‘నీకు ఈ జన్మలో పెళ్లి అయ్యే యోగం లేనట్లుందిరా’ దిగులుగా అంది భార్గవి.
‘అదేంటక్కా.. అలా అనేసావు?’ సుదీప్ హర్ట్ అయ్యాడు.
‘లేకపోతే ఏంట్రా నీ గొంతెమ్మ కోరిక? ఏ పెళ్లికూతురన్నా నీ కోరిక ఒప్పుకుంటుందని అనుకుంటున్నావా? ఇప్పటికి ఎన్ని సంబంధాలు తప్పిపోయాయి నీ కోరిక వల్ల?’ కాస్త విసుగ్గానే అంది భార్గవి.
‘అక్కా! ఒప్పుకునే అమ్మాయి తప్పక దొరుకుతుంది’ దృఢంగా అంటున్న సుదీప్ వైపు జాలిగా చూసింది భార్గవి.
‘పిచ్చి సన్నాసి ! ఇది ఉమ్మడి కుటుంబాల కాలంగాదురా! వ్యక్తి కుటుంబాల కాలం నడుస్తోంది. అందుకే మనుషుల మధ్య సంబంధాలు, మమతాను రాగాలు లేకుండా పోతున్నాయి’
‘ఒక కుటుంబంలోనే లేనప్పుడు సమాజంలో మానవ సంబంధాలు, విలువలు ఎలా ఉంటాయక్కా?’
‘కార్ల్ మార్క్స్ ఏనాడో చెప్పాడు కదరా మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలేనని!’
‘కానీ అక్కా! మన అమ్మానాన్న ఎప్పుడూ... డబ్బుకు కాకుండా మనుషులకే విలువ ఇవ్వాలి. ఒక మనిషి నైతిక విలువలుతో ఉన్నప్పుడే మనిషిగా గుర్తింపు అని చెప్పేవారు కదా!’
‘నిజమేరా కానీ ఇప్పుడు ప్రతి దాన్ని డబ్బుతో, సమయంతో, స్వప్రయోజనంతో ముడిపెట్టి... మనిషి చూస్తున్నాడు’
‘అవునక్కా! మనిషికి మానవత్వం గుర్తు చేసే ప్రయత్నం ఎవరో ఒకరు చేయాలి కదా!’
‘ఒక్కరి ప్రయత్నం వల్ల సమాజం మారిపోతుందంటావా?"
‘రాత్రికి రాత్రి మారిపోతుందనుకోవడం మూర్ఖత్వమే కదక్కా! ఈ ప్రయత్నంలో నేను సఫలం అవుతానో లేదో కాలం నిర్ణయిస్తుంది’
ఇప్పటికే చాలా సంబంధాలు చూశారు. అన్నీ... పెళ్లి చూపులప్పుడు సుదీప్ కోరిక విని వెనక్కి వెళ్ళిపోయాయి. కొందరు ఆశ్చర్యపోయారు. కొందరు భయపడ్డారు. కొందరు హేళన కూడా చేశారని విన్నారు. అయినా సుదీప్ తన పట్టు వీడడం లేదు. పెళ్లి చూపులప్పుడు చెప్పడము.. మళ్లీ వాళ్ళు వద్దనుకోవడం ఎందుకని .. ముందుగానే సుదీప్ కోరిక చెప్పి దానికి ఒప్పుకుంటేనే.. పెళ్లి చూపులు ఏర్పాటు చేయించమని చెప్పారు పెళ్లిళ్ల పేరయ్యకు. ఆ మాట చెప్పాక ఒక్క సంబంధం గురించీ చెప్పలేదాయన. ఫోన్ చేస్తే ‘మీకు తెలియందేముందమ్మా? ఉన్న వాళ్ళనే వద్దనుకునే కాలం ఇది. ఇక.. లేనివాళ్లను కావాలనుకుంటుంటే మనకెందుకు ఆ లంపటాలు అన్న భయము ఉంటుంది కదా? అయినా నా ప్రయత్నం నేను చేస్తాను లెండి’ అని పరిస్థితి వివరిస్తూనే హామీ ఇచ్చాడాయన.
