గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅనురాగమే చిరునామా

4 రోజుల క్రితం

anuragamechirunama-
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 08:49 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

అనురాగమే చిరునామా‘సార్, మీకోసం ఎవరో పెద్దాయన ఎదురు చూస్తున్నారు, లోపలికి పంపమంటరా?’ అడిగాడు అటెండర్ సత్తెయ్య.

‘ఈ రోజు చాలా బిజీ షెడ్యూలు ఉంది. సాయంత్రం దాకా ఉండగలిగితే ఉండమను.. లేదంటే ఆయనకు ఏమి కావాలో రాసి ఇమ్మను, ఒక వేళ సాయంత్రం దాకా ఉంటే, ఆయనకు భోజన ఏర్పాట్లు చేయి’ అంటూ టెలీ కాన్ఫరెన్స్‌కు వెళ్ళాడు గిరిధర్.

సాయంత్రం అయ్యాక మళ్ళీ ఒక్కసారి సత్తెయ్య ‘సార్ పెద్దాయన మీకోసం ఉదయం నుంచి విజిటర్ వెయిటింగ్ రూమ్‌లో కూర్చొని ఉన్నారు. పంపమంటరా?’ అడిగాడు.

‘అయ్యో, పంపు’ అంటూ ఫైల్స్ ఓపెన్ చేశాడు గిరిధర్.

‘ఏరా గిరి! కన్నతండ్రిని విజిటర్ రూమ్‌లో వెయిట్ చేయించేంత పెద్దవాడివయ్యవా?’ అంటూ పెద్దగా అరుచుకుంటూ ఛాంబర్‌లోకి అడు‌గుపెట్టాడు విజయేంద్ర.

‘అయ్యో నాన్నా మీరా? ఫోన్ చేసి రావచ్చు కదా?’ అంటూ సీట్‌లో నుంచి లేచి, తండ్రికి ఎదురువెళ్ళాడు గిరిధర్.

‘చాలా సార్లు చేశాను, మెసేజ్ పెట్టాను, నా నెంబర్ బ్లాక్ చేసేవేమో?’ అంటూ కొడుకుపై కొంత అసహనంగా మాట్లాడాడు.

‘లేదు నాన్న! ఉదయం నుంచి టెలీకాన్ఫరెన్స్‌‌లో ఉండి సెల్‌‌ఫోన్‌ ‌సైలెంట్‌‌లో పెట్టాను’ అంటూ మిస్డ్‌‌కాల్స్‌‌ను పరిశీలించి, ఆయన మాటను రూఢి చేసుకున్నాడు గిరిధర్‌.

‘కనీసం అటెండర్‌‌కి చెప్పవచ్చు కదా, మీ వివరాలు?’ అని తన తండ్రికి ఎదురుగా కూర్చున్నాడు గిరిధర్.

‘నేను వచ్చాను అంటే కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వవేమో అని వెయిట్ చేశాను’ అంటూ తాను వచ్చిన సంగతి చెప్పడం మొదలుపెట్టాడు విజయేంద్ర. ‘మీ అమ్మ నిన్ను చూడాలి అనుకుంటున్నది. నీవు ఒప్పుకుంటే తీసుకొని వస్తాను’ అంటూ కొడుకు సమాధానం కోసం ఎదురుచూశాడు విజయేంద్ర.

‘ఎటువంటి షరతులూ లేకుంటే ఎప్పుడైనా రావచ్చు, పోవచ్చు.. నేను ఎక్కడ ఉంటే అక్కడ నా దగ్గరే ఉండవచ్చు. దానికి నా పర్మిషన్లు అవసరం లేదు నాన్న’ అంటూ బదులిచ్చాడు గిరిధర్.

‘అదే చివరిమాటనా?’ అంటూ విసురుగా లేచి, బయటకు నడిచాడు విజయేంద్ర. ఆయనను ఆపే ప్రయత్నం చేయకుండా తన పనిలో నిమగ్నమయ్యాడు గిరిధర్.

ఆయన విసురుగా వెళ్ళడం చూసి, సత్తెయ్య ఛాంబర్ లోపలికివచ్చి ఆయనను తిట్టడం మొదలుపెట్టాడు. సత్తెయ్యను అడ్డుకుంటూ ‘సత్తెయ్యా ఆయన మా తండ్రి అలా మాట్లాడకు’ అని సత్తెయ్య నోటికి అడ్డుకట్ట వేశాడు. ‘బయట నా కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారేమో చూడు, నా క‌థ చెబుతాను’ అని నవ్వుకున్నాడు.

‘విజిటర్స్‌ ఎవ‌రూ లేరు’ అని రూఢి చేసుకున్నాక, గిరిధర్ తన జీవితంలో జరిగిన సంఘటన చెప్పడం ప్రారంభించాడు.


