mh ad
ఆదివారం, 28 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రజాస్వామ్యం.. స్వేచ్ఛ.. మానవహక్కుల పరిరక్షణ!

1 గంట క్రితం

sneha cover
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 08:13 పూర్వాహ్నం | 7 నిమిషాల చదవడం

చట్టాల రూపకల్పన ద్వారా మానవ హక్కులను రక్షించడంలో, పౌరుల స్వేచ్ఛను కాపాడటంలో పార్లమెంట్ల బాధ్యత అత్యంత కీలకం. ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా పార్లమెంట్లు మరింత పారదర్శకంగా పనిచేయాలి. చట్టసభల్లో మహిళ, యువ ప్రతినిధుల సంఖ్యను పెంచాలి. ప్రజలకు మరింత చేరువ కావడానికి ఆధునిక డిజిటల్ సాంకేతికతలను పార్లమెంటరీ వ్యవస్థల్లో ఉపయోగించాలి. ఇవన్నీ సక్రమంగా జరిగేందుకు.. జవాబుదారీతనంగా పార్లమెంట్లు పనిచేయాలి. ఇందుకోసం ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ల ప్రాధాన్యతను గుర్తించడానికి, చట్టసభల పనితీరును మెరుగుపరచడానికి ప్రపంచ వ్యాప్తంగా జూన్ 30న అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవం కేటాయించారు.ఈ ఏడాది‘‘మానవహక్కులకు పెద్ద పీట వేయడం’’ ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా భారతదేశంలో పరిస్థితులను, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు, తదితర వివరాలతో ఈ కథనం.


ఇంటర్‌-పార్లమెంటరీ యూనియన్‌ 1889లో పారిస్‌‌లో ఏర్పడినది. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌ ‌దేశం జెనీవాలో ఉన్నది. దీనిలో 180 దేశాల జాతీయ పార్లమెంట్లు + 15 అసోసియేట్‌ ‌సభ్యులు ఉంటారు. పార్లమెంట్ల మధ్య సహకారం, ప్రజాస్వామ్య బలోపేతం, శాంతి, మానవహక్కుల పరిరక్షణ దీని లక్ష్యాలు. ఇంటర్‌ - పార్లమెంటరీ యూనియన్‌ ‌సమావేశాలు సంవత్సరానికి రెండుసార్లు జరుగుతాయి. 2026 అక్టోబర్‌ 5 ‌నుంచి 9 వరకు ఇంటర్‌ - పార్లమెంటరీ సమావేశాలు టాంజానియాలో జరుగుతాయి. భారతదేశం 1949 నుండి దీనిలో సభ్యురాలిగా ఉన్నది. లోక్‌‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్ల ఆధ్వర్యంలో ప్రతినిధి వర్గాలు వెళతాయి.

​భారత రాజ్యాంగం - పార్లమెంటరీ ప్రజాస్వామ్యం..

భారత రాజ్యాంగ పరిషత్‌ 1949 ‌నవంబర్‌ 26న రాజ్యాంగాన్ని ఆమోదించినది. రాజ్యాంగం భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాన్ని ప్రవేశపెట్టినది. పార్లమెంట్‌ అనగా రాజ్యసభ, లోక్‌‌సభలను జాతీయ చట్టసభలుగా ప్రకటించినది. లోక్‌‌సభకు 1952లో తొలి సాధారణ ఎన్నికలు జరిగి, ఇప్పటిరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నది.

prabeer

​ప్రజాస్వామ్యానికి సవాళ్లు..

