బయట ఇంకా తెల్లవారలేదు. పక్షుల కిలకిలారావాల కంటే ముందే శ్రావ్య గదిలో మొబైల్ వైబ్రేషన్ 'రుయ్.. రుయ్..' మంటూ ఆ మౌనాన్ని ఛేదించింది. నిద్రకళ్లతోనే తడముకుంటూ ఫోన్ అందుకుంది శ్రావ్య. ఆ గాఢాంధకారంలో మొబైల్ స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై ఒక కృత్రిమ నీలి కాంతిని ప్రసరించింది. కళ్లు బైర్లు కమ్మినా మనసు మాత్రం ఆత్రుతగా ఫేస్‌బుక్ మాయాలోకంలోకి ప్రవేశించింది. రాత్రి తను పెట్టిన 'మూడ్ ఆఫ్' పోస్ట్‌కి ఎన్ని సానుభూతి కామెంట్లు వచ్చాయో చూడాలనే తాపత్రయం అది. వందమంది కామెంట్ లతో పరామర్శించారు. వెయ్యి మంది లైక్ కొట్టారు. ఆ నిద్రమత్తులోనూ ఆమె అధరాలపై ఒక గెలుపు నవ్వు మెరిసింది. అపరిచితుల పొగడ్తలకు రిప్లైలు ఇస్తూ, తన డిజిటల్ సామ్రాజ్యంలో తానే గొప్పగా మురిసిపోయింది.
కాసేపయ్యాక... ఆ రోజుటి పోస్టింగ్ కోసం వేట మొదలుపెట్టింది. గూగుల్ తల్లిని ఆశ్రయించి, ‘హార్ట్ టచింగ్ గుడ్ మార్నింగ్ తెలుగు కొటేషన్స్’ అని నెమ్మదిగా వాయిస్ సెర్చ్ చేసింది. తెరపై ప్రత్యక్షమైన వందలాది సూక్తులలో ఒక వాక్యం ఆమెను ఆకర్షించింది. ‘గడచిన కాలం పాఠం నేర్పుతుంది.. రాబోయే కాలం కొత్త ఆశను ఇస్తుంది. అందరికీ శుభోదయం!’ నిజానికి గడిచిన కాలం ఆమెకు ఏ పాఠం నేర్పిందో ఆమెకే తెలియదు కానీ ఆ వాక్యం లైకులను రాల్చుతుందని మాత్రం తెలుసు.
దాన్ని కాపీ చేసి ఎప్పుడో పది రోజుల క్రితం ఒక ఖరీదైన కేఫ్‌లో ముఖానికి రంగులద్ది, కాఫీ కప్పు పట్టుకుని స్నాప్ చాట్ లో దిగిన సెల్ఫీకి జత చేసి పోస్ట్ చేసింది.
పక్కనే గ్లాసులో రాత్రి మిగిలిపోయిన నీళ్లు ఉన్నాయి. వాటిని ఒక గుక్క తాగి మళ్లీ దుప్పటి ముసుగు తన్ని పడుకుంది.
