా మారింది. పశ్చిమబంగ, బంగ్లాదేశ్‌ల్లో విస్తరించిన సుందర్‌బన్‌ అడవుల్లో జీవించే బెంగాల్‌ టైగర్లు బాగా ఫేమస్‌. వచ్చే 50 ఏళ్లలో కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

తగ్గిపోతున్న ఆయుష్షు

అడవిలో పులి ఆయుర్దాయం సాధారణంగా 10 నుంచి 15 ఏళ్లు ఉంటుంది. 10 ఏళ్లకు మించి బతుకుతున్నట్లుగా కనిపించడం లేదు. ప్రస్తుతం బతికి ఉన్న పులుల్లో ఎక్కువశాతం జంతు ప్రదర్శన శాలల్లోనే ఉన్నాయి. అడవుల్లో చాలా తక్కువగానే ఉంటున్నాయి. ఇందుకు కారణం వేట. కొందరు అక్రమార్కులు ఉచ్చులను ఏర్పాటు చేసి పులులను చంపేస్తుండటం బాధాకరం. గోళ్ల నుంచి చర్మం, ఎముకలు.. ఇలా అన్ని భాగాలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పెద్దపులి చర్మం, గోళ్లు, ఎముకలకు అంతర్జాతీయంగా గిరాకీ ఉందని సమాచారం. వేటలో గాయాలు, ఆహార కొరత, వృద్ధాప్యంతో తొందరగా చనిపోతాయి._ముసలితనం వచ్చే సరికి లేదా చివరి దశలో పులికి వేటాడే శక్తి తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉన్నప్పటి బరువుతో పోలిస్తే సుమారు 30 నుంచి 40 శాతం బరువు తగ్గి చిక్కి మరణిస్తాయి. జంతుప్రదర్శన శాలల్లో మంచి ఆహారం, ఆరోగ్యపరమైన వసతి సదుపాయాలు ఉండటంతో 20 ఏళ్ల వరకు బతికే అవకాశాలు ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు.

అడవుల పెంపుదలతోనే పులుల సంరక్ష‍ణ

ఒక్క పులిని కాపాడుకోవాలంటే 25 వేల ఎకరాల అడవి పరిరక్షించుకోవాల్సి ఉంటుందనేది శాస్త్రవేత్తలు అంచనావేశారు. అటవీ విస్తీర్ణం పెంచుకోవటమే తప్ప మరోమార్గం లేదని స్పష్టంచేస్తున్నారు. ఇలా చేస్తేనే అరుదైన పులి జాతులు సంరక్షించి భవిష్యత్‌ తరాలకు అందించే ఏకైక మార్గం. సంరక్షణ కేంద్రాల్లోని పులులకూ భద్రత కూడా కరువవుతోందని గత 13 సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. వరల్డ్ యానిమల్ డే చట్టం ప్రకారం జంతువుల ఆకలి, దాహాలు తీర్చాలి. ఎలాంటి బాధ,అసౌకర్యం కలిగించకూడదు. వ్యాధులు గాయాల నుంచి కాపాడాలి. ఇవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి తప్ప.. క్షేత్రస్థాయిలో ఆచరణ కావటం లేదు. కేంద్రం వన్యప్రాణి సంరక్షణ చట్టానికి 2006లో సవరణ తెచ్చి, జాతీయ పులుల ప్రాధికార సంస్థ ఏర్పాటు చేసింది. పులుల్ని వేటాడే వారికి కఠిన శిక్షలు పడేలా చట్టాలు తెచ్చింది. వాటి సంరక్షణ కోసం భారీగా ఖర్చు చేస్తోంది. కానీ ఆచరణలో వైఫల్యాలు కొనసాగుతున్నాయి. సరైన సిబ్బంది లేకపోవటం, పులుల రక్ష‍ణ చర్యలు సరిగ్గా కొనసాగకపోవటం, అవసరమైన అడవులు పూరిస్థాయిలో అందుబాటులో లేకపోవటం కూడా కారణాలుగా ఉన్నాయి.

