ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionశాస్త్రీయ విజ్ఞానంతోనే యువత అభివృద్ధి

2 గంటల క్రితం

youth
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 09:09 పూర్వాహ్నం | 8 నిమిషాల చదవడం

రానున్న తరం యొక్క విజ్ఞానం, నైపుణ్యం మీదనే దేశాల అభివృద్ధి ఆధారపడి వుంటుంది. కావున వాటిని సాధించడం తక్షణ అవసరంగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. గత కాలపు అజ్ఞానాంధకారాన్ని చీలుస్తూ, కొత్త వెలుగుల వైపు సమాజాన్ని నడిపించేది యువత శ్రమే. శారీరక, మానసిక శ్రమ లేకుండా ఏదీ తయారుకాదు. ఆ శ్రమకు నైపుణ్యం తోడు కావాలంటే శాస్త్రీయ విజ్ఞానం, నూతన పరిశోధనల ఫలితాలు నిరంతరం అందాలి. అప్పుడే ఆశించిన అభివృద్ధి సాధ్యమవుతుంది. అలాంటి యువత గురించి శ్రీశ్రీ “కొంత మంది కుర్రవాళ్ళు ముందు యుగపుదూతలు, పావన, నవజీవన, బృందావన నిర్మాతలు” అన్నారు. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం అనేది యువతకు సంతృప్తికరమైన వృత్తిని, సరైన ఉద్యోగ అవకాశాలను, నూతన పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే సామర్థ్యాన్ని అందించడానికి అవసరమైన సాధనాల్ని సమకూర్చేందుకు ఉద్దేశించింది. ప్రతి ఏటా జులై 15న ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవంగా జరపాలని 2014లో ఐరాస అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. నైపుణ్యానికి దేశాల సరిహద్దులు లేవని అన్నివైపుల అది వికసించాలనే లక్ష్యంతో జులై 15ను ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవంగా ప్రకటించింది. ప్రతి ఏడాది ఒక థీమ్‌తో నిర్వహిస్తోంది. ఈ ఏడాది ‘ఉమ్మడి భవిష్యత్ కోసం నైపుణ్యాలు’ థీమ్‌తో ఈ దినోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం..


మత, ప్రాంతాల సరిహద్దులను దాటి, యువత అభివృద్ధి చెందడానికి అవసరమైన సాధనాలను వారికి అందించాల్సిన అవసరాన్ని నానాటికి ప్రపంచం గుర్తిస్తుంది. నైపుణ్యం కలిగిన యువ శ్రామికశక్తికి డిమాండ్ పెరుగుతున్నది. దీని ప్రాధాన్యత గుర్తించిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2014లో ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని ప్రకటించింది. నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా, యువత ఉద్యోగ మార్కెట్‌లోని ఆటంకాలను ఎదుర్కోవడానికి, సమాజానికి అర్థవంతంగా దోహదపడటానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని, సామర్థ్యాన్ని సాధిస్తారు. నైపుణ్యం అంటే ప్రత్యేకపని చేయడం కాదు, పనిని ప్రత్యేకంగా చేయడం. నిర్దిష్ట నైపుణ్యాలను సంపాదించుకున్న వారే ఎదరయ్యే సవాళ్లను అధిగమించి, అందరిలో ఒకరుగా కాకుండా, ప్రత్యేక వ్యక్తిగా గుర్తింపును పొంది, చరిత్రను సృష్టిస్తారు. అలాంటి యువత గాథలను తెలియజేసి, యువతలో స్పూర్తిని నింపడం ఈ దినోత్సవ ప్రత్యేకత. ఇది యువతకు ఒక ప్రేరణా వనరుగా పనిచేస్తుంది. వారి అభ్యాసానికి వారే బాధ్యత వహించేలా, సంబంధిత నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి అవకాశాలను చురుకుగా అందిపుచ్చుకునేలా వారిని ప్రోత్సహిస్తుంది. ప్రపంచ ఆర్థికవ్యవస్థలో వస్తున్న నిరంతర మార్పులకు తగ్గట్టుగా, మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా అత్యంత నైపుణ్యం, అనుకూలత కలిగిన శ్రామికశక్తిని పెంపొందించడం ఈ దినోత్సవ లక్ష్యం.