ఉదయం ఎనిమిది గంటలు. ఆ ఇల్లు ఒక నివాసంలా లేదు. ఒక అస్తవ్యస్తమైన యుద్ధరంగంలా ఉంది. ఒకపక్క పిల్లల పుస్తకాల సంచులు...మరోపక్క భర్త రఘు ఆఫీస్ ఫైళ్ల హడావిడి. వంటింట్లోంచి మాడిన తాలింపు వాసన గాలిలో ఘాటుగా ప్రసరిస్తోంది. కానీ, అవేవీ శ్రావ్యను స్పృశించడం లేదు. ఆమె శరీరం అక్కడ ఉన్నా ఆమె ఆత్మ మాత్రం ఫేస్‌బుక్ నోటిఫికేషన్ల సవ్వడిలో విహరిస్తోంది. ఎలాగోలా పిల్లలను సాగనంపి, రఘు చేతికి అరకొరగా సర్దిన క్యారేజీని ఒక యంత్రంలా అందించి పంపించేసింది. ఆమె హృదయం ఆ ఇంట్లోని స్పందనలకు కాక ఆన్‌లైన్ లోని స్పందనలకు కొట్టుకుంటోంది. తలుపు గడియ పడగానే శ్రావ్య సోఫాలో వాలి మళ్ళీ ఆ సోషల్ మీడియా మత్తు ప్రపంచంలోకి జారిపోయింది. ఫేస్బుక్ లో లభించే 'సూపర్ బ్యూటీ', 'దేవత' అనే కృత్రిమ బిరుదులు వింటుంటే ఆమె గర్వంగా ఫీలయ్యింది. పదేళ్ల కాపురంలో రఘు ఎప్పుడూ తనను ఇంతలా పొగడలేదని, తనలోని అందాన్ని అతను గుర్తించలేదని ఒక బాధగా నిట్టూర్పు విడిచింది.
ఆ క్షణాన ఆమెకు రఘు ఒక సామాన్యమైన వ్యక్తిగా, తన అద్భుత ప్రపంచానికి అడ్డుపడే ఒక అవరోధంగా కనిపించాడు. వెంటనే ఆమె చూపు ఇన్‌స్టాగ్రామ్ వైపు మళ్లింది. వంటింట్లో మాడిన గిన్నెలను సింక్‌లోకి నిర్దాక్షిణ్యంగా తోసేసి ముఖానికి మూడు పొరల ‘డిజిటల్ ఫిల్టర్' అద్ది ఒక రీల్ చేసింది. గరిటె పట్టుకుని ఆమె వండిన వంటకు గంటలో వ్యూస్ వెయ్యి దాటాయి. ఒకడు ఆమె నడుము వంపును పొగిడితే, మరొకడు ఆమె చీర కట్టును కామెంటు చేశాడు. ఆ వ్యాఖ్యల్లోని వెకిలితనాన్ని ఆమె అసహ్యించుకోలేదు. పైగా తన గ్లామర్‌కు ప్రపంచం దాసోహమంటోందని గర్వపడింది.
మధ్యాహ్నం రెండు గంటలు. కడుపులో ఆకలి నరాలన్నీ మెలికలు తిరుగుతున్నా వంట చేసే తీరిక లేదు. ఒక ఎండిన ఆపిల్ ముక్కను పాత ప్లేటులో పెట్టి అందంగా ఫోటో తీసి, ‘డైట్ ఫాలో అవుతున్నాను’ అని స్టోరీ పెట్టింది. ఆ అబద్ధపు స్టోరీకి వచ్చే ‘హార్ట్’ ఎమోజీలే ఆమె కడుపు నింపే అమృతంలా అనిపించాయి. అదే సమయంలో ఆమెకు ఒక పెద్దాయన నుంచి సందేశం వచ్చింది. ‘అమ్మా శ్రావ్యా! నీలో ఒక గొప్ప కవయిత్రి దాగి ఉంది. నీ అంతరంగాన్ని కవితా రూపంలో ఆవిష్కరించు తల్లీ.’ ఆ పొగడ్త శ్రావ్య మనసులో కొత్త మత్తును నింపింది. ‘నిజమే కదా!’ అనిపించింది. ఆలోచించింది. ఈ మధ్య కవులు ఎక్కువగా కనపడుతున్నారు. సన్మానాలు ఎక్కువగా జరుగుతున్నాయి అనుకుంది. వెంటనే గూగుల్‌లో వెతికి ఒక కవితను తీసుకుంది. ‘మౌనమే నీ భాషా.. మనసే నీ అన్వేషణా...’ ఒరిజినల్ కవి పేరు తీసేసి తన పేరు తగిలించింది. పోస్ట్ చేసిన కొద్దిసేపటికే నోటిఫికేషన్ల మోత మొదలైంది. గ్రూపుల్లో ఉన్న కొందరు వృద్ధ కవులు, ఇతర సాహిత్య ప్రియులు కామెంట్ల వర్షం కురిపించారు. అమ్మాయిల పేర్లుతో ఫేక్ ప్రొఫైల్ పెట్టుకునే మగాళ్ళు అందమైన కామెంట్లు మొదలు పెట్టేసారు.