భారతదేశంలో రాజ్యాంగం ప్రజాస్వామ్యవ్యవస్థను ప్రవేశపెట్టినది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థతో పాటు పౌరులకు భావ ప్రకటనా స్వేచ్ఛ అవసరం. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 19(1)(ఎ) పౌరులకు హక్కులను, భావప్రకటనా స్వేచ్ఛకు కల్పించినది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా పౌరుల భావ ప్రటకనా స్వేచ్ఛ అణచివేయబడుతున్నది. గౌరీ లంకేష్‌, నరేంద్ర దభోల్కర్‌, గోవింద పన్సారీ, కల్బుర్గి మొదలైన సామాజిక కార్యకర్తలు, సాహితీవేత్తలు హత్య చేయబడ్డారు. ‘‘ఉపా’’ చట్టం కింద వేలాదిమంది విచారణ లేకుండా, బెయిల్‌ ‌లేకుండా జైళ్లలో మగ్గుతున్నారు. జె.ఎన్‌.యు. విద్యార్థి ఉమర్‌ ‌ఖలీద్‌ ను అన్యాయంగా 2020 నుండి జైలులో బెయిలు లేకుండా ఖైదీగా ఉన్నారు. న్యూస్‌‌క్లిక్‌ ‌పోర్టల్‌ ‌వ్యవస్థాపకుడు ప్రబీర్‌ ‌పుర్కాయస్థ 2023లో అరెస్ట్‌ ‌చేయబడి 226 రోజుల పాటు జైలులో ఉన్నారు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు పురకాయస్థపై పెట్టిన కేసులన్నింటినీ కొట్టి వేసినది. ఆయనను 226 రోజుల పాటు జైలులో ఉంచడం అన్యాయమే కదా? అని నిపుణులు ప్రశ్నించారు. ప్రజలకు స్వేచ్ఛాయుత వాతావరణం లేకుండా ప్రజాస్వామ్యం ఎలా మనుగడ సాగిస్తుంది అని పౌర సమాజం ప్రశ్నిస్తున్నది.

ఎన్నికల విధానంలో లోపాలు - సంస్కరణలు

ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణం వంటివి. ప్రపంచంలో ఎక్కువ దేశాలలో ఎన్నికల విధానంలో ‘నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి’ (proportional Represention) అనుసరిస్తున్నారు. దీనిలో పార్టీలకు ఎన్నికలలో వచ్చే ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు కేటాయిస్తున్నారు. కానీ మనదేశంలో ఎన్నికల విధానం లోపభూయిష్టమైనది. పార్టీలకు వచ్చే ఓట్ల శాతానికి, సీట్ల సంఖ్యకు సంబంధం ఉండదు. భారతదేశంలో 50 శాతం ఓట్లు పొంది అధికారంలోకి వచ్చిన పార్టీల సంఖ్య చాలా తక్కువ. గత మూడు సాధారణ ఎన్నికలలో అనగా 2014, 2019, 2024 ఎన్నికలలో కేంద్రంలో బి.జె.పి. అధికారంలోకి వచ్చినప్పటికి దానికి వచ్చిన ఓట్ల శాతం ఎప్పుడూ 40 శాతం కంటే తక్కువే. ఆంధ్రప్రదేశ్‌‌లో 2019లో వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి 151 సీట్లు రాగా, తెలుగుదేశానికి సుమారు 40 శాతం ఓట్లు వచ్చినప్పటికి సీట్లు 23 మ్రాతమే వచ్చాయి. 2024 ఎన్నికలలో కూటమి పార్టీలకు 164 సీట్లు రాగా, వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి 39 శాతం ఓట్లు వచ్చినప్పటికి 11 సీట్లు మాత్రమే వచ్చాయి.

152ipu-1782280674887-4486.jpg

జాతీయ ఎన్నికల కమిషన్‌ -‘సర్‌’

