మీ బిడ్డ చేతిలోని స్మార్ట్ ఫోన్ – అది ఎప్పుడైనా డ్రగ్ డీలర్ కాల్ చేసే గేట్వే కావొచ్చు. మీ పక్కింటి కాలేజీ బాల్కనీలో పార్టీలు – అక్కడ మిఠాయిలా రంగురంగుల టాబ్లెట్లు విక్రయించబడొచ్చు. ప్రపంచంలోని 28 కోట్ల మందిలో మన పిల్లలు కూడా ఒకరు కావొచ్చు. ప్రతరోజూ సగటున 1,400 మంది మాదకద్రవ్యాల బారిన ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే గడియారం ముల్లు కదిలిన ప్రతి నిమిషానికీ ఒకరు బలైపోతున్నారు. మత్తు మనిషిని మైమరిపిస్తుంది. ఇప్పుడు ఇదో ఫ్యాషన్.. ట్రెండ్.. సంతోషం వచ్చినా.. దుఃఖం కలిగినా డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు చిత్రపరిశ్రమలో కొందరు ఈ డ్రగ్స్ మాఫియా విషకౌగిలిలో ఉన్నారు. రేవ్ పార్టీలు పెట్టడం ఒక ట్రెండ్ అయిపోయింది.. ఈ పార్టీల్లో అనేకమంది ప్రముఖులే ఉండటం మరో వాస్తవం. ఇంతలా మత్తులో జోగడం.. ప్రపంచానికి పెనువిపత్తు. అందులోనూ యువత ఈ మత్తులో ఊగుతుంటే ప్రపంచానికి తీరని నష్టం. అందుకే మత్తు వదలాలి.. వదిలించాలి.. అందుకు అందరం కలిసి సమాయత్తం కావాలి. రాష్ట్రంలో దీనికోసం పోరాడుతున్న సిపిఎం కార్యకర్త పెంచలయ్య మరణం దీనిపై మన కర్తవ్యాన్ని మరింతగా గుర్తుచేస్తోంది. ఈ నెల 26వ తేదీన ‘అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం’ సందర్భంగా దీనిపైనే ప్రత్యేక కథనం..
నేడు యువత, ప్రత్యేకంగా కొందరు సెలబ్రిటీస్ మత్తు ప్రపంచంలో ఓలలాడుతున్నారు. డ్రగ్స్ ఒకసారి శరీరానికి అలవాటయ్యాక.. ఆ మత్తులోంచి బయటపడటం అంతతేలికైన విషయం కాదు. స్కూలు పిల్లలకు సైతం డ్రగ్స్‌ను చాక్లెట్స్ రూపంలో చేరువ చేస్తున్న దారుణమైన దుస్థితిలో ఉన్నాం. పసితనం ఈ మత్తు పదార్థాలతో వసివాడిపోతోంది. ఈ దారుణాలను అరికట్టాలంటే పగడ్బందీ చర్యలు అత్యవసరం. దానితో పాటు అందరం కలిసికట్టుగా దీనిపై పోరాడతేనే అరికట్టగలం.
రాష్ట్రంలో పేట్రేగిన మాఫియా..
ఆంధ్రప్రదేశ్‌లో పెంచలయ్య హత్య సంఘటన మాదకద్రవ్యాల మాఫియా ఏ స్థాయికి వెళ్ళిందో చాటిచెప్తోంది. కె. పెంచలయ్య సిపిఎం యువ కార్యకర్త, ప్రజా నాట్యమండలిలో క్రియాశీలక కార్యదర్శి. నెల్లూరు జిల్లాలోని వినుకొండలో యువకుల్ని గంజాయి, టాబ్లెట్ల బారి నుండి కాపాడటానికి రాత్రింబవళ్లు అతను శ్రమించాడు. దీంతో అతనిపై కక్షగట్టిన మాఫియా ఒకరోజు పెంచలయ్య కొడుకును స్కూల్ నుంచి తీసుకొచ్చే సమయంలో, అందరూ చూస్తుండగానే మాఫియా ముఠా సభ్యులు నిర్దాక్షిణ్యంగా చంపేశారు. దీంతో రాష్ట్రం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడింది. స్థానిక ప్రజలు ఆగ్రహంతో మాఫియా సభ్యుల ఇంటిని కూల్చివేశారు. ఈ డ్రగ్స్ మాఫియా కారకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇంతకు ముందు రాష్ట్రంలో 2025లో 880 కేసులు, 1625 అరెస్టులు జరిగాయి. ఇవన్నీ కాగితాలపై బాగానే ఉన్నా.. పెంచలయ్య మరణం ప్రభుత్వ వైఫల్యాన్ని రుజువు చేస్తోంది. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యతిరేక కార్యకలాపాలు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో వెల్లడిస్తోంది.