‘అమ్మా శ్రావ్యా! నీ కవితలో అక్షరం అక్షరం ఒక మణిపూసలా ఉంది. కానీ ఆ కవిత కంటే నీ కళ్లు ఇంకా గొప్ప భావాల్ని వ్యక్తం చేస్తున్నాయి. కవయిత్రికి ఉండాల్సిన లాలిత్యం నీలో మెండుగా ఉంది!’ అని కవిరత్న రామారావు కామెంటు చేసాడు. శ్రావ్య పొంగిపోయింది .
‘ఏం సొగసు.. ఏం భావం! ఈ కవిత నీ పెదవుల నుండి జాలువారితే వినాలని ఉంది. అక్షరాల కంటే నీ అందమే ఈ కవితకు నిండుతనాన్ని ఇచ్చింది.’ శ్రీనురావు అనే కవి కామెంట్. శ్రావ్య ఆ కామెంట్లు చదువుతూ లోకమే మర్చిపోయింది. అక్కడ కవితలోని గొప్పతనం కంటే తన ఫోటోలోని అందాన్నే అందరూ పొగుడుతున్నారు అని గ్రహించలేకపోతుంది. ఇదేదో బాగుందనుకుంది. మనసు దూది పింజంలా తేలింది. తన అబద్ధపు మేధాశక్తికి మురిసిపోతూ ఆ పొగడ్తల మత్తులో తను ఒక ‘సాహిత్య శిఖరం’ అని భ్రమపడింది. కొందరు ఫేమస్ కవులు ఇన్ బాక్స్ లోకి కూడా వచ్చేశారు. ఆమెను పొగడ్తలతో ముంచేశారు .
రఘు ఆఫీసు నుండి అలసిపోయి వచ్చే సమయానికి కూడా ఆమె అదే మాయాజాలంలో ఉంది. ఆమె చేతిలో వెలుగుతున్న మొబైల్ స్క్రీన్ ఉంది కానీ...ఆ ఇంట్లో మనుషుల మధ్య ఉండాల్సిన అనురాగపు వెలుగు లేదు. ఆ రోజంతా రఘు పిల్లల గురించి ఏది అడిగినా...‘నేను ఒక కవిత రాస్తున్నాను డిస్ట్రర్బ్ చేయకండి’ అంటూ విసుక్కుంది. నిజానికి ఆ కవితలో ఒక్క అక్షరం కూడా ఆమెది కాదు. కానీ ఆ 'అందాల కవయిత్రి' అనే ట్యాగ్ ఆమెను తన వాస్తవ జీవితం నుండి పూర్తిగా వేరు చేసేసింది. తన ఇంటి బాధ్యతల కంటే ఆ కొందరి పొగడ్తలే ఆమెకు శ్వాసగా మారిపోయాయి. ఆ 'అందాల కవయిత్రి' అనే ముద్ర శ్రావ్య జీవితాన్ని ఒక మాయా వేగంతో మార్చేసింది. గూగుల్ నుండి తీసుకున్న భావాలకు, స్నాప్‌చాట్ ఫిల్టర్ల మెరుగులు అద్ది ఆమె వదులుతున్న ఒక్కో పోస్ట్, సోషల్ మీడియాలో ఒక ప్రకంపన సృష్టించింది. కేవలం లైకులకే పరిమితం కాకుండా, ఆమె కీర్తి ఇప్పుడు నిజ జీవితంలోని సాహిత్య వేదికల వరకు పాకింది. ఒక ప్రసిద్ధ సాహిత్య సంస్థ ఆమెకు ‘భావ కవితా కళానిధి’ అనే బిరుదును ప్రకటించింది. ఒక పురాతన సభా ప్రాంగణంలో కవి సమ్మేళనం. వేదికపై ఉన్నత శ్రేణి కవులు, పండితులు కూర్చుని ఉన్నారు. శ్రావ్య పట్టుచీర కట్టుకుని, చేతిలో ఖరీదైన మొబైల్ పట్టుకుని మహారాణిలా ప్రవేశించింది. ఆమెకు అవార్డు ఇస్తూ ‘శ్రావ్య గారు ఆధునిక సాహిత్యానికి ఒక వరప్రసాదం. ఆమె అక్షరాల్లో ప్రాచీన గాంభీర్యం, ఆధునిక ఆవేదన రెండూ మేళవించి ఉన్నాయి. ఇంతటి సౌందర్యవతి, ఇంతటి మేధావి కావడం మన కాలపు అదృష్టం!’ అని ఉపన్యాసాలు దంచేసారు . శ్రావ్య వేదికపై సన్మానం పొందుతుంటే, చుట్టూ కెమెరాల క్లిక్కులు, చప్పట్లు. సభ ముగిశాక పెద్ద పెద్ద కవులు ఆమెతో 'సెల్ఫీ'లు కూడా దిగారు. కొందరు సీనియర్ కవులైతే పుస్తకం ప్రింటింగ్ వేద్దాం...ముందు మాట రాస్తాను అని ఒకరు అన్నారు.
సభాధ్యక్షులు, ప్రముఖ విమర్శకులు డాక్టర్ సన్నిహిత్ శ్రావ్యను పరిచయం చేస్తూ ‘సాహిత్య ఆకాశంలో శ్రావ్య గారు ఒక ధ్రువతార. ఆమె అందం అలంకారం అయితే... ఆమె అక్షరం ఒక అగ్నిధార. ఈరోజు మన అభ్యర్థన మేరకు... ఆమె తాను రాసిన 'మౌనమే నీ భాష' కవితలోని అంతరార్థాన్ని వివరిస్తూ, అప్పటికప్పుడు ఒక ఆశుకవితను వినిపించాలని కోరుతున్నాను’ అని మైక్ అందించారు.
సభలో నిశ్శబ్దం గడ్డకట్టుకుపోయింది. శ్రావ్య మైక్ ముందుకు నడిచింది. ఆమె వేళ్ళు వణుకుతున్నాయి. గుండె చప్పుడు పెదవుల వరకు వినిపిస్తోంది. అప్పటికప్పుడు ఆశు కవిత అంటే గుండె జారి నట్టయింది . గూగుల్ తల్లి తోడు లేని ఆ క్షణాన, చాట్ జిపిటి ఓపెన్ చేస్తే దొరికిపోతానేమో అని తన మేధస్సులోని శూన్యం ఆమెను వెక్కిరించింది. ‘అదీ ... కవిత్వం అనేది హృదయం నుండి వస్తుంది...’ అని తడబడింది శ్రావ్య.
సరిగ్గా అప్పుడే సభలోంచి ఒక వృద్ధుడు లేచి నిలబడ్డారు. చిరిగిపోయిన చొక్కా, కళ్లద్దాల వెనుక నిప్పులు చెరిగే కళ్లు ఆయనవి. !అమ్మా! నువ్వు రాసిన ఆ 'మౌనమే నీ భాష' కవిత పదేళ్ల క్రితం నా పుస్తకం లో అచ్చయింది. అది నా కూతురు మరణించినప్పుడు నా గుండె రగిలి రాసిన అక్షరం. రచయిత పేరు తుడిచేయడం సులభమే తల్లీ... కానీ ఆ అక్షరం వెనుక ఉన్న ఆవేదనను నువ్వు మోయగలవా?. ఆ కవితలోని మూడవ పాదానికి అర్థం చెప్పు... ఈ కీర్తిని నీకే వదిలేస్తాను!’తన పుస్తకం చేతిలో పెట్టుకుని అన్నాడు. సభ ఒక్కసారిగా నివ్వెరపోయింది. శ్రావ్య నోట మాట రాలేదు. ఆమె అబద్ధాల మేడ కుప్పకూలిపోయింది. అప్పటి వరకు ఆమెను 'ప్రముఖ కవయిత్రి' అని ఆకాశానికి ఎత్తిన ఆ ముసలి కవుల మొహాలు మాడిపోయాయి. ముఖం తెలియని అభిమానులు ఇప్పుడు అసహ్యంగా, ఎగతాళిగా చూడటం మొదలుపెట్టారు. శ్రావ్య ఆ అవమానాన్ని తట్టుకోలేక వేదిక మీద నుండి పరుగెత్తుకుంటూ బయటకు వచ్చింది.
ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి దాటింది. హాల్లో లైటు వెలుగుతోంది. రఘు సోఫాలో కూర్చుని ఉన్నాడు. అతని కళ్లలో కోపం లేదు, కానీ ఒక తీరని శూన్యం ఉంది.
‘అందరిలో పరువు పోయింది రఘు... నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను’ అని బావురుమంది శ్రావ్య. రఘు నెమ్మదిగా లేచి ఆమె దగ్గరకు వచ్చాడు. ‘పరువు ఇప్పుడు పోలేదు శ్రావ్యా! నీ బిడ్డ ఆకలిని చూడకుండా లైకుల కోసం ఆరాటపడిన రోజే పోయింది. అపరిచితుల వెకిలి నవ్వుల కోసం నీ ఆత్మీయతను తాకట్టు పెట్టిన రోజే పోయింది. ఇన్నాళ్లూ నువ్వు మురిసిపోయిన ఆ 'డిజిటల్ సామ్రాజ్యం' ఒక అద్దాల మేడ. అది ఎప్పుడో ఒకప్పుడు పగలాల్సిందే!’ ఆమె చేతిలోని ఫోన్ తీసుకుని కిటికీ వెలుపల ఉన్న చీకటిలోకి చూస్తూ అన్నాడు. ఆమెకు ఒక నిష్ఠుర సత్యం అర్థమైంది. ఆన్‌లైన్ లో దొరికే గుర్తింపు ఒక ఎండమావి. అది దాహాన్ని తీర్చదు, కేవలం భ్రమను మాత్రమే మిగిలిస్తుంది అని అర్థమైంది. వణుకుతున్న చేతులతో శ్రావ్య ఒక్కొక్క సోషల్ మీడియా ఖాతాను శాశ్వతంగా మూసివేసింది. ఒక్క క్లిక్కుతో తన అబద్ధపు లోకాన్ని చిధిమేసింది. ఫోన్ స్క్రీన్ నల్లగా మారిపోయింది. కానీ, ఆ క్షణాన ఆమె మనసులో ఒక అద్భుతమైన ప్రశాంతత ఆవరించింది.
మర్నాడు ఉదయం పక్షుల కిలకిలారావాల కంటే ముందే శ్రావ్య నిద్రలేచింది. ఈసారి ఫోన్ వైబ్రేషన్ కోసం కాదు, తన నిద్రపోతున్న బిడ్డ నుదుటిపై ముద్దు పెట్టడానికి. అద్దం ముందు నిలబడ్డ శ్రావ్యకు ఇప్పుడు ఏ 'డిజిటల్ ఫిల్టర్' అవసరం లేదు. ఆమె కళ్లలో ఉన్న పశ్చాత్తాపమే ఆమెకు ఒక కొత్త కాంతిని ఇచ్చింది. బయట సూర్యుడు ఉదయిస్తున్నాడు. అబద్ధాల యవనిక తొలగిపోయింది.. అక్షర సత్యం సాక్షాత్కరించింది. అనురాగపు పునాదుల మీద శ్రావ్య ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించింది.
కత్తిమండ ప్రతాప్ కుమార్
9000343095








కామెంట్లు (0)