​ప్రపంచ యువత స్థితి..

ప్రస్తుతం ప్రపంచంలో 15 నుండి 24 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు 120 కోట్లకు పైగా ఉన్నారు. వీరు ప్రపంచ జనాభాలో 16 శాతం. 2030 నాటికి ప్రపంచం సుస్థిర అభివృద్ధి సాధించాలని ఐక్యరాజ్య సమితి లక్ష్యంగా పెట్టుకుంది. అప్పటికి యువజనుల సంఖ్య ఏడు శాతం పెరిగి, దాదాపు 130 కోట్లకు చేరుకుంటుందని అంచనా. తాము జీవించే సమాజంలో మరింత న్యాయమైన, సమానమైన, ప్రగతిశీల అవకాశాలను, సమస్యలకు పరిష్కారాలను యువత కోరుకుంటుంది. వారు ఎదుర్కొంటున్న విద్య, ఆరోగ్యం, ఉపాధి, లింగ సమానత్వం వంటి బహుముఖ సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం గతంలో కంటే ఇప్పుడు మరింత తీవ్రమైంది. యువత అభివృద్ధి చెందడానికి అవసరమైన జ్ఞానం, అవకాశాలు కల్పించినప్పుడు, వారు అభివృద్ధికి ఒక సానుకూల శక్తిగా మారగలరు. ముఖ్యంగా, యువత ఉత్పాదక ఆర్థిక వ్యవస్థలో పాలుపంచుకోవడానికి అవసరమైన విద్యను, నైపుణ్యాలను సంపాదించుకోవాలి.. వారికి ఉపాధి కల్పించి శ్రామికశక్తిలో భాగస్వామ్యం చేసుకోగలగాలి. మనిషి చేసే అన్ని పనులు కృతిమ మేధస్సు చేయవచ్చు.. కానీ మనసు పెట్టి చేసే పనులు, మార్పును సాధించే ఆవిష్కరణలు మనిషే చేయగలడు. అలాంటి మనిషి చేతిలో యంత్రం ఒక సాధనం కావాలి.

coverpage

​తంతు కాదు.. కార్యాచరణ కావాలి..

ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం 2026ను జరుపుకోవడం కేవలం ఒక వార్షిక తంతు కాదు. మన యువత కొత్త ఆవిష్కరణలు సృష్టించడానికి, పెట్టుబడి పెట్టడానికి అవసరమైనది. అంతేకాదు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా చూడటానికి, వారి పూర్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలను అందించడానికి ప్రోత్సహించే ఒక కార్యాచరణ పిలుపు. చదువు జ్ఞానం కోసమే కానీ నేటి ప్రపంచంలో ఆ జ్ఞానం వృత్తిపరమైన, సాంకేతిక నైపుణ్యాలకు ప్రాధాన్యతనిచ్చే విధంగా వుండాలి. అలాంటి చదువును అందించడం ప్రభుత్వాల బాధ్యత. అయితే అనేక దేశాల్లోని పాలకులు నోటితో ఎఐ టెక్నాలజీ గురించి చెబుతూ, చేతల్లో గతకాలపు పురాణాల్లోనే అన్నీ వున్నాయంటున్నారు. ఆ శాస్త్రాన్ని, శాస్త్రం అంటూ నమ్మించే పాలకులు, ఆధునికత నుండి ఆదిమ దిశ వైపు నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాము చదివిన చదువు, నేర్పిన నైపుణ్యం ప్రపంచ లేబర్ మార్కెట్‌లో తమకు ఉపాధి చూపడం లేదనే సత్యాన్ని యువత గుర్తిస్తున్నారు. చేసే పని గౌరప్రదంగా వుండాలని, తమ జీవితాన్ని, సమాజాన్ని అభివృద్ధి దిశలో నడపాలని యువత కోరుకుంటుంది. ఆర్థిక, సామాజిక అసమానతలు (మన దేశంలో కుల అసమానతలు) బట్టి కాకుండా ప్రతి యువ‌తా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, వనరులను పొందడానికి, సమాజానికి సానుకూలంగా దోహదపడటానికి సమాన అవకాశాన్ని కలిగి ఉండేలా చూడటం అత్యవసరమని ఐక్యరాజ్యసమితి గుర్తించింది.