తెలంగాణ, తమిళనాడు, కేరళలలో..
ఈ మూడు రాష్ట్రాలలో డ్రగ్స్ కు అడ్డాలుగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. టెక్ సిటీ, ఐటీ హబ్ అయిన హైదరాబాద్ లో సింథటిక్ డ్రగ్స్ వాడకం విపరీతంగా ఉంది. 2023లో 1,464 కేసులు ఉండగా, 2025 నాటికి ఇవి 2,734 కు పెరిగాయి. ఇది 86% పెరుగుదల. ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో అద్దంపడుతోంది.
తమిళనాడులో స్వచ్ఛంద చికిత్సకు ప్రోత్సాహం ఇస్తున్నారు. ఎన్‌డిపిఎస్ చట్టంలోని సెక్షన్ 64ఎ ప్రకారం, వ్యసనంతో బాధపడే వారు స్వచ్ఛందంగా చికిత్స తీసుకుంటే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయరు. ఇది ఒక ముందడుగు. ఈ రాష్ట్రంలో 2026 మొదటి మూడు నెలల్లోనే 294 కేసులు నమోదు, 419 అరెస్టులు జరిగాయి. అయినా, 65 యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేస్తామన్న వాగ్దానం ఇంకా పూర్తికాలేదు. చెన్నై, కోయంబత్తూరు, మదురైలో అత్యధికంగా డ్రగ్స్ వినియోగం ఉంది.
కేరళలో హైటెక్ వార్ నడుస్తోంది. “ఆపరేషన్ తుపాన్” పేరుతో వినూత్నమైన చర్యలు తీసుకుంటున్నారు. 2025లో 36,314 ఎన్‌డిపిఎస్ కేసులు నమోదు చేశారు. ఇది ఆందోళనకరమైన సంఖ్యే.
తీసుకుంటున్న చర్యలు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కేరళలో ఆయా ప్రభుత్వాలు కొన్ని చర్యలు చేపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్సైజ్ విభాగం ప్రత్యేక దాడులు చేసి, 190 కేజీల గంజాయి, రూ.1.2 కోట్ల విలువైన హష్ ఆయిల్, మారిజువానా, కొకైన్ స్వాధీనం చేసుకున్నాయి. - నెల్లూరు, విశాఖ, గుంటూరు, కృష్ణాజిల్లాల్లో మాఫియా నెట్‌వర్క్ కు చెందిన 12 మందిని అరెస్ట్ చేశారు. పాఠశాలల్లో “గుడ్ ఫ్రెండ్, డ్రగ్ ఫ్రెండ్” గుర్తింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 కొత్త డీ-అడిక్షన్ కేంద్రాలు నిర్మించాలని ప్రతిపాదించారు. ఇప్పటివరకు 20 మాత్రమే పనిచేస్తున్నాయి.
తెలంగాణాలో ఎఐని ఉపయోగించి సోషల్ మీడియాలో డ్రగ్స్ వ్యాపారాన్ని ట్రాక్ చేస్తోంది. వ్యసనపరుల్ని స్టేషన్ బెయిల్ రద్దు చేసి, నేరుగా పునరావాస కేంద్రాలకు పంపుతోంది. మహిళా డ్రగ్ నేరస్తులను గుర్తించేందుకు ప్రత్యేక “పింక్ నార్కో” బృందం ఏర్పాటు చేసింది.