ఆ మాటలు విని భార్గవి నిరాశపడింది. తమ్ముడికి పెళ్లి కాదేమోనన్న బాధ దాచుకోలేకపోయింది. ఎన్ని చెప్పినా... ఎంత నచ్చచెబుతున్నా సుదీప్ తన నిర్ణయాన్ని వదలటం లేదు.
‘ నీళ్లు లేవని మేఘాలను ఆకాశం వద్దంటుందా? నీలి నీలి ఆకాశంలో తెల్లని మబ్బులు ఎంత అందమో మనిషికి వ్యక్తిత్వమే మర్యాద కాదూ?!?
ఒకరి ఆశయం మంచిదైనప్పుడు వీలైతే ప్రోత్సహించాలి లేకపోతే ఊరుకోనుండాలి . నువ్వు ఎందుకలా బాధపడి అతన్ని నిరుత్సాహ పరుస్తావు? అతడి ఆశయాన్ని అర్థం చేసుకునే అమ్మాయి దొరక్కపోదు. అంతవరకూ నువ్వు కాస్త ఓపికగా ఉండు.’ భర్త రవి మాటలకు బదులు పలకలేక ‘అంతకన్నా చేసేదేముందిలే?’ అనుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చింది భార్గవి.
ఒక యాక్సిడెంట్ లో సుదీప్ కి అమ్మానాన్న ఒకేసారి చనిపోయారు. ఆ దుఃఖం నుండి ముందుగా తేరుకున్నది భార్గవే! భర్త, పిల్లలే కాకుండా డిగ్రీ చదువుతున్న తమ్ముడి బాధ్యత కూడా తనదే కాబట్టి తల్లిదండ్రుల మరణ బాధను కడుపులో దాచుకొంది. తండ్రి ఉద్యోగం తమ్ముడికి వచ్చాక పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. తల్లిదండ్రుల పుట్టినరోజులకు, పెళ్లిరోజుకు, వర్ధంతికి వృద్ధాశ్రమాల్లో, అనాధాశ్రమాల్లో అన్నదానాలు చేస్తారు. అలా ఓసారి ఒక ఓల్డేజ్ హోమ్ కు వెళ్లి వచ్చాక సుదీప్ చాలా డిస్టర్బ్ అయిపోయాడు. కొన్ని రోజులు ముభావంగా ఉంటూ ...తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది అక్కా బావలకు చెబితే ముందు వాళ్లే ఒప్పుకోలేదు. అయితే సుదీప్ మొండి పట్టుపట్టడంతో చివరకు ఒప్పుకోక తప్పలేదు. ఇక ఒప్పుకునే అమ్మాయి దొరకాలి. దొరకదేమోనన్న అనుమానం అక్కకు. సంకల్పం బలంగా ఉంటే అనుకున్నది జరుగుతుందన్న నమ్మకం తమ్ముడికి ఉంది.
‘మీరు సరిగ్గా నే విన్నారా? మీరు వివరంగా చెప్పారా అసలు?’ నమ్మలేనట్లు అడిగింది భార్గవి పెళ్లిళ్ల పేరయ్య తెచ్చిన అమ్మాయి ఫొటో, బయోడేటా చూస్తూ.
‘చెప్పానమ్మా. పెళ్ళిచూపులకు మీరు మంచి రోజు చూసుకుని చెబితే ..నేను వాళ్లకు చెప్తాను.’ పెళ్లిళ్ల పేరయ్య వెళ్లిపోయాక భర్తకు, తమ్ముడికి ఫోన్ చేసి చెప్పింది భార్గవి ఆనందంగా. తర్వాత తమ ఇంటి పురోహితుడికి ఫోన్ చేసి దగ్గరలో ఉన్న మంచి రోజులు శుభ సమయాలతో సహా చెప్పమని చెప్పింది. పెళ్లి చూపులుకే పెళ్లి అవుతున్నంత సంబరపడిపోయింది భార్గవి.
‘అమ్మా! మీరు ఈ ఆశ్రమానికి ఎలా వచ్చారు?’
‘కొత్త కథేముంటుంది బాబూ? ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యే కదా?’
‘సమస్యకు కారణం ఏమిటంటారు?’
‘స్వార్థం కాక మరేముంటుంది?’