‘మాది ఒక ఉన్నత మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారు రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్. మా అమ్మ ముత్యాల వ్యాపారి. వాస్తవానికి ఆర్థికంగా మంచిస్థితిలో ఉన్నా, డబ్బు, హోదా కోసం మా తల్లితండ్రులు ఎప్పుడూ ఆలోచించేవారు. అన్నప్రాసన రోజే నా జీవిత లక్ష్యం నా ప్రమేయం లేకుండా నిర్ణయం అయిపోయింది. నేను వాళ్ళ హోదాకు తగ్గకుండా ఐఏఎస్ కావాలి అన్నది వాళ్ళ నిర్ణయం. నా చిన్నతనంలో మా నానమ్మనే నాకు అన్నీ. ఆమె నా ఆరవ ఏట మరణించింది. అమ్మ వ్యాపారంలోనూ, నాన్న సైన్యంలోనూ ఉండటంతో నాకు తగిన సమయం కేటాయించే అవకాశం లేకపోయింది. నన్ను హాస్టల్‌‌లో చేర్చారు. సెలవుల్లో కూడా హాస్టల్లోనే ఉండేలా ఏర్పాట్లు చేశారు. అందరూ వారి సెలవులకు ఇంటికెళ్తే, నేను హాస్టల్లోనే ఉండాలి. మొదట్లో ఎప్పుడన్నా అమ్మానాన్న వచ్చేవారు. వచ్చినా వారి ప్రశ్నలు నా గురుంచి కాదు, నా మార్కుల గురుంచే ఉండేవి. నా చదువు పురోగతి గురించి మాత్రమే. మొదట్లో హాస్టల్ నుంచి పారిపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. వార్డెన్‌కి దొరికిపోయాక ఇంకా కట్టుదిట్టం చేశారు. అప్పటి నుంచి పారిపోవాలనే ఆలోచన మానుకొని, ఐఏఎస్ అవ్వాలన్న లక్ష్య సాధన కోసం కష్టపడి చదవడం మొదలుపెట్టాను.

హాస్టల్ వాచ్‌మెన్, స్వీపరు యాదమ్మ, లక్ష్మయ్య నా పెంపుడు తల్లిదండ్రులు అయ్యారు. వాళ్ళకు పిల్లలు లేకపోవడంతో వాళ్ళకు నేనే కొడుకును అయ్యాను. యాదమ్మ మేనకోడలు మౌనిక సెలవులకు అత్తామామల దగ్గరకు వచ్చేది. నేను కోల్పోయిన ప్రేమ, అభిమానం వారి ముగ్గురి దగ్గర దొరికేది. మౌనిక వస్తుంది అంటే సంతోషం, వెళ్ళిపోతుంది అంటే భాధ. వాళ్ళు నా దగ్గర నుంచి ఏమి ఆశించకుండానే నా ఆర్థిక అవసరాలు తప్ప, అన్నీ తీర్చారు. ఐఏఎస్ సెలెక్ట్ కాగానే ట్రైనింగ్ లో ఉన్నపుడు, అమ్మానాన్న వచ్చారు. రెండురోజులూ ఉన్నారు. కానీ మా మధ్య మాట్లాడుకోవడాని మాటలు కరువయ్యాయి. తర్వాత యాదమ్మ దంపతులు, మౌనిక దగ్గరకు వెళ్లాను. విషయం తెలిసి, అక్కడకి వచ్చి అమ్మానాన్న చేసిన గొడవ అంతా ఇంతా కాదు.

నేను వాళ్ళకు ఒక్కటే చెప్పాను ‘మీరు నాకు ఏమి ఇచ్చారో అదే మీకు అవసరం. నా శక్తి మేరకు మీకు అవసరం అయినప్పుడు ఇస్తాను. అలాగే యాదమ్మ, లక్ష్మయ్య, మౌనిక నాకు ఏమి ఇచ్చారో.. అవే వాళ్ళకు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాను’ అని. ‘అలాగైతే నా ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వను’ అని నాన్న అన్నారు. ‘యాదమ్మ, లక్ష్మయ్య, మౌనికను విడిచిపెట్టాలి’ అనేది అమ్మ కండీషన్. యాదమ్మ, లక్ష్మయ్య, మౌనికను దూరం చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. పోస్టింగ్ వచ్చాక ఒకానొక సమయంలో యాదమ్మ , లక్ష్మయ్య, మౌనిక కొన్నిరోజులు దూరమయ్యారు. కానీ నా మనసు వారి చుట్టే తిరిగింది. మౌనికను పెళ్లి చేసుకోవడానికి యాదమ్మ, లక్ష్మయ్యను కష్టపడి ఒప్పించి, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. మళ్ళీ వాళ్లను విడిచి రమ్మని చెప్పడానికే మా నాన్న వచ్చారు. ఇప్పుడు తీర్పు ఇవ్వు సత్తెయ్య!’ అంటూ నవ్వుతూ సత్తెయ్య వంక చూశాను.

ఏమి మాట్లాడాలో అర్థంకాక ‘మీకు అంతా మంచే జరగాలి సార్!` అని చెప్పి, బయటకు వెళ్ళిపోయాడు సత్తెయ్య.

వారం గడిచాక, తండ్రి విజయేంద్ర తల్లి రాజ్యలక్ష్మిని తీసుకొని వచ్చాడు. వారు గిరిధర్‌‌ను ఒప్పించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. గిరిధర్ సూటిగా తాను చెప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా చెప్పాడు.

‘మీ ఆస్తిలో ఒక్క పైసా కూడా అక్కర్లేదు. మీరు కుల పట్టింపులు వదిలేయండి. ఒక కన్నకొడుకుగా మిమ్మల్ని చివరివరకూ చూస్తాను. అలాగే యాదమ్మ, లక్ష్మయ్యలనూ చూస్తాను. మౌనికతో కలిసే ఉంటాను. వాళ్ళు నాకన్నా బాగా మిమ్మలిని గౌరవిస్తారు, చూసుకుంటారు’ అని తన అభిప్రాయాన్ని చెప్పాడు.

‘ఆలోచించుకొని చెప్తాం!’ అంటూ బయటకు వెళ్లారు.

వాళ్ళు తిరిగి వస్తారు అనే ఆశతో గిరధర్‌‌తో పాటూ యాదమ్మ, లక్ష్మయ్య, మౌనిక ఎదురుచూస్తున్నారు.

మనస్విని


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్