కేరళలో మురుగు నీటి పరీక్ష చేసి, ఏ ప్రాంతంలో ఎలాంటి డ్రగ్స్ ఎక్కువగా వినియోగంలో ఉన్నాయో గుర్తించింది. డ్రోన్ల ద్వారా సరిహద్దు ప్రాంతాలలో నిఘా ఏర్పాటు చేసింది. పాఠశాలల్లో ‘పోడా’ (ప్రతిజ్ఞ) చేయిస్తోంది. సామాజిక చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపడుతోంది. కళాశాలల్లో విద్యార్థుల నేతృత్వంలోని యూత్ రెడ్ రిబ్బన్ క్లబ్బులు తోటి విద్యార్థులను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడతాయి.
తమిళనాడులో ఏదైనా ఒక రోజు, రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా డ్రగ్స్ నుండి దూరంగా ఉండే ప్రతిజ్ఞ. సెలబ్రిటీలు, క్రీడాకారులు ఈ ప్రచారానికి నేతృత్వం వహించాలి. పోలీసులకు, ఉపాధ్యాయులకు ఫోన్, వెబ్‌సైట్ ద్వారా పేరు చెప్పకుండా సమాచారం అందించే సదుపాయం చేపడుతోంది.
నెల్లూరులో ప్రజానాట్యమండలి ద్వారా పెంచలయ్య నిర్వహించిన కార్యక్రమాలు చాలా ప్రభావం చూపాయి. ఆయన ఈ అంశంపై వీధి నాటకాలు రూపొందించి, వేశారు. అలాగే అనేక పాటలతో సంగీత శిబిరాలు నిర్వహించారు. ఇవన్నీ అందరికీ ఆదర్శనీయం. ఇలాంటి సామాజిక చైతన్యం కలిగించే కార్యక్రమాలు ప్రభుత్వాలు పెద్దఎత్తున నిర్వహించాలి. ప్రజల్లో చైతన్యంతోనే ఎక్కువ ఫలితం ఉంటుంది.
సినీ ప్రపంచంలో కలకలం..
ఒక్కసారి వెండితెర వెనుక వున్న అసలు సినిమా ఈ మాఫియా కనుసన్నల్లో ఉందంటే అతిశయోక్తి కాదు. 2017 టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం రేగింది. ఒక డ్రగ్స్ రాకెట్ ముఠాను పట్టుకుంటే.. వారెవరికి సప్లయి చేస్తున్నారనేది అన్నీ విచారణలో వెల్లడయ్యాయి. అప్పుడు పూరీ జగన్నాథ్, ఛార్మి, ముమైత్ ఖాన్, రవితేజ ఇంకా బుల్లి బుల్లి తారల పేర్లు చాలానే ముందుకు వచ్చాయి. ఆ తర్వాత అనేకమంది సినీతారల పేర్లూ రేవ్ పార్టీల పేరుతో వెలుగులోకి వచ్చాయి. వీటి వెనుక రాజకీయ సర్దుబాట్లు ఉన్నాయి. నాటి ఘటనలో బడాబాబుల పేర్లు బట్టబయలు కావడం.. వారంతా పాలకులని వేడుకుని.. భారీగా చెల్లింపులు చదివించి, తమ పిల్లలను బయటపడేలా చేసుకున్నారు. ఆ కేసును పట్టుదలగా ఇన్వెస్టిగేట్ చేసిన అకున్ సబర్వాల్ ఏమైపోయారో కూడా చూశాం. ఈ సందర్భంగానే స్కూల్ పిల్లలకూ ఈ డ్రగ్స్ చాక్లెట్స్ రూపంలో చేరవేస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. నేటికీ ఇదే సినిమా పదే పదే పునరావృతం కావడం చూస్తున్నాం.
రేవ్ పార్టీలు నిర్వహించి..
బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో ఐదుగురిని పోలీసులు నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. అయితే రేవ్ పార్టీలో కీలక సూత్రధారులను నాడు పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలోనూ అతిపెద్ద బుకీల నెట్‌వర్క్‌ను గుర్తించారు. పైకి మాత్రం వ్యాపారం, ఫార్మా రంగాల పేర్లను ఉపయోగించుకుంటున్నట్లు వెల్లడైంది. డీజీపీ కార్యాలయంలో కొంతమంది అధికారుల పేర్లను సదరు నిందితుడు ఉపయోగించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్‌లతో పాటు డ్రగ్స్ వ్యవహారంలోనూ నిందితుడు కీలక సూత్రధారిగా ఉండటం వాస్తవం. ఇందులో ప్రముఖ నటితో పాటు మొత్తం 86 మందికి, అందులోనూ తెలుగు వారందరికీ పాజిటివ్ వచ్చింది. అప్పడిక రంగంలోకి దిగిన పోలీసులు పాజిటివ్ వచ్చిన వారందరికీ నోటీసులు ఇవ్వడం.. విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
అంతర్జాతీయ స్థాయిలో..
అయితే అసలు ఈ డ్రగ్స్‌కు మూలం ఎక్కడనేది ఇప్పటికీ సస్పెన్సే! ఈ రహస్యం అధికారులకు, ప్రభుత్వాధినేతలకు మాత్రమే తెలుసు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే వారే కమీషన్లు తీసుకుని.. ఈ డ్రగ్స్ వ్యవహారాలను చూసీచూడనట్లు వదిలేయడమే ఇంతలా వ్యాప్తి చెందడానికి మూల కారణం. వీళ్లంతా వసూల్ రాజాలే! ఒక్కోసారి తమ పిల్లలూ ఆ ఉచ్చులో పడితే.. బయటపడేయటానికి ఆ వసూళ్లే ఖర్చు పెట్టేస్తుంటారు. డ్రగ్స్ మాఫియా ఇంటర్నేషనల్ రేంజ్‌లో పనిచేస్తోంది. సినిమాల్లో చూపించినట్లే వారి నెట్‌వర్క్ చాలా పెద్దది.. బలమైనది. వారికి అడ్డొస్తే హత్యలు చేయడానికీ వెనుకాడరు. అధికారులను, ప్రజాప్రతినిధులను ముందే తమ కంట్రోల్‌లో పెట్టుకుంటారు.
మాదకద్రవ్యాల సమస్యపై ఏ దేశమూ ఒంటరిగా పోరాడలేదు. కానీ వారి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యాలను బట్టి వ్యూహాలు మారుతాయి.
ఆయా దేశాలు చేపడుతున్న చర్యలు..
* పోర్చుగల్ 2001లో చేసిన ప్రయోగం చాలా చర్చనీయాంశమైంది. ఇక్కడ ఒక వ్యక్తి వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి స్వల్ప పరిమాణంలో మాదకద్రవ్యాలను కలిగి ఉండటం నేరంగా పరిగణించరు. బదులుగా, అలాంటి వ్యక్తిని ‘కమిషన్ ఫర్ ది డిస్సువేషన్ ఆఫ్ డ్రగ్ అడిక్షన్’ అనే ప్యానెల్ ముందు హాజరుపరచి, వైద్యం, కౌన్సెలింగ్ లేదా సామాజిక సేవలకు పంపిస్తారు. ఫలితంగా మాదక ద్రవ్యాల వలన మరణాలు 80% కు పైగా తగ్గాయి. వ్యసన చికిత్సకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
* నెదర్లాండ్స్ లో కాఫీ షాపుల్లో గంజాయి విక్రయాన్ని నియంత్రించింది. అలాగే కొకైన్, హెరాయిన్ వంటి హార్డ్ డ్రగ్స్ పూర్తిగా చట్టవిరుద్ధం. ప్రభుత్వం సురక్షితమైన ఇంజెక్షన్ గదులు, సూదుల మార్పిడి కార్యక్రమాలు నడుపుతుంది. ఫలితంగా, అక్కడ మాదక ద్రవ్యాల వినియోగం ఇతర యూరోపియన్ దేశాల కంటే తక్కువ.