‘ఎవరి స్వార్థం? పిల్లలదే కదా!’
‘పూర్తిగా కాదు బాబూ! తల్లిదండ్రులది కూడా.’
‘తల్లిదండ్రులదా? వాళ్లకు స్వార్థం ఏముంటుందమ్మా? తమ శక్తి యుక్తులు, సంపాదన, జీవితం మొత్తం పిల్లల కోసమే దారపోస్తారు కదా? వాళ్ళ త్యాగానికి ప్రతిఫలంగా చివరి దశలో చూసుకోకుండా వదిలేయటం పిల్లల తప్పు కాదా?’
‘తల్లిదండ్రులు పిల్లల కోసం చేయటం అనేది బాధ్యత. దానికి ప్రతిఫలం ఆశించటమే స్వార్థం అంటాను నేను.’
‘సరే. మీ మాటే సరైనది అనుకుందాము. మరి పిల్లలకు వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోవలసిన బాధ్యత లేదంటారా?’
".........."
‘చెప్పండమ్మా. బాధ్యత లేదంటారా లేక తెలియదంటారా?’
‘ఉందని తెలుసుకోకపోవడమే కావచ్చు.’
‘తెలియకపోతే తెలియ చెప్పాలి కదా?’
‘చెప్పినా వినకపోతే ఏం చేయాలి? కడుపులో లేనిది కావలించుకుంటే వస్తుందా?’
‘అమ్మా! ఏ సమస్య పరిష్కారానికైనా సామ బేధ దండోపాయలుంటాయి. మీకు తెలియదేమో తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత తీసుకోకుండా ఇలా అనాధాశ్రమాలు, రోడ్లపాలు చేస్తున్న పిల్లలను... కొడుకులు, కోడళ్ళు, కూతుళ్లను కూడా శిక్షించే చట్టాలు వచ్చాయి . ఇప్పుడు మీలాంటి చాలామంది తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లడానికి కూడా వెనుకాడడం లేదు.’
‘కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. కుటుంబం గుట్టు విప్పితే పరువు రట్టవుతుందని చాలామంది ఫిర్యాదు చేయడానికి వెనుకంజలోనే ఉన్నారన్న మాటా నిజమే కదా?’
‘అయితే తప్పక మార్పు రావాలి తల్లిదండ్రుల్లోనూ, పిల్లల్లో కూడా. తమ బిడ్డలే కదా తమను చూసుకోక ఎలా ఉంటారన్న అలివిమాలిన నమ్మకంతో ముందు చూపు లేకుండా తమకున్నదంతా బిడ్డల కోసమే ఖర్చు పెట్టేసో, ఇచ్చేసో.. మలిదశలో వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఎదురు చూడడం తప్పని.. ఇప్పటి పిల్లల ప్రవర్తన నిరూపిస్తోంది. ఆ ప్రవర్తనలో మార్పు తెచ్చే చట్టాలు రావడం సంతోషం. ఆ చట్టాలను.. అవసరమైన తల్లిదండ్రులు ఉపయోగించుకోవటమూ ఆనందమే.
అయితే మనుషుల్లో మార్పు పరస్పర ప్రేమానురాగాలతోనే రావాలి కానీ చట్టాల వల్ల రాదని... శిక్షా భయంతో ఒకవేళ వచ్చినా అది మొక్కుబడిగానే ఉంటుందని నా భావన.’
‘ఇంత బాగా పరిస్థితులను, మనుషులను అర్థం చేసుకున్నారు. మాట్లాడుతున్నారు. మీరేం చదువుకున్నారమ్మా’
‘చదువు అంటే మీ దృష్టిలో డిగ్రీలతో కొలిచే కాగితాలు. నా దృష్టిలో జీవితం నేర్పే అనుభవ పాఠాలు.’
‘బాగా చెప్పారమ్మా. మళ్లీ కలుద్దాం. నమస్తే!’
‘నమస్తే అమ్మా ! బాగున్నారా ? నేను ఆరు నెలల క్రితం ఇక్కడ ఇంటర్వ్యూ చేశాను.. మా టీవీ ఛానల్ కోసం! మీరు కూడా మాట్లాడారు.’
‘నమస్తే బాబూ! గుర్తొచ్చారు. బాగున్నారా?’