భారత రాజ్యాంగం జాతీయ ఎన్నికల కమిషన్‌‌ను ఆర్టికల్‌ 324 ప్రకారం జాతీయ ఎన్నికల కమిషన్‌‌ను ఏర్పాటు చేసినది. ఎన్నికల కమిషన్‌ ‌లోక్‌‌సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, శాసనసభ, శాసనమండలి ఎన్నికలు నిర్వహించటమేకాక, ఓటర్ల జాబితాలను రూపొందిస్తుంది. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్‌‌పై ఉన్నది. సుకుమార్‌‌సేన్‌, టి.ఎన్‌.శేషన్‌, వై.ఖుర్‌‌షీ వంటివారు తమ బాధ్యతలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించారు. 2023లో మోడీ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ల నియామక విధానంలో మార్పులు తెచ్చినది. ఎన్నికల కమిషనర్ల పేర్లను సిఫార్సు చేసే కమిటీలో ప్రధానమంత్రి, సుప్రీంకోర్ట్‌ ‌ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు ఉండేవారు. మోడీ ప్రభుత్వం సవరణ ద్వారా దానిని ప్రధానమంత్రి, కేంద్రమంత్రి, ప్రతిపక్షనాయకుడిగా మార్చారు. ఎన్నికల కమిషన్‌‌లో కమిషనర్ల నియామకాలు తమ ఇష్టానుసారం చేసేవిధంగా నిబంధనలు మార్చారు. ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషన్‌ ‌జ్ఞానేష్‌‌కుమార్‌ ‌పూర్తిగా కేంద్రప్రభుత్వ ఏజెంట్‌‌గా వ్యవహరిస్తున్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. దీనిలో భాగంగా 2025 నుండి ఓటర్ల జాబితాల తయారీకి ‘సర్‌’ అనగా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ విధానం ప్రవేశపెట్టారు. ఓటర్లుగా గుర్తించాలంటే ఆధారకార్డు, రేషన్‌‌కార్డులు కాకుండా పౌరసత్వ గుర్తింపుకు అవసరమయ్యే గుర్తింపుపత్రాలను ప్రవేశపెట్టారు. బీహార్‌‌లో ‘సర్‌’ అమలు జరిపి సుమారు 60 లక్షల ఓట్లు అనగా 7.7 శాతం ఓట్లను తొలగించారు. బెంగాల్‌‌లో 40 లక్షలకు పైగా ఓట్లు తొలగించారు. ఓట్లు తొలగించబిన వారిలో ఎక్కువ భాగం మైనారిటీలు, దళితులు, వలస కార్మికులు ఉన్నారు. రెండు రాష్ట్రాలలో ‘సర్‌’ అమలు చేయటం వలన ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఇప్పుడు దాదాపు 16 రాష్ట్రాలలో ‘సర్‌’ అమలుచేస్తున్నారు. రాబోయే కాలంలో ‘ప్రజాస్వామ్యంలో ఓటర్ల ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కానీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఓటర్లను ఎన్నుకుంటుంది’’ అని చెప్పారు. భవిష్యత్‌‌లో భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాద ఘంటికలు ఎదుర్కొంటుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.


జమిలి ఎన్నికలు..

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, సమాఖ్య విధానానికి జమిలి ఎన్నికలు ప్రమాదకరంగా మారబోతున్నాయి. కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంటే, రాష్ట్రాలలో భిన్నమైన పార్టీలు ఉండటం సహజమైన విషయం. భారతదేశంలో కేంద్రంలో, అన్ని రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నరేంద్రమోడీ ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నది. దీనికోసం మాజీ రాష్ట్రపతి రామనాధ్‌ ‌కోవింద్‌ ఆధ్వర్యంలో నియమించిన కమిటీ అనేక సిఫార్సులు చేసినది. రాజ్యాంగ సవరణలు చేసి జమిలి ఎన్నికలు ప్రవేశపెట్టాలని మోడీ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. 2034 నాటికి జమిలి ఎన్నికలు పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నది.

political partys

​సిద్ధాంత రాహిత్యంతో రాజకీయ పార్టీలు..

ప్రజాస్వామ్యం, ఎన్నికలు రాజకీయ పార్టీలతో అనుసంధానమై ఉంటాయి. ఆధునిక ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు కీలకపాత్ర పోషిస్తాయి. కానీ 1950 నుండి 70 వరకు రాజకీయ పార్టీలు కొంతవరకు సిద్ధాంతాలపై ఆధారపడి పనిచేశాయి. పార్టీల నుండి బయటకు వెళ్లినవారు సిద్ధాంత అభిప్రాయబేధాలతో వెళ్లేవారు. కానీ తరువాత కాలంలో ప్రయోజనాలకోసమే పార్టీలు మారటం ప్రారంభించారు. 1967లో ‘ఆయారాం, గయారాం’ అనే ఇద్దరు శాసనసభ్యులు 48 గంటలలో ఆరుసార్లు పార్టీలు మారారు. అప్పటి నుండి పార్టీ ఫిరాయింపుదారులను ‘ఆయారాం, గయారాం’ అని పిలుస్తున్నారు.

