mh ad
ఆదివారం, 28 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅద్భుతాల మధ్య అనుభూతులు

2 గంటల క్రితం

Great Wall of China - Han, Yuan, Dynasties
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 07:01 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

"కలలు కనే కథలా.. కనుల ఎదుట నిలిచావా.. నింగిని తాకే అందాలేవో.. నేలకు దిగి వచ్చాయా!" ఓ సినీ కవి రాసిన గీతంలా చైనాలోని ఆకాశహర్మ్యాలు, అద్భుత ప్రగతిని చూసి పరవశించిన పర్యాటకుల అనుభూతికి అద్దం పట్టేలా సాగింది మా ప్రయాణం. ఎక్కడో మనసులో ఒక చిన్న భయం, మరెన్నో అపోహలు, సందేహాలు.. వీటన్నింటి నడుమ కర్నూలు నుండి మా 10 మంది బృందం చైనాకు ప్రయాణమయ్యాం. ఎస్ఎఫ్ఐ మాజీ కార్యకర్త, బెంగళూరుకు చెందిన డాక్టర్ వెంకటేశ్వర్లు-జగదాంబిక దంపతులు, డాక్టర్ శ్రీహరి, డాక్టర్ నాగభూషణం, డాక్టర్ రంగన్న, డాక్టర్ రాంగోపాల్ రావుతో కూడిన వైద్యుల బృందం, అలాగే నేను, నా శ్రీమతి కల్పన, మిత్రుడు రామసుబ్బారెడ్డి-ప్రమీలారాణి.. అందరం కలిసి ఎన్నో కలలు కన్న ఆ సోషలిస్టు దేశంలో అడుగుపెట్టాం. ఆ తొమ్మిది రోజుల పర్యటన మాకు ఎనలేని సంతోషాన్ని, మరువలేని అనుభూతులను మిగిల్చింది.
విమానం దిగగానే ఆకాశాన్ని తాకేలా ఉన్న బహుళ అంతస్తుల భవనాలు మమ్మల్ని అబ్బురపరిచాయి. తల పైకెత్తి చూస్తే నింగికెగిసిన ఆ కట్టడాలు చైనా ఆధునికతకు అద్దం పట్టాయి. బీజింగ్, జియాన్ ప్రావిన్స్, షాంఘై నగరాల మధ్య వేల కిలోమీటర్లు బుల్లెట్ రైలులో ప్రయాణించినా ఎక్కడా పచ్చదనం తగ్గలేదు. రోడ్లకు ఇరువైపులా వందలాది వృక్షాలు, రంగురంగుల గులాబీ పూలమొక్కలు మాకు స్వాగతం పలికాయి. అక్కడి రైల్వేస్టేషన్లు కూడా మన దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల తరహాలో ఎంతో విశాలంగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అత్యంత పరిశుభ్రంగా ఉన్నాయి. పాఠశాల స్థాయిలో చైనీస్ భాషలోనే ఉచిత విద్య అందిస్తారు. యూనివర్సిటీ స్థాయిలో ఫీజులు ఉంటాయి. ప్రజల్లో 'సివిక్ సెన్స్' చాలా ఎక్కువ. పాదచారులు రోడ్డు దాటుతుంటే, సిగ్నల్ పడకపోయినా కార్లను ఆపి గౌరవిస్తారు. మనలాగా వాహనాలను ఒకదానికొకటి తాకించేలా ఆపరు. అక్కడ బహిరంగ ప్రదేశాల్లో కూడా ప్రజలు విపరీతంగా సిగరెట్లు కాల్చడం మాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. మేము షాంఘైలో 88 అంతస్తుల బిల్డింగ్‌ను కేవలం 45 సెకన్లలో లిఫ్ట్ ద్వారా చేరుకున్నాం. ఆ వేగానికి చెవుల్లో గిర్రున శబ్దం వచ్చింది. అక్కడ 125 అంతస్తుల భవనాలకు కూడా లిఫ్టులు ఉన్నాయి. గాలిలో ట్రాక్‌పై 10 సెంటీమీటర్ల పైన ప్రయాణించే 'ఫ్యూచరిస్టిక్' (Maglev) బుల్లెట్ రైలులో ప్రయాణించాం. ఇది గంటకు 450 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. హోటల్‌లో మా బృందంలోని డాక్టర్ వెంకటేశ్వర్లు డెంటల్ కిట్ ఆర్డర్ ఇస్తే, ఒక రోబో వచ్చి రూమ్ తలుపు తట్టి మరీ కిట్ అందించడం విశేషం. చైనాలో ప్రైవేట్ ఆసుపత్రులు లేవు, అన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. వైద్య ఖర్చుల్లో 75 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ప్రజలు కేవలం 25 శాతం భరిస్తే సరిపోతుంది. అక్కడ హత్యలు, మోసాలు అనేవి ప్రజలకు అస్సలు తెలియవు. 'Rule of Law' కచ్చితంగా పాటిస్తారు. దొంగలు, దోపిడీల భయం లేని దేశం అది.

chaina

చారిత్రక ప్రదేశాల సందర్శనం..