అమ్మ ప్రేమకు ప్రతిరూపంగా...: ఒక ఆడపులి గర్భధారణ కాలం సుమారు 93 నుంచి 112 రోజులు. డెలివరీ టైమ్ రాగానే.. మగ పులికి, ఇతర జంతువులకు దూరంగా దట్టమైన పొదలు లేదా గుహల్లోకి వెళ్లిపోతుంది. ఒకసారికి 2 నుంచి 4 పిల్లలకు జన్మనిస్తుంది. పుట్టినప్పుడు వీటి బరువు కేవలం 750 గ్రాముల నుంచి1.5 కిలోలు మాత్రమే ఉంటాయి. చాలా బలహీనంగా ఉండి కళ్లు కూడా తెరవలేవు. సుమారు 6 నుంచి14 రోజుల తర్వాతే _లోకాన్ని చూస్తాయి. తల్లి వాటిని కంటికి రెప్పలా కాపాడుతుంది. మగ పులులు పిల్లలను చంపే ప్రమాదం ఉండటంతో నిత్యం నివాసాలను మారుస్తూ పిల్లలను మెడ పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది._6 నెలలు పిల్లలు పూర్తిగా తల్లిపాల మీదే ఆధారపడతాయి. 6 నెలల తర్వాత పిల్లలను తల్లి వేటకు తీసుకెళ్తుంది. ఆకులు కదలకుండా నడవడం.. గాలి శబ్దాన్ని బట్టి జంతువును పసిగట్టడం తల్లిని చూసి నేర్చుకుంటాయి. పిల్లలకు10 నెలల వయసు వచ్చాక తల్లి పులి గాయపడిన జంతువును చంపకుండా పిల్లల ముందు వదిలేస్తుంది. దాన్ని ఎలా చంపాలో పులి పిల్లలే ప్రయత్నించి నేర్చుకోవాలి. 2 ఏళ్లు వచ్చేసరికి వేటలో నైపుణ్యం సాధిస్తాయి.

మెరుపు వేగం

పులి ఒక్క గెంతులో 16 అడుగుల ఎత్తు ఎగురుతుంది. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. పూర్తిగా ఎదిగిన మగ పులి సుమారు 200 నుంచి 300 కిలోల బరువు ఉంటుంది. ఆడపులి మాత్రం మగదానితో పోలిస్తే కాస్త తక్కువగా100 నుంచి 170 కిలోల వరకు ఉంటుంది.   ఒక పులి తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి రోజుకు 10 నుంచి 20 కిలోమీటర్లు నడుస్తుంది. ఆకలి ఉన్నప్పుడు.. జంతువు కోసం వేటాడే క్రమంలో ఒక్కోసారి 50 నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. పులి వెనుక కాళ్లలో బలం ఎక్కువ. నిలువుగా సుమారు 5 మీటర్లు ఎత్తు ఎగురుతుంది. అడ్డంగా అయితే 10 మీటర్ల (32 అడుగులు) దూరం గెంతుతుంది. పులి గాండ్రిస్తే సుమారు 3 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. అద్భుతంగా
త   : పులి దవడల్లో ఉండే 4 అంగుళాల కోర పళ్లు ఎంతటి గట్టి ఎముకనైనా కొరికేస్తాయి. పెద్ద పులి బాగా ఆకలితో ఉంటే.. ఒక్కసారి కూర్చుంటే సుమారు 18 నుంచి 25 కిలోలకుపైగా మాంసాన్ని తింటుంది. వారానికి ఒక్కసారే పెద్ద జంతువును తిన్న తర్వాత మళ్లీ వేటాడటానికి 5 నుంచి 7 రోజులు విరామం తీసుకుంటుంది. 10 సార్లు వేట ప్రయత్నాలు చేస్తే పులికి వేట చిక్కే అవకాశం ఒకసారి మాత్రమే ఉంటుందని సమాచారం. బాగా ఆకలితో ఉన్నప్పుడు ఏదైనా జంతువు తారసపడితే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదలబోదు. నీటిలో పులి అద్భుతంగా ఈత కొడతుంది. నదిని దాటడానికి 6 నుంచి 20 కిలోమీటర్ల దూరమైనా ఈదుకుంటూ వెళ్తుంది. మాంసం తిన్న వెంటనే పులికి విపరీతమైన దాహం వేస్తుంది. తిన్న మాంసం అరగడానికి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే, వేట తర్వాత నీటి కొలను వైపు వెళ్తుంది. వాతావరణాన్ని బట్టి రోజుకు10 నుంచి 20 లీటర్ల నీటిని తాగుతుంది. 

జనారణ్యంలోకి ....