ప్రస్తుతకాలంలో ‘క్రోనీ కాపిటలిజం’ అనగా రాజకీయాలు, వ్యాపార సంబంధాలు పెనవేసుకుపోయాయి. నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రస్తుత కాలంలో తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను చీల్చటం, ఫిరాయింపులను ప్రోత్సహించటం నిత్యకృత్యంగా మారాయి. ఇటీవల ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బి.జె.పి.లో చేరారు. బెంగాల్‌‌లో తృణమూల్‌‌లో కాంగ్రెస్‌ ‌నుండి ఎన్నికలయిన నెలరోజులలోనే 60 మంది శాసనసభ్యులు, 20 మంది లోక్‌‌సభ సభ్యులు ప్రత్యేక గ్రూపులుగా గుర్తింపు పొందారు. మహారాష్ట్రలో ఆరుగురు లోక్‌సభ సభ్యులు శివసేన నుండి ఏక్‌‌నాథ్‌‌షిండే అసలైన శివసేనలో చేరారు. త్వరలో సమాజ్‌‌వాద్‌ ‌పార్టీ నుండి కూడా 20 మంది లోక్‌‌సభ సభ్యులు పార్టీ మారవచ్చని విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. పై చీలికలు, ఫిరాయింపులు అన్నీ కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే జరుగుతున్నాయని జగమెరిగిన సత్యం. 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం చేశారు. ఈ చట్టంలో లోపాల వలన గత 40 ఏళ్లలో ఈ చట్టం పార్టీ ఫిరాయింపులు నిరోధించటానికి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఈ ఫిరాయింపులు, చీలికలు ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు విముఖత కలిగించే అవకాశం ఉన్నది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సమూలంగా మార్చవలసిన అవసరమున్నది.

మానవహక్కులు - పరిరక్షణ

ఈ సంవత్సరం ఇంటర్‌ - పార్లమెంటరీ యూనియన్‌ ‌థీమ్ గా ‘మానవహక్కులు’ నిర్ణయించబడినది. 1948 డిసెంబర్‌ 10‌న ఐక్యరాజ్యసమితి ‘ప్రపంచ మానవహక్కుల ప్రకటన’ చేసినది. ఆ ప్రకటనలో రాజ్యాలు గౌరవించవలసిన మానవహక్కులను గుర్తించినది. సమకాలీన ప్రపంచంలో అనేక దేశాలలో మానవహక్కుల అణచివేత జరుగుతున్నది. అనేక ఆఫ్రికా దేశాలు, ఆసియా, దక్షిణ అమెరికా దేశాలలో నియంతృత్వ ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయి. భారతదేశంలో ప్రజాస్వామ్యవ్యవస్థ కొనసాగుతున్నది అని చెప్పినప్పటికీ ఆచరణలో మానవహక్కుల ఉల్లంఘటన తీవ్రంగా జరుగుతున్నది. పత్రికా స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. రాజ్యం అణచివేత కొనసాగుతున్నది. జాతీయ మానవహక్కుల కమిషన్‌, రాష్ట్రాల మానవహక్కుల కమిషన్‌లు ప్రజల హక్కులు కాపాడటంలో విఫలం చెందుతున్నాయి. మోడీ ప్రభుత్వం రకరకాల ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా రాజకీయంగా ప్రత్యర్థులను అణచివేతకు గురిచేస్తున్నది.

israelpalestomewar

పాలస్తీనాలో మానవహక్కుల హననం..

ఇంటర్‌ ‌పార్లమెంటరీ యూనియన్‌ ‌సమావేశాలలో గాజాలో జరిగిన నరమేధం గురించి, పాలస్తీనా ప్రజల హక్కుల గురించి చర్చించాలి. మొదటి ప్రపంచయుద్ధం తరువాత ప్రపంచపటంలో పాలస్తీనా ఉన్నది. ఇజ్రాయిల్‌ అనే దేశం ఉనికిలో లేదు. బ్రిటీష్‌ ‌సామ్రాజ్యవాద పన్నాగాల ఫలితంగా ఎక్కడెక్కడో ఉన్న లక్షలాది మంది యూదులు పాలస్తీనా ప్రాంతాలకు వచ్చి స్థిరపడటం జరిగినది. 1948లో యూదులతో ఇజ్రాయిల్‌ ఏర్పడినది. తదనంతరం జరిగిన పరిణామాలలో పాలస్తీనా ప్రాంతాలను ఇజ్రాయిల్‌ ఆక్రమించినది. ఇప్పుడు జెరూసలెం, వెస్ట్‌‌బ్యాంక్, గాజాలో కొంతభాగం మొదలైనవన్నీ ఇజ్రాయిల్‌ ఆధీనంలో ఉన్నాయి. పాలస్తీనా భూభాగాలను పూర్తిగా ఆక్రమించి ‘‘గ్రేటర్‌ ఇజ్రాయిల్‌’’ ఏర్పాటు చేస్తామని ఇజ్రాయిల్‌ ‌ప్రధానమంత్రి బెజమిన్‌ ‌నెతన్యాహు బహిరంగంగా ప్రకటించారు. గాజా ప్రాంతంలో ఇజ్రాయిల్‌ ‌దాడులకు మహిళలు, పిల్లలతో సహా ఇప్పటికి 70 వేల మందికి పైగా మరణించారు. పాలస్తీనా దేశాన్ని ఇండియాతో సహా యుఎన్‌ఓలోని 150 దేశాలకు పైగా గుర్తించాయి. అయినప్పటికీ పాలస్తీనా రాజ్యం ఏర్పడలేదు. అమెరికా అండదండలతోనే ఇజ్రాయిల్‌ ‌పాలస్తీనా జాతిని నిర్మూలించడానికి ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలో పాలస్తీనా ప్రజల హక్కులను, రాజ్య ఏర్పాటును ప్రపంచమంతా సమర్ధించాలి.