అవగాహన అవసరం..

నేటి ప్రపంచంలో, వాతావరణంలో వస్తున్న మార్పులు, తద్వార సమాజంలో ఏర్పడుతున్న వివిధ సంక్షోభాల గురించి యువత అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే వాటిని ఎదుర్కోవడానికి సిద్ధమవడానికి వీలవుతుంది. అలాంటి నైపుణ్యాలను యువతలో కల్పించాలి. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం 2026 కార్యక్రమం కేవలం వర్తమానానికి ఒక గుర్తింపు మాత్రమే కాదు. యువతపై, వారి సామర్థ్యాలపై సమాజానికి వున్న అచంచలమైన విశ్వాసానికి ఒక నిదర్శనం. వారి నైపుణ్యాలు, అభిరుచి, పట్టుదల సమాజంలోని సమస్త జనంతో కలిసి ఒక ఉజ్వలమైన, సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేయాలి.

coverphoto

​పెట్టుబడి ప్రయోజనాలు..

కార్మిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దడం నేటి పెట్టుబడికి అత్యవసరం. అందుకు తోడ్పడే విధంగా విద్యా పాఠ్యప్రణాళికలను మార్చడం, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య భాగస్వామ్యాలను పెంపొందించడం ఈ కార్యక్రమంలో భాగం. వివిధ దేశాలు ఈ లక్ష్యం కోసం ఈ దినోత్సవాన్ని జరపుకుంటాయి. భారతదేశంలో నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, వృత్తి శిక్షణా కార్యక్రమాలను విస్తరించడం, యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం లక్ష్యంగా కొత్త కార్యక్రమాలను ప్రారంభించనుంది.

ఆవిరి యంత్రాలను కనుగొనిన తర్వాత వాటి ముందు పనిచేయగలిగే కార్మికులకు అనివార్యంగా ఆ నైపుణ్యం యాజమాన్యం నేర్పాల్సిందే. అలాగే విద్యుత్ యంత్రాలు, నేటి ఎఐలాంటి ఆధునిక సాంకేతిక విజ్ఞానం ముందు యువత పనిచేయాలంటే ఆ నైపుణ్యాలను అందించాలి. ప్రపంచీకరణ యుగంలో పెట్టుబడి మాత్రమే ప్రపంచమంతటా పర్యటించదు.. దానితో పాటు కార్మికులను, అందునా నైపుణ్య కార్మికులను విశ్వమంతటా తిప్పుతుంది. అందుకు తోడ్పడే విద్య, పని సంస్కృతిని నేర్పుతుంది. అలా నేర్పేందుకు ప్రపంచ వేదికలను సృష్టిస్తుంది.

​దేశ యువతకు ఉపాధే పెద్ద సమస్య..

మన దేశ జనాభాలో సుమారు 63 శాతం మందికి పైగా గ్రామాల్లో వున్నారు. అయితే ఇక్కడ నివసిస్తున్న యువతలో 70 నుండి 85 శాతం మంది ప్రస్తుతం చేస్తున్న పనుల నుండి దూరం కావాలని కోరుకుంటున్నట్లు “స్టేట్ ఆఫ్ రూరల్ యూత్ ఎంప్లాయిమెంట్ రిపోర్టు 2024” తెలిపింది. వ్యవసాయం తమ భవిష్యత్తుకు గ్యారంటీ కాదని వీరు భావిస్తున్నట్లు 19 రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ సర్వే బృందానికి తెలిపారు. దీనికి ప్రధాన కారణాలు వ్యవసాయ దిగుబడులు ఏటేటా తగ్గిపోతున్నాయని 68 శాతం మంది, తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి అవసరమైనంత భూమి లేదని 46 శాతం మంది, కుటుంబ అవసరాలకు సరిపడా ఆదాయం వ్యవసాయం నుండి రావడంలేదని 63 శాతం మంది అభిప్రాయపడినట్లు ఈ నివేదిక ప్రకటించింది. వీటితోపాటు సామాజిక వివక్ష కూడా మరో ముఖ్యకారణం. వీటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వాలే ఈ సమస్యను మరింతగా పెంచుతున్నాయి.

