mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పిల్లలు స్వచ్ఛతకు ప్రతీకలు..

4 రోజుల క్రితం

stars
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 01:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

పిల్లలూ..! వేసవి సెలవుల్లో బాగా ఎంజాయ్‌ ‌చేశారా.. ఈసారి ఎండలు కూడా మండిపోయాయి.. పాపం బాగా ఇబ్బందిపడి ఉంటారు కదూ.. అయితే మళ్లీ స్కూల్స్‌ తెరవగానే మీలో కొంత ఆనందం నింపాలనే ఈ ప్రత్యేక సంచిక ప్రయత్నం. ఈ ‘స్నేహ’ సంచికను పిల్లల ప్రత్యేక సంచికగా ‘నక్షత్రాలు’ పేరిట వెలువరిస్తున్నాం. మీరంతా భూమిపై నడిచే నక్షత్రాలు కదా..
పిల్లల ప్రేమికుడు, మాజీ ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రహ్మణ్యం గారు పిల్లల భాష గురించి ప్రత్యేక వ్యాసం రాశారు. వారికి మా ధన్యవాదాలు. మేము కోరిన వెంటనే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి స్వల్ప కాలంలోనే బొమ్మలు గీసి, కథలు రాసి, కవితలు అల్లి, కొన్ని వ్యాసాలు పంపిన పిల్లలందరికీ శుభాశీస్సులు. ​పిల్లలు స్వచ్ఛతకు, ఐక్యతకు, సామరస్యతకు ప్రతీకలు. వారి అమాయకత్వం, నిష్కల్మషమైన మనస్తత్వం, కులమతాలకతీతంగా అందరితో కలిసిపోయే గుణం.. ప్రపంచానికి శాంతి, ప్రేమను నేర్పుతాయి. పిల్లలది భేదభావాలు లేని స్నేహం. పిల్లలు ఎప్పుడూ కులం, మతం, ధనిక-పేద అనే తేడాలు చూడరు. అందరినీ సమానంగా ఆదరిస్తూ స్నేహహస్తం అందిస్తారు. తోటి పిల్లలతో ఆటలు ఆడుకునేటప్పుడు, వారు కలిసిమెలిసి పంచుకోవడం (Sharing) నేర్చుకుంటారు. ఇది సామరస్యానికి పునాది. పిల్లలది స్వచ్ఛమైన మనసు. పిల్లల నవ్వులో ఎలాంటి స్వార్థమూ ఉండదు. వారి నిష్కల్మషమైన ప్రేమ, పెద్దల మధ్య ఉన్న విభేదాలను కూడా చిటికెలో దూరం చేస్తాయి. అలాంటి పిల్లల ఆలోచనలకు రెక్కలు తొడిగితే ఎన్నెన్నో కథలు.. కవితలు.. బొమ్మలకు రూపం ఇస్తాయి. ఆకాశంలో నక్షత్రాల్లా తమ ఊహాలను అందంగా ప్రకాశింపజేస్తుంటారు. ప్రోత్సహిస్తే.. ఎలా కథలు, కవితలు అల్లేస్తారో.. పిల్లలంతా సృజనాత్మకంగా రూపొందించిన ఈ ‘నక్షత్రాలు’ నిదర్శనం.
ఇందులో పాలుపంచుకున్న పిల్లలందరికీ ఆశీస్సులు.. వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లలు పంపినవన్నీ వీలైనంత వరకూ ప్రచురించాం. మిగిలిన రచనల్నీ, బొమ్మల్నీ తర్వాత వారం వారం వచ్చే స్నేహ సంచికల్లో వరుసగా ప్రచురిస్తాం.
ఈ స్నేహ పిల్లలందరికీ గొప్ప వేదిక కావాలన్నదే మా అభిలాష. ఇప్పుడే కాదు.. ఇకముందూ పిల్లలకు పెద్ద పీట వేస్తుంది. మీ సృజనాత్మకతను చిగురులు వేయిస్తూ .. ఆ రచనలను మాకు పంపండి. వాటిని ప్రచురించి, పదుగురికీ పంచే బాధ్యత మాది.
వేసవి సెలవుల్లో మీ సందళ్ల తర్వాత బడి గంట మోగగానే మీ చేతుల్లో ‘నక్షత్రాలు’ మెరుస్తూ ఉంటాయి.
ప్రజాశక్తి గతంలో ప్రచురించిన ప్రత్యేక సంచికల మాదిరిగానే ‘నక్షత్రాలు’ సంచికనూ ఆదరిస్తారని ఆశిస్తున్నాము.

-బి. తులసీదాస్‌
సంపాదకులు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్