* అమెరికాలోని కాలిఫోర్నియా, కొలరాడో రాష్ట్రాల్లో గంజాయిని వినోదాలకు చట్టబద్ధం చేసినా.. అధిక ప్రాణాంతక ఓపియాయిడ్ల సంక్షోభం అక్కడ భయంకరంగా ఉంది. ఫెంటానిల్ వంటి కృత్రిమ మాదకద్రవ్యాల మాఫియా ప్రతిరోజూ వందల మందిని బలి తీసుకుంటుంది. అమెరికా ‘క్రాక్ డౌన్’ విధానం, చికిత్సా కేంద్రాలు రెండింటినీ సమాంతరంగా నడుపుతుంది.
* చైనాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు మరణశిక్ష కూడా విధించవచ్చు. సింగపూర్ లో విదేశీయులు కూడా డ్రగ్స్ పరీక్షలో విఫలమైతే కొరడా దెబ్బలతో సహా కఠిన శిక్షలు ఉన్నాయి. ఈ దేశాల్లో మాదకద్రవ్యాల వినియోగం అత్యంత తక్కువ.
భారత్‌లో..
దేశంలో మాదక ద్రవ్యాల వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. వినియోగదారుల సంఖ్య 331 లక్షలు.. గంజాయి, అఫీం, సింథటిక్ డ్రగ్స్ వినియోగిస్తున్నారు. 2025లో 1.33 లక్షల కిలోల మాదక ద్రవ్యాలు (రూ. 1980 కోట్ల విలువ) స్వాధీనం చేసుకున్నారు. ఇందులో గంజాయి ప్రధానమైనది (సుమారు 1.07 లక్షల కిలోలు), తర్వాత అఫీం, హెరాయిన్, ఎండి ఎంఏ. సింథటిక్ డ్రగ్స్ ను యువత ఎక్కువగా పార్టీలు, రేవ్‌లలో ఉపయోగిస్తోంది. టెలిగ్రామ్, డార్క్ నెట్ ద్వారా ఆర్డర్ ఇచ్చి డెలివరీ తీసుకోవడం సాధారణంగా మారింది.
పెద్ద మొత్తంలో పట్టుబడితే జరిమానా, శిక్షలను మరింత కఠినతరం చేసేలా చట్టం సవరణలు జరిగాయి. కానీ అమలులో సమస్యలు ఉన్నాయి.
ఒక్కొక్కరి చేతిలోనూ ఆయుధం..
మాదకద్రవ్యాల ఈ మహమ్మారి ఎవరినీ వదలదు. పెంచలయ్య హత్య మనల్ని పెనునిద్దర నుంచి లేపిన దుర్ఘటన. ప్రపంచ దేశాల విజయాలు, వైఫల్యాలను గమనించి, మన రాష్ట్రాల్లో స్థానికంగా సరిపోయే నమూనాలను రూపొందించుకోవాలి. ప్రభుత్వాలు పోలీసు చర్యలను ముమ్మరం చేయాలి. పాఠ్యాంశాల్లో మార్పు తీసుకురావాలి. బాధితుల పునరావాసానికి నిధులు పెంచాలి. అన్నింటికంటే, ప్రతి కుటుంబం కోటలా మారాలి. తల్లిదండ్రులు మేల్కొనాలి. సమాజం అప్రమత్తంగా ఉండాలి. వ్యసనం నుండి బయటపడిన వారిని రెండోసారి మనుగడలోకి స్వాగతించాలి. ఎందుకంటే ఒక యువకుడిని బతికించగలిగిన ప్రతి చర్య, మన భవిష్యత్తును కాపాడినట్లే. ఇది మనందరి సామూహిక బాధ్యత. ఈ దినోత్సవం మనకు ఆత్మవిమర్శ చేసుకునే రోజుగా మారాలి. మన చుట్టూ ఎవరైనా వీటి బారిన పడుతున్నారా? మనం వారికి అండగా ఉన్నామా? జవాబు ‘కాదు’ అయితే, ఈనాటి నుండే మార్పు ప్రారంభించండి.
ఎందుకు అడిక్ట్ అవుతున్నారు ?