నూతన గ్రాడ్యుయేట్లలో 25 ఏళ్ళలోపు వారు 45 శాతం మంది నిరుద్యోగులుగా వున్నారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ నివేదిక ప్రకటించింది. 2016-17 నుండి 2022-23 మధ్య దేశంలో పనిచేయగలిగే సామర్థ్యం వున్న శ్రామికుల్లో పట్టణ ప్రాంతాల్లో 44.7 శాతం నుండి 37.5 శాతం మందికి, గ్రామీణ ప్రాంతాల్లో 47 శాతం నుండి 40.5 శాతం మందికి ఉపాధి పడిపోయింది.

పాతికేళ్లలోపు వయసున్న నిరుద్యోగులు పట్టణాల్లో 45.98 శాతం మంది, గ్రామీణ ప్రాంతాల్లో 43.79 శాతం మంది ఉన్నారు. మోడీ ప్రభుత్వం 2014లో ప్రకటించిన ‘మేక్ ఇన్ ఇండియా’ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు.

un emplayment

సమానత్వం దిశగా..

నేటి పోటీ ప్రపంచంలో యువతకు సరైన నైపుణ్యాలు ఉండటం చాలా ముఖ్యం. కానీ అన్ని దేశాల్లో, అన్ని వర్గాల యువకులకు ఒకేలా అవకాశాలు లేవు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య, అబ్బాయిలకు, అమ్మాయిలకు మధ్య, ధనిక, పేద కుటుంబాల మధ్య నైపుణ్యాల శిక్షణలో పెద్ద తేడాలు ఉన్నాయి.

చాలా మంది యువతకు డిజిటల్ నైపుణ్యాలు, భాషా శిక్షణ, సాంకేతిక విద్య అందుబాటులో లేవు. ఇది వారి ఉద్యోగ అవకాశాలను పరిమితం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా యువతీ యువకులందరికీ నాణ్యమైన విద్య, శిక్షణ, ఇంటర్నెట్ సౌకర్యం అందాలి.

అలాగే, లింగ వివక్ష లేకుండా అమ్మాయిలకు కూడా STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం) రంగాల్లో ప్రోత్సాహం అవసరం. వికలాంగ యువతకు ప్రత్యేక శిక్షణా విధానాలు అందుబాటులో ఉండాలి.

ప్రభుత్వాలు, సంస్థలు కలిసి పనిచేస్తేనే నైపుణ్యాల్లో ఈ సమానత్వం సాధ్యం. ఆన్లైన్ కోర్సులు, ఉచిత శిక్షణా కేంద్రాలు, వృత్తి విద్యా పాఠశాలల ద్వారా యువతకు అవకాశాలు కల్పించాలి.

నైపుణ్యాల సమానత్వం అంటే ప్రతి యువతకీ తన సామర్థ్యాన్ని వెలికితీసే అవకాశం ఇవ్వడమే. అప్పుడే వారు మంచి ఉద్యోగాలు పొందగలరు.. సమాజానికి దోహదపడగలరు. ఇది పేదరికం, నిరుద్యోగం, అసమానతలను తగ్గించడానికి మార్గం.

"నైపుణ్యం ఉన్న యువతే నేటి ప్రపంచానికి అసలు ఆస్తి" – ఈ మాటను నిజం చేయాలంటే అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

coverphoto

​శాస్త్రీయ జ్ఞానం అవసరం..