hq720-1782280674887-1908.jpg

ఇరాన్‌‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ ‌దాడి

ఇరాన్‌‌పై 2026, ఫిబ్రవరి 28న ఇరాన్‌‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ ‌ప్రారంభించిన యుద్ధం ప్రపంచమంతా గర్హించినది, ఖండించినది. దాడిలో నాలుగు వేల మందికిపైగా ఇరానీ ప్రజలు మరణించారు. వేలాదిమంది గాయపడ్డారు. 240కి పైగా వైద్య, ఆరోగ్య కేంద్రాలు శిధిలమైపోయాయి. 50కి పైగా మ్యూజియంలు దెబ్బతిన్నాయి. 20కి పైగా పాఠశాలలు నేలమట్టమైపోయాయి. ఇరాన్‌‌లో ఖమైనీతో పాటు అనేకమంది ప్రముఖ నాయకులు మరణించారు. ఒక స్కూల్‌‌పై ప్రయోగించిన క్షిపణిలో 160 మందికి పైగా బాలికలు మరణించారు. కానీ ఇరానీ ప్రజలు ఐక్యతతో అమెరికా, ఇజ్రాయిల్‌ ‌దుర్మార్గాలను అడ్డుకోవటానికి వీరోచితమైన పోరాటం చేశారు. హార్మూజ్‌ ‌జలసంధిపై పట్టు సాధించడం ద్వారా ఇరాన్‌ అమెరికాకు తానేమిటో నిరూపించినది. ఇరాన్‌ ‌వద్ద గల అణుశక్తిని, యురేనియంని దెబ్బతీయటానికి ఇదంతా చేశామని అమెరికా చెప్పినప్పటికీ అసలు కారణం ప్రపంచం మొత్తానికి తెలుసు. పశ్చిమాసియాలో తన ఆధిపత్యానికి అడ్డంకిగా ఉన్న ఇరాన్‌‌ను లొంగదీసుకుని, ఆయిల్‌ ‌నిక్షేపాలపై పట్టు సాధించటమే అమెరికా అసలు లక్ష్యం. అమెరికాతో కలిసి ఇరాన్‌‌ను ఓడించి గ్రేటర్‌ ఇజ్రాయిల్‌ ఏర్పాటే ఇజ్రాయిల్‌ ‌లక్ష్యం. అమెరికా సామ్రాజ్యవాదాన్ని బహిరంగంగా రోడ్డు మీద నిలబెట్టి విజయం సాధించిన ఇరాన్‌ ‌ప్రజలకు జేజేలు. ఇరాన్‌ ‌ప్రజల హక్కులకు మనమంతా మద్దతు పలుకుదాం.

​ఇంటర్‌-పార్లమెంటరీ యూనియన్‌ ‌బాధ్యత

ఇంటర్‌ ‌పార్లమెంటరీ యూనియన్‌ ‌సమావేశాలలో కేవలం ఉపన్యాసాలు, మొక్కుబడి తీర్మానాలు కాకుండా ఆయా దేశాలలో ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను, హక్కులను కాపాడుకోవటానికి సూచనలు, సలహాలు ఇవ్వవలసి ఉన్నది. లాస్కీ చెప్పినట్లు ‘ప్రజల అప్రమత్తతే స్వేచ్ఛకు చెల్లించవలసిన మూల్యం’.

mlc ks lakshmana rao

కె.ఎస్‌.లక్ష్మణరావు
మాజీ శాసనమండలి సభ్యులు
8309965083

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్