అసలు సెలబ్రిటీస్ ఎందుకు ఈ డ్రగ్స్ ఉచ్చులో పడుతున్నారు? దీనికి బాలీవుడ్ ఈ టాలీవుడ్ అని తేడా లేకుండా ఎలా దీనికి అడిక్ట్ అవుతున్నారు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు వేధిస్తున్నాయి. ఎందుకంటే మామూలుగా బాధే కాదు.. ఆనందం వచ్చినా మందు తాగుతున్నారు. అసలు నలుగురు కలిస్తే చాలు మందు కొట్టడం అనేది సాధారణం. అయితే ఈ మందు ఇచ్చే కిక్ సరిపోవడం లేదు. అందుకే వారిపై డ్రగ్స్ మాఫియా వల విసురుతోంది. రోజంతా షూటింగులు.. రాత్రంతా పార్టీలు.. గడియారంలో ఇంకా గంటలు మిగిలి ఉంటే.. వాటినీ గడిపేస్తారు. అలాంటివారికి మరి శరీరం సహకరించాలిగా.. అంత ఓపిక ఎలా వస్తుంది? నేచురల్‌గా రాదు. మన డాక్టర్లు చెప్పినట్లు.. కనీసం 6 నుంచి 8 గంటలైనా నిద్రపోకపోతే మనిషి ఆరోగ్యంగా ఉండలేడు. అలాగే రాత్రి కాకుండా పగలు నిద్రపోతే ఆరోగ్యం పాడవుతుంది. మరివన్నీ దాటేసి, ఎంజాయ్ మెంట్‌ని కొనసాగించాలంటే.. డ్రగ్స్ కావాలి. అలా క్లాసు చెప్పేసి.. డ్రగ్స్ అలవాటు చేస్తారు. ఇక ఒకసారి అలవాటయ్యాక అడిక్ట్ అవడం చాలా ఈజీగా జరిగిపోతుంది.
ఒకప్పుడు నటులు ఎంత ఆరోగ్యంగా ఉండేవారు. ఉదయాన్నే వ్యాయామం.. సరైన ఆహార పద్ధతులు పాటిస్తూ.. అరవై ఏళ్ల పైబడీ హీరోలుగా నటించారు. అలా పాత తరం హీరో హీరోయిన్లు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా నియమాలు పాటించేవారు. రోజులు మారాయి.. చిత్రపరిశ్రమ వ్యాపార స్థాయి పెరిగిపోయింది. లక్షలు కోట్లు అయ్యాయి.. వందల కోట్ల వ్యాపారం ఒక్క సినిమాతోనే చేసేస్తోంది. అది డ్రగ్స్ తీసుకునే స్థాయికి సినిమా ఎదిగిపోయింది. అందులో వీళ్లంతా పావులు. దీని నుంచి బయటపడితేనే భవిష్యత్తు. అది తెలిసేలోపు ఇదో సామాజిక రుగ్మతగా ముందుకొచ్చేస్తుంది. అందుకే అందరూ అప్రమత్తంగా.. బాధ్యతగా ఉండాలి. మన బిడ్డల్ని కాపాడుకోవాలి.. అంటే సమాజ భవిష్యత్తును భద్రపరచుకోవడమే.
గుర్తించడమెలా?