మన విద్యావిధానం అటు శాస్త్రీయ జ్ఞానాన్ని, ఇటు ఉపాధి నైపుణ్యాన్ని పెంచేవిధంగా లేదని చాలా కాలంగా విద్యారంగ నిపుణులు, నివేదికలు చెబుతూనే వున్నాయి. 2023లో కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన ‘పరాఖ్’ (ఫెర్పార్మెన్స్ అసెస్‌మెంట్ రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ డైలెస్టిక్‌ డెవలప్‌మెంట్) సర్వే ప్రకారం ఆరో తరగతి చదివే 54 శాతం మంది పిల్లలు లెక్కల్లో స్థానాల విలువలను కచ్చితంగా ఉపయోగించడం లేదని, 71 శాతం మంది సాధారణ భాగాహారాలను చేయడం లేదని పేర్కొంది. అలాగే తొమ్మిదో తరగతి పిల్లల్లో 31 శాతం మంది మాత్రమే పూర్ణాంకాలు, భిన్నాలు అర్థం చేసుకుంటున్నారని ఈ సర్వే తేల్చింది. తొమ్మిదో తరగతి పిల్లల్లో 45 శాతం మంది మాత్రమే మన రాజ్యాంగ కనీస సూత్రాలను, జాతీయోద్యమ అవసరాన్ని అర్థం చేసుకోగలగుతున్నారనడం తీవ్ర ఆందోళనకర మైంది. మహాకవి గురజాడ అన్నట్లు ‘ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగు పడునోయ్‌’. యువతలో నైపుణ్యం వుండా లంటే శాస్త్రీయ విద్య, విజ్ఞానం అందించాలి. అందుకోసం యువత ఉద్యమించాలి.

‌కృత్రిమ మేధ.. యువ నైపుణ్యాలు

కృత్రిమ మేధస్సు (ఎఐ) నేడు యువత నైపుణ్యాల వికాసంలో ఒక శక్తివంతమైన సాధనంగా మారింది. అయితే, ఇది పూర్తిగా మంచిదా లేదా చెడ్డదా అనేది మనం ఎలా వాడుకుంటున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. దాని సానుకూల, ప్రతికూల అంశాలను పరిశీలిద్దాం.

​సానుకూల అంశాలు..

ఎఐ యువతకు అవసరమైన బోధనను అప్పటికప్పుడు అందిస్తుంది. ప్రతి విద్యార్థి వేగం, బలహీనతలను బట్టి పాఠ్యాంశాలను సర్దుబాటు చేస్తుంది. దీనివల్ల నెమ్మదిగా నేర్చుకునే వారికి ప్రత్యేక శ్రద్ధ దొరుకుతుంది. ప్రపంచంలోని ఏ మూలనున్న జ్ఞానమైనా నిత్యం అందుబాటులో ఉంచడం వల్ల యువత స్వయంగా నేర్చుకునే అలవాటు పెరుగుతుంది. రొటీన్ లెక్కలు, డేటా సేకరణ వంటి బోరింగ్ పనులను ఎఐ చేస్తుంటే, యువత సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచనపై దృష్టి పెట్టగలరు. ప్రోంప్ట్ ఇంజనీరింగ్, డేటా విశ్లేషణ వంటి కొత్త టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఇది సులభమైన మార్గంగా నిలుస్తుంది. అంతేకాక, ఎఐ సహాయంతో మాక్ ఇంటర్వ్యూలు, కెరీర్ మార్గదర్శనం పొందడం వల్ల ఉద్యోగాలకు సిద్ధమవడంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


​ప్రతికూల అంశాలు..

ఎఐపై అతిగా ఆధారపడటం వల్ల యువతలో సొంతంగా కష్టపడి ఆలోచించే శక్తి మొద్దుబారిపోతుంది. ఎఐ సమాధానాలు సులభంగా చెప్పేస్తుంటే, పరిశోధనా దృక్పథం, సమస్య పరిష్కార నైపుణ్యాలు క్రమంగా క్షీణిస్తాయి. ఇక ఎఐ భవిష్యత్తులో ఉద్యోగాలను భర్తీ చేస్తుందనే భయం యువతలో తీవ్రమైన ఆందోళన, నిరాశను కలిగిస్తోంది. ప్రధాన సవాలు డిజిటల్ విభజన - మంచి నెట్‌‌వర్క్, ల్యాప్‌‌టాప్ లేని గ్రామీణ, పేద విద్యార్థులు ఎఐ సౌకర్యాల నుండి దూరంగా ఉండిపోతే, నైపుణ్యాల అసమానత మరింత పెరుగుతుంది. ఎఐ రూపొందించిన డీప్‌‌ఫ్లేక్స్‌, తప్పుడు వార్తలు యువ మనసులను సులభంగా మోసగించగలవు. చివరిగా, ఎఐ తోనే ఎక్కువ సమయం గడపడం వల్ల సహనివాసం, సమిష్టి కృషి, మానవ సహానుభూతి వంటి మృదు నైపుణ్యాలు (సాఫ్ట్ స్కిల్స్) బలహీనపడే ప్రమాదం ఉంది.