ఇక మా ట్రిప్‌లో చూసిన చారిత్రక ప్రదేశాల గురించి ప్రస్తావిస్తాం. బీజింగ్‌లో ప్రపంచంలో ఏడు వింతలతో ఒకటి అయిన గ్రేట్‌వాల్ ఆఫ్ చైనా సందర్శించాం. 21,196 కిలోమీట‌ర్లు రక్షణ గోడ నిర్మించడానికి రెండు వేల సంవత్సరాలు పట్టింది. మంచు రాజులు, సైన్ రాజులు మంగోలియా రాజుల నుండి రక్షణ కొరకు నిర్మించుకున్నారు. నిర్మించడానికి ప్రజలు ఎంతగా శ్రమించారో కదా! ఎత్తున ఉన్న పర్వతాల గుండా గోడను ఎలా నిర్మించారోనని ఆశ్చర్యం చెందాం. మాకందరికీ ఎక్కడానికి ఆయాసం వచ్చింది. డాక్టర్ శ్రీహరి, డాక్టర్ రంగన్న, 400 స్టెప్స్ ఎక్కి ఆర్చి దాకా వెళ్ళారు. మిగిలిన వారు కూడా తమ శక్తి మేరకు ఎక్కారు. మేము పైకి వెళ్ళటానికి కొంచెం ఇబ్బందిపడ్డాం.

రష్యా ప్రెసిడెంట్ చైనా సందర్శనకు రావటంతో తియానన్మెన్‌ ‌స్క్వేర్‌‌ను మేము వెలుపలి నుండే చూసాం. ఫర్ బిడ్డన్ సిటీ ఉన్న ప్రాంతాలు చూసాం. ఒకప్పటి రాజులు తమ విలాసాల కోసం నిర్మించుకున్న భవనాలు చాలా అందంగా ఉన్నాయి.

chaina

జియోన్ ప్రావిన్స్ కు వెళ్ళి టెర్రకోట వారియర్స్, ప్రాచీన కాలం నాటి అవశేషాలు సైనికులు, గుర్రాలు, ఇతర వస్తువులు 1974 సంవత్సరంలో బయటపడ్డాయి. రైతులు పొలం పనులు చేస్తున్నపుడు బయటపడితే ఆర్క్యాలాజీ డిపార్ట్‌మెంట్ తవ్వకాలలో సైనికుల, యోధుల అవశేషాలు బయటపడ్డాయి. చిన్‌రాజు 1600 సంవత్సరాలకు పూర్వం కేవలం 14 ఏళ్ల వయస్సులో చుట్టుపక్కల రాజ్యాలను జయించి, చైనా రాజ్యాన్ని చిన్‌రాజు నిర్మించారు. అందువలన చైనా అనే పేరు వచ్చింది. టెర్రకోట వారియర్స్ గురించి తెలుసుకొన్న కథనాలలో.. రాజు తను మరణించిన తర్వాత తాను స్వర్గానికి కానీ నరకానికి గానీ వెళితే తన రక్షణ కొరకు సైన్యంలోని యోధులను ప్రాణత్యాగం చెయ్యమని కోరాడట. అందువలన చాలా మంది ప్రాణాలుతీసు కొన్నారు. ప్రాణత్యాగం చెయ్యనివారిని ప్రాణాలతో భూమిలో సమాధి చేశారు. సైనిక యోధులను గుర్తించటానికి వీలుగా వారి ముఖకవళికలతో సహా విగ్రహాలను తయారుచేసి, భూమిలో వారిపక్కన పాతిపెట్టారు. రాజు తను మరణించాక తనవద్దే భూమిలో పాతిపెట్టమని కోరటం జరిగిందని చెబుతున్నారు. జియాన్ రాజ్యంలో చారిత్రక కట్టడంలోని నలుదిశలా సుమారుగా ఉన్న 28 ప్రాంగణాల్లో ఉన్నటువంటి భవనాల్లో రాజులు ఋతువులు సకాలంలో వచ్చి కరువులు లేకుండా వర్షాలు కురవాలని ప్రజలతో సహా ప్రార్థన చేసేవారని తెలిపారు. యువన్ ప్రామిస్‌లోని సియాక్ నగరంలో పర్యటించినప్పుడు అక్కడ ప్రభువులు డ్రం, బెల్ సందర్శనకు వెళ్ళినప్పుడు స్త్రీలు మోగించినప్పుడు నగరంలోని ప్రజలు పనులకు వెళ్లాలని సూచనగా ఆదేశాలు ఇచ్చేవారు. డ్రమ్‌పై కొట్టినప్పుడు ప్రజలందరూ పనుల నుండి తిరిగి రావాలనేది మరో కథనం.