దట్టమైన అడవుల్లో అడుగుజాడలు కన్పించకుండా, గోప్యంగా ఉండే పులులు, జనారణ్యంలో అలజడి రేపుతున్నాయి. పులుల సంతతి పెంచుకునే క్రమంలో తోడు వెతుక్కుంటూ కొన్ని పులులు దారితప్పి గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. మరికొన్ని పులులకు అడవుల్లో మేత దొరకకపోగా... ఆకలితో అలమటిస్తూ గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. పొలాల్లో మేతకు వచ్చే పశువులను తింటున్నాయి. మొత్తంగా అరణ్యం నుంచి జనారణ్యంలోకి పులులు రావడంతో అడవులకు సమీపంలోని కొన్ని గ్రామాల్లో అలజడి రేగుతోంది. పాపికొండల నేషనల్‌ పార్కులో జీవనం సాగిస్తున్న వన్య ప్రాణులకు స్వేచ్ఛా భంగం కలుగుతుండడంతో జనావాస ప్రాంతాల్లోకి చొరబడుతున్నాయి. కొన్ని తిరిగి అడవిలోకి వెళుతుండగా, మరికొన్ని వేటగాళ్ల ఉచ్చులకు, తుపాకీల తూటాలకు, రోడ్డు ప్రమాదాలకు, విద్యుదాఘాతాలకు బలౌవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు 23 గిరిజన గ్రామాలు ప్రాజెక్టు ఎగువన 160.16 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండేది. ప్రాజెక్టు నిర్మాణానంతరం గ్రామాల తరలింపు తర్వాత అటవీ విస్తీర్ణం పెరగడంతో పాటు గోదావరి తీరం వెంబడి అడవులు వన్యప్రాణులకు ఆహారం దొరుకుతుండడంతో వాటి సంతతి గణనీయంగా పెరిగింది. పాపికొండల అడవుల్లో పులులు, చిరుతలు కూడా ఉన్నాయి. బుట్టాయిగూడెం, కోయలగూడెం అడవుల్లో సంచారం ఉన్నట్లుగా సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో పెద్దపులులు ప్రధానంగా నల్లమల అటవీ ప్రాంతంలో (కర్నూలు, నంద్యాల, ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో విస్తరించి ఉంది) సంచరిస్తాయి. గోదావరి పరివాహక ప్రాంతాలు, పాపికొండలు, ఉత్తరాంధ్ర జిల్లాల సరిహద్దుల్లో కూడా అప్పుడప్పుడు పులుల సంచారం కనిపిస్తోంది. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) భారతదేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం. శ్రీశైలం, ఆత్మకూరు, నంద్యాల, మార్కాపురం అడవుల్లో పులులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని పాపికొండలు అటవీ ప్రాంతంలో కూడా పులుల కదలికలు నమోదయ్యాయి. ఏలేరు - అన్నవరం పరిసరాల్లోని కాకినాడ, ఏలూరు జిల్లాల్లోని ఏలేరు రిజర్వాయర్, ప్రత్తిపాడు, బౌరువాక, అన్నవరం అటవీ ప్రాంతాల్లో పులుల సంచారం గుర్తించి అటవీ శాఖ అధికారులు స్థానికులను అప్రమత్తం చేస్తుంటారు. అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో, ముఖ్యంగా నల్లమల పరిసరాలు, పాపికొండల అడవుల గుండా ప్రయాణించేటప్పుడు అటవీశాఖ నిబంధనలను పాటించాలి. పులుల కదలికలు, రక్షణ చర్యల గురించిన తాజా సమాచారం కోసం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించటం ద్వారా తెలుసుకోవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా...

ఇండోనేషియాలోని బాలి దీవిలో ఒకప్పుడు తిరుగాడిన బాలి టైగర్, జావా దీవిలో జావా టైగర్, ఈ రెండు జాతులు పూర్తిగా అంతరించిపోయాయి. కంబోడియా, వియత్నాం, లావోస్ దేశాల్లో అడవి పులులు ఇప్పటికే "functionally extinct"(ఆచరణాత్మకంగా అంతరించినవి) గా ప్రకటించబడ్డాయి. అంటే ఆ అడవుల్లో ఇక పులి అడుగుజాడ కనిపించదు. 2010లో 3,200గా ఉన్న ప్రపంచ పులుల సంఖ్య ప్రస్తుతం 5,500కు పైగా పెరగడం "Tx2" లక్ష్యం దిశగా నిజంగా అభినందనీయమైన ముందడుగు. నేపాల్ ఈ విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. స్థానిక సమాజాల భాగస్వామ్యంతో, కఠినమైన వేట వ్యతిరేక చట్టాలతో తన పులుల సంఖ్యను గత దశాబ్దంలో దాదాపు రెట్టింపు చేసుకుంది. రష్యాలోని సైబీరియన్ టైగర్ (అము టైగర్), ఇండోనేషియాలోని సుమత్రన్ టైగర్ ఇప్పటికీ తీవ్ర ప్రమాదపు అంచున ఉన్నాయి. వాతావరణ మార్పు, పామాయిల్ తోటల విస్తరణ కోసం జరిగే అటవీ నరికివేత వీటి మనుగడకు పెద్ద సవాళ్లు విసురుతున్నాయి.