ఎఐ అనేది రెండు పదునుల కత్తి. దీన్ని ఒక సాధనంగా మాత్రమే భావించి, సరైన డిజిటల్ అవగాహనతో మితంగా వాడుకుంటే యువత నైపుణ్యాలు అంతర్జాతీయ స్థాయికి ఎదగవచ్చు. కానీ, దీనికి బానిసలయిపోతే మన సహజ మేధస్సు, సృజనాత్మకత నశించిపోతాయి. కాబట్టి, తెలివిగా వాడుకోవడం ఇక్కడ ముఖ్యం.

ఆశ్చర్యపోయే నిజాలు

  • 27.3 కోట్ల మంది పిల్లలు, యువకులు పాఠశాలకు దూరంగా ఉన్నారు.

  • 15-24 సంవత్సరాల వయస్సు గల ప్రతి ఐదుగురు వ్యక్తులలో ఒకరు ఉపాధి, విద్య లేదా శిక్షణలో లేరు.

  • నేటి యువత నైపుణ్యాలలో 40 శాతం పైగా ఉద్యోగ మార్కెట్ అవసరాలకు సరిపోవడం లేదు.

  • శ్రామిక మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం వల్ల 70 శాతం యువత (45 కోట్ల మంది) ఆర్థికంగా వెనుకబడ్డారు.

  • 2023లో ప్రపంచవ్యాప్తంగా 6.5 కోట్ల మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారు.

  • సాంకేతిక విప్లవం కారణంగా 2030 నాటికి 22 శాతం ఉద్యోగాలు రూపాంతరం చెందనున్నాయి.

  • అనేక దేశాలలో పేద గ్రామీణ మహిళల్లో 1% కన్నా తక్కువ మంది సెకండరీ పాఠశాల విద్యను మాత్రమే పూర్తిచేస్తున్నారు.

coverphoto2

ఏ ఏడాది ఏ థీమ్‌లు

యువతలో స్ఫూర్తి నింపేందుకు ప్రతి సంవత్సరం ఒక థీమ్‌ను ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ప్రకటిస్తుంది.

సంవత్సరం థీమ్

2019జీవితం, పని కోసం నేర్చుకోవడం

2020కోవిడ్-19 సవాళ్లను ఎదుర్కోవడానికి యువత కోసం నైపుణ్యాలు

2021మహమ్మారి అనంతర యువత నైపుణ్యాలను పునఃసమీక్షించడం

2022భవిష్యత్తు కోసం యువత నైపుణ్యాలను మార్చడం

2023మార్పుదిశగా భవిష్యత్తు కోసం.

2024శాంతి, అభివృద్ధి కోసం యువత నైపుణ్యాలు

2025ఎఐ, డిజిటల్ నైపుణ్యాల ద్వారా యువత సాధికారత

2026ఉమ్మడి భవిష్యత్ కోసం నైపుణ్యాలు


మొదటి ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన్ని 2015లో నిర్వహించారు. 2030 నాటికి సుస్థిర అభివృది సాధించడం అజెండాగా ఇది కొనసాగుతుంది. ఈ అజెండాలో అందరికీ నాణ్యమైన విద్య, గౌరవప్రదమైన ఉపాధిపై దృష్టి సారించిన నిర్దిష్ట లక్ష్యాలు ఉన్నాయి. సుస్థిర ఆర్థికవృద్ధి, సామాజిక సమ్మిళితాన్ని సాధించడంలో నైపుణ్యాభివృద్ధి పోషించే కీలకపాత్రను ఇది నొక్కి చెబుతోంది. న్యూయార్క్‌లో, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం కీలక ప్రసంగాలు, ప్యానెల్ చర్చలు, ఇంటరాక్టివ్ సెషన్‌లతో కూడిన ఒక ఉన్నత స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించి, భవిష్యత్ ప్రణాళికను ప్రకటించింది. నైపుణ్యాలను సంపాదించడంలో తమ అనుభవాలను, సవాళ్లను పంచుకోవడానికి యువతకు అవకాశాలు కల్పించడం ద్వారా పరస్పరం పురోగమిస్తారు.

-వి. రాంభూపాల్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్