బీజింగ్‌‌ అందాలు..

చైనా ఆర్థిక రాజధాని బీజింగ్ సండే నగరాలు తిలకించినప్పుడు విశాలమైన పది లైన్ల రోడ్లు, టూ వీలర్స్‌కు ఒకదారి కేటాయించడం, పాదచారులకు రోడ్డు క్రాస్ చేయడానికి ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండడం బాగుంది. అందరూ చక్కగా నియమ నిబంధనలు పాటించడం ముచ్చటగొలిపింది. రోడ్లు అన్నీ పచ్చదనంతో పరిశుభ్రంగా ఉన్నాయి. రోడ్డుకు ఇరువైపులా అందమైన గులాబీలు చూడముచ్చటగా అనిపించింది. వందల వేల వృక్షాలతో నగరం పచ్చదనంతో ఉండటం పర్యావరణ హితాన్ని తెలియజేస్తోంది. వాటితో పాటు బహుళ అంతస్తుల తోటి అండర్ డ్రైనేజీలతోటి పట్టణాలు నగరాలు చాలా అందంగా తీర్చిదిద్దటం గమనించాం.

chaina

రైల్వేలో రక్షణ ఏర్పాట్లు..

బుల్లెట్ రైలులో ప్రయాణించినప్పుడు రైల్వేస్టేషన్‌లోకి వెళ్లాలంటే ప్రయాణికులకు మాత్రమేకాక ఇతరులకూ ప్రవేశం ఉంటుంది. అయితే టికెట్, లగేజ్ తనిఖీలు తప్పనిసరి. అంతేకాకుండా రైలులో ప్రయాణించేటప్పుడు వందల కిలోమీటర్లు ట్రాఫిక్‌కు ఇరువైపులా రక్షణగా గోడలు నిర్మించారు. మన దేశంలో రోడ్లు, గేట్లు లేక రైలు ప్రమాదాల్లో వందలాది మంది చనిపోవడం చూశాం. మనదేశంలో కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకునేలా, గోడలు నిర్మించాలి.

chaina

స్త్రీ-పురుష సమానత్వం..

స్త్రీలందరూ వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో నగరాల్లో పట్టణంలో స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించారు. ఎలాంటి భయాందోళన లేకుండా ఆధునిక వస్త్రాలతో తిరగటం గమనించాం. స్త్రీలపై ఎలాంటి అత్యాచారాలు జరగవని తెలుసుకున్నాం. స్త్రీలు పురుషులతో సమానంగా, ఎలాంటి వివక్ష లేకుండా ఉంటారని తెలుసుకున్నాం. పిల్లల బాధ్యత స్త్రీలతో పాటు పురుషులకు కూడా ఉందని గమనించాం. ఇష్టం లేకుంటే చట్టం ప్రకారం భర్తతో భార్య విడిపోవడం, విడాకులు తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అక్కడ చట్టాలు ఉన్నాయి. ఆ విధంగా ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు. విడిపోయినప్పుడు ఆర్థిక స్థితిగతులు మేరకు కొంత డబ్బు చెల్లింపులు చేయడం చట్టంలో ఉంది.

మొత్తానికి ఎన్నో కలలు కన్న చైనా పర్యటన చేయడం మాకు చాలా ఆనందం కలిగించింది. ఈ విధంగా మేమంతా కలిసి వెళ్లడం ఇంకా బాగుంది. అక్కడ మనలాంటి ప్రజాస్వామ్యం లేదు. కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం. చైనా లాంగ్ మార్చ్ గురించి నేటి తరానికి తెలియదు. మహా నాయకుడు మావో షేతుంగ్ గురించి, ఆయన పోరాట విషయాలు చరిత్ర చాలామందికి తెలియకపోవడం గమనించాం. మాకందరికీ ఈ అంశం మింగుడుపడలేదు. సోషలిస్టు చైతన్యం అనేది నేటి తరానికి నిత్యం కలిగించాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ విధంగా అక్కడ నాయకత్వం ఇకముందు అయినా ప్రయత్నించాలని ఆకాంక్ష.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్