​కేరళలో ఎల్‌డిఎఫ్‌ ఆదర్శం

పులుల సంరక్షణకు, మానవ-వన్యప్రాణుల సంఘర్షణలను తగ్గించడానికి గతంలోని కేరళ ఎల్‌డిఎఫ్ (LDF) ప్రభుత్వం అనేక పగడ్బందీ చర్యలను చేపట్టింది.మానవ ఆవాసాలకు ప్రమాదకరంగా మారిన పులులు, చిరుతపులులను సురక్షితమైన దట్టమైన అడవుల్లోకి వేగంగా రవాణా చేయడానికి భారతీయ వైమానిక దళ (IAF) హెలికాప్టర్లను ఉపయోగించే వినూత్న ప్రతిపాదనను చేసింది. పులుల కదలికలను నిరంతరం పర్యవేక్షించడానికి స్థానికులతో కూడిన ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు, రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను (RRT) ఏర్పాటు చేసింది. జనావాసాల వైపు వస్తున్నప్పుడు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి ట్రాప్ కెమెరాలు, ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలను వినియోగించింది. పులుల దాడిలో పశువులు మరణిస్తే లేదా పంటలు నష్టపోతే బాధితులకు వెంటనే ఎక్స్‌గ్రేషియా, నష్టపరిహారం చెల్లించే విధానాన్ని అమలు చేసింది.

ఎన్‌టిసిఎ గణాంకాల ప్రకారం

భారతదేశంలోని ప్రతి పులి మరణ సంఘటన వివరాలను జాతీయ వన్యప్రాణి సంరక్షణ ప్రాధికార సంస్థ (NTCA) నిర్వహిస్తూ వస్తోంది. పులి మరణాల కేసుల్లో 72.6 శాతం కేసులు పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మూసివేయబడ్డాయి. 27.4 శాతం కేసులు పరిశీలనలో పెండింగ్‌లో ఉన్నాయి. పులి మరణాలు సంభవించిన ప్రదేశం ఆధారంగా, 2012-2025 మధ్యకాలంలోని మరణాల డేటాను మూడు విభాగాలుగా విభజించారు. అవి: పులి సంరక్షణ కేంద్రం లోపల, వెలుపల జరిగిన సంఘటనలు, పులి చర్మం, ఎముకల స్వాధీనం. మొత్తం 1581 పులి మరణ 9సంఘటనల్లో 52.5 శాతం (పులి మరణాలు) పులి సంరక్షణ కేంద్రాల లోపలే జరిగాయి. 47.5 శాతం పులి సంరక్షణ కేంద్రాల సరిహద్దుల వెలుపల నమోదయ్యాయి.

tiger 1

tiger 2

మన బాధ్యత

పులులను కాపాడటం అంటే కేవలం ఒక జంతువును రక్షించడం కాదు. అడవులు, జీవవైవిధ్యం, నీటి వనరులు, పర్యావరణ సమతుల్యతను సంరక్షించడం కూడా. ప్రభుత్వం, అటవీ శాఖ, స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రతి పౌరుడు కలిసి పనిచేస్తేనే భావితరాలకు పులులను సురక్షితంగా అందించగలం.

నాలుగేళ్లకు ఒకసారి గణన

మనదేశంలో నాలుగేళ్లకోసారి పులులను లెక్కిస్తుంటారు. సుమారు ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ గణన సాగుతుంది. ఐదు పద్దతుల్లో వీటి గణాంకాల సేకరణ జరుగుతుంది. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ)లోనూ డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి పులుల సంఖ్యతోపాటు వాటి ఆరోగ్య పరిస్థితిని గుర్తిస్తారు.

జీవవైవిధ్యంలో ప్రతీ జీవి కీలకమే. తనకంటూ ఓ ప్రత్యేకత కలిగి.. ప్రకృతి సమతుల్యత కీలక పాత్ర పోషించే జీవరాశులను కాపాడుకోలేకపోతే మానవాళికే నష్టం.



-యడవల్లి శ్రీనివాసరావు
9490099214

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్