‘బాగున్నానమ్మా. ఇదిగో ..ఈమె విదీష... నాకు కాబోయే భార్య. మరో పదిహేను రోజుల్లో మా పెళ్లి. మా పెళ్ళికి మీరు రావడమే కాదు మాకు కానుక కూడా ఇవ్వాలి.’
‘కానుకా? ఆశీస్సులు తప్ప నేనేమీ ఇవ్వగలను బాబూ?’ ఆమె రవ్వంత ఇబ్బందిగా, విచారంగా అంది.
‘అవే.. మేము రోజూ పొందే అవకాశాన్ని ఇవ్వండమ్మా!’ సుదీప్ చిరునవ్వుతో అన్నాడు.
‘అంటే ?’ ఆమె అర్థం కానట్లు అడిగింది.
‘అంటే ....’ సుదీప్ వివరంగా చెప్పాడు. అతను చెప్పింది విని ఆమె మొదట నమ్మలేదు. తర్వాత ఆశ్చర్యపోయింది. భయపడింది. ‘నావల్ల మీకేం ఉపయోగ’మంటూ అభ్యంతరం చెప్పింది. విదీష వైపు అనుమానంగానూ చూసింది.
‘అమ్మా!ఆ రోజు మీరో మాట అన్నారు గుర్తుందా? మనుషుల్లో మార్పు చట్టాల భయంతో కాక పరస్పర ప్రేమతో రావాలి అని. మనం చేసే ఈ పని వల్ల కొందరిలోనన్నా మార్పు రావచ్చేమో! మార్పుకు శ్రీకారమైన ఆలోచనా విత్తూ పడొచ్చు కదా!. చిన్నప్పుడు "అమ్మ నాది ..అమ్మ నాది" అని పోట్లాడుకునే పిల్లలు ..పెద్దయ్యాక ‘అమ్మను చూడటం నా వల్ల కాదు..’ అని వంతులు, వాటాలు వేసుకునే స్వార్థపు ఆలోచనా దృక్పథం మారుతుందేమో చూద్దాం. మలి సంధ్య... మరో బాల్యంలా సంతోషంగా గడవాలన్న ఆకాంక్ష తప్ప మాకు మరేమీ స్వార్ధం లేదమ్మా. నిదానంగా, ప్రశాంతంగా ఆలోచించండమ్మా’ అని అన్నాడు సుదీప్.
ఇద్దరూ ఎంతో సేపు నచ్చ చెప్పాక, ఆశ్రమ పెద్దలు కూడా వివరించాక ... 'తనకు నచ్చకపోతే ఎప్పుడైనా తిరిగి వచ్చేయడానికి ఒప్పుకోవాలని, తనమీద హక్కులు ఏమి ఉండకూడదన్న' షరతుతో ఒప్పుకుందామె అయిష్టంగానే.
సుదీప్ విదీషల పెళ్లి నిరాడంబరంగా జరిగింది. రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లితో పాటు "దత్తత" కూడా రిజిస్టర్ చేయబడింది. తమ తల్లిదండ్రుల వర్ధంతి రోజు అన్నదానం చేస్తూ తాను ఇంటర్వ్యూ చేసిన ...పిల్లలు వదిలేసిన ఒక తల్లిని దత్తత తీసుకున్నారు సుదీప్ విదీషలు. పిల్లలు లేని దంపతులు పిల్లలను దత్తత తీసుకున్నట్లే తల్లిదండ్రులు లేనివారు.. అనాధలుగా బతుకుతున్న తల్లిదండ్రులను దత్తత తీసుకొంటే ఇటు తమకు వారి ప్రేమ, అటు వాళ్ళకు చివరిదశలో ప్రశాంతంగా.. కుటుంబం, పిల్లలతో గడిపిన ఆనందం దక్కుతుందన్న సుదీప్ సదాశయము మెచ్చి అతన్ని పెళ్ళాడింది విదీష. తనకు పాదాభివందనం చేస్తున్న కొత్త దంపతులను మనసారా ఆశీర్వదించిందా అమ్మ.
యం. ఆర్ అరుణ కుమారి
8121523835








కామెంట్‌లు (0)