యుక్త వయస్కులు, చిన్న పిల్లలు మాదక ద్రవ్యాల బారిన పడటం ఆందోళన కలిగించే విషయమని వైద్య నిపుణులు చెప్తున్నారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల ఆకలి తగ్గిపోతుంది. నిద్ర పట్టదు. అల్సర్లు, క్రామ్ప్స్ వస్తాయి. జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. నిద్రలో సమస్యలు, మానసిక ఒత్తిడి, మూడ్ స్వింగ్స్, అందరితో పోట్లాటలు చేస్తారు. చేతులు, కాళ్ళు వణకడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. జుట్టు ఎండిపోతుంది, వయసు మీరిపోయినట్లు కనిపిస్తారు. మాటలో తడబాటు కలుగుతుంది. కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడతాయి. కొంత మంది డ్రగ్స్ కొనుక్కోవడం కోసం దొంగతనాలు చేయడమూ మొదలుపెడతారని నిపుణులు చెప్తున్నారు. మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్ల నిజమైన ఆనందాన్ని కోల్పోవడం, వాటిని సంపాదించడం కోసం సమయాన్ని వినియోగించడం, కోపంగా, దురుసుగా ప్రవర్తించడం, వాటి ప్రభావంలో ప్రమాదాలకు గురి కావడం లాంటివీ జరుగుతూ ఉంటుంది. కొంత మందికి ఫిట్స్ కూడా వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. మాదకద్రవ్యాలు తీసుకునే వారికి ఆత్మహత్య చేసుకునే ముప్పు కూడా ఉంటుందని తెలిపారు. ఇంజెక్షన్లు ద్వారా హెచ్‌ఐవి లాంటి ముప్పు పొంచి ఉందని వారు హెచ్చరిస్తున్నారు. గంజాయి లాంటివి తీసుకునేటప్పుడు స్కిజోపెర్నియాలాంటి తీవ్రమైన మానసిక సమస్యలు కనిపించడంతో పాటు మూడ్‌లో మార్పులు, మానసిక ఒత్తిడి, ఆందోళన కలుగుతాయి. ఇవి నరాలను ఉద్రేకపరిచి గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయి. దీని వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని అంటున్నారు.
ఎలా మొదలువుతోంది ?
మాదక ద్రవ్యాలను సరఫరా చేసేవారు యుక్త వయస్కులను లక్ష్యంగా చేసుకుంటారని నిపుణులు చెప్తున్నారు. మాదక ద్రవ్యాల సరఫరా ఒక చెయిన్‌లా సాగుతుందని చెప్పారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉండే కిళ్లీ దుకాణాలు, కాఫీ షాపుల ద్వారా కూడా వీటి సరఫరా సాగుతూ ఉంటోందని అంటున్నారు. హైక్లాస్ పార్టీలకు పిలిచి ఉచితంగా మద్యం సరఫరా చేస్తామని చెబుతూ మొదలైన వ్యవహారం వారిని క్రమంగా డార్క్ వెబ్‌కు కనెక్ట్ చేసి డెలివెరీ బార్సు ద్వారా నేరుగా ఇంటికే సరఫరా చేసే వరకూ చేరుతుందని అన్నారు. మాదక ద్రవ్యాలను జొమాటో డెలివెరీ బారు ముసుగులో ఇంటి దగ్గరకే సరఫరా చేయడం ఆశ్చర్యకరమైన విషయమని పోలీసులు కూడా చెప్పారు. సాధారణంగా సిగరెట్లు, ఆల్కహాల్ ద్వారా మాదక ద్రవ్యాలను తీసుకోవడం మొదలవుతుందని, వీటిని గేట్ వే డ్రగ్స్ అంటారని నిపుణులు చెప్తున్నారు.
ప్రభావం ఇలా..
ఒక్కసారి మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన తర్వాత జీవన శైలి మారిపోయి, వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలను మర్చిపోతారని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా సిగరెట్‌తో కలిపి తీసుకునే కొకైన్, గంజాయిలాంటివి తీసుకోగానే ఉద్రేకానికి లోనవుతారు. ఆగకుండా నవ్వడం, ఆనందపు అంచుల్లో ఉన్నట్లు ఊహించుకుంటూ ఉంటారని వైద్య నిపుణులు చెప్తున్నారు. కూల్ డ్రింక్‌లో కలిపి తీసుకునే టాబ్లెట్లు కూడా ఆడ్రెనలిన్‌ను ఉత్తేజపరుస్తాయి.ద్రవ రూపంలో కూడా దొరికే ఎల్‌ఎస్‌డీ (లైసెర్జిక్ యాసిడ్ డైథ్లమైడ్ ట్యాబ్‌లెట్లను మూడ్ మార్చే రసాయనాలని చెబుతారు. ఎండీఎంఏ మిథలీన్ డైఆక్సీమేథామెటామైన్ పార్టీలలో వాడే మత్తుమందుగా చెబుతారు.
నవ్యసింధు
8333818985









కామెంట్‌లు (0)